MohanPublications Print Books Online store clik Here Devullu.com

పితృపక్షం_Pitrupaksham

పెద్దపక్షం పెద్దలపక్షం
భాద్రపద మాసంలోని బహుళ పక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం కనుక దీనికే పితృపక్షమని పేరు. ఈ దినం నుంచి పక్షం రోజులూ అన్ని వర్ణాలవారూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇది ఆచరించకపోతే పాతకం చేకూరుతుందని శాస్త్రవచనం. కాబట్టి ఈ రోజులలో యధాశక్తి పితృశ్రాద్ధాన్ని ఆచరించాలి. శాస్త్రీయమైన విశ్లేషణ అయితే, మన దేహం లోని కణాలు ఎన్నో తరాలుగా ఒక వంశం పేరుతో మన పూర్వీకుల నుండి సంక్రమించాయి. కనుక మన జీవన ప్రమాణాలలో, మన శరీరంలోని అణువణువునా మన పెద్దల ప్రభావం వుంటుంది. అందుకే తన వారి బంధం తాను జీవించి ఉన్నంతకాలం వుంటుంది. కనుక వారిని ఒక్క సారి తలుచుకొని మనఃపూర్వక నమస్కారములతో పూజించడం సంస్కారమౌతుంది. ధర్మ సింధు ప్రకారం పెద్దలు మరణించినా వారి జీవుడి ప్రభావం కొంతకాలం వుంటుంది. మరణించిన సంవత్సరం వరకు జీవుడు ఊర్ధ్వలోక ప్రయాణంలో ఉంటాడు. ఆ దశలో ఆ జీవుడి దృష్టి తన వారిపై వుంటుంది. అందుకే ఆ ప్రభావం ఉన్నంతకాలం నిత్యకర్మలు తప్పించి పండగలు పబ్బాలు జరుపుకోకూడదంటారు పెద్దలు.
ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతి ముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్క రోజు కూడా అన్నశ్రాద్ధం చేయలేని వారు హిరణ్యదానం చేయాలి. ఏమిచేయలేని అశక్తులు అడవుల్లోకి వెళ్లి, ముళ్ళకంచెను కౌగలించుకుని పితృదేవతలనుద్దేశించి కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
మహాలయపక్షాల గురించిన ఐతిహ్యం ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
దానకర్ణుడిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. ఒక ఫలవృక్షాన్ని చూసి ఆనందంతో పండు కోసుకుని తినబోయాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లలో ఏది కోయబోయినా అదే పరిస్థితి ఎదురైంది. ఇలా లాభం లేదు. కనీసం దప్పికయినా తీర్పుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీరు తీసుకున్నాడు. తాగుదామని నోటి వద్దకు తీసుకురాగానే ఆ నీరు కాస్తా సువర్నజలంగా మారిపోయింది. స్వర్గానికెళితే అక్కడ కూడా ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి, దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు “కర్ణా! నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముకలేకుండా దానాలు చేసావు. అయితే బంగారం, వెండి, దానం రూపేణా చేసావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది” అని అశరీరవాణి పలికింది. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుని వద్దకెళ్ళి పరిపరివిధాల ప్రాధేయపడగా, చివరకు దేవతలంతా కలిసి ఆయనకు ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. సశరీరంగా భూలోకానికి వెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి, పేదలు, బంధు మిత్ర్హులందరికీ అన్న సంతర్పణ చేశాడు. రాజ్యంలోని ప్రజలందరికీ షడ్రసోపేతంగా భోజనాలు పెట్టడంతో పాటు పితరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన అన్న సమారాధనతో అందరి కడుపులూ నింపాడో అప్పుడే ఆయనకు కూడా కడుపు నిండిపోయింది. ఆకలి, దప్పిక ఇక ఆయన్ని ఎన్నడూ భాదించలేదు.
కర్ణుడు స్వర్గంనుంచి భూలోకానికి వచ్చి గడిపి వెళ్ళిన కాలమే మహాలయపక్షాలుగా, పితృపక్షాలుగా పిలవబడుతోంది. ఈ పదిహేను రోజుల కాలమూ అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడినప్పటికీ శుభకార్యాలకు మాత్రం పనికిరాదు.
పితరులకు అంటే గతించిన తల్లి తండ్రులకు తద్దినాలు పెట్టె అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరుమీదుగా అన్నదానం చేసినట్లైతే పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకల శుభాలు కలుగుతాయి. శాస్త్రీయమైన విశ్లేషణ ఏంటంటే మనకు సిరి కలిగినప్పుడు మనతోటి వారికి సహాయంచేసి వారి ఆకలి దప్పులు కూడా తీర్చితే మన మనిషి జీవితానికి సార్ధకత చేకూరుతుంది. అందుకే ఇటువంటి ఆచరణ పద్దతులు, సూత్రాలు మన పూర్వీకులు రూపొందించారు. మహాలయ అమావాస్య: మహాలయ పక్షాలలో పదిహేను రోజులూ పితృతిథి- విధి విధానాలు ఆచరించలేని వారు మహాలయ అమావాస్య రోజు వేదవిడుడైన బ్రాహ్మణుని ఆహ్వానించి, స్వర్గస్థులైన తమ తండ్రి-తాత-ముత్తాతలకు, అలాగే తమ తల్లి తండ్రి-తాత-ముత్తాతలకు వైదిక విధిన సమంత్రకంగా తర్పణ విడవాలి. ఈ తతంగం పూర్తయ్యేంతవరకు ఆ రోజు ఇతర పూజా కార్యక్రమాలు నిషిద్దం. ఎవరికీ భిక్ష పెట్టకూడదు. ఎంతగా శ్రద్ధాసక్తులు కలిగివుంటే అంత మంచిది. శ్రాద్ధం అంటే శ్రద్ధతో నిర్వహించేది అని అర్ధం. కాబట్టి శ్రాద్ధాన్నిసంపూర్తిగా ఏ లోటు లేకుండా నిర్వర్తించాలి.
తర్పణ కార్యక్రం పూర్తయ్యాక మనం ఆహ్వానించిన ద్విజుని కాళ్ళు కడిగి, షడ్రసోపేతంగా భోజన, దక్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరచాలి. తర్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన వారు (కర్త-ఇంటి యజమాని) ఆ రోజు రాత్రి భోజనం చేయరాదు. అల్పాహారం తీసుకోవచ్చు.
పై విధానాన్ని పాటించడానికి శక్తీ, స్తోమత లేనివారు, దగ్గరిలోని దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణతో కలిపి స్వయంపాకం సమర్పించాలి. తర్పణలు ఎవరెవరికి విడవచ్చన్న సందేహం ఉండక మానదు. స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, తల్లిదండ్రుల తోబుట్టువులకు, గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టిన వారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితుని బార్యకు (వీరిలో వారసులు లేకుండా మృతిచెందిన వారికి ప్రాముఖ్యత నివ్వాలి). మనం ఏ అన్నాన్నైతే తింటున్నామో దాన్నే పితృదేవతలకు ప్రతినిధులుగా ఒకరిని ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెట్టాలి. అలాగే వారిని తలచుకుని పిండాలను పెట్టి, తర్పణం విడవాలి. పితృదేవతల ప్రీత్యర్థం ప్రతి ఏటా వైదిక విధిన పితృకార్యం జరిపించితీరాలి. అందుకే కదా, తప్పనిసరి తద్దినం అనే సామెత పుట్టింది.
×××××××××××××××××××××
పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం
భాద్రపదమాసంలోని బహుళపక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం. అందుకే దీనిని పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రవచనం.
ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతిముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా తర్పణలు చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకలశుభాలూ కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి శక్తి లేదా స్థోమత లేనివారు ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణునికి స్వయంపాకం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలిదప్పులు తీరి తమ వంశస్థులను సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు. మన పితరుల ఆత్మకు శాంతి కలిగినప్పుడే ఇహలోకంలో మనకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయనీ, వంశాభివృద్ధి కలుగుతుందని ప్రామాణిక శాస్త్రగ్రంథాలయిన ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి.
ఎంతో దానశీలుడిగా పేరుపొందిన కర్ణుడు కోరినవారికి కాదనకుండా ధన, కనక, వస్తు, వాహన రూపేణా భూరిదానాలు చేశాడు. అయితే అన్నిదానాలలోనూ మిన్న అయిన అన్నదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా మరణానంతరం ఆయన ఆత్మ ఆకలిదప్పులు తీరక ఆర్తితో అలమటించవలసి వచ్చింది. అప్పుడు దేవతలందరి అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పక్షం రోజులపాటు ఉండి, కురుక్షేత్ర సంగ్రామంలో అసువులు బాసిన తన జ్ఞాతులకు అంటే దాయాదులకు, సైనికులకు తదితరులందరికీ తర్పణలు వదిలి తన రాజ్యంలోని పేదసాదలకు, పెద్దఎత్తున అన్నసంతర్పణలు చేసి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ పక్షం రోజులకే మహాలయపక్షాలని పేరు. శాస్త్రరీత్యా ఈ పదిహేను రోజులూ ఎటువంటి శుభకార్యాలూ నిర్వర్తించకూడదు.
స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, (తల్లిదండ్రుల జననీ జనకులు) తల్లిదండ్రుల తోబుట్టువులకు, గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టినవారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితునికి, అతని భార్యకు..... వీరిలో వారసులు లేకుండా మృతి చెందినవారికి ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా వివిధ ప్రమాదాలలో అకాల మరణం చెందిన వారికోసం కూడా తర్పణ విడిస్తే మంచిది.
లౌకికంగా కూడా... అసలు ఈ తర్పణలు, తిలోదకాలు ... వంటి వైదికపరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేనివారు కూడా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా చనిపోయిన తల్లిదండ్రులను లేదా తాతముత్తాతలను తలచుకుని, మనం ఏ అన్నాన్నయితే తింటున్నామో, దానినే... అర్హులయిన పేదలను ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెడితే... వారికి కడుపు, మనకు గుండె నిండుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నవారైనా, వస్త్రదానం, ధనదానం తదితర ఏ రకమైన దానాలు చేసినప్పటికీ, ఆయా దానాలు పుచ్చుకునేవారు మాత్రం మొహమాటానికి చాలని చెప్పినా, మనసులో మాత్రం ‘వీరికి అంత ఉంది కదా, మరికొంచెం ఇస్తే బాగుండును’ అనిపిస్తుంది. అదే అన్నదానంతో మాత్రం కడుపు నిండా తిన్న తరువాత తృప్తి పడి ‘ఇక చాలు’ అని అనాల్సిందే. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే మిన్న అని శాస్త్రం చెప్పింది. ఈ పక్షంలో మిగిలిన కొద్దికాలాన్నైనా ఈ రీతిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
మహాలయపక్ష తిథులలో శ్రాద్ధకర్మలు చేస్తే వాటి ఉపయోగాలు.

తిథి ఉపయోగాలు
పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం 
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశు సంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి
అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list