పోరాటం నేర్పిన రుద్రమ
గట్టి ఉలి దెబ్బలు తగిలితేనే శిల శిల్పమవుతుంది. పట్టరాని కష్టాలు వస్తేనే సాధారణ స్త్రీ రాణీరుద్రమ అవుతుంది. రుద్రమదేవి జీవితం నిలువెల్ల గాయాల వీణ. 16 ఏళ్లకే పెళ్లి. 20 ఏళ్లకే ఇద్దరు ఆడపిల్లలు. 25 ఏళ్లకే భర్త వీరభద్రుడి మరణం.కాకతీయ గణపతిదేవచక్రవర్తికి మగసంతానం లేదు. విడివిడిగా ఉన్న మండలాలన్నింటినీ ఏకం చేసిన ఘనుడు గణపతిదేవుడు. అలాంటి విశాల ఆంధ్ర సామ్రాజ్యానికి తన తర్వాత ఏలిక ఎవరు అన్నది ఆయన దిగులు. అందుకే తన కూతురు రుద్రమకి అన్నీ నేర్పాడు. కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ, విలువిద్య, సంగీతం, నాట్యం, జ్యోతిష్యం, న్యాయం- అన్నింటిలోనూ ఆమె ఆరి తేరింది. తన తండ్రికి రాజ్యపాలనలో చేదోడు వాదోడు అయ్యింది. అంతలో తండ్రి మరణం. దాంతో రుద్రమ క్రీ.శ. 1262లో కాకతీయ మహా సామ్రాజ్యానికి పాలకురాలయ్యింది. అప్పటికి ఆమె వయసు 37 ఏళ్లు. అంటే రాజ్యభారం నడిమి వయసులో! తనకు అడుగడుగునా శతృవులు, నమ్మకద్రోహులు పొంచి ఉన్నారని ఇట్టే పసిగట్టింది. ప్రమాదం ఎపుడయినా ముంచుకు రావచ్చు. రాజధాని రాజ్యానికి గుండెకాయ. అందుకే ముందు ఆమె ఓరుగల్లుని పటిష్టం చేసింది. నగరానికి చుట్టూ గంప కోట కట్టించింది. దానిలోపల మట్టిగోట, దాని చుట్టూ లోతయిన అగడ్త, దానిలోపల రాతికోట, ఆ లోపల మెట్లు, ఇంకా లోపల ఇటుక కోట, అన్ని కోటలపైనా లెక్కలేనన్ని బురుజులు- ఇదీ వరస! ఆమె ఊహించిందే జరిగింది. ఒక స్త్రీ అడుగులకి మడుగులొత్తడం ఇష్టం లేని రాజులంతా ఆమెపై పగబూనారు. గణపతిదేవుడు చేతిలో పరాజితులైన వారు కొత్త కతులు నూరారు. పాత మిత్రులు కొత్త శత్రువులయ్యారు. విజయగండ గోపాలుడు, కులోత్తుంగుడు లాంటి కాంచీపుర పాండ్యులు, సిద్ధమదేవుడు లాంటి చోళులు, రెండవ కాడరాయలు లాంటి పల్లవులు- ఒక్కొక్కరుగా ఒక్కోసారి మూకుమ్మడిగా ఆమెపై దాడి చేశారు. ఒక అబలే కదా- ఆమెను సులువుగానే మట్టుపెట్టవచ్చని, సిరిసంపదలకు నిలయమైన విశాల కాకతీయ భూముల్ని కైవసం చేసుకోవచ్చని- వారంతా అత్యాశకు పోయారు. కానీ రుద్రమ ఇసుమంతయినా జంకలేదు. తన సేనానులు- గోనగన్నారెడ్డి, ప్రసాదిత్య నాయకుడు, జన్నిగదేవుడు, బెండపూడి అన్నమ లాంటి వారిని అప్రమత్తం చేసింది. అందరిలోనూ సమరోత్సాహాన్ని నింపింది. ఖడ్గాలు, చక్రాలు, భిండివాలాలు, పరశువులు, బల్లాలు, శూలాలు- ఇలా అనేకనేక ఆయుధాలతో కదను తొక్కింది. ఒక్కొక్కసారిగా తిరగబడిన సామంతుల్ని, శత్రువుల్ని అణచివేసింది. ఇప్పుడు రాజ్యం శాంతిమయం. అందుకే ఆమె దైవ క్షేత్రాలకు బయలుదేరింది. కులదేవత కాకతమ్మను దర్శించింది. వడ్డెపల్లి గణపతికి, మొగిడిచర్ల ఏకవీరకు, ఐనవోలు మైలారదేవుడికి మొక్కులు తీర్చుకుంది. రాజధానికి తిరిగి వచ్చింది. ఈసారి ఆమె ఊహించనిది జరిగింది. ఆమే నిర్మించిన కోటల ద్వారాలన్నీ మూసేసి ఉన్నాయి. అల్లరి మూకలు పెద్ద పెట్టున ఆమెపై దాడికి దిగాయి. ఈ అల్లకల్లోలానికి సారధులు- ఆమె సవతి తమ్ముళ్లు- హరిహరుడు, మురారి దేవుడు. ఇంతకాలం పక్కలో పాముల్లా ఉన్న వాళ్లు- కొంతమంది శత్రురాజులతో కుమ్మక్కై- రుద్రమపై తిరుగుబాటు చేశారు. కానీ, ప్రజలే తండోపతండాలుగా వచ్చి- కోటగోడలపైకి ఎగబాకి, అల్లరి మూకల్ని చెల్లా చెదురుచేసి- లోనికి దూకి కోట తలుపుల్ని బార్లా తీసి రాణి రుద్రమకి స్వాగతం పలికారు. ప్రజల గుండెల్లో స్థానం పొందిన సబల- రుద్రమ. ఈ విజయోత్సాహంతో బతుకమ్మ సంబురాలు జరిపింది- రుద్రమ. తెలంగాణ పల్లెలన్నీ ఆనందంలో ఓలలాడాయి. తెలుగు ప్రజలంతా పరవశంతో మునిగిపోయారు. ముట్టడికి ఇదే అదనని- దేవగిరి యాదవరాజు మహదేవుడు మూడు లక్షల సైన్యంతో, రెండు లక్షల ఆశ్విక దళంతో ఓరుగల్లుపైకి పోటెత్తి వచ్చాడు. 15 రోజులపాటు భీకరంగా దాడి చేశాడు. రాణి రుద్రమ అంతకు అంత పోరాడింది. అన్ని శక్తుల్నీ కూడ గట్టుకుని యుద్ధం చేసింది. అయిదు పదుల వయసులో అగ్నిగోళమై ప్రజ్వరిల్లింది. ఆ దెబ్బకి మహదేవుడు పారిపోయాడు. అతడిని దేవగిరి వరకు వెంటాడి వేటాడి ఓడించింది. చివరకు యాదవ మహదేవుడు కోటి సువర్ణాల్ని నష్టపరిహారంగా ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఆ సొమ్మును రుద్రమ సైనికులందరికీ పంచి పెట్టేసింది. దేవగిరి వద్ద విజయస్తంభం ఎత్తించింది. ఈ వివరాలన్నీ బీదర్ శాసనంలో ఉన్నాయి. క్రీ.శ. 1225లో పుట్టిన రుద్రమ తన 64వ ఏట క్రీ.శ. 1289లో మరణించింది. అయితేనేం- చివరి శ్వాస వరకు పోరాడడమెలాగో నేర్పింది. తెలంగాణని తేనె మాగాణి చేసింది. తెలుగు నేలని ధీర అవనిగా మార్చింది. భర్త లేడనో, పిల్లలు లేరనో, ఆస్తులు లేవనో, అప్పులు పెరిగాయనో, నమ్మక ద్రోహులు పెరిగారనో, దుఖాలు ముంచుకొచ్చాయనో- బాధపడే తెలుగు జాతికి ఓ ఆత్మవిశ్వాసపు వెలుగురేఖ- రాణి రుద్రమ.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565