ఆఫ్రికాలోని అన్ని తెగల్లోనూ పెళ్లికొడుకే ప్రధానపాత్ర పోషిస్తాడు. పెళ్లి జరగాలంటే వరుడు ఎన్నో ఆటంకాల్ని దాటాలి. తగిన జోడీ కోసం కొన్ని తెగల్లో యుద్ధాలు జరుగుతాయి. మరికొన్ని రోజుల్లో పెళ్లి అవుతుందనుకునే జంటకి తెగపెద్ద కొన్ని మంత్రాలు పఠించమని చెబుతాడు. అందువల్ల పెళ్లయ్యాక ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవిస్తారనేది వారి నమ్మకం. మరికొన్ని తెగల్లో పురుషులు పెళ్లయ్యాక వధువు ఇంటి పక్కనే ఇల్లు కట్టుకుని, అక్కడే సంసారం చేయాల్సి ఉంటుంది. పెళ్లిళ్ల సందర్భంగా పాటలు, నృత్యాలతో వేడుకలు చేసుకుంటారు. ఇక జంతుబలి సాధారణం. పెళ్లి విందులు రోజులతరబడి జరుపుతారు. వారి కొన్ని వివాహ సంప్రదాయాలు ఎలా విచిత్రంగా ఉంటాయో చూద్దామా..
* సూడాన్‌లోని నెర్ ఆదివాసుల్లో పెళ్లికి ముందు వధువుకు- వరుడి తరపువాళ్లు నలభై పశువులు ఇవ్వాలి. అంతేకాదు, వధువు ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాకనే వరుడు ఆమెను పూర్తిస్థాయిలో భార్యగా స్వీకరిస్తాడు. ఒకవేళ ఆమె ఒక బిడ్డకే జన్మనిస్తే అతను విడాకులు తీసుకుని, వేరే పెళ్లి చేసుకోవచ్చు.
* కారో తెగలో వివాహానికి ముందు వధువు పొత్తికడుపు మీద కొన్ని గుర్తులను ముద్రిస్తారు.
* ఆఫ్రికా తెగల్లో త్వరగా అంతరించిపోతున్న జాతుల్లో ఆన్‌లో ఈవ్ ఒకటి. వీరిలో వివాహమనేది ప్రకృతి మధ్య జరిగే పుణ్యకార్యం. అందుకే వివాహానికి ఉపయోగించే వెండి, బంగారు నగల్ని కూడా అక్కడి హస్తకళాకారులే తయారుచేస్తారు.
* ఘనాకు చెందిన తెగల్లో పెళ్లి కూతుర్ని వరుడి తరఫువారే ముస్తాబు చేస్తారు. వధువుని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పెళ్లి కొడుకు తరపు బంధువులంతా ఆమెకు మద్దతుగా నిలుస్తారు. అంతేకాదు, వధువు కొత్త ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు తలుపును గట్టిగా కొట్టి రావాలి. ఇలా కొట్టడాన్ని ‘కొ..కొ..కు’ అంటారు.
* ఇథియోపియాలో రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన తెగ అమ్‌హరా. ఇక్కడి జనాభా 19 మిలియన్లు. అమ్‌హారిక్ వీరి మాతృభాష. వీరి పెళ్లిలో చర్చి ప్రధానపాత్ర పోషిస్తుంది. వీరికి వివాహమనేది ఓ ఒప్పందం. రెండు కుటుంబాల మధ్య గట్టి బంధం ఏర్పడటానికి వివాహం ముఖ్యమని వీరు భావిస్తారు.
* కెన్యాలో జరిగే కొన్ని వివాహాల్లో అత్తారింటికి వెళ్లే వధువుని ఆమె తండ్రి తిడతాడు. అంతేకాదు, ఆమె ముఖం, వక్షోజాల మీద ఉమ్మేస్తాడు. మళ్లీ పుట్టింటికి తిరిగి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తానంటాడు. పదమూడేళ్లకే ఆడపిల్లలకు పెళ్లిచేసే ఈ తెగ వివాహానికి ముందు ఆమెను రంగులతో అలంకరించి, ఒంటినిండా పూసలు, గవ్వలు, వెండి ఆభరణాలతో అత్తవారింటికి పంపిస్తుంది.
* కెన్యాలోని మరో తెగ స్వాహిలి. వీరు పెళ్లికి ముందు వధువుకు సుగంధస్నానం చేయిస్తారు. పెళ్లి కూతురు శరీరాన్ని రకరకాల వర్ణాలతో అలంకరిస్తారు.
* దక్షిణాఫ్రికాలోని కొన్ని తెగల్లో పెళ్లికి ముందు వధూవరుల పెదాలను కొన్ని మూలికలతో కనబడకుండా కప్పేస్తారు. వివాహ సంబరాలు వధూవరుల ఇంట్లో వేర్వేరుగా జరుగుతాయి.
* సాంబూర్ జాతిలో జరిగే పెళ్లిళ్లలో బహుమతులకు ప్రాధాన్యం ఎక్కువ. మేక, గొర్రె, గుర్రం, రెండు పంటల లాభం, ఇంకా వధువు తరపువారు కోరినన్ని పాలను పెళ్లి కానుకగా వరుడు సమర్పించుకుంటేనే వివాహయోగం ఉంటుంది.
* నమీబియాలో ఉన్న హంబా తెగలో పెళ్లికి ముందు వధువును ఎవరికీ కనబడకుండా దాచేస్తారు. వరుడు ఆమెను కనుక్కోవాలి. అప్పుడే పెళ్లి. అలాగే ఆమె ముఖాన్ని తోలుతో కప్పేస్తారు. శోభనం జరిగేంతవరకు ఆ ముసుగును అలాగే ఉంచుతారు.
- ఉమామహేశ్వరి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565