ప్రద్యుమ్నుడు
రుక్మిణీ కృష్ణుల కొడుకు
మనకున్న కొద్దిపాటి పరిచయాల్నే మన బలంగా మలుచుకొని, అవి మనకిచ్చే ప్రత్యేక గౌరవాన్ని ఆసరాగా చేసుకొని గొప్పలకు పోతుంటాం. ఎందుకంటే మన అస్తిత్వం పదుగురికి తెలియాలనీ, మనకంటూ సమాజంలో పెద్దరికం ఉందనీ పదేపదే చెప్పుకోవడం మనకలవాటై పోయింది. మనం గొప్పవారిగా గుర్తించబడాలంటే ఉన్నత వంశంలోపుట్టడమో, మహాత్ముల కడుపున జన్మించడమో, యుద్ధాలూ, దానాలూ చేయడమో, వినూత్న ఆవిష్కరణలు చేపట్టడమో చేయాల్సిన పనిలేదు. మనిషిగా పుట్టి, మానవత్వంతో
బతికి జీవితం అందించే ప్రతీ మలుపునూ తదనుగుణంగా ఆపాదించుకుంటూ బతక గలిగితే అది బతుకనిపించుకోదా? దానికి చరిత్రలో స్థానముండదా? అంటే ప్రతీ పుట్టుకకూ విలువుంది, ప్రతీ బతుకులోనూ జీవముంది. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఆ జీవితాన్ని నిశితంగా పరికిస్తే మనల్ని ఆలోచింపచేస్తూ బతికే విధానంలోని పారదర్శకతను పరిచయం చేస్తుంది. ప్రద్యుమ్నుని జీవితమే సజీవ జీవన సిద్ధాంతం.
-ప్రమద్వర
సనత్కుమార వంశంలో, యదుకులంలో రుక్మిణీ కృష్ణుల కొడుకుగా పుట్టాడు ప్రద్యుమ్నుడు. తను పుట్టిన ఎనిమిదవ నాడే సముద్రం పాలైనాడు. ఈతను పుట్టగానే శంబురాసురుడనే వాడి చావు ఇతని చేతిలోనేనన్న కారణంతో శంబురాసురుడు చావు భయంతో ప్రద్యుమ్నుని సముద్రంలోకి విసిరేస్తాడు. చేప ఒకటి ప్రద్యుమ్నుని మింగేస్తుంది. అలా చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైనాడు ప్రద్యుమ్నుడు. జాలరివాడు ప్రద్యుమ్నుని మింగిన చేపను వలలో పట్టి, శంబురుని ఇంటికే చేరుస్తాడు. శంబరుని కూతురు చేప కడుపు నుంచి బయటపడిన ప్రద్యుమ్నుని పెంచి పెద్ద చేస్తుంది. ప్రద్యుమ్నుని చేతిలోనే శంబురుడు హతమయ్యాడు. శివుని చేతిలో భస్మమైన మన్మథుడే ప్రద్యుమ్నునిగా జన్మించాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రద్యుమ్నుని పెంచిన మాయావతే ద్వారకకు అతణ్ణి తీసుకెళ్లి రుక్మిణీ కృష్ణులకు అప్పగిస్తుంది. రుక్మిణి ప్రద్యుమ్నుడు తన పుత్రుడేనా అని సందేహిస్తుంటే నారదుడు వచ్చి జరిగిందంతా వివరిస్తాడు. ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణులను కలిసిన తర్వాత చేసిన మంచి పని తన మేనమామ రుక్మిణి కూతురైన శుభాంగిని స్వయంవరంలో పెళ్లి చేసుకొని తమ రెండు కుటుంబాల మధ్య గల వైరాన్ని దూరం చేయడం. ప్రద్యుమ్న శుభాంగినుల పుత్రుడైన అనిరుద్ధుడే యదువంశాన్ని ముందుకు నడిపించాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సాల్వుడు దండెత్తి వస్తాడు. ప్రద్యుమ్నుడు అతణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు. అతని బాణాల ధాటికి స్పృహ కోల్పోయిన ప్రద్యుమ్నుడు, కొంతసేపట్లోనే ద్వారకను ఎలాగైనా కాపాడుకోవాలనే మనో సంకల్పంతో తేరుకుంటాడు.
సాల్వుని ఇప్పటికి ద్వారక నుంచి మాత్రమే నీవు తరిమేయగలవు. ఎందుకంటే సాల్వుని వధించగలవాడు కృష్ణుడేనన్న నారదుని సూచనను మీరి తన ఆవేశాన్ని ఆపుకొన్నాడు ప్రద్యుమ్నుడు. వజ్రనాభపురాన్నీ కాపాడేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు ప్రద్యుమ్నుడు. ఆ పురానికి ప్రద్యుమ్నుడు తవ్వించిన సొరంగులు అతని అద్భుత తెలివికి నిదర్శనాలు. ప్రద్యుమ్నుని జీవితంలో అద్భుతాలు, అనర్థాలూ జరుగలేదు. తన ప్రమేయం లేకుండానే తన పుట్టుక అసుర వధకు కారణమనే నెపంతో తల్లిదండ్రులకు దూరంగా చాలా సంవత్సరాలు అసురుని ఇంట్లో పెరిగాడు. తనవల్ల విడిపోయిన రెండు కుటుంబాలూ కలిశాయని సంతోషించాడు. తన అవసరం ఉన్న ప్రతీచోటా నిలబడ్డాడు. తన పనికాదని వారిస్తే వాదించక చిరునవ్వుతో మిన్నకుండిపోయాడు. కృష్ణుని పుత్రునిగానో, యదుకులంలోని ప్రముఖుడిగానో, తన స్వీయ పరాక్రమం వల్ల ప్రదర్శించగలిగే అభిమాన గర్వంతోనో ఏనాడూ బతుకలేదు ప్రద్యుమ్నుడు. నిమిత్తమాత్రుడై నిశ్చయ బుద్ధితో బతికిన ప్రద్యుమ్నుని జీవన విజయం నిశ్రేయమైనదిగా కనిపించే గంభీరమైంది. గెలిచిన వారి గురించి నలుగురూ మాట్లాడుకోవడం, ఓడినవారు సమాజానికి సంజాయిషీ చెప్పుకొంటున్నట్లు కారణాలు చెప్పడం ఇవే కావు జీవితమంటే. జీవితాన్ని జీవితంలా జీవిస్తూ బతికుండడం కూడా జీవితమే. ప్రద్యుమ్నుడు కూడా ప్రపంచానికి ఇదే చెప్పాలనుకున్నాడేమో.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565