జ్ఞాపకాల అల్లికలు
పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలలో ఆడపిల్లలే
అలంకారం. చిన్నారి పాపాయి మొదలు ఆడపిల్లలందరికీ పూల జడలు ఉండేవి. మేనత్తలు,
పిన్నులు, అమ్మమ్మలు.. వారిని ఆటపట్టిస్తూ జడ కుట్టేవారు. రామాయణభారతాలు
చదివిన అమ్మమ్మలు, జడ కుడుతున్నంతసేపు ఆ కథలలోని ఘట్టాలు చెబుతూ, పిల్లలకు
విద్య నేర్పేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లి కూతురు జడ
కుట్టడానికి కాంట్రాక్ట్ వారు వస్తున్నారు. ప్లాస్టిక్ పూలు, బంగారు
పూలు, వెండిపూలు, పూసల పూలతో జడలు కుట్టించుకుంటున్నారు. దాంతో పూలజడలు
జ్ఞాపకాల గుబాళింపులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి.
ఆ కాలనీలో జయమ్మ గారు, వెంకటలక్ష్మి గారు ఇద్దరూ
వేసవికాలంలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. సందులోని ఆడపిల్లలంతా వీరిద్దరినీ
తలో రోజు సొంతం చేసుకుంటారు. పూల జడ కుట్టాలంటే వారిద్దరే ఆ కాలనీ
మొత్తానికి. జయమ్మగారికి ఇద్దరు ఆడ పిల్లలు, వెంకటలక్ష్మి గారికి ఐదుగురు
ఆడపిల్లలు. ఈ కాలంలో మాత్రం వారిద్దరికీ చెరో యాభై మంది ఆడపిల్లలు.
పూలజడల్ని వెయ్యడంలో తల్లి కంటె ఆప్యాయంగా పలకరించే జయమ్మ ఒక శైలి, అమ్మమ్మ
కంటె ఆదరంగా అభిమానించే వెంకటలక్ష్మిది ఒక శైలి.మధ్యాహ్నానికి సిద్ధమైపోవాలి
పూల జడల కోసం ప్రత్యేకంగా జడ మొగ్గల్ని ఎంపిక చేసుకుంటారు. అవి చక్కగా నిలువుగా కుదురుగా ఉంటాయి. జడ మొగ్గలు, కొబ్బరి పుల్లలు, కనకాంబరాలు, మరువం, పొడవాటి అట్టలు, సూది, దారం, సవరం, జడగంటలతో.. ఆ రోజు పూలజడ కుట్టించుకోవాలనుకున్న ఆడపిల్లలు మధ్యాహ్నం రెండు గంటలకల్లా సిద్ధం కావాలి. పూల మార్కెట్‌కి వెళ్లి, కిలో మల్లెమొగ్గలు, కొద్దికొద్దిగా కనకాంబరాలు, మరువం తెచ్చుకుని జడకు సిద్ధమైపోయేవారు.
మల్లె, కనకాంబరం, మరువం
మొగ్గలకు ఉన్న తొడిమలు తీసి, పెద్దపెద్దగా పొడవుగా ఉన్న మొగ్గలను పుల్లలకు గుచ్చి, ఆ పుల్లలను జడ ఆకారంలో కత్తిరించిన అట్ట మీద రెండు వైపులా రెండు వరసలలో కుట్టి, మధ్యలో అడ్డంగా మొగ్గలను సూదితో గుచ్చుతూ నాలుగు వరసలు మల్లె మొగ్గలు, రెండు వరసలు కనకాంబరాలు, ఒక వరుస మరువంతో అందమైన మల్లె మొగ్గల జడ త్రివర్ణ పతాకంలా శ్రీకారం చుట్టుకుని, ఆకారం దాలుస్తుంది.
జడలోకి పండుగొచ్చేది!
పూలజడ వేసుకున్న రోజున ఆడపిల్లలకు పండుగే. చక్కటి పట్టు లంగా కట్టుకుని, చేతులకు నిండుగా రంగురంగుల గాజులు వేసుకుని, తరతరాలుగా భోషాణంలో నిద్దరోతున్న బంగారు హారాలను మేల్కొల్పి, మెడలో అలంకరించుకునేవారు. జడ కిందుగా బంగారు రంగులో జడకుప్పెలు వయ్యారాలొలుకుతూ తాండవమాడేవి. అక్కడితో ఆగేవారా! పట్టు లంగా, కాసులపేరు, పూలజడను కలకాలం పదిలపరచుకోవడం కోసం, ఫొటో స్టూడియోలకి వెళ్లి, మూడు అద్దాలలో జడ మాత్రమే కనపడేలా నిలబడి ఫొటో తీయించుకోవడం అప్పట్లో చాలా గొప్ప.
ఇప్పటివి అప్పటికప్పుడే
అలాంటి పూలజడ ఇప్పుడు జ్ఞాపకాల్లో మిగిలిపోయింది! పట్టు పరికిణీల స్థానాన్ని చుడీదార్లు, చేతికి గాజుల బదులు బ్రేస్‌లెట్స్, బంగారు ఆభరణాల స్థానంలో జూట్, థ్రెడ్ జ్యూయలరీ వచ్చేసినట్లుగానే, నల్లటి వాలు జడల స్థానంలో జుట్లు వదులుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకవేళ పూల జడ వేసుకున్నా, రెడీమేడ్‌గా దొరికే వన్ గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్ పూల జడలను అలా తెచ్చి, ఇలా తగిలించుకుంటున్నారు. ఇవి జ్ఞాపకాలను మిగల్చవు. అప్పటికప్పుడు ప్రశంసలు మాత్రం అందుతాయి.
– పురాణపండ వైజయంతి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565