MohanPublications Print Books Online store clik Here Devullu.com

సిరివెన్నెల_Sirivennela

మంచి వినండి... మంచి చూడండి...మంచి చెప్పండి...


మంచి వినండి... మంచి చూడండి...మంచి చెప్పండి...
 ... మహాత్ముని గురించి కొన్ని మంచి మాటలు
 నీతో నువ్వు అబద్ధమాడకు!

 
‘‘గాంధీజీ అనగానే నాకు ఒకటి కాదు... ఎన్నో గుర్తుకొస్తాయి. మా నాన్న గారికి గాంధీజీ అంటే తీవ్రమైన ఇష్టం. నిజానికి సత్యవ్రతం, సత్యనిష్ఠ లాంటి మాటలు కొద్దిగా అస్పష్టమే. అసలీ ప్రపంచంలో ఏదీ యాబ్‌సొల్యూట్ ట్రూత్... నిరపేక్షమైన సత్యం కాదు. వాస్తవం (ఫినామినన్), నిజం (రియాలిటీ), సత్యం (ట్రూత్) అనే మూడు ఉంటాయని నా వర్గీకరణ. సత్యం మాట్లాడాలని తెలిసినా- అబద్ధం అవసరాల్ని అడ్డదారుల్లో తీరుస్తుంది కాబట్టి, సహజంగా అంతా అటు మొగ్గుతారు. చిన్న వయసులో నాకు ఇంట్లో నాన్న గారికి చెప్పకుండా, దొంగతనంగా సినిమాలు వెళ్ళి చూసి వచ్చే అలవాటుంది. మా  నాన్న గారికి అబద్ధం చెబితే కోపం.
 
 తప్పు చేస్తే, తల దించుకొని తప్పు చేశానని నిజం చెబితే వెంటనే క్షమించేసేవారు. క్రమంగా నాకు కూడా అబద్ధం చెప్పే కన్నా, నిజం చెప్పి తలెత్తుకు నిలబడడమే కంఫర్టబుల్‌గా అనిపించింది. మా స్కూల్‌లో ఒక టీచర్ ఎప్పుడూ సినిమాలు చూసేవారు. బాగా మార్కులొచ్చే నేను ఆయన వెంటపడి, ఆయన తీసుకెళ్తే సినిమాకెళ్ళా. కానీ, ఆ రోజున నా లెక్క తప్పి, మా చుట్టాలెవరో రావడంతో, మా నాన్న గారు రోజూ కన్నా ముందే ఇంటికి వచ్చారు. నన్ను చూసి, ఎక్కడికెళ్ళావంటే మాస్టారితో సినిమాకు వెళ్ళానని చెప్పా. కానీ, నేను అబద్ధం చెప్పాననుకొని, నాన్న గారు లాగి లెంపకాయ కొట్టారు. నా జీవితంలో మా నాన్న గారు నన్ను కొట్టింది అదొక్కసారే.
 
అబద్ధం చెప్పాననుకొన్న నాన్న గారు మరునాడు ఆదివారమైనా సరే, సైకిలెక్కి ఊరంతా తిరిగి, మాస్టార్‌ని వెతికి, కలిసి నేను చెప్పింది నిజమేనని తెలుసుకున్నారు. ఇంటికి రాగానే, చిన్నవాడినైన నాకు అంత పెద్దాయన ‘సారీ’ చెప్పారు. నిజం చెప్పడంలోని రుచి తెలిశాక, దాన్నెవరూ ఒదులుకోరు. ప్రాణ మాన విత్తాలకు భంగం కలిగేటప్పుడు అబద్ధమాడినా పాపం కాదని పెద్దలే చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ‘నీతో నువ్వు అబద్ధం ఆడకు. ఎవరి నుంచైనా తప్పిం చుకోగలవేమో కానీ, నీ నుంచి నువ్వు తప్పించు కోలేవు’. అదే నా సిద్ధాంతం. గాంధీజీ రాజకీయ ప్రయోగాల మాటెలా ఉన్నా, వ్యక్తిగా ఆయన నిబద్ధతపై ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు.
 
 తాను చేసిన ప్రయోగాలూ, వాటిలో వైఫల్యాలు దాపరికం లేకుండా చెబుతూ, జీవితాంతం నమ్మినవాటికే కట్టుబడ్డ ఆయన వైయక్తిక నిష్ఠ నాకూ ఇష్టం. ఆయన తన పరిమి తుల్ని, తప్పుల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. అందుకే, గాంధీ కన్నా గాంధీతత్వం నాకిష్టం. ‘మహాత్మ’లో ఎందరికో నచ్చిన నా పాట ‘ఇందిరమ్మ (కొంతమంది) ఇంటిపేరు కాదుర గాంధీ’లో ‘పదవులు కోరని పావనమూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి’ అనడంలో ప్రాచీన ఋషుల నుంచి గాంధీ దాకా అందరి తాత్త్వికత ఉంది. అలాంటి మంచి మాటలు కొందరినైనా ఆలోచింపజేయడం సంతోషం.’’  - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ప్రముఖ కవి - ఆలోచనాశీలి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list