MohanPublications Print Books Online store clik Here Devullu.com

డాక్టర్ సి.నారాయణ రెడ్డి_Dr.C.Narayana Reddy




ఆధునిక తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన మేరు నగధీరుడు. తెలుగు అక్షరానికి జ్ఞానపీఠాన్ని అందించిన విశ్వంభరుడు. తెలుగు సాహితీ ప్రస్థానాన్ని దిగంతాలకు చేర్చిన నిత్య సాహిత్య కృషీవలుడు. తెలుగు సినిమా పాటలకు కొత్తసొబగులు అద్దిన పాటల మాంత్రికుడు. పద్యం, గేయం, వచనం, పాట, గజల్, బుర్రకథ ఇలా సాహిత్య ప్రక్రియ ఏదైనా ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ ఒక ఆణిముత్యమే. కవిగానే కాకుండా పండితునిగా, పరిశీలకునిగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. తెలుగు సాహితీ సార్వభౌముడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి.
సినారెగా సుపరిచితుడైన డాక్టర్ సి. నారాయణ రెడ్డి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. ఆయన చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగినప్పటికీ తెలుగు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు. పల్లెపదాలు, వినోదాలు, కథాగానంపై మక్కువ పెంచుకోవడంతో పాటు చిన్నతనంలోనే కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1953లోనే నవ్వని పువ్వు పేరుతో తొలి కవితా సంపుటిని వెలువరించి అందరి మన్ననలూ అందుకున్నారు. తరువాత విశ్వగీతి, నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు వంటి కవితా సంపుటాలు తీసుకువచ్చారు. 1962లో కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలో ఎన్‌టీ రామారావు కోరిక మేరకు గులేబకావళి కథ సినిమా కోసం తొలిసారి పాట రాశారాయన.
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ సినారె రాసిన తొలిపాటనే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అలా 3500లకు పైగా సినిమా పాటలు రాశారు. 
1963లో బందిపోటు చిత్రం కోసం 
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను 
మేడ దిగిరావే... అంటూ ఇష్టసఖిని ప్రేమతో పిలుస్తూనే పిండివెన్నెల నీ కోసం పిల్లతెమ్మెర నాకోసం రెండు కలిసిన నిండుపున్నమి రేయి మనకోసం అంటూ కవ్విస్తాడు ప్రియుడు.
ఓహో ఓ ఓ ఓహోహో ఓ ఓ
ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ.. ఓ అంటూ అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఆయన రాసిన పాట అశేష ఆదరణ పొందింది. చూడడానికి నలుపు రంగులో ఉండే రాళ్లను చెక్కితే కొత్త జీవం పోసుకుంటాయంటారాయన. 
తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అమోఘం. 1988లో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె 19 సాహితీ ప్రక్రియల్లో 92 పుస్తకాలు రాశారు. 116 కవితలతో నా రణం మరణంపైనే అనే కవితా సంపుటిని తీసుకువచ్చారు.
అన్నా చెల్లెళ్ల అనురాగానికి గీటురాయిగా నిలిచిన 
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి-
కనిపించని దైవమే ఆ కనులలో ఉన్నది అంటూ అన్నాచెల్లెల మధ్య ఉండే అప్యాయతలు, అనుబంధాలు, అనురాగాల్ని బంగారు గాజులు చిత్రంలో సినారె వివరిస్తారు.
కృష్ణానది విశిష్టతను నారాయణరెడ్డి కృష్ణవేణి చిత్రంలో ఎంతో అందంగా వివరించారు. 
కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి అని నాయిక పాడితే
కృష్ణవేణి నా ఇంటి అలివేణి అంటూ కథానాయకుడు గళం కలుపుతాడు.
శ్రీ గిరి లోయల సాగేజాడల
విద్యుల్లతలు వేయి వికసింపజేసేను అంటూ సాగుతుంది ఈ పాట. ఇక తండ్రి గొప్పతనాన్ని వివరిస్తూ ధర్మదాత (1970) చిత్రంలో ఆయన రాసిన మరో అద్భుత మైన పాట -
ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్న నీ మనసే వెన్న
అమృతం కన్నా అది ఎంతో మిన్న అంటూ కంటికి రెప్పలా సాకే తండ్రిని ముళ్లబాటలో నీవు నడిచావు. పూలతోటలో మమ్ము నడిపావు అని కీర్తిస్తాడు. అంతేకాదు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన దేశాన్ని మరిచిపోవద్దంటూ కోడలు దిద్దిన కాపురం చిత్రంలో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు అంటాడు. హైదరాబాద్ రిక్షావాలా సినారె వర్ణించినంతగా మరెవరూ వర్ణించలేదేమో అనిపించే గీతం.
రింఝిం రింఝిం హైదరాబాద్..రిక్షావాలా జిందాబాద్ - మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరుకారూ బలాదూర్ అంటాడు మట్టిలో మాణిక్యం చిత్రంలో. స్నేహాన్ని స్నేహితుల గొప్పతనాన్ని వివరిస్తూ సినారె రాసిన అద్భుత గీతాలు 1972లో వచ్చిన బాలమిత్రుల కథ చిత్రంలోనివి.
గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది. 
ఒక గూటిలోన కోయిలుంది అంటారు సినారె.
నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహన్ని బలపరుస్తుంది. తనకు ఇష్టమైన కథానాయికను వర్ణిస్తూ 
అభినవ తారవో.. నా అభిమాన తారవో
అభినవ తారవో అంటాడు
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనీ..శివరంజనీ అంటూ పాడుతాడు.
ఒసేయ్ రాములమ్మ చిత్రంలో టైటిల్‌సాంగ్ 
ఓ ముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ.. ఓ పున్నమీ బొమ్మ.. ఓ.. ఒసే రాములమ్మా అంటూ రాసిన గీతం అద్భుతం. అట్లే తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన సినారె 1981లో అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మాతృభాష వాడకాన్ని పెంపొందించారు. 1969-73 వరకు రాష్ట్ర సాహిత్య అకాడమీలో చురుకైన పాత్ర, 1992లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో భాషా సాంస్కృతిక సలహాదారులుగా పనిచేశారు. 1997లో మంత్రిహోదాలో సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా నియమితుడై 2004 వరకు పనిచేశారు. 1997 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పాటలో ఏముంది- నా మాటలో ఏముంది అంటూ ఆయన చెప్పిన ముచ్చట్లు 2 పుస్తకాలుగా వచ్చాయి. వారి సతీమణి సుశీల సంస్మరణగా ప్రత్యేక మహిళా పురస్కారం, ఓపెన్ యూనివర్సిటీలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వర్ణపతకాలు అందిస్తున్నారు. సినారె కవిత్వం విశిష్టతలపై 10 పీహెచ్‌డీలు, 18 ఎంఫిల్‌లు ఆయా యూనివర్సిటీలు ప్రధానం చేశాయి. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్‌కు 1994 నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు గంగా, యమునా, సరస్వతి, కృష్ణవేణి అనే నలుగురు కూతుళ్లున్నారు.
విశ్వంభర, మనిషి-చిలక, 
ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసినడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టిమనిషి, ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, జలపాతం, విశ్వగీతి, 
విశ్వనాథనాయుడు, కొనగోటిమీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం మొదలైన కవితా సంపుటాలు, పరిణత వాణి పేరుతో వ్యాసాలు, 1955లో అజంతా సుందరి సంగీతరూపకం రచించారు. తెలుగు గజల్స్, ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు -ప్రయోగాలు అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథానికి 
డాక్టరేట్ లభించింది. విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్,(1988) 
లభించింది. 1977లో పద్మశ్రీ, 1978లో కళాప్రపూర్ణ, 1992లో పద్మభూషణ్‌లు సినారెను 
వరించాయి. 
స్వాతిముత్యం చిత్రంలో లాలిలాలి లాలీ లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి అంటూ బాబును నిద్రపుచ్చుతూ రాసిన పాట నాటికి నేటికి ఎవర్‌గ్రీన్. సూత్రధారులు చిత్రంలో జోలాజోలమ్మ జోల.. నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల అని జోలపాడుతాడు. 
అమ్మ గొప్పతనాన్ని కూడా సినారె అద్భుతంగా వర్ణించారు. 20వ శతాబ్ధం చిత్రంలో అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించిన అర్థమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే అంటూ అమ్మగొప్పతనాన్ని అమృతమంతా మధురంగా వర్ణించాడాయన. అట్లే ప్రేమించు చిత్రంలో కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా అంటాడు. 
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చలిగాలి రమ్మంటు పిలిచిందిలే చెలిచూపు నీపైన నిలిచిందిలే అంటూ నాయకుని అసలు రూపం తెలుసుకున్న చిత్రనాయిక అతన్ని ఏడిపించాలనే ఉద్దేశంతో పాటందుకుంటుంది రాముడు భీముడు చిత్రంలో. 
అరుంధతీ చిత్రంలోనూ 
జేజమ్మా జేజమ్మా..జేజమ్మా జేజమ్మా
వంటి గీతాలెన్నో సినారె కలం నుంచి జాలువారాయి.తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అన్న తన పాటకు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుగా వెలుగు జాతి మనది అని మార్చారు.





పాటలా... అవి కావు
 నవ పారిజాతాలు! రసరమ్య గీతాలు!! 

శివుడి శిరసు నుండి జాలువారిన గంగ...కొండకోనలదాటి... పంటసీమలు తడిపి...సామాన్యుడి కుండలో కొలువై దాహం తీర్చినట్టు...జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన సినారె కలం...సినిమా పాటలను సైతం సాహితీ సౌరభాలతో గుబాలించేట్టు చేసింది! సామాన్య ప్రేక్షకుడికి కూడా ఉన్నత సాహిత్య విలువలను పరిచయం చేసింది!అత్యుత్తమ భావజాలాన్ని అలతి పదాలతో అందించింది!అందుకే సినారె...

‘సంగీత సాహిత్య సమలంకృతు’డయ్యాడు! ‘లలిత కళారాధనలో ఒదిగే చిరుదివ్వెను నేను...’ అంటూనే వెండితెర సాహిత్యంలో సూర్యసమానుడయ్యాడు!! ఆయన పాటలు... నవపారిజాతాలు... రసరమ్య గీతాలు! సామాన్య ప్రేక్షక జన మనోరంజితాలు!!

సినిమా అంటేనే సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకునేది. ఏది రాసినా, ఏది తీసినా చదువురాని వాడికి సైతం సులువుగా అర్థమయ్యేలా ఉంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. ఇలాంటి రంగంలో కూడా డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాసిన పాటలు సాహితీ గౌరవం పొంది అలరించాయి. అదే సమయంలో సామాన్యుడిని సైతం ఆకట్టుకున్నాయి. ‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని...’తో మొదలైన ఆయన సినీ సాహితీ ప్రస్థానం 3,500లకు పైగా గీతాలతో సుసంపన్నమైంది. ప్రేమగీతాలు రాసినా, జానపద గీతాలు రాసినా, భావగీతాలు రాసినా, విషాద గీతాలు రాసినా సినారె కలం తనదైన ముద్రతో ‘వెండి’తెరపై ‘బంగారు’ సంతకం చేసింది!

* అది...ప్రేయసీ ప్రియులు పాడుకునే యుగళగీతం. నటించేది ఎన్టీఆర్‌, జమున. తోటలో మాల కడుతూ ఎదురుచూస్తున్న ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? ‘తోటలో తొంగి చూసిన’ ఆ రాజు నవ్వులు ఆమెకెలా అనిపిస్తాయి?

‘నవ్వులా? అవి కావు... నవపారిజాతాలు...
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు...’లా కనిపిస్తాయిట!
మరి అంతటి ప్రేమను ఆమెలో చూసిన ఆ రాజు ఏం చేశాడు?
‘ఎలనాగ నయనాల కమలాలలో దాగి...
ఎదలోన కదిలే తుమ్మెద పాట...’ విన్నాడు!
‘ఆ పాట నాలో తియ్యగ మోగనీ... అనురాగ మధుధారలై సాగనీ...’ అన్నాడు!
‘ఏకవీర’ చిత్రంలో ‘తోటలో నా రాజు...’ పాట అటు రసజ్ఞులను, ఇటు సామాన్యులను కూడా ఒకేలా ఆకట్టుకుంది.

* మరో సందర్భం... అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశం. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ ధీరగంభీరంగా నడుస్తూ వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.

‘శత సోదర సంసేవిత సదనా... అభిమానధనా... సుయోధనా...’ అంటూ స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో ఆ సందర్భాన్ని సుసంపన్నం చేసింది.

‘ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా...’ అని సంబోధించింది.

‘కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు సౌర్యాభరణా...’ అని మెచ్చుకుంది. ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలో ఇలాంటి పదాలతో సాగిన ఈ పాట కూడా నేల ప్రేక్షకుడి చేత ఈలలు వేయించింది.

* హీరో హీరోయన్‌తో కలసి విహార యాత్రకు వెళ్లే సందర్భంలో పాట రాయాల్సి వస్తే ఇంకెవరైనా అయితే శృంగార పరంగా రాస్తారు. కానీ సినారె ఆ సందర్భానికి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. శోభన్‌బాబు నటించిన ‘విచిత్ర కుటుంబం’లోని ‘ఆడవే జలకమ్ములాడవే... కలహంస లాగ... జలకన్య లాగ...’ అంటూ మొదలు పెట్టి...

‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల...’లోను, ‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట...’, ‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు...’ -సాహిత్యాన్ని జలకాలాడించారు! సినిమా పాట చేత పుణ్యస్నానాలు చేయించారు!!

* ఇలా ఎన్నెన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. ‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ...’ పాట విన్నా, ‘స్వాతి కిరణం’లో ‘శృతి నీవు, గతి నీవు, శరణాగతి నీవు భారతీ...’ పాటను తల్చుకున్నా, ‘కళ్యాణి’ సినిమాలో ‘లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను... మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...’ పాట చూసినా... ఇలా ఒకటా రెండా ఏ పాటను గమనించినా... అవన్నీ చిత్రసీమలో ‘చిత్రం... భళారే విచిత్రం...’ అనిపించేవే. ‘ఛాంగురే... భళారే... సినారె’ అనిపించేవే!!
పాటే వెన్నెల.. పదమే వూయల...
అమ్మ పాడే లాలి పాటలు.. అమ్మా అని బిడ్డ నోరారా పాడే పాటలు... అల్లరి వయసు విరహ గీతాలు.. ప్రేమికుల సరసాల సయ్యాటలు.. వ్యక్తిత్వానికి వన్నెలుదిద్దే నీతిపాఠాలు.. జీవిత సూత్రాల చద్దిమూటలు.. ఇలా తెలుగు సినీ సాహితీవనంలో సినారె వెదజల్లిన సౌరభాలెన్నో. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాల్లా ఆ పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయి.

‘అమ్మా అని నోరార పిలవరా.. ఆ పిలుపే అందరు నోచని వరమురా..’ అంటూ ‘మనుషులు మట్టిబొమ్మలు’లో బిడ్డల కోసం పరితపించే ప్రతి కన్నతల్లి ఆర్తిని అక్షరాల్లో ఆవిష్కరించారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా..’ అంటూ అమ్మ అనే మాటకు సరికొత్త భాష్యం చెప్పారు ‘ప్రేమించు’ చిత్రంతో. తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దుచేశారంటే ఉలికులికి పడతాడు..’ అంటూ చిన్ని కన్నయ్యలను అమ్మతో జోకొట్టించేశారు ‘జీవనజ్యోతి’లో. అమ్మ గొప్పతనం గురించి చెప్పే క్రమంలో నాన్నను తక్కువ చేయలేదాయన. బిడ్డలను పూలతోటలో నడిపించేందుకు తాను ముళ్లబాటలో నడిచేందుకు సిద్ధమయ్యే తండ్రిని ‘ఓ నాన్నా నీ మనసే వెన్న.. అమృతం కన్న అది ఎంతో మిన్న..’ అని ‘ధర్మదాత’లో కీర్తించారు. ‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు. ఇలాంటి కన్నప్రేమ గీతాలే కాదు.. కన్నె ప్రణయగీతాల్లోనూ తన చమక్కు చూపించారు సినారె.

‘వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. ‘పూజాఫలం’లో ‘పగలే వెన్నెల జగమే వూయల..’ అంటూ వూహాలోకంలో పరవశింపజేశారు. ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. ‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’లో కళ్లకుకట్టారు. ‘నువ్వలా ముందుంటే నిన్నలా చూస్తుంటే..’ అని ‘గూఢచారి 116’ పాడుకున్నా, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా, ‘అమ్మమాట’లో ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు..’ అని కన్నెపిల్ల వాపోయినా, ‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్‌..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.

మెరిసే ముత్యాలు...: సినారె పాటల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సూక్తులు, జీవిత సత్యాలూ ఉన్నాయి. ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో. ‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో. ‘మంచి మిత్రులు’లోని ‘ఎన్నాళ్లొ వేచిన ఉదయం..’ పాటలో మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని ధైర్యమిస్తాడు. ‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు. ‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు. ‘రైతు కటుంబం’లో ‘ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము..’ అంటూ మట్టితో రైతు అనుబంధాన్ని ఆవిష్కరించారు.




చివరి గీతం ఇదే

దాదాపు మూడు వేల అయిదు వందల పాటలు సినారె కలం నుంచి జాలు వారాయి. చివరి క్షణం వరకూ అక్షర సేద్యం చేస్తూనే ఉన్నారాయన. ఈమధ్యే ‘మనసైనోడు’ అనే చిత్రానికి పాట రాశారు. ‘జయ జయహే భారతావని పావని సద్గుణ గణ సముపేతా’ అంటూ సాగే దేశభక్తి గీతాన్ని రచించారు. మనోజ్‌ నందం కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సినారె రాసిన ఈ గీతాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నట్టు చిత్ర నిర్మాత హసీబుద్దీన్‌ 


పాటల హార్బర్ – సినారె
సెప్టెంబర్ 12, 2011 
సన్నివేశాలు పడవ ఎక్కుతాయి.
రకరకాల సందర్భాలతో ప్రయాణం కడతాయి.
ఒక ప్రియురాలు ప్రియుడి చే
తిని మొహమాటంగా అందుకుంటుంది.
ఒక అబ్బాయి అ
మ్మాయిని వర్ణించడానికి పదాలు వెతుక్కుంటాడు.
కాలం పెట్టిన పరీక్షకు ఒక నాయకుడు తల్లడిల్లిపోతాడు.
బిడ్డను పోగొట్టుకున్న తల్లి… ప్రాణం లేని బొమ్మ
కు జోలపాడుతుంది.
నిజజీవితంలో కూడా- చాలా సన్నివేశాలు తమ పడవను ఏ
దైనా పాటల తీరం చేర్చమని ప్రాధేయపడతాయి.
అదిగో… అప్పుడు సినారె ధగధగలాడిపోయే రేవులా కనిపిస్తారు.
ఆశ్రయం ఇచ్చే హార్బర్‌లా ఆదుకుంటారు. తన పాటనే లంగరుగా మలిచి భారం దించే కళాసీ అవుతారు.
ఆ మాత్రం సాయం లేకపోతే మనకు ప్రయాణం లేదు. ఆ మాత్రం గట్టు తగలకపోతే మనకు తీరం లేదు.
ఆ మాత్రం ప్రాణం పోయకపోతే మనకు ఆయువే లేదు.
పాట- ఎప్పుడూ ఒక ఛార్జ్. సినారె పాట- ప్రతి సందర్భంలోనూ రీఛార్జ్.
ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్
గాలి చేదుగా ఉంది. నమ్మకద్రోహాల కాలం కరుకుగా ఉంది. గోతులు తీసే చేతులు పక్కనే ఉండి కరచాలనం చేస్తూ ఉన్నాయి. మంచివాళ్లనుకున్న వాళ్లంతా మంచిని తుంచి రొట్టెముక్కల్లా నమిలి మింగేస్తున్నారు. చేయి చాస్తే పడగ. అడుగు వేస్తే ముల్లు. ముద్ద నోటపెడితే విషం. చూడండి… ఎక్కడో ఏదో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎక్కడో ఏదో విస్ఫోటనం కొన్ని ప్రాణాలను తునాతునకలు చేసింది. ఊపిరి పీల్చాల్సిన పసికందులు వైద్యుల సమక్షంలోనే ఊపిరి అందక మృతి చెందారు. అకాల వర్షమొకటి ఇంటికి చేర్చాల్సిన పంటను నీట ముంచింది. మరి కాసేపట్లో రావాల్సిన కన్నకూతురిని ఎవడో గొంతు కోసి చంపాడు.
ఇంతేనా. అంతటా ఇంతేనా. ఎటు చూస్తే అటు నిరాశేనా. ఇక బాగుపడేది మరేమీ ఉండదనా.
వద్దు. ఆ లోయలో పడిపోవద్దు. ఆ నిస్పృహలో కూరుకుపోవద్దు. ఆ చీకటిలో సోలిపోవద్దు. ఆ నిశ్వాసలో జీవం కోల్పోవద్దు. పాట వినండి. ఒక పాట. సినారె పాట. మీ రెప్పలు కొట్టుకుంటాయి. మొప్పలు కదలాడతాయి. ఆశ- పోయే ప్రాణాన్ని బంధించి మోకులేసి కట్టి మరేం పర్వాలేదన్నట్టుగా భుజం చరుస్తుంది. వినండి.
గోరంతదీపం- కొండంత వెలుగు
చిగురంత ఆశ- జగమంత వెలుగు
ఏమంటున్నాడో చూడండి సినారె. చిగురంతేనట ఆశ. దానికి జగమంతా వెలుగుతో నిండిపోతుందట. కబుర్లు. ఎవరు వింటారు. మేము చాలా పడ్డాం. చాలా చీకటిని మోశాం. నల్లగా అయ్యాం. ఈ కబుర్లు మాకెందుకు? లేదు. వినండి. ఇంకా ఏమంటున్నాడో వినండి.
కరిమబ్బులు కమ్మేవేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్య సహనమే వెలుగు…
వాహ్. సినారె. ఏమన్నావయ్యా. ఇంకేమంటాం. నువ్వు ఇంత విడమర్చి చెప్పాక నలిగిన చొక్కా వేసుకొని ఎందుకు తిరుగుతాం. అమ్మయ్య. వేణ్ణీళ్లతో స్నానం. చలువ చేసిన చొక్కా. రెండు ఇడ్లీ. చాయ్. తోడుగా మళ్లీ నీ పాట.
కొండపైన… వెండివాన…
కడిగేసినట్టే. అక్షరాలే చినుకులుగా మారి కష్టాలన్నింటినీ కడిగేసినట్టే. సేదగా అనిపించట్లేదూ? ఇంకా వినండి. ధైర్యమూ వస్తుంది.
మబ్బులు వస్తూ పోతుంటాయి
నిలిచేదొకటే- నీలాకాశం
కలతలు వస్తూ పోతుంటాయి
మిగిలేదొకటే వలచే హృదయం…
భళా. తళతళా. మిలమిలా.
********
చాలా రోజుల తర్వాత ఇవాళ అమ్మగుర్తుకొస్తోంది. విడివడిన కొప్పును జడ వేసుకోవాలనే తీరిక కూడా లేకుండా వొంచిన నడుము ఎత్తకుండా నీ కోసం నా కోసం అన్న కోసం చెల్లి కోసం చెమటను చిందించిన అమ్మ గుర్తుకొస్తోంది. ఆమె పవిట పట్టుకొని తిరిగి ఎన్నాళ్లయ్యిందో! ఆమె పాడిన పాటను విని ఎన్నాళ్లయ్యిందో! ఆ జోలకు ఆదమరిచి ఒడిలో తల పెట్టుకొని నిదురించి ఎన్నాళ్లయ్యిందో. సినారె… ఒక్కసారి అమ్మలా మారవా?
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి…
ఆపు. చాలా బాగుందిగాని ఆపు. కసువుచిమ్మే పిలగాణ్ణి. గొడ్లు కాసే కసిగాణ్ణి. మా అమ్మ ఇలా పాడదే. కరీంనగర్ జిల్లాలో హనుమాజీపేట అనే మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టావు కదా. మీ అమ్మ ఇలా పాడి ఉంటుందా? కాస్త మామూలు మాటల్లో పాడవయ్యా తల్లీ.
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు
గోపాల క్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు…
అదీ లెక్క. ఇప్పుడు హాయిగా ఉంది. సద్దన్నం తిన్నట్టుగా ఉంది. ఏమి పాళి నీది. రెండంచుల కత్తి. అటూ తెంపుతావ్. ఇటూ తెగ్గొస్తావ్.
ఎలా వచ్చింది నీకీ భాష? నిజాం జమాన. ఉర్దూ చదువుకున్నావ్. వేములవాడ… సిరిసిల్లా… అటు నుంచి ఇటూ ఇటు నుంచి అటూ తిరుగుతూ ఆ కాలంలో- ఆ పల్లె బడులలో- ఆ వానాకాలం చదువులో ఎలా సాధించావ్ ఈ భాష. ఈ ఎక్స్ ప్రెషన్. ఈ తెలుగుపూల పరిమళం.
అదే.. అదే…
అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది…
అర్థమైంది. ఏదడిగినా పాటలోనే సమాధానం ఇస్తావని అర్థమైంది. వయసు కదా. నూనూగు మీసాలు వచ్చాయి కదా. హైద్రాబాదుకు చేరి కాలేజీ చదువు మొదలుపెట్టావు కదా. ఖాళీ దొరికినప్పుడల్లా షెహర్ అంతా చక్కర్లు కొడుతున్నావ్ కదా. ఇంతకీ ఎలా ఉందయ్యా హైదరాబాదూ?
అటు చూస్తే చార్‌మినారు-
ఇటు చూస్తే జుమా మసీదు
ఆ వంక అసెంబ్లి హాలు-
ఈ వంక జూబిలి హాలు
తళతళ మెరిసే హుసేనుసాగరు
దాటితే సికింద్రబాదు
రింజిమ్ రింజిమ్ హైదరాబాద్
రిక్షావాలా జిందాబాద్
ఈ పాట రాసినందుకు హైద్రాబాద్ నీకు బాకీ. తనతో పాటు రిక్షాలో తిప్పినందుకు హీరో చలంకు మేము బాకీ.
********
ఇప్పుడు అసలు సిసలు ఘట్టానికి వచ్చాం. కండలు కరుకు తేలే ప్రాయానికి వచ్చాం. పైరగాలికీ పవిటగాలికీ పరవశించిపోయే ఊపుకు వచ్చాం. ఇలాంటి సమయంలో అలాంటి తమకంలో మరి ప్రేమలో పడకుండా ఉంటామా? ప్రణయంలో మునగకుండా ఉంటామా? పెదాలు నల్లగా మారినా సరే కాటుక కళ్లను ముద్దాడకుండా ఉంటామా? నుదురు ఎర్రబారినా సరే కుంకుమ నుదురుతో రాపాడించక ఉంటామా? పూలతొడిమలు గుచ్చుకున్నా సరే కురులలో ముఖం దాచుకోకుండా ఉంటామా? అదిగో చూడు.. లక్షలాది యువతీయువకులు భిక్షపాత్ర పట్టుకొని నీ యెదుట దేహీ అని నిలుచున్నారు. వాళ్ల పాత్రల్లో కాసిన్ని పదాలు పడేయ్. వాళ్ల పెదాలకు కాసిన్ని పాటలను పులిమెయ్. బతుక్కుంటారు నీ పేరు చెప్పుకుని. పాడుకుంటారు మీ పేరు తలుచుకొని.
చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేర రావేలా
ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా?
ఎవరు ఇది? ఎస్.రాజేశ్వరరావేగా… ఈ మాటలకు అందంగా ముస్తాబు చేసి హార్మోనియం మెట్ల మీద కూచోబెట్టింది. ఏదీ… ఆయన చేతి మీదుగా ఇంకో పాటను నిద్ర ….
నిన్నలేని అందమేదో… నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో
సరే. అబ్బాయి మనసు చెప్పడం ఎంతసేపు? అమ్మాయి మనసులోకి దూరాలి. ఆ అగాధ నీలిమలో మునకలు వేయాలి. ఆమె మాటలకు కొత్త అర్థాలు వెతకాలి. అదిగో. ఆ అమ్మాయి పరవశానికి పాట కట్టు చూద్దాం.
పగలే వెన్నెల- జగమే ఊయెల
కదలే ఊహలకే కన్నులుంటే…
పగలే వెన్నెల- జగమే ఊయెల…
భేష్. హైద్రాబాద్ నీకు మంచి ట్రైనింగే ఇచ్చింది. ఇక్కడికి చేరి లైబ్రరీలో ఇరవై నాలుగ్గంటలూ గడిపి నువ్వు చదివిన మహామహుల కవిత్వం నీకు పెన్నిధిలా మారింది. ఉగ్గుపాలతో కొంత, పుస్తకాలకు ఊడిగం చేసి కొంత రాటు తేలావు. చదువు పూర్తి చేశావు. ఒకవైపు లెక్చరర్‌గా పాఠాలు చెబుతూనే ఇంకో చేత కావ్యాలు రాస్తున్నావు. సింగిరెడ్డి నారాయణరెడ్డి కాస్తా సినారెగా ప్రసిద్ధిపొందావు.
ఇంకా ఎంతసేపు?
వెండితెర నీ కోసం వేచి ఉంది. నీ పల్లవి చరణాల కోసం కాచుకొని ఉంది. వేలి కొసలతో నువు చుట్టే పాటల కుచ్చిళ్ల కోసం పడిగాపులతో ఉంది.
ఏంటి… టైము రావాలా? కాలం కలిసి రావాలా?
సింహం మీద సింహం స్వారీ చేయడం చూశావా ఎపుడైనా.
అడుగో ఎన్టీరామారావు.
కాలమనే కేసరి మీద స్వారీ చేసి నీ దగ్గరికే వస్తున్నాడు.
పద. పద పద. పదం పంచడానికి పోదాం పద.
********
జమున జాంపండు. ఎన్టీఆర్ పంటికి పదును మెండు. కొరుక్కుతినాలనిపించే అతడి కోరికను పాటగా చెప్పాలి. అదీ సన్నివేశం. ‘గులే బకావళి కథ’ సినిమా కోసం ఎన్టీఆర్ పిలిపించి మొదటిసారిగా ఇచ్చిన సన్నివేశం. జోసఫ్-కృష్ణమూర్తి సంగీత దర్శకులు. అందరూ చూస్తున్నారు. చుబుకం కింద చేయి పెట్టుకొని ఎన్టీఆర్ పరికిస్తున్నారు.
మొదట పాట రాయాలి.
తర్వాత బాణీ కట్టాలి.
హైద్రాబాద్‌లో ఆయన దృష్టిలో పడగానే సరిపోయిందా? అవకాశం ఇస్తాను పాటలు రాద్దురుగాని రండి అని పిలవగానే పరిగెత్తుకొని వస్తే సరిపోయిందా? ఇది సినిమా. కల్పనల కల్పితాల కృత్రిమ కార్ఖానా. ఇందు లోనే ప్రాణం పోయాలి. ఇందులోనే పాటను పాదుగా చేయాలి. అందుకో మరి. కాస్త కొత్తగా. నీ మార్కుగా. సినిమా రంగానికి కొత్తగా సినారె అనే కవి వచ్చాడు చూడండి అని చూపించేంత మెరుపుగా.
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకొందు
నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ…
పాస్. కాదు కాదు పాఠాలు చెప్పే లెక్చరర్‌గారికి నూటికి నూరు మార్కులు. పింగళి, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, కొసరాజు… వంటి హేమాహేమీలు ఉన్న సినీ రంగంలో కొత్త కవి ఒకడు వచ్చాడు. రావడం రావడమే మంచి గంధంలాంటి… కర్పూరకళికలాంటి పాటలు ఇచ్చాడు.
శుభం.
ఇది మొదలు.
మలి పరీక్ష ‘ఆత్మబంధువు’ నుంచి వచ్చింది. సారధీ స్టూడియోస్‌వారి బంపర్ ఆఫర్. తమిళ్‌లో సూపర్‌హిట్టయిన ‘పడిక్కాద మేదై’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరో. సావిత్రి హీరోయిన్. ఎస్వీఆర్ ఆల్ ఇన్ వన్. అయితే చిన్న చిక్కు. తమిళ వెర్షన్‌లో రెండు పాటలు సూపర్ హిట్టయ్యాయి. వాటి బాణీ మార్చడానికి లేదు. వాటి భావమూ మార్చడానికి లేదు. ఆ బాణీలో అదే భావంలో తెలుగు తొణకిసలాడేలా రాయాలి. సినిమా రంగానికి కొత్త. ఫ్రెష్‌గా రాస్తాడని డెరైక్టర్ రామకృష్ణ- అదే భానుమతి రామకృష్ణలోని రామకృష్ణ ఆలోచన. రాయ కుండా ఎలా ఉంటాను అని సినారె నమ్మకం. ఈలోపు కెవి మహదేవన్ వచ్చాడు. తోడుగా పుహళేంది వచ్చి చేతులు కట్టుకున్నాడు. అందరూ మితభాషులే. కాని బాణికి అవసరమైన మాటలు మాత్రం పటాకుల్లా పేలాలి.
మొదటి పాట ట్యూన్‌కు అర్థం.
ఒకే ఒక ఊరిలో ఒకే ఒక రాజు
ఒకే ఒక రాజుకు ఒకే ఒక రాణి…
ఇలాగే రాస్తే తమిళం వాసన గుప్పుమంటుంది. సాంబారు ధార ఎడతెగక ప్రవహిస్తుంది. మనకు కొద్దిపాటి అల్లం పచ్చడి చాలు. కాదంటే చిటికెడు కరివేపాకు కారం. ఏం రాయాలో సినారెకి అర్థమైంది. వెంటనే కాగితం మీద మెత్తగా కలం జారింది.
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న…
నూట పది మార్కులు.
ఇంకో ట్యూను వినిపించారు. హీరో తనకు చదువు రాదని బాధపడుతుంటే హీరోయిన్ ఓదారుస్తూ పాడే పాట. ట్యూన్ సిద్ధం. ఏం… సినారె కలం సిద్ధంగా లేదా?
చదువురాని వాడవనీ దిగులు చెందకు
అట్టి మదిలోన మమతలేని చదువులెందుకు
నూట ఇరవై మార్కులు.
సరే. ఇవన్నీ నలిగిన దారులు నలిగిన మాటలు అనుకుంటారా?
ఎన్టీఆర్ మళ్లీ పరీక్ష పెట్టాడు.
హిడింబికి పాట అట.
శ్రీకృష్ణపాండవీయం సినిమా అట.
తెలుగులో అరుదైన మాటలతో రాయాలట.
ఇదీ కిక్కంటే. ఇదీ ఛాలెంజ్. వెంటనే రాక్షసస్త్రీల అందాన్ని తలదన్నే పాట సినారె కలం నుంచి పుట్టింది.
ఛాంగురే బంగారు రాజా
ఛాంగు ఛాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తై వగకాడా
అయ్యారే… అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా…
నూటికి రెండు వందల మార్కులు.
సినారె రథం సినీ పాటల రహదారి మీద దూసుకుపోతూ ఉంది.
ఇక అది ఆగదు.
********
సినారెకి చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి పోయారు. ఇంట్లో బెంగ. పెద్దవాళ్లుండేసి గంగమ్మకు మొక్కుకో అని సినారెకి పెద్ద నమ్మకాలు లేకపోయినా కరీంనగర్ జిల్లాలోనే ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం తీసుకెళ్లి అక్కడి గోదావరి దగ్గర దంపతుల చేత మొక్కించారు.
మరు సంవత్సరానికి కూతురు పుట్టింది.
పేరు గంగ.
మళ్లీ కూతురు పుట్టింది. ఒక నదికి ఇంకో నది తోడు.
యమున.
మళ్లీ కూతురు పుట్టింది.
సరస్వతి.
త్రివేణి సంగమం పూర్తయ్యింది.
కాని గంగమ్మకు తృప్తి తీరలేదు. కొసరుగా ఇంకో కూతురిని ఇచ్చింది.
ఉత్తరాది నదుల పేర్లు ఇది వరకే పూర్తయ్యాయి. దక్షిణాది ఏం పాపం చేసింది.
అందుకే ఈ కూతురి పేరు- కృష్ణవేణి.
నలుగురు కూతుళ్లు. నాలుగు నదుల పేర్లు. ఇంట్లో కళకళలాడే వీరి మాటల ప్రభావం. ఈ నదులను కన్న తండ్రి కలాన పాటల ప్రభావం. చేసుకున్నవారికి చేసుకున్నంత. పొందిన వారికి పొందినంత. రాబట్టుకున్నవారికి రాబట్టుకున్నంత. మాస్ కావలంటే సిద్ధం. క్లాస్ కావలంటేనా… ఇదిగో వినండి.
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటునా ఏ గుండెలు మ్రోగెనో….
సినిమా పేరు అమరశిల్పి జక్కన.
ఇంకో క్లాసికల్ కావాలా? ఏకవీర రికార్డు ప్లే చేస్తాను వినండి.
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
సినారెకు పాడటం వచ్చు. రాసేటప్పుడే ఒక వరుస అనుకొని పాడుకోవడమూ వచ్చు. కెవి మహదేవన్ ఎదుట ‘తోటలో నా రాజు’.. రాసి పెడితే ఆయన ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ స్టయిల్‌లో మోత మోగించేశాట్ట. అది బాగున్నా హుషారుగా ఉన్నా ఈ పాత్రల స్వభావానికి ఈ సన్నివేశ నేపధ్యానికి ఈ స్పీడు తగదు.
సినారె ముఖం చూశాక మామకు ఆ మాట అర్థమైంది.
‘మీరెలా అనుకున్నారో చెప్పండి’ అని అడిగాడాయన.
సినారె పాడి వినిపించాడు.
ఇప్పటికీ అదే వరుసలో మనం పాడుకుంటూ ఉన్నాం.
********
ఎవడైనా ఒక పడవ మీద అతికష్టం మీద ప్రయాణిస్తాడు.
రెండు పడవల మీద కాలు పెట్టినవాడు బొక్కబోర్లా పడతాడు.
మూడు పడవల మీద సవారీ చేస్తే?
సినారె అలా చేసి కూడా గెలిచాడు.
బోధన- ఒకవైపు లెక్చరర్‌గా ప్రొఫెసర్‌గా రీడర్‌గా బోధనా వృత్తిలో అంచెలంచెలుగా రాణిస్తున్నాడు.
కవిత్వం- సీరియస్ సాహిత్యంలో కవిత్వంగా ఇంతింతై వటుడింతై ఎదుగుతున్నాడు.
గీతరచన- సినీ రంగంలో గీతరచయితగా దుమ్ము దులుపుతున్నాడు.
ఇన్ని పనులు ఎలా సాధ్యం. ఒక్క పనికే ఆపసోపాలు పడే మనుషుల మధ్యన ఇన్ని పనులు చేస్తూ గెలుస్తూ ఉండటం ఎలా సాధ్యం.
బహుశా సినారెకి ఈ పనులన్నీ ఇష్టం కావడమే ఈ విజయ రహస్యం.
శ్వాస పీల్చినంత సులభంగా సినారె పాఠాలు చెప్పాడు.
గాలి వీచినంత సులభంగా కవిత్వం చెప్పాడు.
మాట చెప్పినంత సులభంగా పాట కట్టాడు.
వినండి.
ఈ రేయి తీయనిది- ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
శ్రీపతి పండితారాధ్యుల… అంత పెద్దగా ఎందుకుగాని బాలూ అంటే పోలా? తెలుగు పాటకు దేవుడు చేసిన మేలూ అంటే పోలా? అతడు వచ్చాడు. చూశాడు. జయించాడు. అలాంటి బాలూ దొరికితే రాసేవాడికి ఎలా ఉంటుంది కసి. అలా రాసే వాడుంటే పాడే వాడిది ఎలా ఉంటుంది కృషి.
సందర్భం కలిసి వచ్చింది.
సినిమా చెల్లెలి కాపురం.
కథానాయకుడు కవి. కథానాయిక నర్తకి. ఆమె అడుగులను హెచ్చరించే కవిత్వం అతడు చెప్పాలి. అతడి పదాలకు పాదం కలిపే నాట్యం ఆమె చేయాలి. ఒకరికి మరొకరితో పోటి. ఈ సందర్భానికి పాట. జమీందారులోనో రిక్షావాడిలోనో రైతు నాగలిలోనో ప్రవేశించి పాట రాయాలంటే కొంత ప్రయత్నించాలిగాని కవిలోకి కవిగా ప్రవేశించాలంటే ఏం కష్టం?
సినారెకి పూనకం వచ్చింది. పంక్తులు వేపమండల్లా గాల్లోకి లేచాయి. పాట తన్నుకొని వచ్చింది.
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కరకంకణములు గలగలలాడగ
వనీల కచభర విలాస బంధుర
తనూలతిక చంచలించిపోగా
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకునుగని నా పలుకు విరియ
నీ నటననుగని నవ కవిత వెలయగా
ఆడవే మయూరి నటనమాడవే మయూరీ….
క్లాప్స్ మోగాయి. బాలూ పాటకా? ఎస్. సినారే మాటకా? ఎస్.
ఏం పెద్ద లెక్కండి ఇది సినారెకి ఏం పెద్ద లెక్క.
కాని నిర్మాత రాఘవ మరో సందర్భంలో పెద్దగా పట్టించుకోలేదు. ‘తూర్పు- పడమర’ సినిమా తీస్తున్నప్పుడు అది తమిళ రీమేక్ కాబట్టి తమిళంలో బాణీ తమిళ భావం యధావిధిగా వాడమన్నాడు.
ఏం. తెలుగువారికి లేదా ప్రతిభ.
తెలుగు కలానికి లేదా పౌరుషం.
హార్మోనియం పెట్టె ఎదుట కూచున్న రమేష్ నాయుడు నేను కొత్త పాట ఇస్తాను అన్నాడు. సినారె నేను కొత్త మాట ఇస్తాను అన్నాడు.
తమిళం కంటే గొప్పగానా అని ఛాలెంజ్ చేశాడు రాఘవ.
అవును గొప్పగా అన్నాడు సినారె.
పాట తన్నుకొచ్చింది.
శివరంజనీ.. నవరాగిణి
వినినంతనే- నా
తనువులోని అణువణువు కరిగించే
అమృతవాహినీ…
తెలుగోడి దెబ్బకు తమిళనాడు అబ్బా అంది.
********
మీరు సందర్భం చెప్పండి.
సినారె దానికి పాట రాశాడు.
మంచిరోజా?
భలే మంచిరోజు… పసందైన రోజు…
నాన్నకు కృతజ్ఞతా?
ఓ నాన్నా… నీ మనసే వెన్నా…
అన్నయ్య పట్ల అనురాగమా?
అన్నయ్య సన్నిధి… అదే నాకు పెన్నిధి…
స్నేహమా?
స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం…
మృత్యువా?
అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం…
అనురాగమా?
ఇక్కడే కలుసుకున్నాము…
ఎప్పుడో కలుసుకున్నాము…
వదిలిపెట్టండి. అవన్నీ వదిలిపెట్టండి.
ఒక ఐటమ్‌సాంగ్ కావాలా?
ఇది ఇవాళ విని రేపు మర్చిపోయే ఐటమ్‌సాంగ్ కాదు.
ముమైత్‌ఖాన్ జేజమ్మ చేసిన సాంగ్.
సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు మోగించిన సాంగ్.
సినారె కలం స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకొని చిందేసిన సాంగ్.
మాయదారి సిన్నోడు- మనసే లాగేసిండు
లగ్గమెప్పుడురా మావా అంటే
మాగమాసం యెల్లేదాకా
మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా?
నో క్లాప్స్. ఓన్లీ డాన్స్.
********
సినారెకి లెక్కకు మించిన సన్మానాలు జరిగాయి.
సాహిత్యంలో ఉత్కృష్టమైన జ్ఞానపీఠ్ దక్కింది.
అనేక పదవులు వరించాయి.
అవి ఆయనకు గౌరవం తెచ్చిపెట్టాయి.
వాటికి ఆయన గౌరవం తెచ్చి పెట్టారు.
సాహిత్య జీవులు, బుద్ధిజీవులు, మేధావులు, విద్యార్థులు… వాళ్లదీ సినారెది ఒక లోకం.
సామాన్య ప్రేక్షకులు రిక్షావాళ్లు అన్నెం పున్నెం ఎరగని గృహిణులు రైతులు శ్రోతలైన నానాజాతులు వీరిదీ సినారెది ఇంకో లోకం. వాళ్లంతా తమకు తోచినప్పుడు తోచనప్పుడు ఏదో ఒక సినారె పాట పాడుకుంటారు.
ఆయన ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కూచుని ఉన్నప్పుడు కూడా ఆయన గతంలో వెదజల్లిన కొన్ని మాటలూ పాటలూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక హృదయాన్ని తాకుతుంటాయి. సేద తీరుస్తుంటాయి. చార్జ్ చేస్తుంటాయి. రీచార్జ్ చేస్తుంటాయి.
ఆయనకు ధన్యవాదాలు.
మోదుగుపూలవంటి ఆయన పాటకు కూడా.
గోగులుపూచె గోగులు కాచె ఓ లచ్చగుమ్మాడి
గోగులు దులిపె వారెవరమ్మా ఓ లచ్చ గుమ్మాడి..
ఓ లచ్చ గుమ్మాడి…
హిందీ స్వరకర్తలతో దోస్తీ
అతిరథ మహారథులనదగ్గ హిందీ సంగీత దర్శకులు సి.రామచంద్ర, శంకర్-జై కిషన్, ఓపీ నయ్యర్, రవీంద్ర జైన్, ఉషాఖన్నా తెలుగులో కొన్ని సినిమాలకు స్వరాలందించారు. వీరందరితోనూ సినారె కలిసి పనిచేశారు. ‘అక్బర్-సలీం-అనార్కలి’కి సి.రామచంద్ర స్వరకర్త. సినారె రాసిన పది పాటలకూ ఆయన బాణీలు కట్టడం విశేషం. ‘జీవిత చ క్రం’ కోసం శంకర్-జైకిషన్ స్వరసారథ్యంలో రెండు పాటలు రాశారు. రవీంద్రజైన్‌తో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ కోసం పనిచేశారు. ఇక ఓపీనయ్యర్ తెలుగులో పనిచేసిన ఏకైక చిత్రం ‘నీరాజనం’లో అద్భుతమైన ప్రేమగీతాలు రాశారు సినారె. అలాగే సుప్రసిద్ధ హిందీ నేపథ్య గాయకుడు మహమ్మద్ రఫీ ‘భలేతమ్ముడు’లో పాటలు పాడారు. ఆ పాటలు రాసింది సినారెనే. సినారెకి ఉర్దూ బాగా వచ్చు కాబట్టి రఫీ తనకొచ్చే సందేహాలను ఆయన్నే అడిగి తీర్చుకునేవాడు. పాటలో పదాల ఉచ్చారణను సినారెకు వినిపించి సరిచేసుకునేవారు. ‘ఎంతవారు గానీ, వేదాంతులైన గానీ’ ‘నేడే ఈ నాడే’ వంటి పాటలు అందులోనివే. ఆ తర్వాత ‘ఆరాధన’ సినిమాలో కూడా వీరిద్దరి కలయికలో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’ వంటి పాటలు వచ్చాయి.
ఆయనకు 80 ఏళ్లు… ఆయన పాటకు 60 ఏళ్ళు
కొంచెం అటూ ఇటూగా సినారెది, తెలుగు సినిమాది ఒకే వయసు. ఎనభై ఏళ్లు. అలాగే ఆయన సినిమా పాటల రచన మొదలుపెట్టింది 1961లో. ఆ లెక్కన సినారె సినిమా పాటకిది స్వర్ణోత్సవ సంవత్సరం. మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ ఇంట్లో కూర్చుని ‘గులేబకావళి కథ’ పాటలు రాశారు. సినిమా మాత్రం 1962 జనవరిలో విడుదలైంది. సినారెతో మాట్లాడుతుంటే ఏదో నవయవ్వనుడితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు పచ్చిగానే, పచ్చగానే ఉంటాయి. ఫిలిమ్ నగర్‌లోని ఆయన ఇంటినిండా పుస్తకాలే పుస్తకాలు. చదవకపోతే ఆయనకు ఊపిరాడదు. రోజూ ఒక కవిత రాయందే ఆయన విశ్రమించరు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు ఓ కవితా సంకలనాన్ని విడుదల చేయడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఏ సాహిత్య సమావేశం జరిగినా సినారె లేకపోతే అది వెలవెలపోయినట్టే. నాలుగు మంచి మాటలు మాట్లాడి కొత్త తరాన్ని ఉత్తేజపరుస్తుంటారు. కవిత్వంలాగానే ఆయన ప్రసంగించే తీరు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన సినిమా పాటల రచన చేస్తూనే ఉన్నారు. మొన్నామధ్య ‘అరుంధతి’లో ‘‘జేజమ్మా…’’ పాట రాసింది ఆయనే. త్వరలో విడుదల కానున్న ‘ఇంకెన్నాళ్లు’ చిత్రంలో ‘ఏమి వెలుతురో ఇది ఏమి వెలుతురో’ పాట రాశారు.
భళారే సినారె…
పూర్తి పేరు : సింగిరెడ్డి నారాయణరెడ్డి
పుట్టింది : 1931 జులై 29న హనుమాజీపేట (కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల తాలూకా)
తల్లితండ్రులు : బుచ్చమ్మ, మల్లారెడ్డి
భార్య : సుశీల
సంతానం : నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి
విద్యార్హతలు : ఎం.ఎ, పీహెచ్‌డి (ఉస్మానియా విశ్వవిద్యాలయం)
తొలి సినిమా పాట : నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ-1962)
ఇప్పటివరకూ రాసిన పాటలు : 3500కు పైగా
తెరపై కనిపించిన సినిమాలు : మొగుడా- పెళ్ళామా (1975), తూర్పు పడమర (1976)

మాటల రచయితగా : ఏకవీర, అక్బర్ సలీం అనార్కలి






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list