సంతానప్రదాత తలుపులమ్మ
సర్వసృష్టికి కర్తకర్మక్రియ ఆదిపరాశక్తి. ఆ పరాశక్తి లేనినాడు జగమే లేదు. ఆ తల్లినే అనేక రూపాలను ధరించి దుష్టులను శిక్షిస్తుంది. తన భక్తులను, సజ్జనులను, లోకోపకారం చేసేవారిని సదా రక్షిస్తూ ఉంటుంది. తమను చల్లగా చూడమని ఆ పరాశక్తినే లలితాదేవిగా, దేవీ భక్తులను ఉపాసిస్తారు. లోకాలన్నింటిని తన దృక్కులచేతనే కాపాడేతల్లి ఒకనాడు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ గ్రామంలో అవతరించింది.అగస్త్యమహర్షి మేరుపర్వతానికి గర్వమణ చడానికి మునుల కోరికననుసరించి దక్షిణభారతదేశ ప్రయాణం ఆరంభించాడు. మేరువు తన గురువు చెప్పినట్టు వింటూ తాను ఇంకా ఇంకా పెరగకుండా తన్ను తాను అదుపులో పెట్టుకున్నాడు. ఆ నెపంతో దక్షిణ భారతదేశానికి వచ్చిన అగస్త్యుడు ఒకనాడు ఈ తూర్పు గోదావరి జిల్లాలో తుని మండలంలోని లోవ గ్రామసరిహద్దుల్లో ప్రయాణిస్తున్నాడు. ఆనాడు మార్గశిర బహుళ అమావాస్య. సాయంసంధ్యా సమయం దగ్గరైంది. అగస్త్యమహాముని ప్రయాణ చేసేది ఓ కీకారణ్యం. కొద్దిసేపట్లో సూర్యాస్తమయం అవబోతోంది. సంధ్యా వందనం చేద్దామని అక్కడ నీటిజాడ కోసం ఆ ముని వెతకడం ఆరంభించాడు. కాని అక్కడదరిదాపుల్లో ఎక్కడా నీరు కనిపించలేదు. అపుడు ఆ ముని పాతాళగంగను ప్రార్థించాడు. మహాముని ప్రార్థన మేరకు పాతాళ గంగ పర్వత శిఖరాల మీదుగా పైకి పెల్లుబికి ఒక లోయ గుండా ప్రవహించింది. అపుడు సంధ్యా వందనాన్ని పూర్తిచేసి అర్ఘ్యం సమర్పించాడు అగస్త్యుడు.
కాస్త విశ్రాంతి తీసుకొంటుండగా క్రమంగా కటిక చీకటి అలముకుంది. ఆ రాత్రికి అక్కడే గడిపి ఉదయానే్న తిరిగి యాత్ర ప్రారంభించాలని మహాముని అనుకొన్నాడు. బడలికతో అక్కడ ఉన్న ఒక బండరాతిపైన పడుకున్నాడు. అపుడు ఆకలి అనిపించి లలితాదేవిని ప్రసాదించాడు. అగస్త్యుని ప్రార్థన విన్న తల్లి అతనికి మధుర పదార్థాల్లాంటి రెండు ఫలాలను అందించింది. ఆ తల్లిని స్మరించి అగస్త్యుడు వాటిని ఆరగించి తన ఆకలిని తీర్చుకున్నాడు. ఒక్కసారి ఆ తల్లిని చూస్తే బాగుండు కదా అని అనిపించింది ఆ మహర్షికి. వెంటనే ధ్యానంలోకి వెళ్లి ఆ తల్లిని మనసారా వేడుకున్నాడు. అపార కరుణామూర్తి అయన తల్లి అగస్త్యుని ప్రార్థనను మన్నించి ఆ ముని దగ్గరకు వచ్చింది. అగస్త్యుడు అమ్మను చూచి ఆనందాశ్రువులతో చేతులెత్తి నమస్కరించాడు.
తల్లీ ఈ ప్రాంత ప్రజలను కాపాడడానికే ఇక్కడ నీవు సంచారం చేస్తున్నావని తెలిసిందమ్మా. సకరులకు సర్వశుభాలను ఇచ్చి కాపాడే నీవు చల్లగా చూడమ్మా అని ప్రార్థించాడు. ఆ తల్లి అగస్త్యుని ప్రార్థనను మన్నించింది. చిరునవ్వులు చిందిస్తున్న తల్లిని చూచి అగస్త్యుడు ‘‘ తల్లీ నిరంతరం వ్యధాపరుల, రోగపీడితుల, మృత్యు భయకంపితులైన మానవులకు సకల సంపదలు కల్పించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మగా ఈ అటవీ ప్రాంతంలోనే పీఠం వేసుకుని కూర్చో తల్లీ అందరూ తలుపులమ్మా అన్ననామంతో నిన్ను కొలుస్తారని అన్నాడు అగస్త్యుడు. లోకోపకారి అయన అగస్త్యుని మాట మన్నించిన ఆ తల్లి ఆనాటి నుంచి భక్తుల కోరికలు తీరుస్తూ తలుపులమ్మతల్లిగా కొలువుతీరిందని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది. ఈ ‘లోయ’నే కాలక్రమంలో ‘లోవ’ గా రూపాంతరం చెందింది అని ఇక్కడి నివాసితులు చెబుతారు.
సకలభాగ్యప్రదాయిని అయన అమ్మను పూజించిన వారిలో రాజులు, చక్రవర్తులు, మహా మునులు ఇలా రకరకాలు వారు ఉన్నారు. నేటికీ కూడా అమ్మ సత్యసంధత భక్తులకు కనిపిస్తుం టుందని ఏ కోరిక కోరినా అది తప్పకుండ ఈడే రుస్తుందని అమ్మ భక్తులు అంటారు. స్ర్తిలు అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారని, సంతానం లేనివారు పూజిస్తే సంతానం పొందుతారని ఇక్కడి వారి నమ్మకం.
పౌర్ణమి రోజున ‘చంఢీ హోమం’, స్వాతి నక్షత్రం నాడు ‘పంచామృతాభిషేకం’ వంటి కార్యక్రమాలతో పాటుగా లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చనలు విశేష అర్చనలు కూడా అమ్మవారికి చేస్తుంటారు.
ఒకప్పుడు కీకారణ్యంగా ఉండే ఈ అటవీ ప్రాంతానికి ప్రస్తుతం రహదారి సౌకర్యం ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థ ఆర్టీసి, అన్నవరం దేవస్థానం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్తర కోస్తా జిల్లా నుంచి కొత్త, పాత వాహనాలన్నీ అమ్మవారి అనుగ్రహం కోసం లోవ ఆలయానికి విధిగా తీసుకొస్తుంటారు. అమ్మవారి పూజ జరిపించిన ఏ వాహనానికైనా ఎలాంటి అవరోధం రాదని భక్తుల విశ్వాసం. అమ్మ దర్శనం వల్ల తలలో పుట్టే తలపులకు నియంత్రణ కలుగుతుందని అంటారు.
- హనుమాయమ్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565