MohanPublications Print Books Online store clik Here Devullu.com

జబ్బులు, టైఫాయిడ్, దోమ Disease, Typhoid, Mosquito

జల..'భద్రం'
బాత్‌రూమ్‌లో షవర్‌ ఆన్‌ చేసుకుందామంటే అలాంటి బాత్‌రూములు మనకెక్కడుంటాయ్‌? పోనీ... అలాంటి బాత్‌రూములు సంపాదించామే అనుకోండి! ట్యాంకులో నీళ్లెక్కడుంటాయ్‌? ఏ షవర్‌నైనా మైమరపించే మాన్‌సూన్‌ షవర్‌ వస్తుంటే జరభద్రం... కొంచెం జాగ్రత్త... అంటూ ఈ విసుర్లేంటి? ఇప్పటి వానలు... ఒకప్పటి వానల్లా కాదు. సేదదీర్చే వర్షంతో పాటు కుట్టే, కొరికే, అంటించే జబ్బులు వస్తాయి. అదిగో వాన వస్తోంది... ఇదిగో దోమ, ఈగ, ఎలుక వచ్చేశాయి. జర భద్రం... జల భద్రం!
నీరు కలుషితం కావడం వల్ల
ఈ సీజన్‌లో నీరు కలుషితం కావడం వల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ప్రధానంగా వస్తుంటాయి. ఇలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే కొన్ని ప్రధాన వ్యాధులు...
టైఫాయిడ్‌ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్‌ కల్చర్, స్టూల్‌ కల్చర్, వైడాల్‌ టెస్ట్‌ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్‌ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు.
కలరా ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇందులో నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల డీహైడ్రేషన్‌ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ప్రత్యేకమైన ఈ లక్షణాన్ని రైస్‌ వాటర్‌ స్టూల్స్‌ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోయి, ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. స్టూల్‌ కల్చర్, డార్క్‌ ఫీల్డ్‌ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు.
షిజెల్లోసిస్‌ జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగుల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చే ‘టాక్సిక్‌ మెగా కోలన్‌’ అనే కాంప్లికేషన్‌తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్‌ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకమయ్యే అవకాశమూ లేకపోలేదు.
ఈ–కొలై నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్‌కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్‌ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్‌ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
వర్షాకాలం వ్యాధుల నివారణ
⇒ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం.
⇒కుండల్లో/బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకండి. అలా నిల్వ ఉన్న నీరు తాగకండి. 
⇒మరీ వీలుకానప్పుడు మినహా ఈ సీజన్‌లో బయట వండిన ఆహార పదార్థాలు తినకపోవడమే మేలు.
⇒తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని మాటి మాటికీ వేడి చేసి తినవద్దు.
⇒మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. అయితే వ్యాధిని వ్యాప్తి చేసే ఈగల వంటి కీటకాలు ముసరడానికి మాంసం కారణమవుతుంది. శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్లనే ఈ అవకాశం ఎక్కువ. ఇక మాంసాహార ప్రియులు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ సీజన్‌లో మాంసాహారాన్ని సరిగ్గా ప్రాసెస్‌ చేయడం, పూర్తిగా ఉడికించడం.
⇒పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైపెచ్చులు ఊడిపోయిన సన్‌షేడ్‌కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్‌ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించండి. దోమ తెరలు వాడటం మేలు.
⇒ఈ సీజన్‌లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి.
⇒ఇంటి కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే వెల్‌క్రో వంటి ప్లాస్టిక్‌ మెష్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
⇒వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్‌ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్‌లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.
⇒ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
⇒వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.
⇒కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేయడానికి సబ్బు లేదా డిష్‌వాషింగ్‌ డిటర్జెంట్స్‌ వూత్రమే వాడాలి.
⇒అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు... వానలో అతిగా తడిస్తే నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
⇒చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్‌వాష్‌తో గానీ, సబ్బుతోగాని కడుక్కోని శుభ్రంగా ఉంచుకోవాలి.
పైన పేర్కొన్న జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారించుకోవచ్చు.
ఈగలతో వచ్చే వ్యాధులు
వర్షాల సీజన్‌ మొదలుకాగానే ఈగలు మూగడం మొదలవుతుంది. ఈగల కారణంగా వచ్చే వ్యాధుల సంఖ్య దాదాపు వందకు పైగానే ఉంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లోనే ఎక్కువ. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలవు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్‌ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ప్రోటోజోవన్‌ పరాన్న జీవులనూ, ఆస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్‌ వర్మికులారిస్‌ వంటి నులిపురుగులనూ, పోలియో, వైరల్‌ హెపటైటిస్‌ (హెపటైటిస్‌ ఏ అండ్‌ ఈ) వంటి వైరస్‌లనూ ఈగ వ్యాప్తి చేస్తుంది. ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని...
అమీబియాసిస్‌ 
ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములివి. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్‌ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్‌ యాబ్సెస్‌) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
జియార్డియాసిస్‌ 
ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఆహారాన్నంతా జియార్డియా జీవులే తీసుకోవడం వల్ల ఆహారం ఒంటికి పట్టదు.
దోమలతో వచ్చే వ్యాధులు
మలేరియా 
ఇది అనాఫిలస్‌ దోమతో వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్‌ అనే ప్రోటోజోవా ఈ వ్యాధిని కలిగిస్తుంది. ప్లాస్మోడియమ్‌లో ఒక్కో రకం (స్పీïసీస్‌) వల్ల ఒక్కోరకం మలేరియా వస్తుంది. అయితే వీటిన్నింటిలోనూ సెరిబ్రల్‌ మలేరియా తీవ్రమైనదీ, ప్రాణాంతకమైనది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌–ఏఆర్‌డీఎస్‌), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్‌ ఫెయిల్యూర్‌) వంటివి రావచ్చు.
చికన్‌ గున్యా 
ఈ వ్యాధి ఎడిస్‌ ఈజిపై్ట అనే దోమ వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్‌ కారణంగా వస్తుంది. ఏడిస్‌ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ దోమ కాటు వల్ల జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఆ కీళ్లనొప్పులు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా భరించలేనంతగా ఉంటాయి.
డెంగ్యూ 
ఈ వ్యాధికి కూడా ఏడిస్‌ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌’ అని కూడా అంటారు. మామూలుగా వచ్చే డెంగ్యూవ్యాధిని క్లాసికల్‌ డెంగ్యూ అంటారు. ఈ వ్యాధిలోని మరో దశ అయిన డెంగ్యూ హేమరేజిక్‌ ఫీవర్‌లో అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్‌కు గురికావచ్చు. దీన్ని ‘డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌’ అంటారు.
ఎలుకల వల్ల...
వర్షాలకు బయటి ఎలుకలు ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్‌ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్‌లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది.
డా.ఎమ్‌. గోవర్థన్‌
సీనియర్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్,
కేర్‌ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list