బాహుబలి నగలు కావాలా?
భారతదేశ చరిత్రలోనే బాహుబలి ఓ సంచలనం. అశేష మాహిష్మతీ సామ్రాజ్యానికి మనల్నీ తీసుకెళతాడు దర్శకుడు ఇందులో. అయితే అచ్చెరువొందించే కోటలూ, మందిరాలే కాదు... అందులో దేవసేన, శివగామీదేవిలతో పాటు బాహుబలి, భళ్లాలదేవలు ధరించిన నగలూ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతగా జనాన్ని కట్టిపడేసిన అలాంటి నగల్ని ఇప్పుడు మనమూ సొంతం చేసుకోవచ్చు. దేవసేనలా మనమూ హొయలొలికించొచ్చు!
బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలో హంసనావ పాట మనల్ని వూహాలోకంలోకి తీసుకుపోతుంది. అందులో అనుష్కకూడా స్వప్నసుందరిలాగే దర్శనమిస్తుంది. అందమైన చీరా, అందుకు తగ్గ నగలే అనుష్కకు ఆ పాటలో అంతందాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి. ఇక సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న మరో పాట ‘కన్నా నిదురించరా...’ లోనయితే అనుష్క ధరించిన మువ్వల నగల సెట్టు ఆడవాళ్ల మనసుల్ని ఎంతగానో దోచేసింది. సినిమా చూశాక అలాంటి నగలు ఒక్కసారి పెట్టుకుంటే బాగుండు అనిపించని అమ్మాయిలుండరంటే అతిశయోక్తి కాదు. రాజమాత శివగామీదేవికి అంతటి గాంభీర్యాన్నీ, బాహుబలీ భళ్లాల దేవలకు తిరుగులేని రాజసాన్నీ తెచ్చిపెట్టినవీ ఆ ఆహార్యాలే... అందుకు తగ్గ నగలే. ఈ పాత్రలన్నింటికీ కలిపి బాహుబలి సినిమాలో మొత్తంగా 1500 నగలు వాడారట. పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు నగల్ని తయారు చేసిన ప్రఖ్యాత జువెలరీ సంస్థ ఆమ్రపాలి సుమారు ఏడాదిన్నర కష్టపడి ఒక్కో పాత్రనూ దాని ఆహార్యాన్నీ బట్టి ప్రత్యేకంగా నగల్ని రూపొందించింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన ఈ నగలను ఇప్పుడు జనానికి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ‘బాహుబలి కలెక్షన్’ పేరుతో తమ దుకాణాలూ, వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టింది https://www.tribebyamrapali.com/ వెబ్‌సైట్లోకి వెళ్లి బాహుబలి కలెక్షన్‌ని చూడొచ్చు. సినిమాలో వివిధ పాత్రలు ధరించిన నగల తరహాలోనే అచ్చం అదే విధంగా వివిధ ఆభరణాల్ని రూపొందించారు. నచ్చిన వారు వీటిని ఆర్డరిచ్చి సొంతం చేసుకోవచ్చు. ఈ నగలన్నింటినీ వెండి మీద బంగారు పూతపూసి తయారుచేశారు. వీటి తయారీలో ముత్యాలూ, సెమీ ప్రీషియస్ రాళ్లూ (సహజాతి రత్నాలు), క్రిస్టల్స్ తదితరాలను వాడారు. విభిన్న రకాల గాజులూ, నెక్లెస్‌లూ, హారాలూ, పాపిటబిళ్లలూ, చెంపసరాలూ, వడ్డాణాలూ, గుళ్ల దండలూ, ముక్కుపుడకలూ... ఇలా అన్నింటినీ ఇందులో అందుబాటులోకి తెచ్చారు. రూ.600 మొదలు లక్షా లక్షన్నర రూపాయల వరకూ ధరపలికే నగలున్నాయిందులో. మీకు కూడా దేవసేన చెంపసరాలూ, శివగామీదేవి గొలుసులూ మళ్లీమళ్లీ గుర్తొస్తుంటే మాత్రం వీటిని ఓ లుక్కేయండి. మరీ నచ్చితే మీరూ రాణిగారి అవతారమెత్తేయండి... ఏమంటారు?!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565