MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆనందానికి ఏకైక మార్గం..!ఆనందానికి ఏకైక మార్గం..!

మీరు మంచి ఉద్యోగం కోసం వెతికినా, వ్యాపారం ప్రారంభించినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా వీటన్నింటి వెనుకా ఉన్న ఒకే ఒక్క కోరిక - ఆనందం. కాని ఈ ప్రయత్నంలో ఎక్కడో ఒకచోట జీవితం సంక్లిష్టం అయిపోతుంది. మరే ఇతర ప్రాణిగా పుట్టినా జీవితం ఎంతో సరళంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు మీ అవసరాలన్నీ శారీరకమైనవే అయివుండేవి. కడుపు నిండితే చాలు. ప్రశాంతంగా ఉండొచ్చు. మనిషిగా పుడితే మాత్రం అన్ని విషయాలూ మారిపోతాయి. మనిషి మనుగడకు అవసరమైనవి సమకూరడంతో జీవితం ముగిసిపోదు. అక్కడి నుంచి అసలు జీవితం ప్రొరంభమవుతుంది.

ఈరోజుల్లో మన ముందు తరాల వారికంటే కూడా ఎక్కువ సుఖమైన జీవితం గడుపుతున్నాం. వంద సంవత్సరాల కిందట మహారాజులకి దొరకని వస్తువులు కూడా ఇప్పుడు సామాన్యునికి అందుబాటులో ఉంటున్నాయి. మన చుట్టూ ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దగలిగాం. ఇక ఏమాత్రం చక్కదిద్దినా ఈ భూమి మిగలదు అన్నంతగా. కానీ వెయ్యి సంవత్సరాల కిందటి వాళ్ల కన్నా, ఇప్పటి వరకు జీవించిన వాళ్లకన్నా ఎక్కువ ఆనందంగా, ప్రశాంతంగా మాత్రం ఉండడంలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? పొరపాటు ఎక్కడుందో అని వెనుదిరిగి చూసుకోవాల్సిన సమయం కదా! మనం వేసుకున్న ప్రణాళికలు మనల్ని గమ్యానికి చేర్చకపోయినా వాటినే అంటిపెట్టుకుని ఎన్నాళ్లు వేలాడుతాం? అందుకే మనలోనే సమూలమైన మార్పులు రావాల్సిన సమయమిది.
మీ శరీరం ఉల్లాసంగా ఉంటే దాన్ని ఆరోగ్యం అంటాం. ఇంకా ఉల్లాసంగా ఉంటే సుఖం అంటాం. మనసు ఉల్లాసంగా ఉంటే ప్రశాంతత అంటాం. ఇంకా ఎక్కువ ఉల్లాసంగా ఉంటే ప్రశాంతత అంటాం. మీ భావాలు ఉల్లాసంగా ఉంటే ప్రేమ, మరింత ఉల్లాసంగా ఉంటే కారుణ్యం. ఇకపోతే మీ జీవశక్తులన్నీ ఉల్లాసంగా ఉంటే దాన్ని బ్రహ్మానందం అంటాం. మీరు కోరుకుంటున్నది ఒక్కటే. శరీరానికి బయటా లోపలా ఒక ఆహ్లాదకరమైన స్థితి. మీ జీవితంలో ఎన్ని రోజులు, రోజు మొత్తం మీద ఒక్క క్షణం కూడా ఏ రకమైన ఆందోళన, గాబరా, చిరాకు, ఒత్తిడి లేకుండా గడపగలిగారా? మీరు రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలూ నిరవధికమైన పరమానందంలో గడిపిన రోజులెన్ని? ఈమధ్య కాలంలో అలా గడిపిన రోజేది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి వ్యక్తికీ ఏ ఒక్కరోజూ అతను ఎలా జరగాలని కోరుకుంటాడో అలా జరిగిన రోజు ఒక్కటీ ఉండదు. అలాగే సంతోషం, ప్రశాంతత, బ్రహ్మానందం, అనుభవించని వ్యక్తి, అవి ఎంత క్షణికమైనప్పటికీ అనుభూతి చెందని వ్యక్తి కూడా ఉండడు. వాళ్లు కోరుకున్న స్థితికి చేరుకుంటారు గానీ అక్కడ ఎక్కువ సేపు ఉండలేక, ఆ స్థితి కొద్ది సేపట్లోనే కూలిపోవడం మొదలవుతుంది. అలా జరగడానికి భూకంపం తెప్పించే విషయం ఏదీ జరగనక్కరలేదు. అతి చిన్న విషయాలు కూడా మనుషులు తమ సంయమనాన్ని కోల్పోయేట్టుగా, తమ నిలకడ తప్పేలా చేయగలవు.
ఉదాహరణకి, మీరు బయటికి ఎక్కడికో వెళ్తారు. ఎవరో మిమ్మల్ని చూసి ప్రపంచంలోనే మీరు అత్యంత సుందరమైన వ్యక్తి అని పొగుడుతారు. మీరు ఆనందంలో తేలిపోతుంటారు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్లు మీరెలా ఉంటారో ఉన్నదున్నట్టు చెబుతారు. మీ ఆకాశ హర్మ్యం కూలిపోతుంది. 

ఇలాంటిదేదో జరిగినట్టే ఉంది కదూ!

మీరు అంతరంగంలో ఆనందంగా ఎందుకు ఉండాలి? దీనికి సమాధానం ప్రత్యక్షంగా తెలిసిందే. మీరు అంతరంగంలో ఆనందంగా ఉండగలిగితే మీరు సహజంగా అందరితోనూ, మీ పరిసరాలతోనూ ఆనందంగా ఉంటారు. మీకు ఏ తత్వ చింతనా, ధార్మిక గ్రంథాలూ అందరితోనూ మంచిగా ఉండమని బోధించనక్కరలేదు. మీరు అంతరంగంలో ఆనందంగా ఉన్నప్పుడు ఇది మీలో సహజంగానే జరుగుతుంది. లోపలి ఆనంద స్థితి అనేది శాంతితో నిండిన సమాజాన్నీ, ఆనందంగా ఉండగలిగే ప్రపంచాన్నీ నిర్మించడానికి తిరుగులేని సాధనం.
అంతేగాక, మౌలికంగా, మీ శరీరమూ, మనసూ రెండింటి సామర్థ్యాలను ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోగలరనేదాని మీద ప్రపంచంలో మీ సఫలత ఆధారపడి ఉంటుంది. కాబట్టి విజయం సాధించాలంటే మీరు అంతరంగంలో ఆనందంగా ఉండగలగడం మీ ముఖ్య లక్షణమై ఉండాలి. అన్నింటినీ మించి, మీరు మానసికానందం పొందే స్థితిలో ఉన్నప్పుడు మీ శరీరమూ, బుద్ధి వాటి అత్యున్నత స్థాయిలో పనిచేయగలుగుతాయని వైద్య, వైజ్ఞానిక దాఖలాలున్నాయి. మీరు 24 గంటలు ఆనంద స్థితిలో ఉండగలిగితే, మీ మేథోశక్తి రెండు రెట్లు అవుతుంది. ఇందుకోసం లోపలి కల్మషాల్ని పక్కకు పెట్టి, ఒక స్పష్టతను తెచ్చుకోవాలి.
మీరు అని సూచించుకునే జీవశక్తి కొన్నిసార్లు చాలా ఆనందంగా, కొన్నిసార్లు దైన్యంగా, మరికొన్నిసార్లు ప్రశాంతంగా, ఇంకొన్నిసార్లు ఆందోళనతోనూ ఉంటుంది. ఆ ఒక్క జీవశక్తి ఇన్ని అవస్థలకూ లోనుకాగలిగిన సమర్థత కలిగిఉంది. మీకు మీ జీవశక్తిని అలా ప్రకటించగల అవకాశం ఇస్తే మీరేది కోరుకుంటారు? ఉల్లాసాన్నా? దుఃఖాన్నా? ఆనందాన్నా లేక విచారాన్నా?
దీనికి సమాధానం మనకి స్పష్టంగా తెలుసు. వ్యక్తికీ, వ్యక్తికీ మార్గాల్లో తేడా ఉండొచ్చు. అది మీరు డబ్బు సంపాదించాలని ప్రయత్నించడమైనా, మందుకు బానిసలవుతున్నా, స్వర్గానికి పోవాలనుకున్నా కోరుకుంటున్న లక్ష్యం ఆనందమే. మీకు ఈ భౌతిక సుఖాల మీద కోరిక లేదని, కేవలం స్వర్గం కావాలని కోరుకుంటున్నారని అనుకుంటే అప్పుడు కూడా మీరు వెతుకుతున్నది ఆనందమే. అదే మీకు చిన్నప్పటి నుంచి దేవుడు స్వర్గంలో ఉంటాడని, కాని స్వర్గం మహా దుర్భరమైన ప్రదేశమని చెబితే, మీరు స్వర్గానికి వెళ్లాలని కోరుకునేవారా? ఖచ్చితంగా కాదు. ప్రాథమికంగా ఆనందానికి పరమావధి స్వర్గం. బాధలకు పరమావధి నరకం. కొందరు ఈ ఆనందం మందులో ఉందంటే మరికొందరు భగవంతునిలో ఉందంటారు తప్ప అందరూ వెతుకుతున్నది ఆ ఆనందమే. మీకూ, మీ శ్రేయస్సుకీ మధ్య అడ్డుగోడలా నిలబడుతున్నది ఒక్కటే. మీ ఆలోచనలు, ఆవేశాలు మీ లోపలి నుంచి కాకుండా బయటి ప్రపంచం నుంచి ఆదేశాలు తీసుకునేలా మీరు వదిలేశారు.
మీరు పూజించే శివుడు, రాముడు, కృష్ణుడు, క్రీస్తు ఎవరైనా కానీ వాళ్లెవరూ ఐఐటి గాని, మరో పరీక్ష గానీ పాస్ కాలేదు. వాళ్లు తమ జీవితాన్ని చక్కగా జీవించారు. కాబట్టే మీరు వాళ్లను పూజిస్తున్నారు. మీరు చేయాల్సింది అదే - చక్కగా జీవించడం. మానవ యంత్రం ఈ భూగోళం మీద అత్యంత సమర్థమైన యంత్రం. మీరు ఈ సూపర్ కంప్యూటర్‌లోని యూజర్స్ మాన్యువల్‌ను చదవకపోవడమే సమస్య. యోగాయే ఆ యూజర్స్ మాన్యువల్. అది మీరు అంతర్గతంగా సమతుల్యం చెందేట్టుగా చేస్తుంది. మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తోడ్పడుతుంది. అత్యుత్తమంగా పనిచేసినప్పుడు సాఫల్యం కూడా వస్తుంది. మీరు మరో వ్యక్తి కంటే మెరుగ్గా చేయలేకపోవచ్చు. కాని మీరు చేయగలిగిన దాంట్లో పరాకాష్టకు వెళ్లగలరు. జీవితం మీకు విసిరిన ఏ సవాలునైనా హుందాగా ఎదుర్కోగలరు. - సద్గురు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం