భక్తి మధురిమ
భక్తి అంటే మాధుర్యం. దానికి లోకంలో మరేదీ సాటి రాదు. పోటీ లేదు. ఆ భక్తి తాలూకు అనుభవమే సాధన. అది అనుభూతి సారం. ఫలితం అనేది తరవాతి సంగతి. సాధనలో ఎడతెగని, ఆగలేని, ఆగనివ్వని అలౌకిక అనుభవం ఉంటుంది. అంశం ఏదైనా, సాధకుడికి ఫలితమే ప్రధానం. దానికోసమే అతడి నిరంతర సాధన. భక్తిసాధన అత్యంత విలక్షణం. ప్రారంభమైన క్షణం నుంచే అందులో మాధుర్యాతిశయం వెల్లివిరుస్తుంది.
ఇతరత్రా ఎటువంటి అనుభవమైనా, మొదలయ్యాక సంతృప్తి లభించవచ్చు. విరక్తీ ఎదురు కావచ్చు. భక్తిసాధన అలా కాదు. ఆ ఆస్వాదన ఆపాతమధురం.
సాధనాంతంలో కలిగే ఫలితం కంటే, సాధనానుభవమే భక్తుడి ఉద్విగ్నతను మరెంతో రసభరితం చేస్తుంది. అది ఓడిపోని పోరాటం. ఓటమి ఎరుగని యుద్ధం. ‘కలడు కలండనెడువాడు కలడో లేడో’ అనే ఉద్విగ్నపూరిత మీమాంస భక్తుణ్ని ఆవహిస్తుంది. దైవం కనిపించేవరకు అద్భుతమైన ఉత్కంఠ. ఒక్క క్షణమైనా నిలవనివ్వనంత అమితాసక్తి. ఎప్పటికీ అదే ఉత్కంఠ కావాలనిపిస్తుంది. ఆయనే భక్తుడి వెంట ఉన్నాడో, భక్తుడే ఆయన వెంటపడుతున్నాడో అర్థం కాని స్థితి అది!
సాధకుడి తుది లక్ష్యం ఒక్కటే- దివ్యానుభూతి. సాధన అంత సులభమేమీ కాదు. అందులో శబరి జీవితకాల నిరీక్షణ ఉంటుంది. తన కన్ను తీసి శివుడికి కన్నుగా పెట్టిన కన్నప్ప త్యాగం నెలకొంటుంది. భక్తులైన రామదాసు, అన్నమయ్యల అనుభవం తొంగిచూస్తుంది. భక్తి కోసం సర్వం త్యజించిన మీరాబాయి, సక్కుబాయిల ప్రేమాతిశయం వ్యక్తమవుతుంది. రాధ ఆరాధన ప్రతిఫలిస్తుంది. దైవాన్నే గెలవాలన్న కాంక్ష భక్తులకు ఉంటుంది. చిత్రమేమిటంటే, ఆ ‘శత్రువు’ తనమీద భక్తులే గెలవాలని అనుకుంటాడు!
అది యుద్ధమైనా, ప్రమాదరహితమైనది. భక్తుడి గెలుపు తథ్యమైన యుద్ధమది. దాన్ని ఎవరు కోరుకోరు? శత్రువు ప్రియమైనవాడైతే, ఆ పోరాటం ఎంత రసవత్తరంగా ఉంటుంది! ఎదుట ఆ ‘శత్రువు’ ఉన్నాడు కానీ, కనిపించడు. పోరాటం సాగుతూనే ఉంటుంది. ఎవరికీ గాయాలు లేవు. కావు. ప్రేమ, ఆర్తి, కన్నీళ్లు, విసుగు లేని-రాని నిరీక్షణలే భక్తుల ఆయుధాలు. అవే వారి అస్త్రాలు. అంతటి అందమైన యుద్ధం ఆగకూడదనే అందరి అభిలాష. వింతైన, విచిత్రమైన సమరమది. చల్లని సమీరం వంటి సమరం. ఇంపైన సంగీతం వంటి కదనం.
ఆ రణం ఆగాలని, దాన్ని ఆపాలని ఎవరికుంటుంది? పువ్వుల మెత్తని తూణీర గాయాలు ఎవర్ని నొప్పిస్తాయని! సీతాకోక చిలుకల రంగుల రెక్కల దాడి ఎవర్ని గాయపరుస్తుందని! అంత అందమైన యుద్ధాన్ని భక్తుడు భగవంతుడితోనే చేయగలడు. భక్తుడికి మరెక్కడా అంతటి మెత్తని కత్తి కనిపించదు. ఇంకెక్కడా అంత మధురమైన గళం లభ్యం కాదు. మరెక్కడా అంతటి ఆత్మీయుడైన ప్రత్యర్థి భక్తుడికి తారసపడడు.
గెలుపు కోసం చూడవద్దు. గమ్యం గురించి ఆరాటపడవద్దు. పయనం సాగించాలి భక్తుడు. సాగినట్లు కనిపించే పయనం అది. సాగనే సాగకూడదనుకునే పయనమూ అదే. ఎందుకంటే, అద్భుతమనిపించే గమ్యం భక్తుడిది. ఆ పడవను అక్కడే నిలవనివ్వాలి. దానికి తెడ్డు సాధనే! అది కేవలం సాధన కాదు. అనుక్షణమూ దివ్యంగా అనిపించే సాకేత రాముడి సన్నిధి అది. అది అతడికి ప్రారంభంలోనే లభ్యమైనట్లు లెక్క. మనసుపెట్టి, ప్రాణం నిలిపి ‘రామా’ అని పిలిచిన క్షణంలోనే మనో జిహ్వకు ఆ రుచి మొదలవుతుంది. మధురమైన, రసరమ్యమైన రుచి అది. అదేమిటో అనుభవజ్ఞులకే అర్థమవుతుంది. భక్తుడి ఆ సాధన అనుభవైకవేద్యం. అతడికి దేవుడే ప్రేమతో పెట్టిన నైవేద్యం అది! అందుకే మహాభక్తులెందరో దాన్ని, ఆ నిరంతర సాధననే కోరుకున్నారు. - చక్కిలం విజయలక్ష్మి #అంతర్యామి
ఎదిగిన కొద్దీ ఒదగాలి!
పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయతలపెట్టాడు. యాగానికి పదిహేను రోజుల ముందు.. సోదరులను, కౌరవులను, కృష్ణభగవానుణ్ణి, ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరారు ధర్మరాజు. సభకు హాజరైనవారంతా.. ‘దానిదేం భాగ్యం ధర్మరాజా! మీరు ఏం చెబితే అది చేస్తామ’ని ప్రకటించారు. భీముడికి భోజనాల విభాగం చూసుకోమని చెప్పాడు. కర్ణుడికి దానధర్మాలు చూసుకోవాల్సిందిగా కోరాడు. ఆదాయ, వ్యయాల విషయాలన్నీ దుర్యోధనుడికి అప్పగించాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు ధర్మరాజు. ఇంతలో శ్రీకృష్ణుడు లేచి.. ‘ధర్మరాజా! అందరికీ అన్ని పనులు చెప్పేస్తున్నావు. మరి నామాటేమిటి?’ అన్నాడు. అప్పుడు ధర్మరాజు.. ‘పరమాత్మా! నీవు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ. మీ సాన్నిథ్య బలంతో యాగం నిర్విఘ్నంగా సాగిపోతుంది’ అని బదులిచ్చాడు. అయినా కృష్ణుడు ఒప్పుకోలేదు. తనకేదైనా పని అప్పగించాల్సిందేనని పట్టుబడ్డాడు. దైవంగా కొలిచే కృష్ణ పరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక ధర్మరాజు తికమకపడ్డాడు. ధర్మజుడి ఇబ్బంది గ్రహించిన కృష్ణుడు.. ‘ధర్మరాజా! యాగానికి వచ్చే మునులు, రుషుల పాదాలు కడిగే బాధ్యత నాద’ని చెప్పాడు. ధర్మరాజు విస్తుపోయాడు. అన్నట్టుగానే యాగంలో తపస్సంపన్నుల పాద సేవ చేశాడు కృష్ణుడు. రాజసూయ యాగం పూర్తయిన తర్వాత అగ్రపూజ అందుకున్నాడు. ఎంత వాడైనా ఒదిగి ఉండాలనే సత్యాన్ని ఈ దృష్టాంతం ద్వారా లోకానికి చాటిచెప్పాడు శ్రీకృష్ణుడు.
ఉన్న ఊరూ... కన్నతల్లీ!
రావణసంహారం పూర్తయిన తర్వాత లంకలో ప్రవేశించారు రామలక్ష్మణులు. రావణుడు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు లక్ష్మణుడు. మనసులోని మాటను అన్నగారితో చెప్పాడు. రావణ రాజసౌధం సామాన్యమైంది కాదు. అంతా మణిమయమే. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు.
మనం ఇప్పుడు అలా ఆలోచించగలుగుతున్నామా? మన దేశం అంటే మనకు అంత గౌరవం ఉందా అసలు? మనవాళ్లెవరైనా అమెరికాలో ఉన్నారంటే మనకెప్పుడు అవకాశం వస్తుందా, మనమెప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తాం. ఎంతసేపూ పొరుగుదేశాలను పొగడటం, స్వదేశాన్ని తెగడటం... లక్ష్మణుడి వంటి తమ్ముడో అన్నో మనకూ ఉంటాడు. అలాంటి సలహా ఇచ్చే మేనమామలూ, బాబాయిలూ, బావమరుదులూ ఉండనే ఉంటారు. వాళ్లు సలహా ఇచ్చేవరకూ మనం స్థిమితంగా ఉండగలమా అసలు! అవతలి వాడు వెళ్లి ఎంత సంపాదించాడు, మనం వెళ్లక ఏమి కోల్పోయాం అనేదే అహరహం ఆలోచన. జన్మభూమిలో ఉండటం, కన్నతల్లి వద్ద ఉండటం కన్నా మించిన స్వర్గం మరొకటి ఉండదని అనుకోం. రాముడిని ఆదర్శంగా తీసుకుందాం... ఆయనలా ఆలోచిద్దాం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565