MohanPublications Print Books Online store clik Here Devullu.com

అర్ధనారీశ్వర స్తోత్రం, Ardhanariswara Stotram

అర్ధనారీశ్వర స్తోత్రం
Ardhanariswara Stotram

అర్థనారీశ్వర శివుని రహస్య మిదియే

సృష్టారంభ వేళలో బ్రహ్మ ద్వారా రచింపబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆకాశవాణి వినవచ్చింది. బ్రహ్మా! మైథునీ సృష్టి చేయి. ఆకాశవాణిని ఆలకించి బ్రహ్మదేవుడు మైథునీ సృష్టిని చేయు సంకల్పించి నిశ్చయించాడు. 

కానీ తత్సమయం వరకు నారీ జనోత్పత్తి కాకపోవడం వల్ల అతడు తన నిశ్చయంలో సఫలుడు కాలేకపోయాడు. శివపరమేశ్వరుని కృపారహితంగా మైథునీ సృష్టి కాజాలదు. అందులకే అతడు శివదేవుని ప్రసన్నుని చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేయనారంభించాడు.

చిరకాల పర్యంతం బ్రహ్మదేవుడు తన హృదయంలో ప్రేమపూర్వకంగా శివమహేశ్వర ధ్యానం చేస్తూండిపోయాడు. అతని తీవ్ర తపస్సుకు ప్రసన్నుడైన ఉమామహేశ్వర భగవానుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. దేవాదిదేవుడైన శివభగవానుని ఆ దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ అభిభూతుడై దండవత్ భూమిపై వరుండి అతని అలౌకిక విగ్రహానికి ప్రణమిల్లాడు. 

అంత శివమహేశ్వరుడు : వత్సా! బ్రహ్మా! నాకు నీ మనోరథం అవగతమైంది. సృష్టి వర్థిల్లాలన్న భావంతో నీవు చేసిన కఠోరమైన తపస్సుకు నేను సంతుష్టి చెందాను. నేను నీ ఇచ్ఛను అవశ్యం నెరవేరుస్తాను. అంటూనే శివదేవుడు తన శరీరం నుండి ఉమాదేవిని వేరు చేశాడు. తదనంతరం శివపరమేశ్వరుని అర్ధాంగం నుండి వేరైన పరాశక్తికి బ్రహ్మదేవుడు సాష్టాంగప్రమాణం చేసి పలికాడు. 

శివే! సృష్ట్యారంభంలో నీనాథుడూ దేవాది దేవుడు అయిన శంభు భగవానుడు నన్ను సృజించాడు. భగవతీ! ఆయన ఆదేశానుసారమే దేవతాది సమస్త ప్రజల మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తరువాత కూడా ఆ సృష్టిని వర్థిల్లజేయడంలో నేను అసఫలుడనయ్యాను.

కనుక ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తిని చేసి సృష్టిని వర్ధిల్లజేయదలచాను. కానీ ఇంత వరకూ నారీకులం ప్రకటింపబడలేదు. నారీ కులాన్ని సృష్టించడం నాకు శక్తికి అతీతంగా ఉంది. దేవీ! నీవు సంపూర్ణ సృష్టికీ, శక్తులకూ ఉద్గమస్థానానివి.

హే మాతేశ్వరీ! నీవు నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదింతువు గాక! నేను మరో ప్రార్థన చేస్తున్నాను. చరాచర సృష్టి వర్థనార్థం నా దక్షపుత్రునికి పుత్రీరూపంలో అవతరించ నీవు దయ చూపెదవు గాక! అని బ్రహ్మ అర్ధించాడు. 

బ్రహ్మ ప్రార్థననాలకించి శివాని తథాస్తు అంటూ అతనికి నారీ కులాన్ని సృష్టించగలుగునట్టి శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకై ఆమె తన భృకుటీ మధ్యభాగం నుండి తనతో సమానమైన కాంతిమతి అయిన ఓ శక్తిని ప్రకటింపజేసింది. దానిని తిలకించి దేవదేవేశ్వరుడైన శివుడు చిరునవ్వు నవ్వుతూ దేవీ! బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. 

నీవతనిపై ప్రసన్నరాలవై అతని మనోభీష్టాన్ని నెరవేర్చుము అన్నాడు. పరమేశ్వరాజ్ఞను శిరోధార్యం చేసి ఆ శక్తి బ్రహ్మ ప్రార్థనానుసారం దక్షపుత్రి అయినది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్థానమై పోయాడు. నాటి నుండియే ఈ లోకంలో మైథానీ సృష్టి కొనసాగింది. సఫల మనోరథుడైన బ్రహ్మ శివపరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరిల్లజేశాడు. 

అలా శివ- శక్తులు పరస్పరాభిన్నులై సృష్టికి ఆదికారణులైనవారు. పుష్పంలో గంధమూ, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో ప్రభ నిత్యులై, స్వభావ సిద్ధులై ఉన్నట్లే శివునిలో శక్తి కూడా స్వభావ సిద్ధయై రాజిల్లుతూ ఉంటుంది. శివునిలో ఇ కారమే శక్తి అయి ఉన్నది. శివుడు కూటస్థతత్వం కాగా శక్తి పరిణామ తత్త్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు, ఆత్మకాగా శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తి సత్తాగా ఉంటుంది. అర్థనారీశ్వర శివుని రహస్య మిదియే.











No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list