అలసత్వం కూడదు!
ఒక ఆశ్రమంలో గురు శిష్యులిద్దరూ ఉండేవారు. ఇద్దరికీ రెండు కుటీరములు ఉండేవి. శిష్యుడు మహా సోమరి. ఒకరాత్రి ఆశ్రమంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గురువు కుటీరంపై ఉన్న తాటాకుల్లో రెండు గాలికి కొట్టుకుపోయాయి. శిష్యుణ్ణి పిలిచి కొట్టుకొని పోయిన తాటాకులను వెంటనే తెచ్చి కుటీరంపై కప్పమన్నాడు. అప్పుడు శిష్యుడు.. ‘గురుదేవా! అసలే చీకటి, పైగా పెనుగాలి.. రేపు ఉదయం తెచ్చి కప్పుతాన’ని బదులిచ్చాడు. రాత్రి తెల్లవార్లూ వర్షం కురుస్తూనే ఉంది. తాటాకులు ఎగిరిపోవడంతో వర్షం ధారలతో గురువు కుటీరం మడుగులా తయారైంది. తెల్లవారాక శిష్యుణ్ణి పిలిచాడు గురువు. ఎంతకూ రాకపోవడంతో.. అతడి కుటీరంలోకి వెళ్లాడు. కుంభకర్ణుడిలా నిద్రిస్తున్న శిష్యుణ్ణి తట్టి లేపాడు. ‘నాయనా! కుటీరం చెరువులా తయారైంది! కాస్త తాటాకులు కప్పరా’ అని అడిగాడు. ‘వర్షం తగ్గాక చూద్దాం గురువుగారు’ అన్నాడు శిష్యుడు. కాసేపటికి వర్షం తగ్గింది. శిష్యుణ్ణి మళ్లీ పిలిచాడు గురువు. ‘ఇప్పటికైనా తాటాకులు కప్పు నాయనా’ అని అర్థించినంత పని చేశాడు. ‘ఎలాగూ వర్షం తగ్గిపోయింది కదా గురువుగారూ! ఇప్పుడు తాటాకులతో పని ఏమీ?’ అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన గురువు.. కాసేపటికి శిష్యునిపై అనుగ్రహంతో.. ‘ఎప్పటి పని అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయడం బద్ధకస్తుల పని. ఆధ్యాత్మిక సాధనలో అలసత్వానికి చోటు లేద’ని చెప్పాడు. ఆ మాటలు శిష్యుడిలో కనువిప్పు కలిగించాయి. వెంటనే తాటాకులు తెచ్చి గురువు కుటీరాన్ని బాగు చేశాడు.
బహిష్టు బాధల నుంచి ఇలా విముక్తి
బహిష్టు సమయంలో కొద్దిపాటి కడుపునొప్పి రావడం సాధారణమైన విషయమే. కడుపునొప్పితో పాటు వికారం, వాంతుల వంటివి కూడా ఉన్నా, రెండు మూడు రోజుల్లో వాటికవే తగ్గిపోతాయి. కానీ కొంత మందికి మాత్రం ఈ నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. నొప్పి నివారణకోసం ఏవో కొన్ని మందులు వాడుతుంటారు. అలా ప్రతినెలా మందుల్ని వాడటం వల్ల గర్భాశయం మీద దుష్ప్రభావం పడటంతో పాటు కొన్ని ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. అలా కాకుండా ఈ సమస్యల నుంచి గృహ వైద్యంతోనే శాశ్వతంగా బయటపడే అవ కాశాలు ఉన్నాయి.
పొంగించిన 60 గ్రాముల ఇంగువను, కొంత బెల్లంతో కలిపి ఉండలా చేసి, బహిష్టు కావడానికి ముందు నుంచి, అది ఆగిపోయే వరకు రెండు పూటలా నెలనెలా సేవించాలి.
5 గ్రాముల శొంఠి, తోకమిరియాలు, బెల్లం సమాన మోతాదులో తీసుకుని, 200 మి.లీ నీళ్లలో వేసి కషాయం కాచి వడబోయాలి. బహిష్టు అయిన రోజు నుంచి లేదా బహిష్టు అయిన 5 వ రోజు నుంచి ప్రతినెలా వాడాలి.
ఒకవేళ నొప్పి మరీ తీవ్రంగా ఉంటే.....శొంఠి 60 గ్రాములు, బాలింత బోలు 60 గ్రాములు, రేవల చిన్ని 10 గ్రాములు తోక మిరియాలు 60 గ్రాములు వీటిని విడివిడిగా చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత 200 మి.లీ నీటిలో రోజుకు 10 గ్రాముల చూర్ణం చొప్పున వేసి ఉడి కించి కషాయం తయారుచేసి వడబోయాలి. ఆ తర్వాత చూర్ణం చేసిన ఇంగువను తగినంత బెల్లంలో కలిపి ఉండలా చేసుకుని మింగుతూ ముందుగా తయారు చేసుకున్న కషాయాన్ని తాగాలి. ఇలా ప్రతినెలా 5 నుంచి 10 రోజుల పాటు సేవిస్తూ ఉంటే దాదాపు 5 నెలల్లో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
గర్భిణులు బరువు లేకపోతే ముప్పే!
ప్రెగ్నెన్సీ సమయంలో తగినంత బరువు ఉండకపోతే నెలలు నిండకముందే ప్రసవించే అవకాశాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా సిజేరియన్ చేయాల్సిన అవకాశం ఏర్పడుతుందని వెల్లడయింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా గర్భిణులపై పరిశోధనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మంది గర్భిణులను పరిశీలిస్తే అందులో సగంకన్నా ఎక్కువ మంది ఉండాల్సిన దానికన్నా అధిక బరువు ఉన్నారు. పావుశాతం మంది ఉండాల్సిన బరువు కన్నా చాలా తక్కువ ఉన్నారని వెల్లడయింది. ‘‘ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక తగినంత బరువు పెరగడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేదంటే నెలలు నిండకుండా ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన హెలెనా టీడ్ అంటున్నారు.
పక్షవాతం రాకుండా కాపాడుకోవడం ఎలా?
మా తాతగారికి ఇప్పుడు 79 ఏళ్లు. అధిక రక్తపోటు సమస్య ఉన్నా, నెలా నెలా డాక్టర్ వద్దకు తీసుకు వెళుతూ చెక్ చేయిస్తున్నాం. బి.పి నియంత్రణలోనే ఉంటోంది. అయితే, మా తాతయ్య ఇద్దరు అన్నలూ ఇప్పుడు పక్షవాతంతో బాధపడుతున్నారు. మా భయమంతా ఇతనికి కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందేమోనని. ఆయనకు అందించే ఆహార పానీయాల విషయాల్లో మేమంతా జాగ్రత్తగా ఉంటున్నామనే అనుకుంటున్నాం. అయినా ఏదో అనుమానం, భయం. ఏమైనా పక్షవాతం రాకుండా, నిరోధించే మార్గాలేమైనా మీరు చెబితే అవి మా తాతయ్యకెంతో శ్రేయస్కరంగా ఉంటాయనుకుంటున్నా.
- డి. ఎన్. సత్యం, కోదాడ
డాక్టర్ వద్దకు తీసుకు వెళ్లినప్పుడు బి.పి. నార్మల్‌గా ఉన్నంత మాత్రాన మిగతా రోజుల్లో కూడా అలాగే ఉంటోందన్న గ్యారంటీ లేదు మఽధ్య మధ్యలో హెచ్చు తగ్గులు కూడా ఉండవచ్చు. అందువల్ల రోజూ లేదా వారానికి ఒకసారైనా బి.పి చెక్ చేయడానికి వీలుగా ఒక బి.పి మెషిన ఒకటి ఇంట్లో ఉంచుకోవడం ఎంతో మేలు. దీనివల్ల ఏ కాస్త హెచ్చు తగ్గులున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించే అవకాశాలు ఉంటాయి. ఇది పక్షవాతం బారిన పడకుండా మీరు తీసుకునే మొదటి జాగ్రత్త. ఇకపోతే పక్షవాతం రావడానికి దారి తీసే మరో కారణం ఆహారంలో మెగ్నీషియం లోపాలు ఉండడం. సహజంగా మన శరీరంలో సమృద్ధిగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. ఇది సుమారు 300 రకాల జీవరసాయనిక చ ర్యల్లో పాలుపంచుకుంటుంది. మన శరీరంలోని మెగ్నీషియంలో సగభాగం ఎముకల్లోనే ఉంటుంది. మిగతా సగం కణజాలంలో అవయవాల్లో ఉంటుంది. కండరాల, నాడుల పనితీరు సక్రమంగా సాగడంలో ఇది తోడ్పడుతుంది. నిజానికి, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పు చాలా తక్కువగా ఉంటుంది.
ఫ పొట్టు తీయని ధాన్యాలు, ఆకు కూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్స), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
ఫ కప్పు బీన్స లేదా ముడిబియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన ఆకుకూర తింటే శరీరానికి రోజూ అవసరమయ్యే 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. రోజూ ఈ మేరకు ఈ తరహా ఆహారం తీసుకుంటే పక్షవాతమే కాదు గుండెజబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
- డాక్టర్ ఎన్. సాగర్, జనరల్ ఫిజిషియన్
పేపర్ కటింగ్‌లో సూపర్
చిన్నప్పుడు పంద్రాగస్టుకో.. ఫేర్‌వెల్ పార్టీకో రంగుల కాగితాలను రకరకాల ఆకారాల్లో కత్తిరించి అతికించే వాళ్లం గుర్తుందా! అలా కత్తిరించడమూ ఒక కళేనని తెలియని వయసది. బడితో పాటే వదిలేసిన ఆ కళను ఆస్వాదిస్తూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాడు చెన్నై యువకుడు వినోద్‌కుమార్. కుంచెతో గీసిన బొమ్మను మరిపించే విధంగా పేపర్ కటింగ్ ఆర్ట్‌తో సూపర్ అనిపిస్తున్నాడు. అరుదైన ఆర్ట్‌తో అందరినీ అబ్బురపరుస్తున్న వినోద్‌కుమార్‌ను ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలు...
చెన్నై శివారులోని తిరునిండ్రవూరు నా స్వస్థలం. చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఆసక్తి. రకరకాల బొమ్మలు వేసేవాణ్ణి. కొన్నాళ్ల తర్వాత నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలనుకున్నా. నేను ఎంచుకునే రంగం అరుదైనదై ఉండాలనుకున్నా. నాలోని కళను వినూత్నంగా ఆవిష్కరించాలనుకున్నా. అందుకు సరైన కాన్వాస్ కోసం ఎన్నో రోజులు పరిశోధించా. నా అన్వేషణలో ‘పేపర్ కటింగ్ ఆర్ట్’ తారసపడింది. పన్నెండేళ్లుగా ఈ కళలో సాధన చేస్తున్నా. చిత్రలేఖనంలో చేయి తిరిగిన కళాకారుడైతేనే పేపర్ కటింగ్ ఆర్ట్‌లో రాణించగలుగుతాడు. నేను చిత్రకారుణ్ణి కావడంతో ఈ కళను తొందరగా నేర్చుకోగలిగాను. నేలపై ముగ్గులు వేసేందుకు పేపర్ కటింగ్ డిజైన్లు మనం చూస్తుంటాం. అవి నిర్దుష్టమైన డిజైన్లలో లభిస్తాయి. పేపర్ కటింగ్ ఆర్ట్ దీనికి విభిన్నమైనది. కుంచెతో గీసే బొమ్మని కత్తితో కాగితంపై మలచడమే ఈ కళ. ఇది చెప్పినంత సులభంగా ఉండదు.
యూట్యూబ్‌లో ఓనమాలు... గోవాలో పాఠాలు..
ఈ ఆర్ట్‌లో ఓనమాలు యూట్యూబ్‌లో చూస్తూ నేర్చుకున్నా. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ గంటల తరబడి సాధన చేసేవాణ్ణి. నాలుగైదేళ్లు కష్టపడితే, కాగితాన్ని చాకచక్యంగా కత్తిరించడం అలవాటైంది. కానీ, అందులో నేర్పరితనం రాలేదు. పైగా ఈ ఆర్ట్‌లో చాలా సూక్ష్మమైన విషయాలు ఉంటాయి. అవేవీ అర్థం కాలేదు. ఒకసారి స్నేహితులతో కలిసి గోవా వెళ్లాను. చైనా నుంచి వచ్చిన ఒక కళాకారుణ్ణి అక్కడ కలిశాను. ఆయన పేపర్ కటింగ్ ఆర్ట్‌లో సిద్ధహస్తుడు. నాకు ఈ కళలో ప్రవేశం ఉందని తెలిసి అభినందించారు. రెండు రోజుల పాటు ఈ ఆర్ట్‌లోని సూక్ష్మ విషయాలెన్నో నాకు అర్థమయ్యేలా బోధించారు. ఈ కళలో నిర్మాణాత్మక అధ్యయనం చాలా ముఖ్యం. వస్తువులను పట్టుకునే విధానం, బొమ్మను మలిచే తీరు, బొమ్మకు తగ్గట్టు కాగితాన్ని కత్తిరించే వైనం.. ఇలా ఎన్నో కీలకమైన అంశాలు ఉంటాయి. చైనా ఆర్టి్‌స్టని కలిశాక.. ఈ విషయాలన్నీ నాకు తెలిసొచ్చాయి.
మడత పడిందా..!
కాగితంపై బొమ్మ గీసేటప్పుడు ఎంత సన్నటి గీతనైనా చాలా సులభంగా గీయవచ్చు. కానీ, అదే గీతను కాగితంపై కత్తిరించడం అంటే కత్తి మీద సామే. చిన్న మడత కూడా పడకూడదు. కాగితం చాలా బలహీనంగా ఉంటుంది. కత్తిరిస్తున్నప్పుడు ఇంకా బలహీనం అవుతుంది. ఒక్కసారి కత్తిరించడం మొదలుపెట్టామా పూర్తయ్యే వరకూ కదిలించకూడదు. ఎన్ని గంటలైనా.. రోజులైనా.. ఆ కాగితం అలాగే స్థిరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా.. చేసిన శ్రమంతా వృథా అయిపోతుంది. ఈ కళలో ఎంత ప్రావీణ్యం సంపాదించినా... కొత్త డిజైన్లు చేస్తున్నప్పుడు మళ్లీ కొత్తగానే అనిపిస్తుంది.
సందేశాత్మకంగా ఉండాలి..
పేపర్ కటింగ్ ఆర్ట్‌లో ఒక డిజైన్ ఎంపిక చేసుకున్నప్పుడు ముందుగా ఆ విషయం గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. మొదట రివర్స్‌లో బొమ్మ గీసి... తర్వాత మధ్య భాగం నుంచి కత్తిరించుకుంటూ రావాలి. బుద్ధుడి బొమ్మ రూపొందించేందుకు చాలా కష్టపడ్డాను. బుద్ధుడి బొమ్మను సూక్ష్మంగా చూస్తే.. అందులో ఒక సందేశం ఉంటుంది. మనం బొమ్మ రూపొందించిన తర్వాత అందులోనూ ఆ సందేశం కనిపించాలి. అప్పుడే ఆర్టి్‌స్టగా సక్సెస్ అయినట్టు. ఏ బొమ్మ తీసుకున్నా అంతే. పేపర్‌పై బొమ్మగీయడం.. దానిని క్రమపద్ధతిలో కత్తిరించి.. అనుకున్న రూపం తీసుకురావడం ఇదే పేపర్ కటింగ్ ఆర్ట్. ఇప్పుడిప్పుడే ఈ ఆర్ట్ ప్రాచుర్యంలోకి వస్తోంది. నేను కూడా తరచూ ప్రదర్శనలిస్తున్నాను. ఈ కళను నలుగురికీ పరిచయం చేయడం నా ముందున్న లక్ష్యం. అందులో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది. బెంగళూరుకు చెందిన లలిత కళాక్షేత్ర సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న చిత్రకళాకారుడిగా నన్ను సత్కరించింది. చెన్నైలో తోటి కళాకారులు నాకు తోడుగా నిలబడుతున్నారు. ఇవన్నీ నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేవే.
పిల్లలకు అప్పుడే వద్దు..
పేపర్ కటింగ్ ఆర్ట్ చిన్న పిల్లలకు నేర్పించే ఆర్ట్ కాదు. ఎందుకంటే... ఇందులో ఉపయోగించే బ్లేడ్ చాలా పదునుగా ఉంటుంది. అందుకే వీటిని పిల్లలకు దూరంగా ఉంచడమే మంచిది. బెంగళూరుకు చెందిన ఒక పాఠశాల.. పిల్లలకు ఈ కళలో శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరింది. ఆఫర్ కూడా భారీగానే ఇచ్చారు. కానీ, చిన్నపిల్లలకు ఇది నప్పదు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉన్న పెద్దపిల్లలకు నేను శిక్షణ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
పుట్టిల్లు చైనా
మన దేశంలో ఈ కళ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కాగితాన్ని కనిపెట్టిన చైనాలోనే పేపర్ కటింగ్ ఆర్ట్ కూడా పుట్టింది. ‘మింగ్’ అనే కళాకారుడు దీనికి ఆద్యుడుగా చెబుతుంటారు. రాజుల కాలంలో కళాకారులు చక్రవర్తులను ప్రసన్నం చేసుకోవడానికి వినూత్నమైన సాధనలు చేసేవారు. కాగితాన్ని కత్తిరిస్తూ మింగ్ తన సృజనాత్మకతను చాటుకున్నాడు. తరువాత అది గొప్ప కళగా రూపాంతరం చెందింది.
పేపర్ కటింగ్ ఆర్ట్‌కి పెన తరహాలో బ్లేడు కలిగిన ప్రత్యేకమైన టూల్ ఉంటుంది. ఇటాలియన ఇంపోర్టెడ్ కాగితం ఉపయోగిస్తుంటారు. 2/3 సైజు పేపర్ ధర రూ.2,800. తెలుగు, నలుపు, ఐవరీ రంగుల్లో ఈ కాగితం లభ్యమవుతోంది. యాసిడ్ ఫ్రీ పేపర్ కావడంతో ఎక్కువ కాలం మన్నుతుంది. కాగితాన్ని జీఎ్‌సఎంతో కొలుస్తారు. 90 నుండి 280 జీఎ్‌సఎం వరకు కాగితాన్ని ఆయా డిజైన్లని బట్టి ఉపయోగిస్తుంటారు. లైవ్ స్కెచలనూ వాడుతుంటారు.
పిల్లలు బడికెళ్తున్నారా!
స్కూలు తిరిగి ప్రారంభమైన తొలి రోజుల్లో పిల్లల మనసుల్లో పలురకాల భావోద్వేగాలు తిరుగుతూ ఉంటాయి. పాత స్కూలే అయినా కొంత మంది పిల్లలకు అంతా ఏదో కొత్తగా అనిపిస్తుంది. తరగతి మారిపోవడం, కొత్త విద్యార్థులు తరగతిలో వచ్చి చేరడం, టీచర్లు, సబ్జెక్టులు మారిపోవడం వంటివి కొత్తగానే అనిపిస్తాయి. ఒకవేళ ఏ కారణంగానో పాత స్కూలు వదిలేసి కొత్త స్కూళ్లో చేరిపోయి ఉంటే వాళ్లకు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. ఆ కొత్తదనం కొందరిలో దిగులు నింపుతుంది. మరికొంత మంది పిల్లలు కొన్ని రోజులు పోతే.. ఆ కొత్తదనాన్ని ఆస్వాదించగలరు. ఆ కొద్ది రోజుల వరకైనా తల్లితండ్రులు వారిని కాస్త వదిలిపెట్టాలి. అలా కాకుండా ఏదో దాటిపోతున్నట్లు ఆ ఏడాది సాధించే లక్ష్యాల గురించి, ర్యాంకుల గురించి ఏకరువు పెట్టడం చేయకూడదు. ఆ దశలో అవి ఏ రకమైన ప్రయోజనాన్నీ ఇవ్వవు. నిజానికి ఆ సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు అంత సమంజసం కావు. ఇలాంటప్పుడు...
పిల్లలతో కొత్త స్కూల్‌లో వాతావరణం ఎలా ఉందో అడిగి తెలుసుకోండి.
ఈ సంవత్సరం కొత్తగా మీ తరగతిలో వచ్చి చేరిన వారెవరైనా ఉన్నారా? వాళ్లల్లో ఎవరైనా నీకు బాగా నచ్చారా? అని అడగండి.
గత సంవత్సరం ఉన్న టీచర్లే ఈసారీ కొనసాగుతున్నారా? కొత్త టీచర్లు ఎవరైనా వచ్చారా? వాళ్లు ఎలా ఉన్నారు.. ఇవన్నీ తెలుసుకోండి.
కొత్త టీచర్ క్లాసు తొలిరోజున ఏం చెప్పారు? వాళ్లు చెప్పిన విషయాల గురించి సరదాగా చెప్పమనండి.
ఇలాంటి వి అడగడం వల్ల పిల్లల్లో ఉత్సాహం పెంచవచ్చు. ఒక్కోసారి కొత్తగా వచ్చి చేరిన విద్యార్థులను లేదా టీచర్లను చూసినప్పుడు కొంత మంది పిల్లలు ఏదో తెలియని ఆందోళనకు గురవుతారు. అలా ఏమైనా అనిపించిందేమో కూడా తెలుసుకోవాలి. చాలాసార్లు అలా అనిపించడానికి ప్రత్యేకమైన కారణమంటూ ఏదీ ఉండదు. ఒకవేళ అది అపోహే అయితే, వాటిని వెనువెంటనే వాళ్ల మససులోంచి తీసివేసే ప్రయత్నం చేయండి. లేదంటే ఆదిలో పడిన ఆ ముద్రలు ఏడాది పొడవునా వెంటాడవచ్చు. ఎటొచ్చీ పిల్లల్ని స్కూలు తొలిరోజుల్లో ఉల్లాసపరిచే విషయాల్నే తలిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి
అమ్మ కసిరిందనో, నాన్న కోప్పడారనో, ఫ్రెండ్ మాట్లాడట్లేదనో... కొందరు అదేపనిగా బాధపడుతూ ఉంటారు. ఎదుటివారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది అన్నిసార్లూ సరికాదు. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదెలా అంటే..
మీకు ప్రేమించే సామర్థ్యం ఉందా? అయితే మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకున్నంత కాలం మీరేదీ సాధించలేరు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ చిన్నబుచ్చుకోవద్దు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని తలచుకుని బాధపడటం కన్నా.. ఎలా సవరించుకోవాలనే కోణంలో ఆలోచిస్తే.. పరిష్కారం దొరుకుతుంది.
* మీకు సంతోషానిచ్చే అంశాలన్నింటినీ ఓ చోట రాసుకోవాలి. మీకు నచ్చిన దుస్తులూ, మీరు మెచ్చే ప్రదేశాలూ, స్నేహితులూ.. ఇలా అన్నమాట. వాటిని చూసినప్పుడల్లా మీకు నూతనోత్తేజం వస్తుంది. ఇలా చేస్తే మీలోని ఒత్తిడీ , ప్రతికూల భావాలూ దూరమవుతాయి. మీరు సానుకూలంగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి.
* రోజూ మీకోసం ఓ అరగంట సమయం పెట్టుకుని మీకు నచ్చిన పనుల్ని మాత్రమే చేయండి. ఇలా చేయడం వల్ల చక్కని వ్యాపకం అలవడుతుంది. అది మీపై మీకు ఇష్టాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది.
ఒత్తిడా.. నడవండి..
నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఉరుకుల పరుగులతో గడిచిపోయే రోజులివి. మీరు మీ పనిని పూర్తిచేయొచ్చేమో కానీ.. మానసిక ప్రశాంతత మాత్రం ఉండదు. దీన్ని అధిగమించాలంటే.. మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి.
* సమయానికి లేచినా సరే! చాలా గాభరా పడిపోతుంటారు కొందరు. నిద్రలేచీ లేవగానే చాలామంది మహిళలు వంటింట్లోకి పరుగు తీస్తుంటారు. అలా కాకుండా లేవగానే కాసేపు ధ్యానానికీ, వ్యాయామానికీ సమయం పెట్టుకోండి. బద్ధకం వదిలిపోవడమే కాదు, రోజంతా మెదడూ చురుగ్గా ఉంటుంది. అలసట ఉండదు. విసుగూ రాదు.
* పక్కాగా ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్ల కాస్త గందరగోళం సహజమే. అలా కాకుండా రేపు చేయాల్సిన పనులేంటో ముందే ఆలోచించుకోండి. ఉదయం పూట కంగారు ఉండదు. ఒత్తిడిగానూ అనిపించదు. ఇలా ప్రణాళిక ఉండటం వల్ల ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* పనులతో అలసిపోయి చిరాగ్గా ఉన్నారా.. ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉండిపోవడం, పడుకోవడం దీనికి పరిష్కారం కాదు. హాయిగా కాసేపు నడిచి చూడండి. ఉపశమనంగా అనిపిస్తుంది.
చర్మానికి నిద్రా ముఖ్యమే..
అందం కోసం సౌందర్య ఉత్పత్తులు వాడటమే కాదు జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి.
* మనం ఒత్తిడిగా ఉన్నా, అలసిపోయినా, ఆ ప్రభావం ముఖంపైపడి కళ తగ్గుతుంది. అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. దాన్ని అధిగమించడానికి రోజూ కాసేపు ధ్యానం చేయడం తప్పనిసరి.
* సబ్బుకన్నా క్లెన్సర్‌ని వాడటం మంచిది. అదీ చర్మతత్వానికి నప్పేదై ఉండాలి. అలాగే వాతావరణం చల్లగా ఉన్నా సరే.. సన్‌స్క్రీన్ లోషన్‌ని తప్పనిసరిగా రాసుకోవాలి.
* మనం తీసుకునే ఆహారం కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే సి విటమిన్, యాంటీఆక్సిడెంట్లూ, ఓమెగా త్రీ ఫ్యాటీఆమ్లాలూ, లాంటి పోషకాలు అందేలా చూసుకోవాలి. అవన్నీ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.
‘దొంగ’ భక్తిని దేవుడు మెచ్చుతాడా?
ఆత్మీయం
ఇటీవల కొందరు ‘పెద్ద’ మనుషులు తెల్లవారీ, తెల్లవారక ముందే బుట్టలు పట్టుకుని వాకింగ్‌కి వెళుతూ, తిరిగి వచ్చేటప్పుడు ప్రతి ఇంటి గోడ మీదకు ఎగబడి, దొంగతనంగా పూలు కోసుకుని ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికి వెళ్లగానే అలా ‘కష్టపడి’ కోసుకు వచ్చిన పూలతో పూజలు చేస్తున్నారు. ఆ పూలమొక్కలు పెంచుకున్న ఇంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో మొక్కలకు ఆ పూలు పూసిన విషయం కూడా తెలిసే అవకాశం లేకుండా... ఇంటివారు నిద్ర లేవక ముందే వాళ్ళ ఇంటి గోడమీద నుంచి పూలు అన్నీ కోసుకుని వెళ్లే వీరభక్తులు మొదలయ్యారు.
ప్రతి కాలనీలోనూ, ప్రతి ఊరిలోనూ ఇలాగే జరుగుతోంది. పోనీ అలా కోసుకు వెళ్లేది ఒకటో, రెండో పూలు కాదు.. బుట్టలు తెచ్చుకుని మరీ కోసుకెళతారు. అలా దొంగతనం చేసుకు వచ్చిన పూలతో చేసిన పూజలను దేవుడు మెచ్చుకుంటాడా? ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం.
హెల్దీ పెసలు
గుడ్‌ఫుడ్
విదేశాల్లో పెసలను కేవలం మొలకలుగానే తింటారుగానీ... అనాదిగా మనం పెసరపప్పును ప్రధానహారాల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నాం. తన పొట్టులో సైతం అనేక పోషకాలు కలిగి ఉన్న పెసరగింజల ప్రయోజనాల్లో కొన్ని...
⇒పెసర్లలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి పెసర్లు బాగా తోడ్పడతాయి. పెసర్లు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి.
⇒పెసర్లలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయగపడతాయి.
⇒చికెన్‌లో కంటే పెసర్ల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్ పాళ్లు చాలా ఎక్కువ. జంతువుల నుంచి లభ్యమయ్యే ప్రోటీన్లతో పాటు బీన్స్ వంటి ఇతర వనరుల నుంచి దొరికే ప్రోటీన్లు కూడా తినాలని అమెరికన్ డయటరీ గైడ్‌లైన్స్ చేసే సిఫార్సు. ఆ కోణంలో పెసర్లు మంచి ప్రత్యామ్నాయం.
ఎక్కువగా వాడితే వేపేస్తుంది
పరిపరిశోధన
చిన్నప్పటినుంచి మనం చదువుకున్న దాని ప్రకారం వేపతో మనకెంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వేప మేలే కాదు, కీడు కూడా చేస్తుంది. ముఖ్యంగా వేపనూనెను చంటిపిల్లలకు ఉపయోగిస్తే వారిలో రియేస్ సిండ్రోమ్ తలెత్తి అది వారి ప్రాణాలకే ముప్పు కలిగిస్తుందట. అలాగే అలెర్జీ తీవ్రస్థాయిలో ఉంటే చాలామంది వేపాకును నూరి అదేపనిగా పట్టిస్తారు. దానివల్ల మరింత తీవ్రరూపం దాల్చి సమస్య జటిలం అవుతుందంటున్నారు పరిశోధకులు. చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు.
కాని ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తేనే మంచి ఫలితం వస్తుంది. లేదంటే కడుపు గడబిడతో అల్లకల్లోలం అవుతుంది. బ్లడ్‌సుగర్‌తో బాధపడేవారికి, అలాగే శరీరావయవాలను మార్పిడి చేయించుకునేవారికి వేపనూనెను ఇస్తుంటారు వైద్యులు. అలా చేయడం చాలా అపాయకరమని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కాబట్టి వేపాకే కదా అని ఇష్టం వచ్చినట్లు వాడితే ప్రాణాలను వేపేస్తుంది మరి!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565