పొంచి ఉన్న దొంగలు రక్షకుడుంటే మేలు
గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అంటే ఎలా ఉంటుందో... సరైన రక్షణ లేకుండా అంతర్జాలం వాడినా అలానే ఉంటుంది. ఖరీదైన మొబైల్, ల్యాప్‌టాప్ వాడుతున్నాం కదా అని అంతర్జాలం ఎలా వాడినా ఫర్వాలేదు అనుకోవద్దు. ‘వానా క్రై’ అంటూ ఈ మధ్యే హ్యాకర్లు చేసిన దాడి గురించి వినే ఉంటారు. ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాలం వినియోగిస్తున్నప్పుడు ఎంత జాగ్త్రతగా ఉంటే అంత మంచిది. అందుకోసం అంతర్జాల వినియోగంలో రక్షణ కల్పించే కొన్ని సాఫ్ట్‌వేర్ల వివరాలు తెలుసుకుందాం...
‘టోర్’ ఉంటే...
ఉల్లిపాయలోని పొరలు చూశారా? ఒకదాని మీద ఒకటి పొందికగా, ఒకదానికొకటి రక్షణగా ఉంటాయి. అంతర్జాల విహారంలో అలాంటి రక్షణ ఇచ్చే బ్రౌజర్ ఒకటి ఉంది. అదే టోర్ బ్రౌజర్. ఇది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఆధారంగా పని చేస్తుంది. సాధారణ బ్రౌజర్‌లా కనిపించే దీంట్లో సమాచారం పంపినా, అందుకున్నా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం అంత సులభం కాదు. మీరు ఏదైనా మెయిల్ పంపిస్తే అది వివిధ దేశాల్లోని సర్వర్లు మారి గమ్యస్థానానికి చేరుతుంది. అలాగే మన దేశంలో అందుబాటులో లేని చాలా వెబ్‌సైట్లను దీని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ మొబైళ్ల కోసం ఓర్బాట్ ఆప్, ఆపిల్ మొబైల్స్ కోసం ఆనియన్ బ్రౌజర్ ఉన్నాయి.
ఒకే దెబ్బకు... ఆరు పిట్టలు
ఆఫీస్, రైల్వేస్టేషన్, పార్క్, రెస్టరెంట్... ఇప్పుడు ఎక్కడ చూసినా వైఫై అందుబాటులో ఉంటోంది. ఇలాంటి ప్రాంతాల్లో అంతర్జాలాన్ని జాగ్రత్త లేకుండా వినియోగించడం శ్రేయస్కరం కాదు. మీ సిస్టమ్‌లో వీపీఎన్ సాఫ్ట్‌వేర్ ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. అలాంటిది ఒకటి సైబర్ ఘోస్ట్. దీంతో ఆరు రకాల పనులు చేయొచ్చు. ఎనానిమస్ బ్రౌజింగ్, స్ట్రీమింగ్ సైట్స్ అన్‌బ్లాక్, ఇంటర్నెట్ కనెక్షన్ రక్షణ, టొరెంటింగ్, వెబ్‌సైట్ల అన్‌బ్లాక్, వీపీఎన్ లాంటి సౌకర్యాలు పొందొచ్చు. మొబైల్స్‌లో ఈ తరహా సౌకర్యం కోసం ఒపెరా వీపీఎన్ లాంటి ఆప్స్ ఉన్నాయి.
ఏం తెలుసుకుంటున్నాయి
ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారీ అది మనకు సమాచారం ఇస్తుందో లేదో తెలియదు కానీ మన సమాచారం మాత్రం తీసుకుంటుంది. Ghostery సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మనం ఓపెన్ చేసిన వెబ్‌సైట్ ఏ సమాచారాన్ని ట్రాక్ చేస్తోందో తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్‌సైట్ మీ నుంచి ఏ సమాచారం తెలుసుకుంటోందనేది వివరాలతో కనిపిస్తుంది. అసవరం లేనివాటిని బ్లాక్ చేయొచ్చు కూడా.
ప్రతి అక్షరం... ఎన్‌క్రిప్ట్
సిస్టమ్ కీబోర్డు మీద టైప్ చేసిన ప్రతి అక్షరాన్ని తెలుసుకునేలా కొందరు హ్యాకర్లు దాడి చేస్తుంటారు. దీని కోసం ప్రత్యేక ర్యాన్‌సమ్‌వేర్‌లు సిద్ధం చేస్తుంటారు. దీన్ని ఎదుర్కోవడానికి ఒకటే మార్గం. మీరు టైప్ చేసిన అక్షరం ఏంటో వాళ్లకు తెలియకపోవడం. KeyScrambler Personal సాఫ్ట్‌వేర్‌తో ఇది కుదురుతుంది. దీన్ని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు టైప్ చేసే ప్రతి అక్షరం ఎన్‌క్రిప్ట్ అవుతుంది. దీని వల్ల ఆ సమాచారం మీ సిస్టమ్‌ను హ్యాక్ చేయాలనుకునేవాళ్లకు తెలియదు.
కన్ను మూసేస్తుంది
మీ సిస్టమ్‌లో కెమెరాను మీకు తెలియకుండానే యాక్సెస్ చేయొచ్చు, అడ్వర్టైజింగ్ ఐడీస్‌తో సమాచారాన్ని అపహరించొచ్చు. ఇదంతా మీ సిస్టమ్‌లో సరైన రక్షణ లేనప్పుడే జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం Antispyఅనే సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే అది మీ యాక్టివిటీస్ మీద ఓ కన్నేసి ఉంచుతుంది. స్మార్ట్‌స్క్రీన్ ఫిల్టరింగ్, అడ్వర్టైజింగ్ ఐడీస్‌ను డిజేబుల్ చేయడం, కెమెరాను యాక్సెస్ చేసే ఆప్స్‌ను పసిగట్టడం లాంటి పనులు చేస్తుంది.
అన్నీ ఒకే దగ్గర
అంతర్జాలంతో బ్రౌజర్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, ఈమెయిల్ లాంటి వాటినే ఎక్కువగా వాడుతుంటాం. వీటిలో ఒక్కోదానికి రక్షణ కల్పించుకునే కంటే పూర్తిస్థాయి రక్షణ ఉండే ఫ్యామిలీ ప్యాక్ లాంటి సాఫ్ట్‌వేర్ ఉంటే బాగుంటుంది కదా. Tails సాఫ్ట్‌వేర్ అలాంటిదే. మేలైన ప్రైవసీ రక్షణ ఉండే ఈ సాఫ్ట్‌వేర్‌లో బ్రౌజర్, మెసేజింగ్ సౌకర్యం, మెయిల్, ఆఫీస్ ఆప్స్ లాంటివి ఉంటాయి. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడంలో పెద్ద ప్రోసెస్ ఉన్నా రక్షణ విషయంలో మాత్రం మంచిదే.
దాచేయండి... ఇలా!
అంతర్జాలం వాడుతున్నప్పుడు రక్షణ కోసం సాఫ్ట్‌వేర్ల గురించి చూశాం. అసలు సిస్టమ్‌లో ఉండే ఫైళ్ల రక్షణ గురించి ఓ సారి చూద్దాం. ముఖ్యమైన ఫైళ్లు, ఇంట్లో పిల్లలకు కనిపించకూడదు అనుకునే ఫైళ్లను దాచుకోవడానికీ సాఫ్ట్‌వేర్లున్నాయి.Wise Folder Hider లాంటి సాఫ్ట్‌వేర్‌తో ఈ పని చేయొచ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ సిస్టమ్‌లోనే ఓ ప్రత్యేక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో మీరు ఎంచుకున్న ఫైళ్లు, ఫొటోలు తదితర సమాచారం భద్రంగా ఉంటుంది.
జాగ్రత్తగా తీసేయడానికి
మొబైల్‌ను అమ్మేసేటప్పుడు అందులోని సమాచారాన్ని జాగ్రత్తగా తొలగించాలి. ఏ మూల ఏ సమాచారం ఉండిపోయినా తర్వాత ఇబ్బంది పడాల్సిందే. దీని కోసం ప్లేస్టోర్‌లో కొన్ని ఆప్స్ ఉన్నాయి. ఉదాహరణకు CCleaner ఆప్‌ను తీసుకుంటే... దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేస్తే మొబైల్‌లోని జంక్ ఫైల్స్, అనవసరమైన డేటా, బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచ్ ఫైల్స్ లాంటివి తొలగిపోతాయి. ఈ ఆప్‌కు కంప్యూటర్స్ వెర్షన్ కూడా ఉంది. దాని ద్వారా కంప్యూటర్‌లోని అనవసరమైన సమాచారాన్ని తొలగించేయొచ్చు.
ముచ్చట్లు.. జాగ్రత్తగా
సమయం చిక్కితే ముచ్చట్లకు వాట్సాప్, ఆఫీస్‌లో తీసుకున్న నిర్ణయాలు పంచుకోవడానికీ వాట్సాపే. ఇటీవల కాలంలో వాట్సాప్‌లో రక్షణ చర్యలు పెంచుతున్నా... దీనికి మించిన రక్షణ ఇచ్చే మెసేజింగ్ ఆప్‌లు ఇంకొన్ని ఉన్నాయి. ‘సిగ్నల్’ లాంటి ఆన్‌లైన్ మెసేజింగ్ ఆప్‌తో పూర్తి రక్షణాత్మక ఛాటింగ్ చేసుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, వీఓఐపీ ఫోన్ కాల్స్, రీడ్ రిసిప్ట్స్ లాంటి అనేక ఆప్షన్లతో ఈ ఆప్ రూపొందింది. వాట్సాప్, హైక్, టెలీగ్రామ్ కంటే రక్షణలో ఇది మేలని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
అన్నింటినీ మార్చి
మనం మాట్లాడే మాటలు పక్కవాళ్లకు అర్థం కాకుండా ‘క’ భాష, ‘జ’ భాష వాడుతుంటాం. అలాగే కంప్యూటర్ల నుంచి పంపించే సమాచారం ఇతరులకు అర్థం కాకుండా ఉండాలంటే వాటిని ఎన్‌క్రిప్ట్ చేసి పంపించాలి. దీని కోసం కొన్ని సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. వాటిలో GnuPG ఒకటి. దీన్ని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మెయిళ్లు, డాక్యుమెంట్లు లాంటి సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి ఇతరులకు పంపించుకోవచ్చు. దాన్ని డీక్రిప్ట్ చేయడానికి మీ దగ్గర ఉండే కోడ్ అవసరమవుతుంది. దాని వల్ల మీరు పంపించిన సమాచారం ఆంగతుకుల చేతులో పడినా ఇబ్బంది ఉండదు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565