MohanPublications Print Books Online store clik Here Devullu.com

గజేంద్ర మోక్షము_GajendraMoksham_Brahmasri Chaganti Koteswara Rao


          


     మనిషి మనిషికో గాథ, ఇంటింటికో రామాయణం. ఎన్నో విచిత్రమైన జీవితాలు, గంభీరమైన కోణాలు, అనుకోని మలుపులు, తృప్తినివ్వలేని గెలుపులు, అమాయకత్వపు ఆలోచనలకు మూర్ఖపు ఛాయలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఎన్నెన్నో చారిత్రక నిక్షిప్తాలై, అంతులేని అగాథాలై మన్నికైన జీవితపు ఖాతాలో చేరిపోయి మనం పలకరించినా, మనకవి తారసపడినా అబ్బురపడిపోవడమో, ఒకింత గర్వపడడమో ఆలోచనల్లోకి వెళ్ళిపోవడమో చేస్తుంటాం తప్ప అందులోని అసలైన విషయాన్ని వివేచన చేయం. అందుకే జీవితం అంటే నిండా సందేహాలే. మరి వాటిని నివృత్తి చేసుకునేలోపు జీవితమే ముగుస్తుంది. అందుకనే చరిత్ర పునరావృతం అవుతూనే ముగుస్తుంది. చారిత్రక ఆధారాలుగా మిగిలేవి శిలలూ, కోటలూ కాదు. కాలం వెనుక దాగున్న జీవితాలను వినీ, చదివీ చూద్దాం. మన సందేహాలన్నింటికీ సమాధానాలు తేటతెల్లమవుతాయి. జీవితాలను సునిశితంగా పరిశీలించే క్రమంలో జీవితానికి మోక్షపథాన్ని చూపించే గజేంద్రుని గాథ చర్విత చర్వణం. మన ప్రయత్నం అశక్తతకు గురైనప్పుడు దైవమే సంపూర్ణశక్తిగా మనల్ని రక్షిస్తుందనేందుకు తార్కాణం గజేంద్రుని చరితం.ప్రమద్వర
గజేంద్రుడు అంటేనే అర్థమవుతుంది ఏనుగని. కానీ అతని బుద్ధిబలం, బలగం, స్థానం చాలా ఉన్నతమైనవి. త్రికూట పర్వత ప్రాంతంలో నివసించేవాడే గజరాజు. అందమైన అడవి ప్రాంతం అది. ఆ ప్రదేశంలో చాలారకాల జంతువులు ఉన్నప్పటికీ వేల ఏనుగులు అక్కడ ఉండడం వల్ల వాటికది ప్రత్యేకస్థానంగా చెప్పబడింది. వేల సంఖ్యలోని ఆ ఏనుగుల గుంపు నడుస్తుంటే అంధకారం నడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ మహాగజ సమూహానికి రారాజు గజేంద్రుడు. ఒకానొక వసంత ఋతువులో జరిగిన సంఘటన గజేంద్రుని జీవితాన్ని మలుపు తిప్పింది.గజేంద్రుడు చాలా సున్నిత మనస్కుడు. తెలివిగలవాడు, పట్టుదలగలవాడు. జీవితమంటే విలువున్నవాడు. వసంత కాలంలో ఆహారాన్వేషణ కోసం గజేంద్రుని సారథ్యంలో వేల ఏనుగుల గుంపు బయలుదేరింది. అవి వస్తుంటే చుట్టుపక్కల ఏ జంతువూ విహారానికి వచ్చేది కాదు. గజేంద్రుని బృందం ఆహారం గ్రహించి నీళ్ళు తాగడానికని సరస్సును వెదుకడం ప్రారంభించింది. ఆ క్రమంలో గజేంద్రునితో సహా కొన్ని ఏనుగులే వెంటరాగా దారితప్పి గుంపులు గుంపులుగా విడిపోయాయి. గజేంద్రునికి అందమైన సరోవరం కనిపించింది. నిండైన తామరలతో అందంగా ఉన్న ఆ కొలనులో మొసళ్ళు కూడా ఉన్నాయి. కానీ అవేవీ గజేంద్రునికీ, అతని వెంట ఉన్న ఏనుగుల బృందానికీ తట్టలేదు. చల్లని సేదకోసం, దాహం కోసం కొలనులో దిగాయి అవంతా. గజేంద్రుడు తృప్తిగా నీటిని తాగి, తన తొండంతో నీటిని ఆకాశానికి ఎగజిమ్ముతూ ఆనందంతో పరవశించిపోయే సమయంలో ఒక్కసారిగా కొలను మధ్యలో నీళ్ళన్నీ అలల్లా విరుచుకుపడగా పెద్ద మొసలి ఒకటి గజేంద్రుని కాలు పట్టేసింది. విషయం అర్థమై గజేంద్రుడు తొండంతో పోరాడుతూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు. కానీ స్థానబలం మొసలి బలాన్ని మరింత పెంచాయి. గజేంద్రునితో సమానంగా బలాన్ని పుంజుకుంది మొసలి. 

గజేంద్రుని ముందటి కాలును బలంగా అదిమిపట్టింది. అంతే గజేంద్రుడు చిక్కుకుపోయాడు.గజేంద్రుడు మొసలితో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు పోరాడాడు. విధి వైచిత్య్రం కాకపోతే అడవుల్లో తిరిగే గజేంద్రునికీ, నీటిలోంచి బయటికి రాని మొసలికి ఎంతకూ తెగని వైరం. గజేంద్రుడు తన శాయశక్తులూ ఓడి పోరాడుతూనే ఉన్నాడు. కాలం తనది కాకపోయినా పోరాటం మాత్రం ఆపలేదు. తన చివరి ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో చేశాడు. పట్టు విడువని మొసలి పట్టుదలతో గజేంద్రుడు జీవిత చక్రం ఎటువంటి సంఘటనలకు తావిస్తుందో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇక చివరికి మొసలిని గెలువడం తన తరం కాదని నిశ్చయించుకున్నాడు గజేంద్రుడు. సర్వశక్తులూ అలసిపోయి అన్ని ప్రయత్నాలూ విరమించి సకల లోకాలనూ కాచే భగవంతుడిని ప్రార్థించాడు గజేంద్రుడు. ఆతని పిలుపులో ఆర్ధ్రత ఉంది. శ్రద్ధ ఉంది. అతని సంకల్పం కూడా గట్టిదే. అందుకేనేమో అలవైకుంఠపురంలో హాయిగా సేదతీరుతున్న హరి, సిరికైనా చెప్పక, శంఖచక్రాలు ధరించక, పరివారాన్ని పిలువక, గరుత్మంతున్నీ రమ్మనకే ఒక్కడే పరుగుపరుగున బయలుదేరాడంట. ఎటు వెళుతున్నాడో తెలియక హరి వెంటే లక్ష్మీదేవి, సకల పరివారం కదిలిందట.హరి అంత హుటాహుటిన కదిలివచ్చి గజేంద్రుడు ఉన్న సరస్సును చేరి తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుని కాపాడాడు. శ్రీహరి స్పర్శతో అన్ని సంవత్సరాల బాధ తొలిగిపోయింది. గజేంద్రుడు పిలిస్తే హరియే దిగివచ్చాడంటే ఎంతటి స్వచ్ఛమైన జీవితం తనది. ఎంతటి మహోన్నతమైన సంకల్పం తనది. మనిషన్నవాడికి జీవితంలో అనుకోని, అనూహ్యమైన సంఘటనలు ఎదురుపడుతాయి. అయినా ధైర్యం కోల్పోక ప్రయత్నం చేయాలి.


--------------------------------------


త్రికూట పర్వతారణ్యములో ఒక గజరా జుండెను. అతనికి దశలక్ష భార్యలు గలరు .అతడొకనాడు భార్యలతో అడవిలో దిరుగుచు దాహమువేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి, కరిణులతో జలక్రీడలకు దిగి, చెరువు నంతయు కలచివేసెను. ఆ చెరువులో పెద్ద మొసలి యున్నది. అది వచ్చి గజరాజు కాలుపట్టుకొనేను. ఏనుగు విదిల్చి కొట్టెను. మొసలి మరల పట్టుకొని విడువలేదు. లోపలికి లాగుచుండెను. గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయి యేండ్లు గడిచేను. స్థానబలముచేత నీటిలోని మొసలి మరింత విజ్రు౦భి౦చెను.గజరాజునకు బలము సన్నగిల్లెను. మొసలిని గెలువగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించువా రెవ్వ రను కొనెను. పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను.


అప్పుడు శా|| లా వొక్కింతయు లేదు ధైర్యము విలోల౦బయ్యె ప్రాణ౦బులున్ ఠావుల్ దప్పెను, మూర్చ వచ్చే,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవేతప్ప నిత:పరం బెరుగ, మన్నింప పందగుం దీనునిన్ రావే! యీశ్వర!కావవే వరద!సంరక్షింపు భద్రాత్మకా!


అని మొరపెట్టుకొనెను. ఆ మొర విని విష్ణుదేవుడు కరిగిపోయేను. తాను విశ్వమయుడు గాన, గజేంద్రుని రక్షింపదలచెను. అహంకారము జీవలక్షణము. అది జీవుని అంత త్వరగా వదలదు. అది ఉండుట, అవసరమే అయినను మితి మీరకూడదు. ఆత్మరక్షణకై సకలజీవులు ప్రయత్నించెను. అది తప్పు కాదు. తానే బలవంతుడ నను అహంకారము అనర్ధము తెచ్చును. గజేంద్రుడు తన్నుతాను రక్షించుకొనుటకై పోరాడునంత కాలము శ్రీనాథుడు పట్టించుకోలేదు. మన యవసరము లేదు లెమ్మని యూరకున్నాడు. ద్రౌపది విషయంలో గూడా ఇంతేకదా! దుశ్శాసనుడు చీర లోలుచుచు౦డగా ఆత్మరక్షణకై చాలా ప్రయత్నించిన దామె. శత్రువుముందు తమ బలము చాలదని గ్రహించిన తరువాతనే వారు దైవమును శరణు వేడిరి .


అంతవరకును చూచుచు ఊరకుండిన శ్రీహరి అప్పుడు రంగంలోనికి దిగినాడు. అది అతని శరణాగత రక్షణ గుణమునకు పరాకాష్ట. సర్వమునకు దైవమే శరణ్య మని నమ్మిన భక్తులను అయన ఆత్మీయులుగా భావించి రక్షించును. శ్రీహరి గజరాజు మొర వినగానే ప్రక్కనున్న లక్ష్మితో గూడా చెప్పకుండా పరుగుల మీద వచ్చి చక్రాయుధముతో మొసలిని జంపి గజరాజును కాపాడినాడు. అని శుకముని పరీక్షిత్తునకు జెప్పి, “రాజా! గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడను రాజు . విష్ణుభక్తుడు. ఒకనాడు అతడు శ్రీహరి ధ్యానములో నుండగా అగస్త్యుడు అక్కడకు వచ్చెను . రా జతనిని జూడలేదు. అందుచే ఆ ముని కోపించి “ నీవు మదముతో నాకు మర్యాదలు చేయవైతివి కావున మదగజమవై పుట్టు “ మని శపించెను.


పుజి౦పదగిన మహాత్ములను పూజించకుండుట శ్రేయోభంగకరము గదా! అట్లు ముని శాపమున ఆ రాజు గజరాజై పుట్టెను. పూర్వజన్మవాసన చేత మనసులో హరిభక్తి అంకురించి విష్ణుదేవుని యనుగ్రహమునకు పాత్రుడయ్యేను. మొసలి, హుహు అను గంధర్వుడు . దేవలుని శాపముచే అట్లాయ్యెను.శ్రీహరి చక్రధారచే చచ్చి పుణ్యగతికి బోయేను. విషమ పరిస్థితులలో చిక్కుకొన్న వా రేవ్వరైనను ఈ గజేంద్రమోక్షణ కథను భక్తితో చదివినను, విన్నను సర్వాపదలు తొలగిపోయి సుఖపడుదురు. ఉత్తమగతిని గజేంద్రునివలె పొందుదురు.


+++++++++++++++


గజేంద్ర మోక్షము – చదివితిన్!


చాగంటి కోటేశ్వరరావు గారి సైటు గురించి పరిచయమై, దాన్ని బ్రౌజ్ చేస్తూంటే ‘గజేంద్ర మోక్షం’ పద్యాలు కనబడ్డాయి. (పోతన భాగవతంలోవి). పదమూడే ఉన్నాయి అన్న కారణం వల్లనూ, పక్కనే తాత్పర్యం‌(అసలది తాత్పర్యం అనడం కంటే, చాగంటి వారి భావం అనడం‌నయమేమో) కనబడ్డంతో కాస్త సాహసించి చదివాను. పఠనానుభవం, రవ్వంత నిప్పురవ్వల లాంటి తారాజువ్వల్లాంటి కంప్లైంట్లు కలిస్తే ఈ టపా….


నీరాట వనాటములకు


బోరాటం బెట్లుగల్గెఁ పురుషోత్తముచే


నారాట మెట్లు మానెను?


ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్?


-నీరాటము, వనాటము, పోరాటము, ఆరాటము, ఘోరాటవి : బాగుంది ప్రాస


ఇంతకీ, భద్రకుంజరముకున్ :అంటే ఏమిటి? కుంజరము అంటే ఏనుగు కదా.భద్ర అంటే కూడా ఆంధ్ర భారతిలో చూసిన రకరకాల అర్థాల్లో, ఏనుగు ఒకటి… మొసలి ఏదీ మరి??


కలడందురు దీనుల యెడ


కలడందురు పరమయోగి గణములపాలం,


గలడందు రన్ని దిశలను,


గలడు గలం డనెడివాడు గలడో? లేడో?


– భక్తులు వేస్కునే ప్రశ్నే ఏమో కానీ, అందరికీ వర్తిస్తుంది కనుక, నాకు బా నచ్చింది. భక్తప్రహ్లాద గుర్తు వచ్చిందెందుకో!!


ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై,


యెవ్వనియందు డిందు, బరమేశ్వరుఁడెవ్వఁడు, మూలకారణం


బెవ్వఁ, డనాది మధ్యలయుఁ డెవ్వఁడు, సర్వము దానయైన వాఁ


డెవ్వఁడు, వాని నాత్మభవు, నీశ్వరు,నే శరణంబు వేఁడెదన్.


-ఓహో, ఇది గజేంద్ర మోక్షము పద్యమన్నమాట. బాగా చిన్నప్పుడు మా నాన్న నేర్పిన పద్యం ఇది. ఇటీవలే, మరొకరు దీన్ని అందంగా చదివి వినిపించారు కూడానూ.


ఒకపరి జగముల వెలి నిడి,


యొకపరి లోపలికిఁ గొనుచు, నుభయముఁ దానై


సకలార్థ సాక్షియగు న


య్యకలంకుని, నాత్మమూలు, నర్థింతు మదిన్.


-నయ్యకలంకుని ఏమిటో? అని కాసేపు బుర్ర బద్దలుకొట్టుకుని – ‘ఆ అకలంకుని’ అన్న మాట అని అర్థం చేస్కునే సరికి రెణ్ణిమిషాలు పట్టింది. అసలు మొదట్నుంచీ , బోరాటం, నారాటం,గలడు గలండు, డెవ్వడు… ఇలా ఇలా చదివి మహా చిరాకొస్తూ ఉండింది. అలాంటివి చూస్తూంటేనే పఠాభి గుర్తొస్తాడు నాకు. చంధస్సుల వల్లో చిక్కిన తెలుగు భాష, అర్థం కాని సౌమ్య ఘోష – అన్న టైటిల్ నా ముందు స్క్రీను మీద, ప్రణవ్ మిస్ట్రీ సిక్స్త్ సెంస్ సాయంతో సాక్షాత్కరించింది


లోకంబులు లోకేశులు


లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం


జీకఁటి కవ్వల నెవ్వఁడు –


నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.


-లోకంబులు, లోకేశులు, లోకస్థులు : :)‌బాగుంది. ‘నేకాకృతి’ :)) కాంటెక్స్ట్ చూస్కోకుండా నేకాకృతి అని చదవగానే నవ్వాగట్లేదు ఎందుకో!!


నర్తకునిభంగిఁ బెక్కగు –


మూర్తులతో నెవ్వఁడాడు, మునులున్ దివిజుల్


కీర్తింప నేర, రెవ్వని –


వర్తన మొరు లెఱుఁగ రట్టి వాని నుతింతున్.


-‘నెవ్వఁడాడు’ అంటే , ‘ఎవరు ఆడునో’ అన్న అర్థం లాగుంది కానీ, మొదటిసారి చదివినప్పుడు – ‘ఎవడాడు?’ అని అరిచినట్లు అనిపించి, కాస్త ఉలిక్కిపడ్డా.


విశ్వకరు, విశ్వదూరుని


విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వు, నవిశ్వున్


శాశ్వతు, నజు, బ్రహ్మ ప్రభు


నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.


-విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వు, నవిశ్వున్ : ఈ పదాల కూర్పు మళ్ళీ‌నాకు తెగనచ్చింది. పక్కనే ఉన్న తాత్పర్యాన్ని బట్టి భావం అర్థమైంది కానీ, ‘విశ్వదూరుడు’ అంటే అర్థం ఏమిటో తెలీలేదు.


విశ్వవేద్యుడు‌: విశ్వమంతా తెలిసిన వాడు అన్నట్లా? ఏదేమైనా, భలే ఉన్నాయ్ ఆ రెండు లైంలు మాత్రం.


ఓకమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష విదూర! కు


య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా


నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపుల ప్రభావ! రా


వే! కరణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుఁ గావవే!


-హమ్మయ్య, ఒక్కసారికి మొదటి చూపులోనే సారాంశం అర్థమైపోయింది.


అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా


పల మందార వనాంతరామృత సరః ప్రాతేందు కాంతోపలో


త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రము “పాహి! పాహి” యన గుయ్యాలించి సంరంభియై”


-ఇక్కడ్నుంచి మిగితా పద్యాల అర్థాలు నేను ఇదివరలో విన్నాను. పద్యం చదవకపోయినా. ‘విహ్వల నాగేంద్రము…’ అని చదువుతున్నప్పుడు, మధ్యన నాగేంద్రమెక్కడిది? కింద ఏనుగు ప్రార్థిస్తూ ఉంటే నాగేంద్రము అంటే ఆదిశేషుడు అనుకుంటే, ఆయనెందుకు పాహి పాహి అంటాడూ? అని సందేహం కలిగింది. ఆపై, మాలతిగారు నాగేంద్రం అంటే ఏనుగు అన్న అర్థం ఉందని చెప్పారు. బాగుంది నాగేంద్రమే పాము, నాగేంద్రమే ఏనుగు … హీహీ…


లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్


ఠావుల్ దప్పెను, మూర్చ్హ వచ్చె, దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్


“నీవే తప్ప యితః పరంబెరుగ, మన్నింపందగున్ దీనునిన్


రావే యీశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”


– ‘భద్రాత్మకా’ మళ్ళీ భద్ర! ఈ భద్రం తో జర్రంత భద్రంగా ఉండాలి. రకరకాల అర్థాలు కనబడుతున్నాయ్ ఆంధ్రభారతిలో!!


సిరికిం జెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింప డే


పరివారంబు జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం


తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోధ్ధత శ్రీకుచో


పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై


-కాస్త భాష నన్ను భయపెట్టేసింది … సిరికిం జెప్పడు…. అన్న భాగం మాత్రం చాలా ఫేమస్ కనుక, పద్యం అర్థమైపోతుందిలే, అనుకున్నా. అక్కడే దెబ్బతిన్నా


తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె


న్కను బక్షీంద్రుడు, వానిపొంతను ధనుః కౌమోదకీ శంఖ చ


క్రనికాయంబును, నారదుండు, ధ్వజనీకాంతుడు దావచ్చి రొ


య్యన వైకుంఠపురమునంగలుగు వా రాబాలగోపాలమున్


-దృశ్యం మొత్తం‌కళ్ళ ముందు కదలాడుతోంది. మన పౌరాణిక సినిమాల పుణ్యమా అని, దేవతలు అనగానే, మన నటులు గుర్తొచ్చేస్తారుగా. ‘బక్షీంద్రుడు’ అన్నప్పుడు మాత్రం ఆనంద్ బక్షీ గుర్తు వచ్చాడు


తన వేంశేయు పదంబు బేర్కొనడనాధ స్త్రీ జనాలాపముల్


వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ, బొలువ వేద ప్రపంచంబులన్


దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం


గని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్.


-లక్ష్మీదేవి ఆలోచనలట. ఇది కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంది. మొత్తానికి, నా బోటి వాళ్ళు కూడా, తాత్పర్యం ఒకటి పక్కన ఉంచుకుంటే, భాగవతం చదివి, ప్రతి పదార్థం తెలుసుకోడానికి ప్రయత్నించవచ్చని అర్థమైంది ఇవాళ.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list