గద్దొచ్చె కోడిపిల్ల..
కియ్యం కియ్యం!
బలవంతుడు బలహీనుణ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఓ బలముంది.. ఎల్‌కేజీ పాప కూడా ఈ డైలాగ్‌ను ఠక్కున చెప్పేస్తుంది. కానీ బలవంతుడెవరు? బలహీనుడెలా ఉంటాడు? అని ఆలోచించే సామర్థ్యం మాత్రం ఈతరానికి ఉండకపోవచ్చు. ప్రాథమిక స్థాయిలోనే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే పిల్లల భవిష్యత్‌కు మంచి పునాది ఏర్పడుతుంది.
ఇంతకూ ఈ గద్దొచ్చె కోడిపిల్ల ఆటకు.. బలవంతుడు.. బలహీనుడికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలంటే
ముందు ఆట గురించి తెలుసుకోవాలి!
-దాయి శ్రీశైలం,
ఆటగాళ్లు ఎంతమంది? : పది నుంచి పదిహేను
ఎక్కడ? : ఆట స్థలంలో
ఇతర పేర్లు : గద్ద, కోడిపిల్ల
ఐకమత్యం నేర్పే ఆట
ఇప్పటి పిల్లలు చూడటానికే కాదు.. పనిలోనూ చాలా స్మార్ట్. నర్సరీ స్టేజీలోనే ఒంటరి జీవితాన్ని ఇష్టపడే వ్యక్తిత్వం వాళ్లకు అలవాటైతున్నది. ఆనందం వచ్చినా.. ఆపద వచ్చినా నాలుగ్గోడల మధ్య తనలో తాను నవ్వుకోవాల్సిందేగానీ నలుగురికీ షేర్ చేసుకోలేని పరిస్థితి వాళ్లది. స్మార్ట్ ఎన్విరాన్‌మెంట్‌లో పీకల్లోతు మునిగిపోయి పరదా చాటు పసివాడిలా తయారవుతున్నారు. అందుకే వాళ్లు బలం.. బలహీనత అన్నింటికంటే ముఖ్యంగా ఐకమత్యం గురించి తెలుసుకోవాలి. స్మార్ట్‌గేమ్స్ నేర్పించని ఐకమత్యాన్ని అలనాటి ఆటయైన గద్దొచ్చె కోడిపిల్ల నేర్పిస్తుంది!
కియ్యం కియ్యం
టెక్నాలజీ మారింది. ఆ ప్రభావంతో మనుషుల జీవనశైలి కూడా మారిపోయింది. కానీ మనిషి మనిషిగానే ఉన్నాడు. కోడి కోడిగానే ఉన్నది. గద్ద గద్దగానే ఉంది. రోజూ గమనిస్తున్నారో లేదో.. కోళ్లున్నచోటుని పసిగట్టి ఆకాశం నుంచి యముడిలా గద్ద వస్తుంది. తన పదునైన రక్కసి ముక్కుతో కోడి పిల్లల్ని అమాంతం ఎత్తుకుపోయి.. కుత్తుకను అదిమిపట్టి తింటుంది. దాని రాకను గమనించిన కోడి.. దాని పిల్లలు కియ్యం.. కియ్యం అంటూ అరుస్తుంటాయి. ఆ అరుపులే కోడిపిల్లల ఐకమత్యాన్ని సూచిస్తున్నాయి.
ఇది చాలా క్రేజ్
కోడి.. కోడిపిల్లలు.. గద్ద మధ్య జరిగే ఈ తంతునే ఆటగా మలిచారు ఆ రోజుల్లో. ఒక ఇరవై ఏండ్ల క్రితం గద్దొచ్చె కోడిపిల్ల ఆటకున్నంత క్రేజ్ మరే ఆటకూ ఉండేది కాదు. అందుకే ఈ ఆటంటే అందరికీ ఉత్సాహం.. ఉల్లాసం. ఎప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందా? ఎప్పుడు గద్దొచ్చె కోడిపిల్ల ఆట ఆడుకుందామా అని సమయం కోసం ఎదురు చూసేవారు. టీచర్లే దగ్గరుండి మరీ పిల్లలతో ఈ ఆట ఆడించేవాళ్లు. మానసిక ఉల్లాసం.. శారీరక కదలిక.. సామాజిక సందేశం ఉన్న ఈ ఆటను వారసత్వంగా ఇప్పటి పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది.
ప్రయోజనం
ఈ ఆట ద్వారా పిల్లలకు ఐకమత్యం విలువ తెలుస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆలోచన అలవడుతుంది అంటున్నారు బాల వికాస నిపుణులు కందుకూరి రాము.
గుర్తుకు రావడం లేదా? :
ఈ తరం పిల్లల గురించి పక్కనబెడితే.. ఒకప్పుడు ఈ ఆటతో అనుబంధం ఉన్నవాళ్లలో కూడా చాలామటుకు దీని గురించి మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇరవైయేళ్ల కాలంలో అనేకానేక సాంకేతిక మార్పులు వచ్చి సగటు మనిషి లైఫ్‌స్టయిల్‌నే మార్చేశాయి. పాత ఆటలు.. పాటలు.. జ్ఞాపకాలను తరిమేశాయి. కాబట్టి కొద్దికొద్దిగా గుర్తున్నట్టనిపించే ఈ ఆట గురించి తెలుసుకునేందుకు కందుకూరి రాము.. జాస్తి శివరామకృష్ణ కూర్చిన చిన్ననాటి ఆటలు.. జ్ఞాపకాల మూటలు అనే పుస్తకంలో కూడా వీటి గురించి చెప్పే ప్రయత్నం చేశారు. వీలు చూసుకొని చదవండి.
ఆట విధానం
పిల్లలంతా ఆటస్థలంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో నిలబడాలి. ఒక పిల్లవాడు గద్ద పాత్ర.. మరొక పిల్లవాడు కోడిపిల్ల పాత్ర పోషించాలి. ఆ కోడిపిల్లేమో వలయాకారంలో నిలబడిన పిల్లల మధ్యన.. వలయం అవతలేమో గద్ద ఉండాలి. గద్ద వచ్చి కోడిపిల్లను పట్టుకోవాలి. అందుకోసం వలయాన్ని దాటుకుని లోపలికి దూరేందుకు ప్రయత్నించాలన్నమాట. గద్దను లోపలికి పోనివ్వకుండా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మిగతా పిల్లలు అడ్డుకోవాలి. ఒకవేళ గద్ద లోపలికి వస్తే కోడిపిల్ల బయటకు పారిపోవాలి. దానికి మిగిలిన పిల్లలు సహకరించాల్సి ఉం టుంది. ఇప్పుడు గద్దను బయటకు పోనివ్వకుండా.. ఆ కోడిపిల్లను పట్టుకోనివ్వకుండా ఐకమత్యంతో అడ్డుకోవాలి. ఈ ఆట ఆడేటప్పుడు పిల్లలంతా గద్దొచ్చె కోడిపిల్ల.. కియ్యం కియ్యం అని అరుస్తూ ఉండాలి. గద్ద.. కోడిపిల్లను పట్టుకుంటే మరో జంట ఆడాల్సి ఉంటుంది. కోడిపిల్లను పట్టుకోలేకపోతే నిర్దిష్ట సమయం తర్వాత మరో జంట ఆడటానికి రావాలన్నమాట.
Game
గేమింగ్ ఆప్స్
పజిల్ గేమ్స్ కొంచెం కష్టంగా అనిపించినా ఆడుతున్నా కొద్ది మజా వస్తుంది. అయితే ఈ సెగ్మెంట్‌లో ఏ యాప్స్ బాగున్నాయో తెలుసా!
కట్ ది రోప్ : మ్యాజిక్
కట్ ది రోప్ సిరీస్‌లో కొత్త వెర్షన్ ఇది. ఇప్పటి వరకు ఈ యాప్‌ను కోటి మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. తాడు ఆధారంగా వేలాడుతున్న చాకొలెట్‌ను కింద ఉన్న ఓమ్‌నోమ్ అనే చిన్నారి రాక్షసికి అందేలా కట్ చేయాలి. సింపుల్‌గా కనిపించినా.. బాగా ఆలోచించి ఆడాలి. కష్టంగా అనిపిస్తే సహాయం స్క్రీన్‌పైనే అందుబాటులో ఉంటుంది.
అంకెల పజిల్ గేమ్ ఇది. 5 కోట్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఈ ఆటలో రెండు గళ్లల్లో ఉన్న ఒకే అంకెలను కలపాలి. అప్పుడు సంఖ్య రెట్టింపు అవుతుంది. అలా సంఖ్యను పెంచుతూ పోవడమే. ఈ ఆట ఆడుతున్న సమయంలో మెదడు పాదరసంలా పని చేస్తుంది.
అగర్.ఐఓ
పేరే కాదు.. ఈ ఆట కూడా విచిత్రంగా ఉంటుంది. ఒక పేపర్‌పై గేమ్ ఆడినట్టు ఉంటుంది. గేమ్‌లో ఉండే పాయింటర్‌ను ముందుకు తీసుకెళ్తూ ఎక్కువ పాయింట్స్ సాధించాలి. మధ్యలో కనిపించే చిన్న చిన్న రంగుల చుక్కలపై నుంచి వెళ్తే పాయిట్స్ వస్తాయి. దారిలో గోకూ లాంటి రాక్షసులుంటారు. వాటి నుంచి తప్పించుకొని విజయం సాధించాలి. భలే సరదాగా ఉంటుంది.
మనం ఇలాంటి ఆటలెన్నో ఆడుకున్నాం. ఆటలకైతే దూరం అయుండొచ్చుగానీ.. వాటి తాలూకు జ్ఞాపకాలు చాలామంది మదిలో ఇప్పటికీ దాగివుండొచ్చు. ఆ జ్ఞాపకాలను నేటితరం పిల్లలకు పంచలేమా? మీ ఆటలు, జ్ఞాపకాలు మాకు రాయండి, నలుగురితో ఇక్కడ పంచుకుందాం!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565