MohanPublications Print Books Online store clik Here Devullu.com

యాదాద్రి బ్రహ్మోత్సవం2017_YadadriBrahmotsavamయాదాద్రి బ్రహ్మోత్సవం !యాదాద్రి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి విశాల శిఖరపు పర్వత గుహలో స్వామి కొలువుదీరడంతో యాదగిరిగా.. మహర్షుల ఆరాధనలకు చిహ్నంగా రుషి ఆరాధనా క్షేత్రం విరాజిల్లుతోంది యాదాద్రి. రుశ్యశృంగుని పుత్రుడు యాదరుషి తపస్సుకు మెచ్చిన స్వామి జ్వాలా నరసింహస్వామిగా.. యోగానందుడిగా.. గండబేరుండగా.. లక్ష్మీ నరసింహుడిగా.. ఉగ్ర నరసింహుడిగా ఐదు రూపాల్లో అవతరించాడు. అందుకే యాదాద్రి పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఆపదలో అర్తత్రాణ పరాయణుడిగా కొలిచే వారికి కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కిన యాదాద్రి బ్రహ్మాత్సవాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక కథనం. --గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, (యాదాద్రి భువనగిరిప్రతినిధి)


నారసింహ చరితం: 
 యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తికరం. కాకతీయ రాజవంశీయులు కూడా స్వామి వారికి పూజలు జరిపి ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో లభించిన శాసనాల్లో ఈ విషయం వెలుగుచూసింది. 15 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో లభించిన శాసనం ద్వారా తెలుస్తున్నది. కీసరగుట్ట త్రిభువనమల్లుడు కూడా స్వామి వారిని సేవించిన వాడే. 13వ శతాబ్దంలో కాకతీయ వంశీయులు ఒక ఆయుర్వేద వైద్యుడికి ఈ స్థలాన్ని దానమిచ్చినట్లు చెప్తుంటారు. 600 సంవత్సరాల శాసనాలు లభ్యమయ్యాయి. యాదాద్రి గుట్టపై సింహాకారంలో స్వయంభుగా వెలసిన నరసింహుడు ఐదు అవతారాల్లో నెలకొని ఉన్నాడు. భక్తోత్సవాలే బ్రహ్మోత్సవాలు: 1964కు ముందు భక్తులే విరాళాలు సేకరించి ఉత్సవాలు నిర్వహించేవారు. వీటినే భక్తోత్సవాలు అని పిలిచేవాళ్లు. అటు తర్వాత ఆలయ నిర్వహకులే ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభమైంది. వీటికి బ్రహ్మోత్సవాలుగా నామకరణం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనమిచ్చే దశావతారాలలో ప్రధానమైన జగన్మోహిని.. తిరువెంకటపతి.. రామావతరం.. శ్రీకృష్ణుడు.. వటపత్రశాయి అలంకారాలలో శ్రీవారు తన ఇష్టమైన గరుఢ.. శేష.. సింహ.. పొన్న వాహన.. అశ్వవాహనాలలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఉత్సవాలలో భక్తులను ఎక్కువగా అలరించే ఎదుర్కోలు మహోత్సవం.. తిరుకల్యాణ మహోత్సవం.. రథోత్సవం జరిగే రోజుల్లో యాదాద్రి కొండ అపర వైకుంఠంగా దర్శనమిస్తుంది. భక్తులకు అభయం : యాదాద్రి నరసింహమూర్తి దివ్యమైన మహిమలతో అభయమిచ్చి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఉత్సవాలు జరిగే పుణ్యదినాల్లో నరసింహస్వామి వారిని దర్శించి ప్రహ్లాద వరదా గోవిందా అని ఎలుగెత్తి వేడుకోవడం ద్వారా ఆపదలు తొలగిపోతాయని నృసింహ పురాణం తెలుపుతున్నది. ఒక చేతిలో శంఖం.. మరో చేతిలో చక్రం.. ఇంకో చేతిలో లక్ష్మీదేవి.. మరో చేతిలో వరదాభయ పద్మచిహ్నాన్ని ధరించిన లక్ష్మీనరసింహుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక.. వ్యాస సనకస నందాదుల హృదయ నివాసుడై భక్తులను కరుణిస్తున్నాడు. బ్రహ్మోత్సవ వేళ స్వామివారి కరుణాకటాక్షాలు మరింత ఎక్కువగా ఉంటాయనీ.. ఈ దర్శనం అనంత ఆనందాలు కలిగిస్తుందని భక్తుల నమ్మకం.  విష్ణు పుష్కరిణి: శ్రీమహావిష్ణువు పాదాలను బ్రహ్మదేవుడు కడుగగా ఏర్పడిందే విష్ణుపుష్కరిణి అని.. బ్రహ్మాండ పురాణాలలో చంద్రవంశపు రాజు సహస్ర నాయకుడైన భృగుమహర్షి యాదాద్రిలో నారసింహ మంత్రానుష్ఠన విధానాన్ని.. ఆలయ నిర్మాణం గురించి స్కంధపురాణంలో పేర్కొన్నారు. హిరణ్యకశ్యపుడి వధ తర్వాత దేవతలు.. రుషులు విష్ణువును ఎల్లవేళలా దర్శనం చేసుకోవడానికి అవకాశమివ్వాలని వేడుకుంటారు. యాదాద్రి కొండగుహలో లక్ష్మీ సమేతంగా వెలిసి యోగ.. జ్ఞాననేత్రాలకు దర్శన మివ్వగలనని వారికి ఇచ్చిన హామీ మేరకే ఇక్కడ వెలసినట్లు చెప్తుంటారు. అలా ఆ ఆనందంతో దేవతలు.. రుషులు.. సృష్టికర్త బ్రహ్మ.. శ్రీవారి పాదాలను కడిగిన తరువాత ఏర్పడిందే పుష్కరిణి. దివ్యజ్యోతి దర్శనం: నలభై రోజులపాటు నరసింహస్వామికి ప్రదక్షిణలు చేస్తే సకల సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతామని భక్తుల నమ్మకం. ఇక్కడ పితృకార్యాలు జరిపితే పితృదేవతలు తరించి వైకుంఠవాసులై సుఖిస్తారని.. వ్రత క్రతువులు చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుపుష్కరిణిలో స్నానమాచరిస్తే సమస్త పుణ్యక్షేత్రాల్లోని తీర్థాలలో స్నానం చేసినంత మహాఫలం వస్తుందంటారు. బ్రహ్మోత్సవాలు జరిగే రాత్రులలో ఈ తీర్థానికి మధ్య అఖండ దివ్యమైన దివ్యజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ జ్యోతిని సావిత్రి- గాయత్రి- అరుణ దేవతలుగా ఆరాధిస్తారు. ఈ జ్యోతి ప్రకాశం నుంచి సుదర్శన జ్యోతి వెలుగొంది సమస్తమైన దీర్ఘకాలమైన వ్యాధుల నుంచి భక్తులను విముక్తి చేస్తుందని విశ్వాసం. కల్యాణ వైభోగమే:శ్రీయాదాద్రీ శుడికల్యాణం... మన లక్ష్మీనరసింహుడి శుభలగ్నం అని ముక్కోటి దేవతలు.. లక్షలాది మంది భక్తులు వీక్షిస్తుండగా యాదాద్రి కొండపై శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. తెలంగాణ తిరుపతిగా రాష్ట్రమంతటా వాసికెక్కిన శ్రీలక్ష్మీనరసింహుడు శ్రీలక్ష్మీ అమ్మవారితో లోక కల్యాణార్థం జరుపుకునే వివాహ వైభవం భక్తులకు కొంగు బంగారం కానుంది. లోకాలను రక్షించడమే దీక్షగా మాంగళ్యమనే తంతు సాక్షిగా శ్రీవారు.. దేవేరులు ఒక్కటయ్యే వేళలో శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. జై నారసింహ అంటూ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తుండగా అమ్మవారి.. స్వామి వారి సేవలు పశ్చిమ గోపురం నుంచి కదులుతాయి.


రమణీయం.. ఇది కమనీయం: అంగరంగ వైభవంగా జరిగే యాదాద్రీశుడీ దివ్య విమాన రథోత్సవం భక్తులను ఆనంద పరవశులను చేస్తుంది. శ్రీవారి కల్యాణ తంతు జరిగిన మరుసటి రోజున అమ్మవారితో కలిసి శ్రీలక్ష్మీనరసింహుడు రథంపై ఊరేగుతారు. ఈ రథోత్సవాన్ని బరాత్ అని కూడా పిలుస్తారు. ఈ రథసేవ వైభవాన్ని వీక్షించడానికి భక్తులకు రెండు కళ్లూ చాలవు. రంగురంగుల పుష్పాలు.. కనులు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతుండగా రథంపై కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. యాదాద్రి కొండంతా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. శ్రీవారు ఊరేగుతున్న దృశ్యాన్ని కనులారా గాంచితే పునర్జన్మ ఉండదని అర్థం. శివకేశవుల నెలవు: యాదాద్రి కొండపైన గల శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. శివాలయం వేలాది మంది భక్తులతో అలరారుతున్నది. యాదాద్రి కొండ శివకేశవులకు నెలవుగా మారిందనడానికి ఇదే ఉదాహరణ. ఈ శివాలయంలో ప్రతి రోజు ఉదయాన్నే పూజలు ప్రారంభమవుతాయి. ఒకవైపు శ్రీమహావిష్ణువు, మరోవైపు పరమశివుడు యాదాద్రిని పునీతం చేస్తున్నారు. శివాలయంలో నవగ్రహాలు, ఆంజనేయస్వామి, నాగదేవత, గణపతి, కుమారస్వామిలను దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శివపార్వతుల కల్యాణం భక్తులకు కన్నుల పండుగే. స్వప్నం సాకారం దిశగా: యాదాద్రిలో జరుగుతున్న పనులపై సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డిజైన్లు పూర్తి కావడానికి రెండేళ్ళు తీసుకున్నారు. 2015 దసరా రోజున పనులకు శంఖుస్థాపన చేయగా, 2017 దసరా నాటికి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు దేశంలోని ఎంతోమంది నిష్ణాతులు యాదాద్రి డిజైన్లను పరిశీలించారు. ప్రతీ ఒక్కరు ప్రశంసించడమే గాకుండా సీఎం చేస్తున్న యజ్ఞం సఫలం కావాలని ఆశీస్సులు అందజేశారు. ప్రధాన ఆలయాన్ని రెండున్నర ఎకరాలలో విస్తరిస్తూ కొండపైన మొత్తం పద్నాలుగు ఎకరాలలో చేపట్టిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వెయ్యేళ్ల కాలం వరకు నిలిచి ఉండే అద్భుత నిర్మాణాలకు రంగం సిద్ధమైంది. ఘనమైన ప్రాకారాలు: యాదాద్రిలో నిర్మించనున్న ఆలయానికి ఘనమైన ప్రాకారాలు, మండపాలు సిద్ధమవుతున్నాయి. వైటీడీఏ పద్నాలుగు మంది శిల్పులకు పనులను అప్పగించారు. హయత్‌నగర్ వద్దగల కోహెడ, కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, గుంటూరు జిల్లా నర్సారావుపేట దగ్గరలోని గుర్జేపల్లి, విజయవాడ సమీపంలోని మార్టూరులలో అపురూప శిల్పాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు నల్లని శిలలను (కృష్ణ శిలలును) ఉపయోగిస్తున్నారు. మంత్రముగ్ధమైన రీతిలో ఆధ్యాత్మికత ఉట్టి పడే కమనీయ ఆకృతులలో వాటిని తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి ఆలయంలోని ప్రధాన గర్భాలయం ఎదురుగా మహా మండపం నిర్మించనున్నారు. కృష్ణశిలలలో చక్కని ఆకారాలతో ఆలయ ప్రాకారాలను మలుస్తున్నారు. సప్తరాజ గోపురాలు: యాదాద్రిలో కృష్ణశిలతో నిర్మాణం కానున్న ప్రాకారాలు, మండపాలు ప్రపంచంలోనే పేరెన్నికగన్న తంజావురులోని శిల్ప సంపదకు దీటుగా రూపుదాల్చనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరు తదితర నాలుగుచోట్ల కృష్ణశిలలతో తయారవుతున్న శిల్పాలను యాదాద్రికి తీసుకువచ్చి రాజగోపురాల నిర్మాణంలో అమరుస్తారు. నిర్మాణాల పర్యవేక్షణ కోసం తమిళనాడులోని తంజావూరు, అనంత మంగళం నుంచి నిపుణులను రప్పించి పనులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మూలవిరాట్‌కు మందుండే ముఖమండపంలో ఒక అసాధారణమైన డిజైన్‌కు రూపకల్పన చేశారు. పంచతల రాజగోపురం.. త్రితల రాజగోపురం.. కాకతీయ విజయ తోరణాలు ఆలయ ప్రాంగణంలో కళా రూపాలుగా నిలువనున్నాయి. నిపుణుల కమిటీ: ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రి ఆలయ ముఖమండప నిర్మాణంలో పటిష్టత, నాణ్యత ప్రమాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణుల కమిటీని ఏర్పరిచారు. ఆలయ నిర్మాణం, విస్తరణ, ప్రాకారపు మండపాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మించనున్నారు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక నుంచి ముగ్గురు స్థపతులు వల్లినాయకం, సుందరరాజన్, డాక్టర్ ఆనందచారివేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, దేవదాయ శాఖ డీఈ శర్మ సభ్యులుగా ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ నిర్మాణానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తున్నారు.  టెంపుల్ సిటీ: సుమారు వెయ్యి ఎకరాలలో ప్రతిష్టాత్మక టెంపుల్‌సిటీ నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. తొలుత పెద్దగుట్టపైన 250 ఎకరాలతో దీనిని నిర్మించాలనుకున్నా యాదాద్రికి ఉన్న ప్రపంచస్థాయి గుర్తింపుతో 1000 ఎకరాలతో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, ఏడు ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, పన్నెండు ఎకరాలలో గ్రీనరీ, 62 ఎకరాలలో రహదారులు, 26 ఎకరాలలో ల్యాండ్ స్కేపింగ్ చేయడంతోపాటు మరో 42 ఎకరాల ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదీద్దనున్నారు. ఇప్పటి వరకు 2200 ఎకరాల భూములను వైటీడీఏ సేకరించింది. ఔటర్ కన్నా పెద్దరోడ్లు: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు కన్నా పెద్దవైన రోడ్లు టెంపుల్ సిటీలో నిర్మాణమవుతున్నాయి. మొత్తం కొండపైన 20 రోడ్లను చేపట్టారు. రూ.202 కోట్ల వ్యయంతో టెంపుల్ సిటీ లేఅవుట్ రూపుదిద్దుకోనున్నది. ఏడు రకాల రోడ్లు నిర్మాణమవుతున్నాయి. 101.5 మీటర్లు, 47.2 మీటర్లు, 44.4 మీటర్లు, 42.3 మీటర్లు, 45.7 మీటర్లు, 21.3 మీటర్లు, 12 మీటర్ల రోడ్లుగా విభజించారు. దీనికి తోడు గిరి ప్రదక్షిణ రోడ్డును 200 మీటర్లలో నిర్మిస్తున్నారు. రాయిగిరి నుంచి రూ.110 కోట్లతో యాదాద్రి వరకు రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. యాదాద్రికి నాలుగు దిక్కులకూ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. యాదాద్రి-చేర్యాల, యాదాద్రి-వంగపల్లి, యాదాద్రి-కీసర రోడ్లు నాలుగు వరుసలుగా మారుతున్నాయి. రక్షణగోడ ఏర్పాట్లు: యాదాద్రి కొండపైన 2015 దసరా రోజున పనులు మొదలయ్యాయి. దీనికోసం మొదటి టెండరు అదే సంవత్సరంలో రాగా రూ.123.03 కోట్లతో పనులు జరుగుతున్నాయి. టెంపుల్ సిటీ లేఅవుట్ కోసం 02-06-2016 రోజున టెండర్లు ఫైనల్ కాగా ఏడాది కాల పరిమితితో పనులు జరుగుతున్నాయి. కొండపైన రక్షణ గోడ నిర్మాణం చాల కీలకమైంది కావడంతో పనులను నాణ్యతతో జరిపిస్తున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పెద్దగుట్ట టెంపుల్ సిటీపైన మొదలయ్యాయి. వర్షపు నీరు వెళ్ళడానికి, మంచినీటి సరఫరా కోసం కూడా వేర్వేరుగా నిర్మాణాలు జరుపుతున్నారు. విశాలమైన బస్టాండ్ : యాదాద్రికి ఈశాన్య భాగంలో సేకరించనున్న 150 ఎకరాలలో అత్యాధునిక వసతులతో బస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న పరిధి వచ్చే తరాలకు సరిపోయేలా లేకపోవడంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. బస్సుల సంఖ్య పెంచుతారు. యాదాద్రికి నాలుగు దిక్కులా ఉన్న రోడ్లు బస్‌స్టేషన్‌ను కలుపుతూ నిర్మాణం కానున్నాయి. ఈ భూములన్నీ గుట్టకు ఈశాన్యభాగంలోని యాదగిరిపల్లి పరిధిలోకి వస్తాయి. దివ్య విమాన గోపురం : యాదాద్రిలో చేపట్టనున్న నిర్మాణాలు పక్కా వాస్తుతో జరగాలని సీఎం ఆదేశించారు. గర్భగుడిపై నిర్మాణం చేయనున్న దివ్యవిమాన గోపురం స్వర్ణమయం చేసేందుకు 45 అడుగులలో అత్యంత పకడ్భందీగా నిర్మించనున్నారు. విష్ణు పుష్కరిణీని విస్తరించి ఎక్కువ భక్తులు స్నానమాచరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. యాదాద్రి కొండపైకి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా 108 అడుగుల అంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

ఆశ్రమ ధర్మశాలలు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణ పనులు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే విధంగా సర్వాంగ సుందరంగా చేపట్టనున్నారు. మండల దీక్షలు చేసే భక్తుల కోసం మూడెకరాల స్థలంలో ఆశ్రమాల తరహాలో ధర్మశాలలు, తిరుమల తరహాలో మెట్ల దారిని ఆధునీకరించి వసతులు కల్పించాలనుకుంటున్నారు. ప్రస్తుతం వైకుంఠ ద్వారం వద్ద వున్న రాజగోపురాన్ని తొలగించి అత్యంత ఆధునిక పద్ధతులలో రాజగోపురం నిర్మించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నారు. హరిత హోటల్ నుంచి ఘాట్‌రోడ్డు వరకు గల మూడెకరాల స్థలంలో ఈ రెండు ధర్మశాలలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో మండల దీక్షలు నిర్వహించే మహిళా భక్తులకు, పురుషులకు వేర్వేరుగా వసతులను కల్పించనున్నారు.

రాజగోపురం నిర్మాణం : యాదాద్రికి వెళ్లే మెట్లదారిలో గల వైకుంఠ రాజగోపురాన్ని తొలగించనున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గిరి ప్రదక్షణ రోడ్డుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి రాజగోపురం తొలగించడం అనివార్యమైంది. ప్రస్తుతం ఉన్న గోపురం యథావిథిగా కొనసాగిస్తే వైకుంఠ ద్వారం వద్ద ఉన్న అనేక ఇళ్లను తొలగించాల్సి వస్తుందని ఎవరికి ఇబ్బందులు కలిగించ వద్దనే ఉద్దేశంతో రాజగోపురం తొలగించి వంద ఫీట్లు లోపలికి జరిపి నిర్మించనున్నారు.

వెయ్యేండ్ల నిర్మాణాలు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణ కనీవినీ ఎరుగని విధంగా జరుగనుంది. మొదటి ప్రాకార మండపం, రెండవ ప్రాకార మండపం, కళ్యాణ మండపం, యాగశాల, అద్దాల మండపం, రామానుజకూటం, రాగోపురాల నిర్మాణం కోసం వైటీడీఏ రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. యాదాద్రిలో రెండున్నర ఎకరాల్లో కొండపై శ్రీవారి ఆలయం.. దీనిలో బాలపాద ప్రాకార మండపం.. 32 శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించిన అవతారాలు కొలువు దీరే విధంగా డిజైన్లు రూపొందించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కడా 32 శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి విగ్రహాలు ఒకే దగ్గర కొలువుదీరి లేవని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అపర వైకుంఠం : శ్రీలక్ష్మీనరసింహుడికి పరమభక్తుడి రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరుమలకు దీటుగా యాదాద్రి ఉండాలని సంకల్పించారు. వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అభివృద్ధిలో తలమునకలయ్యారు. యాదాద్రి చరిత్రలో కేసీఆర్ పాలన సువర్ణాక్షరాలతో లిఖించేదిగా ఉండబోతున్నది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన నిర్మాణాలు తిరిగి కేసీఆర్ పాలనలో జరుగుతున్నాయని ఆధ్యాత్మిక వేత్తలు వేనోళ్లా కొనియాడుతున్నారు. జీయర్ స్వామి మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవం మొదలైంది.


బ్రహ్మోత్సవ ఘట్టాలు27న మొదటి రోజు 

స్వస్తివాచనము:

మొదటి రోజు ఉత్సవాల ప్రారంభ సూచకంగా స్వస్తివాచనము నిర్వహిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడిని ఆరాధించి ఆదిపూజ చేస్తారు. రాత్రి మృత్సంగ్రహణం, అంకురార్పణం చేస్తారు. పుట్టమన్నులో నవధాన్యాలను ఉంచి అంకురార్పణం చేస్తారు. 11 రోజుల్లో నవధాన్యాల నుంచి ఎంత చక్కగా మొలకలు వస్తే అంత సల్లంగా లోకం ఉంటదని నమ్మకం. 28న రెండో రోజు 
ధ్వజారోహణము: 
శ్రీవారి వాహనమైన గరుత్మంతునితో 33 కోట్ల దేవతలను శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని కోరుతూ ప్రధాన ఆలయం ధ్వజస్తంభంపై గరుత్మంతుని తెల్లని వస్త్రంపై చిత్రించి అవగతం చేస్తారు. గరుత్మంతుడు ఆయా దేవతందరినీ ఆహ్వానించినట్లుగా వారికి ఘనస్వాగతం పలుకుతూ రాత్రి భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహిస్తారు.మార్చి 1న మూడో రోజు మత్స్యావతార అలంకారం: 
వేదరక్షకునిగా శ్రీవారికి మత్స్యావతారం అలంకారం చేసి భక్తులకు దర్శనం కలిగిస్తారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్తసముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీమహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదపరిరక్షణ చేస్తారు. రాత్రి శేషవాహనసేవలో ఊరేగుతారు. మార్చి 2న నాలుగో రోజు 
శ్రీకృష్ణాలంకారము :
శ్రీలక్ష్మీనృసింహునికి నాలుగవ రోజు చిన్ని కృష్ణుని అలంకారం చేస్తారు. రేపల్లెలో చిన్నికృష్ణుడు చేసిన సందడిని యాదాద్రిలో ఆవిష్కరిస్తారు. శ్రీకృష్ణుని లీలావిశేషాలను ప్రధానార్చకులు వివరణ చేస్తారు. రాత్రి వాహనసేవల్లో భాగంగా 10 గంటలకు హంసవాహనంలో శ్రీవారు ఊరేగుతారు. జ్ఞాన సముపార్జనకు చిహ్నమైన హంసనే వాహనంగా చేసుకున్న శ్రీవారి మహిమలను వివ రిస్తారు. 

మార్చి 3న ఐదో రోజు వటపత్రాశాయి అలంకారం: వటపత్రశాయి అలంకారంలో శ్రీనరసింహుడు భక్తులను కరుణిస్తారు. సృష్టికి ముందు లోకాలన్నింటినీ తన పొట్టలోనే ఉంచుకుని ఏమీ తెలియని సాధారణ వ్యక్తి మాదిరిగా వటపత్రంలో శయనించి ఉండే శ్రీమహావిష్ణువు లీలలను ఈ రోజు యాదాద్రిలో సాక్షాత్కారం చేస్తారు. పెద్ద మర్రి ఆకుపై పడుకుని ఉండే శ్రీవారి అలంకార సేవలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు రాత్రి 10 గంటలకు పొన్నవాహనసేవ లో శ్రీవారు ఊరేగుతారు.

మార్చి 4న ఆరవ రోజు గోవర్ధనగిరిధారి అలంకారం:
శ్రీవారు గోవర్ధనగిరిధారి అలంకారసేవలో భక్తులకు దర్శనమిస్తారు. రేపల్లెలో గోపకులను రక్షించేందుకు గోవర్ధనపర్వతం చిటికెన వేలుపై ఎత్తి పట్టి ఇంద్రునికి గర్వభంగం చేసిన వైనాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 10 గంటలకు సింహవాహన సేవలో ఊరేగుతారు. సింహం అన్ని జంతువులకు రాజు. ఆ సింహాన్నే తన వాహనంగా చేసుకోవడం ద్వారా శ్రీవారు ఎంతటి శక్తిసంపన్నుడో తెలియజేయడమే దీని ఉద్దేశం. మార్చి 5న ఏడవ రోజు జగన్మోహిణి అలంకారం: 
శ్రీవారు జగన్మోహిణిగా యాదాద్రిలో ఆదివారం కనువిందు చేస్తారు. పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచేందుకు ఉద్భవించిన అవతారాన్ని ఇక్కడ దర్శించుకునే అవకాశం ఉంటుంది. రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు పర్వం. అశ్వవాహన సేవలో ఊరేగుతారు. కోరికలకు ప్రతిరూపంగా నిలిచే గుర్రాన్ని తన వాహనంగా చేసుకుని శ్రీవారు అమ్మవారితో జరిగే వివాహ నిశ్చయ ఘడియలకు హాజరవుతారు. మార్చి 6న ఎనిమిదవ రోజు తిరుకళ్యాణ మహోత్సవం: 
ఉ. 10 గంటలకు హనుమంత వాహనంలో శ్రీరామఅలంకారంలో ఊరేగుతారు. బాలాలయంలో ఉ. 11 గంటలకు జరిగే కళ్యాణంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు శ్రీస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితర అతిరథులు హాజరవుతారు.మార్చి 7న తొమ్మిదో రోజు దివ్య విమాన రథోత్సవం: శ్రీలక్ష్మీనృసింహుడు వెండిగరుఢసేవలో ఊరేగుతారు. అమ్మవారితో వివాహం జరుపుకున్న శ్రీవారు భక్తులకు రథంపై నుంచి దర్శనం కలిగిస్తారు.

మార్చి 8న పదవ రోజు శ్రీవారికి చక్రస్నానం: ఉదయం పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఆయుధమైన సుదర్శన చక్రంతో కలిసి శ్రీవారు విష్ణుపుష్కరిణిలో స్నానమాచరిస్తారు. వేలాది మంది భక్తులు శ్రీవారు విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించే వేళ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే, ఈ దఫా బాలాలయంలోనే శ్రీవారికి చక్రస్నానం ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చి 9న పదకొండో రోజు శతఘటాభిషేకంతో ఉత్సవ పరిసమాప్తి: 11గంటలకు శ్రీస్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. 100 కలశాలలో గల మంత్రపూర్వక జలంతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. రాత్రి 10 గంటలకు శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.


అద్భుత పుణ్యక్షేత్రంగా : 
ఎన్ని వందల కోట్లయినా ఇస్తాము.. యాదాద్రిని తిరుమలకు దీటుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చడంతో ఇప్పుడు అందరి దృష్టినీ యాదాద్రి ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక పరంగా యాదాద్రికి అత్యంత ఘనమైన స్థానం దక్కేలా, తెలంగాణకు తలమానికంగా, దేశంలోనే పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రంగా విరాజిల్లడానికి అవసరమైన హంగులను సమకూర్చుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2014 అక్టోబర్ 17 శుక్రవారం రోజు పవిత్ర యాదాద్రి నేలపై కాలు మోపారు. మన యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదే రోజు ప్రకటించడంతో ఈ క్షేత్రానికి మంచి రోజులు మొదలయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో: 
రెండెళ్ళలో సుమారు వెయ్యి డిజైన్లను పరిశీలించిన తర్వాతే తుది డిజైన్‌ను ఎంపిక చేసిన విధానమే ఆలయ అభివృద్ధి పట్ల కేసీఆర్ శ్రద్ధాసక్తులు, చిత్తశుద్ధిని ప్రస్ఫుటపరుస్తున్నది. ఆ డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. వాటికి వాస్తవ రూపం ఇచ్చేందుకు జరుగుతున్న పనులు భక్తులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి. యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న పనులను ఎవరూ ఊహించలేదు. ఒకనాటి వివక్షకు ఆయన చరమగీతం పాడుతూ కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న అపూర్వ సన్నివేశం అందరినీ అబ్బురపరుస్తోంది. కేసీఆర్ స్వప్నం సాకారం కావడానికి ఇక మరెంతో కాలం పట్టదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం