గో లక్ష్మీ సంవాదం
ఒకనాడు శ్రీ మహాలక్ష్మి గో సమూహంలోకి ప్రవేశించి ‘‘గోమాతలారా! నా పేరు శ్రీదేవి - లోకమంతా నన్ను కోరుకుంటారు. నేను ఉంటే ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, అగ్ని అందరూ ఆనందంగా ఉంటారు. నావల్ల ఋషులు, దేవతలు సిద్ధి పొందుతున్నారు. నేను చేరనివారు అన్నివిధాలా బాధపడుతున్నారు. నేను మాత్రం ఎల్లప్పుడూ మీలో ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటుంది.
దానికి గోమాతలు.. ‘‘శ్రీదేవీ! నీవు ఒకచోట స్థిరంగా ఉండలేవు. కాబట్టి మేము నిన్ను కోరుట లేదు. నీకు శుభం కలగాలని కోరుకుంటాం. నువ్వు సంతోషంగా ఉండే చోటుకెళ్లు’’ అన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి.. ‘‘గోవులారా! నేను అందరికీ లభించేదాన్ని కాదు. మానవులు గొప్ప తపస్సుచేసి నన్ను సేవించి, పొందుటకు ప్రయత్నిస్తారు. దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాదులు, ఉరగములు, రాక్షసులు నన్ను చేరడానికి ప్రయత్నిస్తారు. అట్టి నేను మీ దగ్గరకొచ్చి ప్రాధేయపడుతున్నాను నన్ను స్వీకరించండి’’ అని ప్రార్థించింది.
దానికి గోవులు.. ‘‘దేవీ! మేము నిన్ను అవమానించుటలేదు. నీవు చంచల చిత్తవు. కనుక మేము నిన్ను పరిత్యజించుచున్నాము.’’ అని చెప్పాయి. ‘‘మీరు తిరస్కరింస్తే నేను అన్ని లోకాలలోనూ అవమానం పొందుతాను. నాపై అనుగ్రహం చూపండి. మీ శరీరములోని ఏదో ఒక అవయములో నివసించదలచుకున్నాను. మీ అవయవములలో కుత్సితమైనదేదీలేదు’’ అని లక్ష్మీదేవి మరీ మరీ కోరగా.. గోవులు లక్ష్మీదేవి మాట మన్నించాయి. గోమయమున, గోమూత్రమున నివసించుటకు అంగీకరించాయి. గోవు, గోమయం, గోమూత్రం గొప్పదనాన్ని వివరించే ఈ కథ స్కాందపురాణంలో ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కామధేనువును స్తుతించారని స్కాందపురాణం ధర్మారణ్య ప్రకరణంలో ఉంది. మరో కథనం ప్రకారం.. శంకరుడు ఒకసారి రుషుల విషయంలో అపరాధం చేయగా వారు కోపించి శాపమిచ్చారట. అప్పుడు శివుడు గోలోకానికి వెళ్లి సురభిని స్తుతించాడట.
‘‘గోమాతా! నీవు రుద్రులకు తల్లివి. వసువులకు పంచగవ్యాలు ఇస్తావు. ఆదిత్యులకు సోదరివి. నీవు లేక మూడు లోకములలోనూ ఏదీలేదు’’ అంటూ ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి, ఆమె అనుగ్రహంతో సురభి దేహంలో ప్రవేశించి, నీలవృషభ రూపంలో సురభి నుండి అవతరించాడట. ఆ వృషభమే చతుష్పాద ధర్మం అంటారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565