కాశీ నుంచి వచ్చిన
రామరెడ్డి కాలభైరవుడు!
ఉత్తర భారతదేశంలోని ఆలయాలకు ఉన్న విశిష్టత, నేపథ్యం తెలంగాణలోని పలు ఆలయాలకూ ఉన్నవి. అరుదైన ఆలయాలకూ తెలంగాణ కేంద్రం లాంటిది. అలా చాలామందికి తక్కువగా తెలిసిన, విశిష్ట నేపథ్యమున్న, భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలువుదీరిన ఆలయం రథాల రామరెడ్డి కాల భైరవుని ఆలయం. కాల భైరవుని ఆలయమున్న అరుదైన క్షేత్రంగా విరాజిల్లుతూ భక్తులతో నిత్యం ధూప దీపం నైవేద్యాలు అందుకుంటున్న రథాల రామరెడ్డి శ్రీ కాలభైరవుని ఆలయ విశిష్టతే ఈవారం దర్శనం.
-శ్రీకాంత్ మంచాల
ఎక్కడ ఉన్నది?:
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం రామరెడ్డి, ఇసన్నపల్లి గ్రామాల సరిహద్దుల్లో శ్రీ కాలబైరవ స్వామి కొలువై ఉన్నాడు.
ఎలా వెళ్లాలి?:
కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి వాహనాలు వెళ్తాయి. మాచారెడ్డి, సదాశివనగర్, భీమ్‌గల్ నుంచి రామరెడ్డికి బస్సు సౌకర్యముంది.
విశిష్టత:
కాల బైరవుడి ఆలయాలు భారతదేశంలో రెండు ఉండగా వాటిలో మొదటిది కాశీలో ఉంటే, రెండోది ఈ రామరెడ్డిలోనిది.
ఆలయ చరిత్ర:
సుమారు 1760వ సంవత్సరంలో రాజన్నచౌదరి అనే సంస్థానాధీషుడు బిక్కనూర్ రాజధానిగా చేసుకొని రథాల రామరెడ్డి, దోమకొండను పరిపాలించారని స్థానికులు చెప్తున్నారు. నేడు గ్రామీణ నేపథ్యమున్న రామరెడ్డి, దోమకొండ ఒకప్పుడు సంస్థానాలుగా, పట్టణాలుగా విరాజిల్లాయి. సామ్రాజ్య పాలనా కేంద్రాలుగా పరిఢవిల్లాయి. దోమకొండను పాలించిన రాజుల్లో రామిరెడ్డి, కామిరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారికి శ్రీకాల బైరవుడు ఒకరోజు కలలో దర్శనమిచ్చాడట. తమకు దర్శన భాగ్యం కల్పించిన కాల భైరవుడిని వేడుకోగా కాశీ క్షేత్రంలో తన ప్రతిమ ఉన్నదని, దానిని అక్కడి నుంచి తీసుకురావాలని, విగ్రహం ఎక్కడ పడిపోతే అక్కడే ప్రతిష్టించాలని కోరాడట.
క్షేత్ర నిర్మాణం:
స్వామివారి ఆదేశానుసారం కాశీ చేరుకొని అక్కడి నుంచి ప్రతిమను తీసుకొని వస్తుండగా ఒకచోట ఎడ్లబండికి కట్టిన తాళ్లు తెగిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడిందట. ఆ ప్రాంతమే రామరెడ్డి గ్రామం. ప్రకృతి స్పందనకు విగ్రహాలు భూమిలోకి దిగిపోయాయి. స్వామివారి కోరిక మేరకు అక్కడే గుడి నిర్మించారు. ఆ రోజు నుంచి కాల భైరవస్వామి రామరెడ్డి, ఇసన్నపల్లి ప్రజలకు కొంగు బంగారంగా మారిపోయాడు. కోరిన కోరికలు తీరుస్తున్నాడు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుండటంతో భక్తులు కాల భైరవుడికి మొక్కులు మొక్కుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయంలో నుంచి పెరిగిన రావిచెట్టును చీల్చుకొని 14 అడుగుల భారీ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారి రూపం చూడటానికి రెండు కళ్లూ చాలవు.
ప్రత్యేకత:
రామరెడ్డి కాల భైరవ ఆలయ నిర్మాణానికి ప్రత్యేక నేపథ్యం ఉన్నది. సాధారణంగా హిందు దేవాలయాల ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా ఉంటాయి. కానీ ఈ ఆలయ గర్భగుడి ద్వారం పడమటి వైపు, స్వామివారి ముఖం దక్షిణం వైపు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు పడకపోతే, ఇక్కడి ప్రజలు స్వామివారి విగ్రహానికి పేడ పూసేవారు. దీనివల్ల స్వామి తన మీదున్న పేడను తొలగించుకోవడానికి వర్షాలు కురిపించేవాడని స్థానికుల అభిప్రాయం.
మూలబావి:
ఈ ఆలయం వెనుకాల ఈశాన్యంలో మూలబావి ఉంది. ఇందులో సంవత్సరం పొడుగునా నీళ్ళు ఉంటాయి. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే సర్వ రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ నీటితో 21 లేదా 41 రోజులు రోజూ ఉదయం, సాయంత్రం పూట స్వామివారి విగ్రహాన్ని అభిషేకిస్తే ఆరోగ్య సమస్యలు, సంతాన లేమి సమస్యలు తొలగిపోతాయంటున్నారు. ఈ బావి పక్కనే పూర్వకాలంలో కోనేరు నిర్మించారు. ఇప్పుడు ఆ కోనేరులో స్నానం చేయడానికి అనుమతి లేదు.
ఉత్సవాలు:
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో స్వామి వారి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఎడ్లబండ్ల ప్రదర్శన, అగ్ని గుండాలు, ఒగ్గు కథలు, చక్కెర తీర్థం వంటి కార్యక్రమాలతో 10 రోజులు జాతర జరుగుతుంది. రామరెడ్డిలో కాల భైరవ ఆలయంతో పాటు శ్రీ వేంకటేశ్వరాస్వామి ఆలయం, ఉమా మహేశ్వరస్వామి ఆలయం, రామాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయం, ఇంకా పలు ప్రాచీన ఆలయాలు, కట్టడాలు ఉన్నాయి. శ్రీరామనవమి రోజున ఒకేసారి రెండు రథాలను ఊరేగిస్తారు. మొదట సీతారాములను, రెండవదానిపై శివ పార్వతులను ఊరేగిస్తారు. ఇలా ఏక కాలంలో రెండు రథాలు ఊరేగడం చాలా అరుదు. అందుకే ఈ గ్రామాన్ని రథాల రామరెడ్డి అని కూడా పిలుస్తుంటారు.
ఈశాన్యపల్లి:
కాలభైరవస్వామి ఆలయం రామరెడ్డి గ్రామానికి ఈశాన్యం వైపు ఉంది. అందువల్ల ఈ గ్రామాన్ని ఆ రోజుల్లో ఈశాన్యపల్లిగా పిలిచేవారు. కాలక్రమేణా అది ఇసన్నపల్లిగా మారిపోయింది. ఈ గ్రామానికి అష్టదిక్కుల్లో అష్ట భైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు రక్షకులుగా ఉంటారని ప్రజల నమ్మకం. అష్ట భైరవుల్లో కాల భైరావస్వామి ప్రధానుడు. ప్రస్తుతం ఈ ఒక్క అలయమే తప్ప మిగతా ఏడు ఆలయాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565