MohanPublications Print Books Price List clik Here MohanBookList

రజస్వలా ధర్మాలు_RajaswalaDharmalu


                  

రజస్వలా ధర్మాలు


ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమైన అవగాహన ఏమిటి అన్నది అటుంచితే , అసలు మన సనాతన ధర్మము దీన్ని గురించి యేమంటున్నది అని తెలుసుకోవడము ముఖ్యము. సనాతన ధర్మములో అంటు , ముట్టు అనేవే లేవని మిడిమిడి జ్ఞానముతో వాదించే పండిత పుంగవులు కూడా పుట్టుకొచ్చారు. కృష్ణ యజుర్వేదము రెండో కాండలో ఐదో ప్రశ్న చాలాభాగము దీనిగురించే వివరిస్తుంది. అందులో ఈ ఉదంతము ఉంది, దీనికన్నా ముందు , ఋగ్వేదపు ( 1-20-6 ) సూక్తము నొకదాన్ని చూద్దాము, ద్వాదశాదిత్యులలో ఒకడైన " త్వష్ట " ను ’ విశ్వ కర్మ ’ అని కూడా అంటారు. ఇతడే దేవ శిల్పి. ఇతడు కశ్యప ప్రజాపతి ( మానస ) పుత్రుడు .ఋగ్వేదము ఇతడిని బ్రాహ్మణుడు అంటే , యజుర్వేదము ఇతడిని ప్రజాపతి యనీ , అథర్వణ వేదము పశుపతి యనీ , శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారము రుద్రశివుడనీ వర్ణిస్తాయి. ప్రహ్లాదుడి కుమార్తె , ’ రచన ’ ఇతడి భార్య. వీరి పుత్రుడు " విశ్వరూపుడు " ఇతడికి మూడు తలలుండుట చేత , " త్రిశీర్షుడు " అంటారు. ఈ విశ్వరూపుడు , ప్రహ్లాదుడి దౌహిత్రుడు కాబట్టి , రాక్షస పక్షపాతి అని పేరు, అయితే కొంతకాలము దేవతల పురోహితుడుగా ఉన్నాడు. అతడి మూడు తలలలో ఒకతలతో సోమపానము చేసేవాడు , ఇంకొక తలతో సురాపానమూ , మూడో తలతో అన్న భక్షణమూ చేసేవాడు. పురోహితుడిగా యాగములు చేయించేటప్పుడు , దేవతలకు హవ్యభాగాన్ని ప్రత్యక్షంగా ఇప్పించేవాడు , అయితే , రహస్యంగా రాక్షసులకు కూడా హవ్యభాగాన్ని ఇప్పించేవాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు , ’ ఇతడు దేవలోకాన్ని రాక్షసుల పరం చేయవచ్చు’ నని బెదరినాడు. కాబట్టి , స్వామిద్రోహి , దేవ ద్రోహి యైన విశ్వరూపుడి మూడు తలలూ తన వజ్రాయుధముతో నరికివేస్తాడు. ( సోమపానము చేయు తల ’ కపింజలము’ అను పక్షిగాను , సురాపానము చేయు తల గుడ్లగూబ గాను , అన్నము తిను తల , ’ తిత్తిరి పక్షి ’ గాను రూపాంతరము చెందుతాయి ) ఆత్మ జ్ఞాని యైన ఇంద్రుడికి దుష్ట శిక్షణ చేసినందువల్ల , బ్రాహ్మణ హత్య పాపము కాదని తెలుసు. అయినా సామాన్యులకు జనాపవాద నివృత్తి చేయుట ఎలాగ అన్న విషయము తెలుపుట కోసము , ఇలా చేస్తాడు. ధర్మ దేవతల ఎదురుగా తన అంజలితో బ్రహ్మ హత్యా పాపాన్ని స్వీకరిస్తాడు. తాను తప్పుచేయలేదన్న భావనతో ఆ పాపాన్ని ఒక సంవత్సరము భరిస్తాడు. అయితే సృష్టిలోని ప్రాణులన్నీ , ఇంద్రుడిని " బ్రహ్మ హత్య చేసినవాడు " అని ఆక్షేపిస్తాయి. కాబట్టి , సామాన్యుల దృష్టిలోకూడా దాని నివృత్తి కోసము బ్రహ్మ హత్యా పాపాన్ని ఇతరులకిచ్చి , తీసుకున్నందుకు ప్రతిగా వారికి వరాలను ఇవ్వాలనుకుంటాడు. మొదట , భూదేవిని ప్రార్థించి , తన పాపములో మూడో భాగాన్ని తీసుకోమని కోరుతాడు. భూమి , వరాన్ని ఇలా అడుగుతుంది , " జనులు నన్ను త్రవ్వేటప్పుడు నేను పీడను అనుభవిస్తాను , దానివలన నాకు హింస కలుగుతుంది. కాబట్టి , నాకు వ్యథ తెలియకుండా , హింస కలుగకుండా చూడు " . ఇంద్రుడు దానికి సమ్మతించి , జనులు భూమిని త్రవ్వేటప్పుడు భూమికి నొప్పి కాకుండానూ , అంతేకాక, ఆ త్రవ్విన చోట ఒక సంవత్సరములోపల దానికదే పూడుకొనే లాగానూ వరమిచ్చి , పాపపు మూడో భాగాన్ని వదిలించుకుంటాడు. బ్రహ్మ హత్యా పాపం తో కూడుకొన్నది కావున తనకుతానుగా పూడుకొన్న అటువంటి బంజరు భూమిని ఎవరూ నివాసము కోసమూ ,
యాగముల కోసము ఉపయోగించరాదు. తర్వాత ఇంద్రుడు, వృక్షములను , సస్యములనూ ప్రార్థించి , బ్రహ్మ హత్యా పాపంలో ఇంకో భాగాన్ని తీసుకొమ్మని కోరుతాడు. అప్పుడా సస్యజాలము , "జనులు మమ్మల్ని కత్తరించుటవలన మేము నశిస్తుంటాము, కాబట్టి మేము నాశనము కాకుండా వరమియ్యి " అని అడుగుతాయి. ఇంద్రుడు ఒప్పుకుని , " నరికినచోట అనేక చిగుళ్ళు మొలవనీ " అని వరమిచ్చి , పాపపు రెండో భాగం వదిలించుకుంటాడు. అందుకే , చెట్లను కొట్టివేస్తే అక్కడే అనేక చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అయితే , అది బ్రహ్మ హత్యా పాపంతో కూడుకున్నది కాబట్టి , ఆ కొట్టివేసిన చోట , గట్టియైన రసము ( బంకపాలు లేదా జిగురు) కారుతుంది. కాబట్టి ఆ రసమును తాగరాదు. ( కల్లు వచ్చేది ఇలాగే , అందుకే కల్లుతాగుట నిషేధము. ) కాబట్టి , ఎరుపు రంగుతో ఏదైతే కారుతుందో , లేక , కొట్టివేసిన చోటే బయటికి కారుతుందో , అది తినుటకు యోగ్యము కాదు. అయితే , కొట్టివేయకుండానే కారే రసాలకు ఈ నిషేధము లేదు. ఆ తర్వాత , మిగిలిన బ్రహ్మ హత్యా పాపంలోని మూడోభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు , స్త్రీ సమూహాలను కోరుతాడు. అప్పుడు స్త్రీలు , " నిషిద్ధ దినములలో పురుష సంయోగము వల్ల కలిగే దోషము లేకుండా , దానివలన గర్భమునకు హాని కలుగకుండా వరమునియ్యి " అని అడుగుతారు. ( పురుష సంయోగము కేవలము సంతాన ప్రాప్తికే అయిననూ , ప్రసవము వరకూ , ఇచ్చానుసారముగా పురుష సంయోగమును యే దోషమూ లేకుండా పొందుటకు యోగ్యతను పొందుతారు ) ఆ వరము వలన , ప్రథమ రజోదర్శనముతో మొదలు పెట్టి , ఋతుకాల సంబంధమైన వీర్య సంయోగము వలన సంతానము పొందుతారు , ప్రసవము అయ్యేవరకూ , ఇచ్చానుసారము పురుష సంయోగము పొందే శక్తిని పొందుతారు. అయితే , అది బ్రహ్మహత్యా సంబంధమయినది కాబట్టి , ఆ పాపము స్త్రీల రజోరూపమైనది. అనగా రజస్సును అంటిపెట్టుకొని ఉండును.
రజస్వల అయిన స్త్రీ మలిన వస్త్రములను ధరించినదానితో సమానము. అట్టి రజస్వలతో ఎవరూ సంవాదములు చేయరాదు. పక్కన కూర్చొనరాదు. ఆమె ముట్టిన అన్నమును తినరాదు. బ్రహ్మ హత్యారూపాన్ని శరీరం లో ధరించినది కావున , స్త్రీలకు ప్రియమైన అభ్యంగనాది తైలములను రజస్వలలు తీసుకోకూడదు. సౌందర్య సాధనములను వాడరాదు. ( ఇతర వస్తువులను తీసుకొన వచ్చును ) ముఖ్య నియమములు :- ఎవడైతే రజస్వలతో సంయోగిస్తాడో , ఎవడైతే ఆ సంయోగము వలన పుట్టునో , వాడు నీలాపనిందల పాలై కష్టములనుభవిస్తాడు. అడవిలో రజస్వలతో సంయోగఫలముగా పుట్టినవాడు , దొంగ అవుతాడు. సిగ్గుతోగానీ , భయం తోగానీ , నిరాకరించిన స్త్రీని ఎవరైనా కూడితే , ఆమెకు పుట్టువాడు , సభలలో మాట్లాడుటకు సిగ్గుపడి , తలవంచుకొనెడు పుత్రుడు అవుతాడు యే రజస్వల అయితే స్నానము చేస్తుందో , ఆమెకు , నీటిలో మునిగి చనిపోగల సంతానము కలుగును ( రజస్వలలు ఆ మూడు రోజులూ స్నానము చేయరాదు) యే రజస్వల అభ్యంగన స్నానము చేస్తుందో , ఆమెకు కుష్టు రోగము , చర్మ రోగములు కల సంతానము కలుగును. యే స్త్రీ అయితే గోడలమీద బొమ్మలు వేస్తుందో , ఆమెకు కేశములు లేని , బట్టతల కలుగువారునూ , దుర్మరణము / అకాల మరణమునకు పాలగువారు పుడతారు. ఎవతె కంటికి కాటుక పెట్టుకొనునో , ఆమెకు , కళ్ళులేనివారు , నేత్రరోగులు పుడతారు. ఎవతె , దంతధావనము చేయునో ( వేపపుల్లతో ) ఆమెకు పాచి పళ్ళు , పుచ్చుపళ్ళు కలవారై పుడతారు. యేస్త్రీ గోళ్ళను కత్తరించుకొనునో , ఆమెకు వికృత గోళ్ళు కలవారు పుడతారు. యేస్త్రీ గడ్డి కోస్తుందో , చాపలల్లుతుందో , ఆమెకు నపుంసకులు పుడతారు. ఎవరైతే పగ్గములను ( తాళ్ళను ) పేని తయారు చేస్తారో , ఆ స్త్రీలకు ఉరిపోసుకొని చచ్చువారు పుడతారు. యేస్త్రీ ఆకులతో నీరు తాగునో , ఆకులలో భోజనము చేయునో , ఆమెకు ఉన్మాదులు / పిచ్చివారు పుడతారు. ఎవరైతే అగ్నిలో కాల్చిన మట్టికుండలలో నీరు తాగుతారో , ఆమెకు మరుగుజ్జులు ( పొట్టివారు ) పుడతారు. ఈ నియమాలు మూడురాత్రుల కాలము ముగియువరకూ పాటించవలెను. పచ్చికుండలలో , పచ్చి మూకుడులలో నీళ్ళు తాగడము , భోజనము చేయడము చేయవచ్చును. ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ సంతానము కలుగును. ఇతరులకు కామోద్రేకము కలుగులాగ ప్రవర్తించరాదు. ఈ నిషిద్ధ కార్యములకు ఫలము అరిష్టమే కాబట్టి , అరిష్టము తెచ్చు యే పనినీ చేయరాదు. శ్రద్ధాళువులు సనాతన ధర్మపు సాంప్రదాయములను , ఆచారములను పాటించి శుభమును పొందెదరు గాక .

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం