MohanPublications Print Books Online store clik Here Devullu.com

108నూట ఎనిమిదో లింగం ఇదే! _ Shiva Lingam


ఆ నూట ఎనిమిదో లింగం ఇదే! 

ఎందరో రాజులను చంపిన పరశురాముడు తన పాపప్రక్షాళన కోసం దేశవ్యాప్తంగా 108 శివలింగాలను ప్రతిష్ఠించాడన్నది తెలిసిన విషయమే. అందులో 108వ లింగమే నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరుడు. కొండ గుహలో కొలువైన ఈ శివయ్య దర్శనమే ఓ దివ్యానుభూతి.

భక్తవత్సలుడంటే శివయ్యనే చెప్పుకోవాలి. కాబట్టే రాక్షసులకూ వరాలిచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. భక్తులను కాసేపు ఉడికించి వూరడించిన కథలూ చాలానే ఉన్నాయి. ఈసారి ఒక పరమభక్తుడి చేతిలో ఓ దెబ్బ కూడా తిన్నాడు శివయ్య. చెర్వుగట్టు సాంబయ్యకు జడల రామలింగేశ్వరుడన్న పేరు రావడానికీ ఆ ప్రేమే కారణం.

ఇదీ కథ... 

కామధేనువు విషయంలో తన తండ్రి జమదగ్నితో వైరం పెట్టుకోవడంతోపాటు, చివరికి ఆయన చావుకు కారణమైన కార్తవీర్యార్జునుడినేకాక కనబడిన రాజులందరినీ హతమార్చాడు పరశురాముడు. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు. ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. అందులో చివరిదే నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెర్వుగట్టు రామలింగేశ్వర లింగంగా చెబుతారు. ఈ ప్రదేశంలో ఓ గుహలో పరశురాముడు ఘోర తపస్సు చేశాడట. తాను ప్రతిష్ఠించిన దానికన్నా శివలింగం రోజురోజుకూ పెద్దది కాసాగింది కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావడంలేదట. దీంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు తన గొడ్డలితో శివలింగం మీద ఒకదెబ్బ వేశాడట. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెనువెంటనే ప్రత్యక్షమయ్యాడట. శాంతించమని చెబుతూ, ఆయన కోరినట్టే కలియుగాంతం వరకూ తాను అక్కడే ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తానంటూ వరమిచ్చాడట. తర్వాత పరశురాముడూ ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండి పోయి చివరకు శివైక్యం అయ్యాడని పురాణగాథ. ఇలా కొట్టడం వల్ల శివలింగం బీటలు వారి వెనుకవైపు జడలు జడలుగా జుట్టు ఉన్నట్టు కనిపిస్తుందట. అందుకే ఈయన్ను జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. ప్రస్తుతం కొండమీద నిర్మించిన గుడిలో గుహాలయంలో స్వామి దర్శనమిస్తాడు. పార్వతీ దేవి ఆలయం విడిగా ఉంటుంది.

పెద్ద జాతర... 
తెలంగాణ రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెర్వుగట్టు ప్రత్యేకమైనది. ఇక్కడి శివుడికి మొక్కితే భూత పిశాచాల బాధ వదులుతుందని కొందరూ, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కొందరూ నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగానూ పిలుస్తారు. 3, 5, 7, 9, 11 లేదా 21 అమవాస్యలు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల అపారమైన విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్యల సమయంలో రద్దీ ఎక్కువ. ఇక, ఏటా మాఘశుద్ధ పంచమి నాటి నుంచి ఐదురోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి (ఈ ఏడాది ఫిబ్రవరి 3) నాటి అర్ధరాత్రి నిర్వహించే శివకళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతారు. జాతర సమయంలో రైతులు తమ పొలంలో పండించిన కందులు, ఆముదాలు, పత్తి, వరి తదితరాలను దేవుడికి సమర్పిస్తారు. జాతరకు రైతులంతా ఎడ్లబండ్లపైనే సందడిగా వస్తుంటారు.


మూడు గుండ్లు... 
ఆలయానికి సమీపంలో ఉండే మూడుగుండ్లు అనే ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుడికి కాస్త పక్కన ఓ చోట మూడు పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కే దారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. కానీ ఎంత శరీరం ఉన్నవాళ్లైనా స్వామిని స్మరిస్తూ వెళితే ఇందులోంచి అవతలికి చేరగలగటం ఇక్కడి దేవుడి మహిమకు తార్కాణంగా చెబుతారు. దేవాలయంలోని కోనేరులో స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టును చేరతారు. ఇక్కడి చెట్టు కింద చెక్కతో చేసిన స్వామి పాదుకల జతలు చాలా ఉంటాయి. వాటిని శరీరం మీద ఉంచుకుని స్వామికి మొక్కుతారు. కోనేరులోని జలం పొలాల మీద చల్లుకుంటే మంచిదని నమ్ముతారు. ఇక్కడి హనుమ, వీరభద్ర, శివరేణుక తల్లి దేవాలయాలకూ మంచి ప్రాశస్త్యం ఉంది.

ఇలా వెళ్లొచ్చు 

చెర్వుగట్టు హైదరాబాద్‌ - నల్గొండ ప్రధాన రహదారిలో హైదరాబాద్‌ నుంచి సుమారు 90 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి నల్గొండ వెళ్లే ప్రతి బస్సు చెర్వుగట్టు నుంచే వెళుతుంది. గట్టుపైకి వెళ్లాలంటే నార్కెట్‌పల్లి - అద్దంకి జాతీయ రహదారిపైన దిగి అక్కడి నుంచి 2 కి.మీ. ప్రయాణించాలి. క్షేత్రానికి రోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ, సూర్యాపేట నుంచి వచ్చేవారు నార్కెట్‌పల్లిలో దిగితే అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.

- జీడిపల్లి దత్తురెడ్డి, ఈనాడు, నల్గొండ 

చిత్రాలు: దుబ్బాక నరేశ్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list