తనువు శుభ్రం మనసు భద్రం
శుచి, శుభ్రత భౌతిక ప్రయోజనాల కోసమేనా?అది కేవలం శారీరక సంబంధమైన విషయమా? నిజానికి శుభ్రత ఒక ధర్మం. అది ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. అదో అనంతమైన విజ్ఞానం. మనిషి నడతను తీర్చిదిద్దే సంస్కారం.శుభ్రత బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా మానసిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్ఛంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.
- జగద్గురు ఆది శంకరాచార్య
పంచ శౌచాలు
శాస్త్రగ్రంథాలు శౌచం (శుభ్రత) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి.
మనశ్శౌచం
మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా ఉండడం
కర్మశౌచం
కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించడం
కులశౌచం
నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండడం
శరీరశౌచం
స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచడం
వాక్‌శౌచం
అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకడం
పరిశుభ్రమైన మనస్సు, శరీరం అద్భుతాలను చేస్తాయి. ఆ విషయాన్ని గుర్తించిన సనాతన భారతీయ సంప్రదాయం శౌచం లేదా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. అసూయ, ఆందోళన, అనుమానం, అసహనం, ఈర్ష్య, ద్వేషం, కోపం మొదలైన అవగుణాలు లేని మనస్సు ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. దీన్నే మానసిక శౌచం అంటారు. స్వచ్ఛమైన మనస్సుతో చేసే పూజ, ధ్యానం, తపం ఎంత చిన్నవైనా అనంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే మహాయోగి వేమన ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?’ అంటారు. అలాగే మలినాలేవీ శరీరానికి అంటకుండా ఉండేలా స్నానాది విధులు చెయ్యటాన్ని బాహ్య శౌచం అంటారు. ఈ భౌతికమైన శుభ్రత మానసిక ఉన్నతికి పునాదిగా నిలుస్తుంది. శారీరకంగా, ఆంతరంగికంగా.. పరిశుభ్రత మనిషికి ఏకాగ్రతనిస్తుంది..లక్ష్యసాధన వైపు నడిపిస్తుంది
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతశ్శుచిః
నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య, అంతరంగ శౌచాలు తప్పనిసరి... పుండరీకాక్షుడి స్మరణం వల్ల శుచిత్వం వస్తుందని చెబుతుందీ శ్లోకం.
బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుభ్రత వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రార్థన లేదా ధ్యానం ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. శాస్త్ర గ్రంథాలు కూడా ‘శుచిత్వం మాతృరూపేణ’ అంటాయి. శుచిత్వం మనకు తల్లివంటిది. తల్లి ఏవిధంగా బిడ్డకు సదా రక్షగా ఉంటుందో, శౌచం కూడా అలాగే, మనల్ని రక్షిస్తుందని భావం.
వేదాలు, ఉపనిషత్తులు కూడా ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. రుగ్వేదంలో అనేక చోట్ల శుభ్రతను గురించి ప్రస్తావన వస్తుంది. స్కందోపనిషత్తు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే శుచిత్వమని చెబుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగిఉంటామో, అప్పుడు మనస్సు ధర్మమార్గాన్ని విడిచిపెట్టదు. భగవద్గీతలో చెప్పిన ఆంతరంగిక శౌచం ఇదే.
శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగంలో ‘శుచిత్వమే జ్ఞానం’ అని వివరిస్తాడు.. శుభ్రత అది దేవతల లక్షణాల్లో ఒకటని అంటాడు. ఇదే విషయాన్ని రూఢి పరుస్తూ దైవాసుర సంపద్విభాగయోగంలో శుచిగా ఉండని వారికి రాక్షస ప్రవృత్తి ఉంటుందని చెబుతారు. శారీరకంగా శుభ్రంగా ఉండకపోవడం వల్ల మంచి ఆలోచనలు చేయలేరు. మంచి ఆలోచనలు చేసే మనసు ధర్మాన్ని విడిచిపెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు. నిజానికి శుభ్రత శారీరక తపస్సులో ఒక భాగం.స్వామి వివేకానంద ‘ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ’ - ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని చెప్పారు. శ్రీనాథమహాకవి కూడా తన చాటువుల్లో ఓ చోట ‘అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లేదు....’ అంటూ వాపోతాడు. ఇక మరెప్పుడూ అలాంటి ప్రదేశాలకు రానంటాడు. శుభ్రత లేనిచోట పెద్దలు, పండితులు ఉండరు అనటానికి శ్రీనాథుడి వృత్తాంతమే ఉదాహరణ.ఆంగ్లంలో ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్స్‌టు గాడ్’ - దైవం తర్వాత రెండో స్థానం పరిశుభ్రతదే అనే సామెత ఉంది. హైందవ సంప్రదాయాలతో పాటు పాశ్చాత్య సంప్రదాయంలోనూ శుభ్రతకు దైవంతో సమానమైన ప్రాధాన్యత ఉందనే విషయం ఈ సామెత ద్వారా తెలుస్తుంది.
శుచిత్వం మనకు జీవనవిధానం కావాలి. పరమాత్మ దర్శనానికి సోపానం కావాలి.
‘శ్రీసూక్తం’లో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. వీటిలోని 16వ మంత్రం... యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. శుభ్రత, శాంతి ఉన్న చోట అనారోగ్యం దరిచేరదు. అంతకుమించిన భాగ్యం మరొకటి ఉంటుందా?
శుభ్రత ప్రాధాన్యాన్ని వివరించే పలు పురాణ కథలూ ఉన్నాయి. కశ్యప ప్రజాపతికి దితి, అదితి ఇద్దరు భార్యలు. దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు - అంటే దేవతలు. వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన ‘సరే’ అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుభ్రతను అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే, ఇంద్రుడు అణురూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకడం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన ‘మరుద్గణం’. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి ‘సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే’ ఆచారం వాడుకలోకి వచ్చింది.
బుద్ధభగవానుడు ‘బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలు తొలగించుకుని, మనోశుభ్రతను కూడా పాటించాలని’ బోధించేవాడు. ఇందుకోసం ‘విమల కీర్తి నిర్దేశక సూత్రాల’ను ప్రతిపాదించాడు. మనసుకు అంటిన మాలిన్యాలు (రాగద్వేషాలు మొదలైనవి) పోగొట్టుకోవటానికి ప్రతి ఒక్కరూ ‘షట్ పారమితులు’, ‘పంచశీల’ పాటించాలని బౌద్ధధర్మం చెబుతోంది. ఈ ప్రక్రియలో ఉపాసకుడు ఆచరించాల్సిన ‘ద్వాదశ నీవరణాలను’ కూడా బౌద్ధం వివరిస్తుంది. ప్రత్యేకించి ‘శౌచవ్రతాని’కి బౌద్ధం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది.
‘హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు’ (మత్తయి 5:8) అంటూ ప్రభువు నిష్కల్మషమైన మనస్సుకు ప్రాధాన్యతనిచ్చారు.. మనిషి మనసులో కలిగే ఆలోచనే అతని నడవడికను నిర్దేశిస్తుంది. మనోశుద్ధితో కూడిన బాహ్యశుద్ధి మాత్రమే దేవుడి వద్దకు దారి చూపిస్తుందని క్రైస్తవ ధర్మం కూడా శుచిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.
- డా. కప్పగంతు రామకృష్ణ
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
buy views for youtube