పొగ చిచ్చు!
మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
గుప్పు గుప్పుమని పొగ వదులుతూ.. ఆనందాన్ని పొందుతున్నామని చాలామంది భావిస్తుంటారు గానీ ఇది కళ్ల నుంచి కాళ్ల వరకూ ‘పొగ’ పెడుతుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు.. ఇలా ఏ రూపంలో అయినా పొగ తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తూ.. గుండెజబ్బులు, పక్షవాతం వంటి ముప్పులను పెంచుతుంది. అంతేకాదు.. రకరకాల క్యాన్సర్లనూ వెంటబెట్టుకు వస్తుంది. పొగకు తోడు గుట్కాలు, జర్దాలు, ఖైనీల వంటివీ పెద్ద సమస్యగా మారిపోయాయి. కాబట్టి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నేపథ్యంలో దీని అనర్థాల గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.
సిగరెట్ కాల్చటం వల్ల కాసేపు ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తొండొచ్చు. కొద్దిసేపు తృప్తి, ఆనందం వంటివి కలగొచ్చు. కానీ దీనిలోని పొగాకులోని నికొటిన్ క్రమక్రమంగా మనిషిని లోబరచుకుంటుంది. పొగ రూపంలో అయినా.. జర్దా, ఖైనీ, గుట్కాల వంటి రూపాల్లో అయినా నికొటిన్ తీవ్ర అనర్థాలు తెచ్చిపెడుతుంది. పొగాకులో ఒక్క నికొటిన్ మాత్రమే కాదు.. సుమారు 7వేల రకాల విషతుల్యాలుంటాయి. పొగ పీల్చిన వెంటనే ఇవన్నీ మూకుమ్మడిగా రక్తంలో కలిసి ఒళ్లంతా విస్తరిస్తాయి. ఈ విషతుల్యాల్లో సుమారు 400 రకాల రసాయనాలు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని అధ్యయనాలు గుర్తించాయి. ముఖ్యంగా ఆర్సెనిక్, బెంజీన్, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్ ఆక్సైడ్ వంటి రసాయనాలు కచ్చితంగా క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సిగరెట్లు, చుట్టల పొగలోని ఈ రసాయనాలు నోటి నుంచే శరీరంలోకి వెళ్లటం ప్రారంభిస్తాయి. ముందుగా ఇవి నోట్లోని సున్నితమైన జిగురు పొరల ద్వారా కొంత లోపలికి వెళ్లిపోతాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుకున్నప్పుడు అక్కడ్నుంచి ఇవి రక్తంలో కలుస్తాయి. అనంతరం శరీర స్రావాలన్నింటిలోకి చేరి, స్థిరపడిపోతాయి. అందువల్ల ఇవి ఒక్క ఊపిరితిత్తుల్లోనే కాదు. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.
అన్నీ ముప్పులే..పొగాకు శరీరంలోని అన్ని అవయాల మీదా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులను దెబ్బతీసి సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) న్యుమోనియా, ఆస్థమా వంటి జబ్బులకు దారితీస్తుంది. పొగాకు మూలంగా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, గుండె వైఫల్యం వంటి ముప్పులు పెరుగుతాయి. అధిక రక్తపోటు, పక్షవాతం వంటివి సరేసరి. రక్తనాళాలు సంకోచించటం వల్ల దీర్ఘకాలంగా పుండ్లు మానకుండా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు గ్యాంగ్రీన్‌కూ దారితీయొచ్చు. పొగాకు నేరుగా కిడ్నీల పైనా ప్రభావం చూపుతుంది. మగవారిలో స్తంభన లోపం మరో సమస్య. స్తంభనలోపంతో బాధపడుతున్నవారిలో సుమారు 85% మంది పొగరాయుళ్లే కావటం గమనార్హం. ఆడవారిలోనైతే పొగ తాగే అలవాటు మూలంగా గర్భం నిలవకపోవటం, నెలలు నిండకముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టటం వంటి దుష్ప్రభావాలు కనబడతాయి.
* పొగ అలవాటు జీవన కాలాన్నీ తగ్గిస్తుంది. పొగ తాగటం వల్ల 12.2 నుంచి 14.5 ఏళ్ల ఆయుర్దాయం తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాల్చే ప్రతి సిగరెట్టుతో 11 నిమిషాలు ఆయుష్షు తగ్గుతోంది!
కణకణాన్ని దెబ్బతీస్తుందిమన శరీరంలోని కణాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతుంటాయి. ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతుంటాయి. ఈ ప్రక్రియలను జన్యువులు నియంత్రిస్తుంటాయి. దీని మూలంగానే మన శరీర ఎదుగుదల క్రమ పద్ధతిలో సాగుతూ వస్తుంటుంది. పొగలోని విషతుల్యాలు సరిగ్గా ఈ ప్రక్రియనే దెబ్బతీయటం ఆరంభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ల మోతాదులు తగ్గేలా చేస్తాయి. కణితులు ఏర్పడటాన్ని అడ్డుకునే జన్యువుల పనితీరును మార్చేస్తాయి. దీంతో కణాల విభజన, పెరుగుదల మీద నియంత్రణ, పట్టు తప్పిపోతాయి. ఇవి ఇష్టం వచ్చినట్టుగా, అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి.. క్యాన్సర్ కణితులుగా మారిపోయి.. ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
* పొగ ఎన్నేళ్లు తాగితే అంత ముప్పు ఎక్కువవుతుంది. దీన్నే ప్యాక్ ఇయర్స్ పేరుతో లెక్కిస్తారు. అలాగే పొగ తాగే తీరు కూడా క్యాన్సర్ ముప్పు ఆధారపడొచ్చు. పొగను గట్టిగా లోపలికి పీల్చుకోవటం, బలంగా దమ్ము లాగుతూ.. పొగను పూర్తిగా పీల్చుకోవటం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశముంది. పొగ అలవాటు మానేసిన తర్వాత.. దాదాపు పదేళ్ల వరకూ క్యాన్సర్ ముప్పు పొంచే ఉంటుంది. కాబట్టి అసలు పొగ తాగే అలవాటు చేసుకోకపోవటమే అన్నింటికన్నా ఉత్తమం. అప్పటికే అలవాటుంటే తక్షణమే మానెయ్యటం మంచిది.
పొగ తాగటమే కాదు, ఇతరులు వదిలిన పొగను పీల్చినా ప్రమాదమే. ఇది కూడా క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్టు అధ్యయనాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇది రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి- ఇతరులు సిగరెట్ల వంటివి కాలుస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే పొగను నేరుగా పీల్చటం. రెండోది- పొగరాయుళ్లు వదిలిపెట్టిన పొగను పీల్చటం. ఇది పక్కవారికీ ప్రమాదకరంగా పరిణమిస్తుండటం గమనార్హం. దీని మూలంగా ఇంట్లోని స్త్రీలు, పిల్లలు కూడా క్యాన్సర్ల బారినపడే ప్రమాదముందని గుర్తించటం అవసరం.
దిగ్భ్రాంతికర వాస్తవాలు
పొగాకు వాడకంపై మనదేశంలో ఇటీవల చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 27 కోట్ల మంది పొగాకు వాడుతుండగా.. వీరిలో 6.84 కోట్ల మంది పొగ తాగేవారు కాగా 16.3 కోట్ల మంది ఇతరత్రా రూపాల్లో పొగాకును వినియోగిస్తున్నారు. ఇక 4.23 కోట్ల మంది ఇటు పొగ రూపంలోనూ అటు ఇతరత్రా రూపాల్లోనూ పొగాకును వాడుతున్నారు. పురుషుల్లో 48% మంది, మహిళల్లో 20% మంది పొగాకును వాడుతున్నారు.
* మహిళల్లో పొగ తాగే అలవాటు మనదగ్గరా ఎక్కువగానే కనబడుతోంది. సుమారు 1.21 కోట్ల మంది మహిళలు పొగ తాగుతున్నట్టు అంచనా. ఈ విషయంలో అమెరికా తర్వాత స్థానం మనదే కావటం గమనార్హం. పొగ తాగటాన్ని అరికట్టటానికి చేపట్టిన ప్రచారాల మూలంగా పురుషుల్లో ఈ అలవాటు కాస్త తగ్గుముఖం పడుతున్నా మహిళల్లో మాత్రం అలాగే ఉంటోంది. పట్ణణాల్లో ఈ ధోరణి హోదాకు చిహ్నంగా భావిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు ఆకలి, నొప్పి తగ్గించుకోవటానికి మహిళలు పొగ తాగుతున్నారు.
* పొగాకు వాడకంతో తలెత్తుతున్న జబ్బులు ఆర్థిక వ్యవస్థకూ భారంగా పరిణమిస్తున్నాయి. 35-69 ఏళ్ల వారిలో కనబడుతున్న పొగాకు సంబంధ జబ్బులతో 1.05 లక్షల కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తున్నట్టు (జీడీపీలో 1.1%) అంచనా.
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
youtube subscribers buy