భగవన్నామ సంకీర్తనంతోనే
ఆత్మానందం
ఆత్మానందం
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే తొమ్మిది రకాల భక్తి మార్గాలలో కీర్తనం వరుసకు ద్వితీయమైనా.. వాసికి అద్వితీయం. మిగిలిన ఎనిమిది రకాల మార్గాల్లో పని సాగుతున్నా మనసు లీనమవుతుందో లేదో తెలియదు.
కానీ కీర్తనంలో ఉన్న గానధర్మం వల్ల మనసు సహజంగానే ఆకర్షితమవుతుంది. ఆ స్థితి కూడా లేని వారికి కనీసం కొంతసేపు సత్కాలక్షేపం చేశామన్న సంతృప్తి అయినా మిగులుతుంది. భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యునిగా కీర్తింపబడే నారదుడు నారాయణ నామస్మరణలో పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంకీర్తనే ఆయనకు మూడులోకాల్లో ఏడువాడలూ తిరిగే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత అంతటివాడు.. తనకు తెలియకుండానే నారదునికి శిష్యుడైనవాడు.. ప్రహ్లాదుడు. ఈయన గురువును మించిన శిష్యుడు. నారదుడు సంతోషంగా ఉండి సంకీర్తన చేస్తే ఈయన సంక్షోభంలో కూడా అదే పని అంత ఆనందంగానూ చేశాడు.
‘తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుఁడు మాటిమాటికో
పన్నగశాయి! యోదనుభంజన! యో జగదీశ! యో మహా
పన్న శరణ్య! యో నిఖిల పావన యంచు నుతించుగాని తా
గన్నుల నీరుదేఁడు భయకంప సమేతుఁడు కాడు భూవరా’
..అన్నారు పోతనగారు. హిరణ్యకశిపుని ఆజ్ఞ ప్రకారం రాక్షసభటులు భయంకరంగా హింసిస్తుంటే ప్రహ్లాదుడు చేసిన పని ఈ సంకీర్తనే. బాధలను భరిస్తూ భగవద్గుణగణగానం చేశాడే కానీ దీనంగా ఏడుస్తూ కూర్చోలేదని పోతనగారు మనకు సందేశం ఇస్తున్నారు. మనోవేదనకు మందు లేదంటారుగానీ.. మనం ఒక నిశ్చయానికి రాగలిగితే మనోవేదనను మరచిపోవచ్చు. కానీ, శరీరబాధ అలాంటిది కాదు. మనం తీసేద్దామంటే పోదు. దాని సమయం అది తీసుకుని క్రమంగా తగ్గుతుంది.
అలాంటిది.. అంతటి భయంకరమైన హింసని అనుభవిస్తూ ప్రహ్లాదుడు భగవత్కీర్తన మానలేదంటే ఆ కీర్తన అతనికి ఎంత బలాన్నిచ్చిందో తెలుస్తోంది. మనకైనా అంతే. నవీనకాలంలో.. మనకంటే ముందు తరంలో సంకీర్తన వల్ల మహాయోగం పొందిన నాదముని త్యాగరాజు. ఆంతిమలక్ష్యం ఆత్మానందనమని తన కీర్తనల ద్వారా త్యాగరాజస్వామి నిరూపించారు. అంత శక్తి కలిగిన భగవన్నామ సంకీర్తనతో జీవుడు ఆనందలహరిగా మారి ఆత్మానంద సాగరంలో లీనం కావడమే జీవన పరమార్థం.
గరికిపాటి నరసింహారావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565