MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఈ ఆలయాలలో మగవారికి ప్రవేశం నిషిద్ధం_No ENTRY FOR GENTES



ఈ ఆలయాలలో
 మగవారికి ప్రవేశం నిషిద్ధం
ఆలయాలు అనేవి దేవుని నివాసాలు. గుడిలోని దేవుణ్ణి దర్శించటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.. లింగ భేదం లేకుండా దేవుణ్ణి మొక్కుతారు. ప్రసాదాలు తీసుకెళ్తారు. తీరా ఆ కోరిక సఫలమైన తర్వాత మొక్కు తీర్చుకోవటానికి వస్తుంటారు.. అయితే కొన్ని ఆలయాల్లో ఆడవారికి ప్రవేశం లేదు. అలాంటి ఆలయాల గురించి మనకు తెలుసు. ఇటీవలే సుప్రీంకోర్టు జోక్యంతో కొన్ని ఆలయాల్లో స్త్రీలకు ప్రవేశం కల్పించారు. 
 
కానీ ఇక్కడే ఒక గమ్మత్తైన విషయం ఉంది. మీకు తెలుసా? కొన్ని ఆలయాల్లో మగవారికి ప్రవేశం నిషిద్ధమని! అదేంటి... మగవారు ప్రవేశించలేని ఆలయాలున్నాయా మనదేశంలో అని ఆశ్చర్యపోతున్నారా? అవును! మీరు విన్నది కరెక్టే. మ‌హిళ‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌ని ఆలయాల గురించి మనకు తెలుసు కానీ పురుషులను అనుమతించని ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మగవాళ్ళు అడుగుపెట్టడానికి వీల్లేదు. గుడిలోకి మగవాళ్ళు రాకుండా ఉండేందుకై అక్కడ కాపలాదారులు పహారా కాస్తుంటారు. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో మీరూ తెలుసుకోండి మరి!
 
రాజస్థాన్‌
బ్రహ్మదేవుడికి ఆలయాలుండడం చాలా అరుదు. మనదేశంలోని రాజస్థాన్‌లో ఉన్న బ్రహ్మ పుష్కర్‌లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. అదేంటి... బ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదని అంటారేంటి? దీనికి కారణం బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి ఆ సమయంలో అతని పక్కన ఉండదు. బ్రహ్మ గాయత్రిని పెళ్ళి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అందువల్ల సరస్వతీదేవికి ఆగ్రహం వచ్చి ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ ప్రవేశిస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది. అందుకే ఈ ఆలయంలోకి మగవాళ్లు వెళ్లరు. 
 
చెంగన్నూర్‌ భగవతీ ఆలయం , కేరళ
చెంగన్నూర్‌ భగవతీ ఆలయం కేరళలో ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రతినెలా రుతుస్రావాన్ని ఆచరిస్తుంది. ఆలయ స్థలపురాణం ప్రకారం, పార్వతీదేవితో శివుని వివాహం తర్వాత ఆ కొత్త దంపతులు మొదటిసారిగా చెంగన్నూర్‌ను సందర్శించారట. అంతేకాక ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది అమ్మవారికి గుడ్డకప్పినప్పుడు అది ఎర్రగా మారుతుంది. దీంతో అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకుని గుడిని ప్రతినెలా మూడురోజుల పాటు మూసివేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్రజలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత అందరికీ గుడిలోకి ప్రవేశించడానికి అనుమతినిస్తారు. ఇలా ప్రతి నెల మూడురోజులు కేవలం మహిళలు మాత్రమే గుడిలోకి వెళ్లడానికి అర్హులు. ఈసమయంలో ఆలయం అంతా మహిళామణులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 
కేవలం ఇదే కాకుండా 108 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడే ఆలయం కన్యాకుమారిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం. మూడు సముద్రాల మధ్యన కొలువైన ఈ ఆలయంలోని ప్రధాన దేవతను భగవతీమాతగా పిలుస్తారు. ఆ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్లరు. 
 
ఆట్టుక్కాల్‌ ఆలయం, కేరళ
కేరళ రాష్ట్రంలోని, తిరువనంతపురానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆట్టుక్కాల్‌ అమ్మవారి దేవాయం ఉంది. కేవలం పురుషులకు శబరిమలై ఆలయంలో ప్రవేశమున్నట్లే ఈ ఆట్టుక్కాల్‌ దేవాలయంలో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయంలోకి పురుషులు అస్సలు వెళ్లరు. కాదని వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ప్రతీ సంవత్సరం వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు ‘పొంగా ఉత్సవం’. పొంగా పండుగ నాడు ఆట్టుక్కాల్‌ అమ్మవారి దేవాలయం మహిళలతో కిటకిట లాడుతుంది.
ఫిబ్రవరి, మార్చి నెల మధ్యలో ఈ దేవాలయంలో పొంగా ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఎంతో మంది మహిళా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా పొంగల్‌ నైవేద్యాన్ని సమర్పించు కుంటారు.
 
         ఆ నైవేద్యాన్ని అప్పటికప్పుడే తయారుచేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఆ ప్రసాదం తయారుచేసే పద్థతి కూడా చాలా సంప్రదాయంగా, శుచిగా ఉంటుంది. దానికన్నా ముందు పొంగా ఉత్సవం ఏ తేదీన జరిగేదీ, ముహూర్త సమయం ఎప్పుడన్నదీ పూజారులు ముందుగా ప్రకటిస్తారు. ఆ ముహూర్త సమయానికి ముందుగానే, అక్కడ ప్రదేశాన్ని శుభ్రపరచి చక్కగా ముగ్గువేసి, ఇటుకలతో పొయ్యిని పేర్చుకుంటారు. ఎండు కొబ్బరి, కొత్త కుండ, కొత్త బియ్యం, బెల్లం, కొబ్బరి ఆకుతో కూడిన కొబ్బరిమట్టను, పూజాసామాగ్రిని తమ వెంట తెస్తారు. ఈలోగా తమ వెంట తెచ్చుకున్న కొత్త కుండకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరిస్తారు.
 
             పూజారి ముహూర్త సమయం ఆరంభమయిందని చెప్పగానే, మహిళలు తాము ముందుగా అమర్చుకున్న పొయ్యిని వెలిగిస్తారు. బియ్యం కడిగి కుండలో పోసి, తగినంత నీరు పోసి, ఆ పొయ్యిమీద పెడతారు. బియ్యం ఉడకగానే అందులో పాలుపోసి నైవేద్యాన్ని తయారు చేస్తారు. నైవేద్యం తయారయిన తర్వాత ఒక అరటి ఆకును శుభ్రపరచి, కుండలోని అన్నాన్ని ఆకులో ఉంచుతారు. పొంగా ఉత్సవపు గీతాలు, అమ్మవారిని స్తుతించే పాటల సందడితో ఆ ప్రాంతం మారుమోగుతుంది. అమ్మవారిని కీర్తిస్తూ ఎన్నెన్నో దండకాలు, పాటలు... స్త్రీలంతా కలిసి పెద్ద గొంతుతో వినిపిస్తూండగా, అర్చకులు ఆ ప్రాంతమంతా తిరుగుతూ, పవిత్రో దకంతో ప్రసాదాలను సంప్రోక్షిస్తారు.
స్త్రీలందరూ ఎంతో భక్తితో ఆ నైవేద్యాన్ని స్వీకరించి, అమ్మవారికి పూజ జరిపిస్తారు. కేర ళీయులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎందరో స్త్రీలు పొంగా పండుగ సమయానికి అక్కడకు చేరుకొని, తామూ అమ్మవారికి నైవేద్యం అర్పించి, పూజ జరిపిస్తారు. ఆ దేవత కరుణా కటాక్షాల కోసం, ప్రార్థనలు, భజనలు జరుపుతారు.
 
బీహార్‌లో
మాతా ఆలయం బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.

అక్కడ పురుషులకే తాళిబొట్టు!
భారతీయ సంప్రదాయం ప్రకారం స్త్రీ మెడలో పురుషుడు తాళిబొట్టు కట్టడం ఆనవాయితీ. కానీ ఓ గ్రామంలో సీన్ రివర్స్. అక్కడ పెళ్ళిలో ఆడవారే మగవారికి పుస్తెలు కడతారు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది నువ్వలరేవు గ్రామం. ఇక్కడ ఎక్కువగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తుంటాయి. అయితే ఇక్కడ పెళ్ళి విషయానికి వచ్చేసరికి స్త్రీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆడపిల్ల ఇష్టపడిన సంబంధాన్నే పెద్దలు కుదురుస్తారు. పైగా కొన్ని తరాలుగా ఇక్కడ ఆడవారే పురుషులకు తాళి కడుతున్నారు. ధాన్యం గింజ ఆకారంలో ఉండే బంగారు ఆభరణాన్ని పసుపుతాడుకు గుచ్చి కడతారు. అయితే మూడు నెలల లోపు స్త్రీలు తిరిగి ఆ తాళిబొట్టును తమ మెడలో వేసుకుంటారట. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానం అని చెప్పడమే ఈ ఆచారం వెనకున్న ఉద్దేశం అట.


మగవారి కోసం 
చరిత్రలో ఎంతోమంది తమ భార్యలు, ప్రియురాళ్ళ జ్ఞాపకార్థం ఎన్నో ప్రసిద్ధ కట్టడాలను నిర్మించారు. కాని మగవారి జ్ఞాపకార్థం, మగవారి కోసం కూడా ఆడవారు పలు కట్టడాలు నిర్మించడం జరిగింది. అయితే అవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అవేమిటో చూద్దాం...
 
మొదటి ఉద్యానవన సమాధి: మొఘల్‌ చక్రవర్తి హూమయూన్‌ చనిపోయాక, ఆయన భార్య హమీదాబాను బేగం అతడి జ్ఞాపకార్థం ఒక పెద్ద సమాధిని నిర్మించారు. భారతదేశంలో మొదటి ఉద్యానవన సమాధిగా దీనికి గుర్తింపు ఉంది. ఆ సమాధి ఇప్పటికి కూడా చాలా ఫేమస్‌. హుమయూన్‌ సమాధికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇత్మద్‌ ఉద్‌ దౌలా: నూర్జహాన్‌ తన తండ్రి మరణించిన కొన్ని సంవత్సరాలకు, ఆయన జ్ఞాపకార్థం, ‘ఇత్మద్‌ ఉద్‌ దౌలా' అనే కట్టడాన్ని అద్బుతమైన పాలరాతితో నిర్మించింది.
తాజ్‌మహల్‌ ఆకారంలో ఉంటుందీ కట్టడం కూడా! ఇది కూడా ఆగ్రాలోనే యమునా నదీతీరంలోనే ఉంది. ఈ కట్టడాన్ని దూరం నుంచి చూస్తే పెద్ద నగలపెట్టెను తలపింపజేస్తుంది.
 
రాణీ కి వావ్‌: సోలంకి రాజు భీమదేవుడి జ్ఞాపకార్థం ఆయన భార్య ఉదయమతి గుజరాత్‌లో ఏడు అంతస్తుల బావి ‘రాణీకీ వావ్‌’ను నిర్మించడం జరిగింది. ఈ బావి అప్పట్లో కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించేది అని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రతి అంతస్తులో కూడా ఎన్నో అద్బుతమైన శిల్పాలు ఉంటాయి. దీనిని హెరిటేజ్‌ కట్టడంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
 
విరూపాక్ష దేవాలయం: రెండో విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి కర్ణాటకలోని పట్టదకల్‌లో విరూపాక్ష దేవాలయంను నిర్మింపజేసింది. ఈ దేవాలయంలో అద్బుతమైన శిలలు, శిల్పాలు కొలువుదీరి ఉంటాయి. తన భర్త పల్లవుల సామ్రాజ్యంపై దండెత్తి విజయం సాధించినందుకుగాను విరూపాక్ష దేవాలయంను కట్టించింది లోకమహాదేవి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list