నెల్లూరు జిల్లా
విశేషాల నెలవు
కొండలు,
కోనలు, నదులు, సాగర తీరాలతో కూడిన ప్రకృతి సౌందర్యం... చరిత్రకు
సాక్ష్యాలుగా నిలిచే ప్రదేశాలూ... మతసామరస్యాన్ని చాటే వందల ఏళ్ల నాటి
దర్గాలు, ఆలయాలు.. దేశ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినువీధుల్లో
నిలుపుతున్న అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు.. ఇలాంటి ఎన్నో ఆకర్షణీయమైన
పర్యాటక స్థలాలకు కేంద్రం నెల్లూరు జిల్లా.
నెల్లూరు
జిల్లాలోని మైపాడు సాగరతీరం రమణీయ ప్రకృతి దృశ్యాల సమాహారం. మరో కోనసీమగా
పేరు గాంచిన ఇందుకూరుపేట మండలంలోని మైపాడుకు జిల్లా కేంద్రం నుండి
ప్రయాణించడం గొప్ప అనుభూతి. పచ్చని వరిపొలాలు, కొబ్బరి తోటలు దారంతా
పలకరిస్తాయి. మైపాడు పర్యాటక కేంద్రంలో విశాలమైన స్థలం, పిల్లలు
ఆడుకోడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తీరం పక్కనే శివాలయం ఉంది.
ఆదివారాలు, సెలవులు పండగ రోజుల్లో బోటు షికారు, సముద్ర ఇసుక తిన్నెల మీద
హార్స్ రైడింగ్ చేసేందుకు వీలుంటుంది.
ఎలా వెళ్లాలి?: నెల్లూరు పట్టణానికి 25 కి.మీ. దూరంలో మైపాడు బీచ్ ఉంది. ఆర్టీసీ బస్సులు నేరుగా బీచ్ వరకూ వస్తాయి.
వసతి: ఏపీ
టూరిజం శాఖ వారి హరిత రిసార్ట్స్‌లో బస చేయవచ్చు. రెస్టారెంట్ కూడా ఉంది.
గదులను జిల్లా కేంద్రంలో లేదా టూరిజం శాఖ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.
అందాల తీరం తూపిలిపాలెం
నెల్లూరుజిల్లా
వాకాడు మండలంలోని తూపిలిపాళెం సముద్రతీరం ప్రకృతి ప్రేమికులను విశేషంగా
ఆకర్షిస్తోంది. దీని సరిహద్దుల్లో 40 లైట్లతో బ్రిటి్‌షవారి కాలంలో ఏరాఁటు
చేసిన ఆర్ముగం లైట్‌హౌస్, సుప్రసిద్ధమైన పంట్రంగం ఆలయం ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి?: గూడూరు నుంచి 4 కి.మీ., నాయుడుపేట నుంచి 39 కి.మీ. దూరంలో తూపిలిపాళెం వుంది. ఆ పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
కృష్ణపట్నానికి పర్యాటక శోభ
పారిశ్రామికంగా
పురోగతి సాధిస్తున్న కృష్ణపట్నం ప్రాంతం పర్యాటకంగానూ ప్రసిద్ధి
పొందుతోంది. డీప్‌వాటర్ పోర్టుగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం
పోర్టుతో పాటు కృష్ణపట్నం గ్రామంలో శతాబ్దాల కాలం నాటి సిద్ధేశ్వరస్వామి
ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1270వ సంవత్సరంలోనే
మనుమసిద్ధి మహారాజు పునర్నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ
మండపంలోని స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు కనువిందు చేస్తాయి.
బీచ్‌కి
వెళ్లే దారిలో వున్న కృష్ణపట్నం లైట్‌హౌస్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ
లైట్‌హౌస్ పైనుంచి కృష్ణపట్నం పోర్టు, పరిసర ప్రాంతాలను తిలకించవచ్చు.
కృష్ణపట్నం పోర్టులో పర్యటించేందుకు, లైట్‌హౌస్ ఎక్కేందుకు ముందుగా అనుమతి
తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలా వెళ్ళాలి?: నెల్లూరు
నగరానికి 28 కి.మీ. దూరంలో వున్న కృష్ణపట్నం పోర్టు, కృష్ణపట్నం
గ్రామానికి నెల్లూరు నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు వున్నాయి. బీచ్‌ను
చేరుకోవాలంటే కృష్ణపట్నం నుంచి ఆటోల్లో లేదా సొంత వాహనాలపై రెండు కి.మీ.
ప్రయాణించాలి.
తుమ్మలపెంట హరిత బీచ్ రిసార్ట్స్
నెల్లూరు
జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట తీరంలో సముద్రపు ఒడ్డున ఏపి టూరిజం
శాఖ నిర్మించిన హరిత బీచ్ రిసార్ట్స్ సందర్శకులకు ఆహ్లాదం
కలిగిస్తున్నాయి. తీరప్రాంతంలో ప్రక్కనే సముద్రం ఉండటంతో ఆ పర్యాటక
కేంద్రానికి సెలవుదినాలలో ఎక్కువగా పర్యాటకులు వస్తారు. అక్కడ సుమారు ఆరు
ఎకరాల స్థలంలో పన్నెండు ఏసీ గదులు, ఒక రెస్టారెంట్ 2013లో నిర్మించారు.
పర్యాటక కేంద్రంలో పిల్లలు, పెద్దలు ఆడుకునే విధంగా ఊయల, జారుడుబల్ల,
ఆటవస్తువులు ఏర్పాటుచేశారు. త్వరలో బోటు షికారు నిర్వహణకు సన్నాహాలు
జరుగుతున్నాయి.
ఎలా వెళ్ళాలి?: కావలిపట్టణానికి 10 కి.మీ., నెల్లూరుకు 70 కి.మీ. దూరంలో తుమ్మలపెంట ఉంది. కావలి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.
వేసవి విడిది సోమశిల
ఆత్మకూరు
నియోజకవర్గం పరిధిలోని అనంతసాగరం మండలంలో సోమశిల జలాశయం పంట భూములను
సస్యశ్యామలం చేయడంతోపాటు సందర్శకులకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తోంది.
నెల్లూరు జిల్లాలో ప్రధాన వేసవి విడిది కేంద్రంగా ఇది గుర్తింపు పొందింది.
కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో సాగునీటి కోసం ఉద్దేశించిన ఈ జలాశయాన్ని
రెండు కొండల మధ్య నిర్మించారు. జలాశయంలోని నీటి నిల్వలు, చుట్టూ
విస్తరించిన నల్లమల అడవుల పచ్చదనంతో ఏడాది పొడవునా వాతావరణం చల్లగా
ఉంటుంది. ఇక్కడ సోమేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు కూడా
భక్తులను ఆకర్షిస్తున్నాయి.
ఎలా వెళ్ళాలి?: ఈ రిజర్వాయర్ నెల్లూరు పట్టణానికి 80 కి.మీ. దూరంలో ఉంది. నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి.
కండలేరు రిజర్వాయర్
చెన్నై
దాహార్తిని తీర్చే ప్రయత్నంలో భాగంగా కండలేరు రిజర్వాయర్‌కు అంకురార్పణ
జరిగింది. 11 కి.మీ. పొడవు కలిగిన మట్టి కట్టతో ఈ రిజర్వాయర్‌ను
నిర్మించారు. సౌర గడియారం, బొటానికల్ గార్డెన్స్, జింకల పార్కు, జల
విద్యుత్ కేంద్రం, సత్యసాయి గంగ కాలువలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ఈ
రిజర్వాయర్ వద్ద సూర్యాస్తమయ దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
బోట్ షికారు, సౌకర్యం ఉంది.
ఎలా వెళ్ళాలి?: నెల్లూరు నుంచి 44 కి.మీ. దూరంలో కండలేరు ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు. - ఆంధ్రజ్యోతి, నెల్లూరు జిల్లా
చరిత్రకు ఆనవాళ్ళు
ఉదయగిరి కోట
నెల్లూరు
జిల్లాలోని ప్రధాన చారిత్రక ప్రదేశాల్లో ఉదయగిరి కోట ఒకటి. వెయ్యేళ్ళనాటి
ఈ కోటకు పదకొండవ శతాబ్దంలో ఉదయగిరి పాలకులుగా ఉన్న పల్లవులు పునాదులు
వేశారు. పదమూడవ శతాబ్దంలో లంగూళ్ల గజపతి అసంపూర్తిగా ఉన్న కోట నిర్మాణాన్ని
పూర్తి చేశారు. గుర్రపునాడా ఆకారంలో ఉన్న లోయలో ఈ కోటను నిర్మించారు.
ఉపరితలం నుంచి పరిశీలిస్తే కోట రూపం నిద్రిస్తున్న మనిషి ఆకారంలో ఉంటుంది.
ఇక్కడ ఎనిమిది ప్రాకారాలు, వందలాది బురుజులు, రాజ ప్రాసాదాలు, రాణివాసాలు,
మంత్రుల నివాసాలు ఉన్నాయి.ఈ కట్టడాల్లో ఆనాటి కళావైభవం ద్యోతకమవుతుంది.
చుట్టూ జలపాతాలు, ఔషధ మొక్కలతో కూడిన వనాలతో ఉదయగిరి కోట సముదాయం సుందరంగా
కనిపిస్తుంది.
ఎలా వెళ్ళాలి?: నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో దుర్గం ఉంది. దుర్గం నుంచి కోటను చేరుకోడానికి ఏడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.
పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం
నెల్లూరు
జిల్లాలోని పల్లిపాడులో గాంధీ ఆశ్రమం స్వాతంత్య్ర పోరాట కాలాన్ని గుర్తుకు
తెస్తుంది. దీన్ని పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం అని పిలుస్తారు. జాతిపిత
మహాత్మాగాంధీ 1915లో నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆయన స్మృతి చిహ్నంగా
1925లో పల్లిపాడులో గాంధీ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ స్వాతంత్య్ర ఉద్యమంలో
గాంధీ పాల్గొన్న ముఖ్య ఘట్టాలతో ఫొటో గ్యాలరీ, లైబ్రరీ ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి?: నెల్లూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరాన ఈ ఆశ్రమం ఉంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
‘అమరజీవి’ జన్మస్థలం
భాషాప్రయుక్త
రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
జువ్వలదిన్నెలో జన్మించారు. ఆయన పేరిట ఈ జిల్లా ‘పొట్టి శ్రీరాములు
నెల్లూరు జిల్లా’ అయింది. ఆ అమరజీవి స్మృతి చిహ్నంగా నెల్లూరు ఆర్యవైశ్య
సంఘం నాయకులు జువ్వలదిన్నె గ్రామంలో ఆశ్రమాన్ని నిర్మించారు.
ఎలా వెళ్ళాలి?: ఈ స్మారక కేంద్రం నెల్లూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
మతసామరస్యానికి ప్రతీక బారా షాహీద్ దర్గా
నెల్లూరు
పట్టణంలోని బారాషాహీద్ దర్గా మత సామరస్యానికి ప్రతీక. అన్ని మతాలవారూ ఈ
దర్గాను సందర్శిస్తారు. నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ దర్గాలో 1930
నుంచి రొట్టెల పండుగ జరుగుతోంది. అయిదురోజుల పాటు నిర్వహించే ఈ
కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు. వివిధ రకాల కోర్కెల
రొట్టెలను ఈ సందర్భంగా భక్తులు ఇచ్చి, పుచ్చుకుంటారు. కోర్కెలు తీరిన వారు
తదుపరి సంవత్సరం వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. అలాగే ఇక్కడ మొహరం రోజు
రాత్రి నిర్వహించే గంధం మహోత్సవం మరో ప్రధానమైన వేడుక.
ఎలా వెళ్ళాలి?: నెల్లూరు నగరంలో ఈ దర్గా ఉంది.
ప్రకృతికి ఆటపట్టు
పక్షుల విడిది నేలపట్టు
నెల్లూరు
జిల్లాలోని నేలపట్టు గ్రామానికి దేశ, విదేశాలకు చెందిన పక్షులు
వస్తుంటాయి. ఏటా అక్టోబరు మాసం నుంచి మార్చి వరకు- ఆరు నెలలపాటు ఇక్కడ
చెట్లపై అవి నివాసం ఏర్పరుచుకుంటాయి. ఇక్కడే గుడ్లను పొదిగి, ఆ పిల్లలు
కొంచెం పెద్దవయ్యాక, వాటితో కలిసి తమ దేశాలకు తరలిపోతాయి. సూళ్లూరుపేటలో
రాష్ట్ర ప్రభుత్వం ఏటా 3 రోజుల పాటు ‘ఫ్లెమింగో ఫెస్టివల్’
నిర్వహిస్తోంది.
ఎలా వెళ్ళాలి?: సూళ్ళూరుపేటకు 21 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి మంచి రవాణా సదుపాయాలున్నాయి.
పులికాట్ సరస్సు
ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన పులికాట్ సరస్సు అతి పెద్ద ఉప్పు నీటి
సరస్సుల్లో ఒకటి. ఇక్కడ తెల్లవారుజామున సూర్యోదయ దృశ్యం చూసి తీరాల్సిందే.
సూర్యుడి తొలి కిరణాల్లో సరస్సు బంగారు వర్ణంలో మెరిసిపోతూ సందర్శకులను
పులకింపజేస్తుంది. సరస్సులో పడవ షికారు మధురానుభూతిని మిగుల్చుతుంది. ఈ
ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే పక్షుల పండుగలో
పడవ షికారు ప్రత్యేక ఆకర్షణ. పులికాట్ సరస్సుకు మరో ఒడ్డున ఇరకం దీవి కూడా
తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి.
ఎలా వెళ్ళాలి?: సూళ్ళూరుపేటకు 12 కి.మీ. దూరంలో పులికాట్ సరస్సు ఉంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565