MohanPublications Print Books Online store clik Here Devullu.com

హిందూ ధర్మం_HindhuDarmam

ధర్మం’ అంటే ఏమిటి? 
ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న! ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాల లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’
ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.
ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.
ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు
శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||
“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;
1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.
2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.
4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.
5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.
7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.
8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.
9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.
అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.
కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.
వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.
విశేష ధర్మాలు –
సామాన్య ధర్మాల వస్తే చెప్పవలసిన ధర్మాలు ఎన్నో వున్నాయి. సామాన్య ధర్మాలు అంటే శాస్త్రాలు చెప్పనివి చెప్పనక్కరలేని చెప్పినవి కూడా సామాన్య ధర్మాల క్రిందకే వస్తాయి.
విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!
భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!
న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!
భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ధర్మం!
సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!
వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం!
తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!
తన ఇంటికీ, తనను కున్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!
తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!
తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!
అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!
చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!
ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!
తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం!
నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!
సోమరితనం లేకుండటం పురుష ధర్మం!
– ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ధర్మాలుంటాయి.
‘అమ్మా! తల్లీ! ధర్మం చేయి తల్లీ’ అని మనం యింటిముందు నిలబడి భిక్షకోసం అరుస్తుండటం ప్రతిరోజూ చూస్తుంటాంగదా! ఇందేంటి ‘ధర్మాన్ని చేయటం’ ఏమిటి అని మీకేపుడూ అన్పించలేదా!
‘ధర్మం చేయండి’ అని యాచించటంలో ఒక ధార్మిక విషయం దాగి ఉంది. మనిషి సంఘజీవి. సంఘశ్రేయస్సే మనిషికి శ్రేయస్సు! సంఘ సుఖమే మనిషికి సుఖం! సంఘం ఆరోగ్యంగా వుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం!
ధర్మాన్ని చేయమని చెప్పి యాచించటం ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి మనకు ఉన్నదాన్ని ఎంతో కోంత లేనివారికి దానం చేయటం సామాజిక ధర్మంగా పూర్వ కాలం నునీ మన ఆచారంగా వస్తోంది. బహుజన సుఖం, బహుజనహితం భారతీయ ధర్మంగా అనాదికాలంనుండి ఋషులు మనకు బోధించారు. నీదగ్గర ఉన్నదాన్ని నీవోక్కడవే తినటం ధర్మంకాదు. నీవు నివసిస్తున్న సమాజంతో సమానంగా పంచుకోవాలి. ఆహారం అందరికీ అందాలి. ఎవరు పస్తులతో ఉండకూడదు. సమాజంలో ఆకలి బాధలు ఆకలిచావులు ఉంటే అరాచకత పుడుతుంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు తయారై మానవకులాన్ని కలుషితం చేస్తాయి. అందుకే ఆర్యులు ‘అతిథి దేవోభవ’ అని చెప్పారు.
అందువల్ల ‘దానం చేయటం కూడా ఒక ధర్మం’ అని గుర్తించాలి. ఆకలిబాధ ఎంతటి దుర్మార్గాన్ని అయినా చేయిస్తుంది కదా! నీకు శక్తివుంటే, ఎంతోకొంత సాయం చేయటం మానవధర్మం. మనిషికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఆకలిబాధ ఉండకూడదు కదా! ఆహారం నిద్ర అందరికీ అవష్యకమే. వేదం కూడా ఇదే చెబుతోంది.
“స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేవ మార్గేణ
మహిం మహీశాః | గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినోభవంతు | అపుత్రాః పుత్రిణః పంతు |
పుత్రిణ స్సంతుపౌత్రిణః | లోకావుయం క్షోభారహితః |
అధనాః సాధనాః సంతు | జీవస్తు శరీదశ్శతమ్||”
“పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!” అని చెబుతుంది వేదం.
పూర్వకాలం ‘దానధర్మం’ ఒక కర్తవ్యంగా ఉండేది. బ్రాహ్మణ వర్ణం వారికి ఇల్లు తప్ప, స్థిరాస్థులు ఉండేవికాదు. విద్యార్జన చేయటం సమాజానికి హితాన్ని బోధించటం, ప్రజలకు విద్య బోధించటం వారి పని. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇంటింటికీ భిక్షమెత్తుకొని వచ్చి గురువుకి సమర్పించేవారు. ఆ విధంగా యాచకం చేస్తూ చదువుకోవాలి. విద్య నేర్పుతున్నందుకు గురువు ఏ విధమైన ప్రతిఫలం ఆశించటం తప్పుగా ఉండేది. అప్పటి ఆ కాలంలో మనకు అల్లోపతి వైద్యంలేదు. ఆయుర్వేద వైద్యం అందరికీ ఉచితంగా అందుతుండేది. బ్రాహ్మణులే ఈ పనిని చేస్తూ ఉండాలి. విద్య, వైద్యం, జ్ఞానం ఎవరూ అమ్మకూడదు. ఎవరూ కొనకూడదు. పొరపాటు జరిగితే శిక్షకు గురికావలసిందే!
ఈనాటికీ బౌద్ధమత ప్రచారకులు “దానధర్మం”తో జీవిస్తూ ధర్మప్రచారం చేస్తున్నారు. బౌద్ధసూక్తి మీకు తెల్సుగదా!
“ధర్మం శరణం గచ్ఛామి !
సంఘం శరణం గచ్ఛామి!
బుద్ధం శరణం గచ్ఛామి!”
ధర్మాన్ని శరణు పొందుతున్నాను! సంఘాన్ని శరణు పొందుతున్నాను.బుద్ధుని (జ్ఞానాన్ని) శరణు పొందుతున్నాను. అంటూ ‘ధర్మయానం’ చేస్తుంటారు.
‘ధర్మోరక్షతి రక్షితః’
“ధర్మాన్ని నీవు రక్షించితే ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది.” నీవు ఎపుడు ధర్మాన్ని నిర్లక్షం చేస్తావో ధర్మం నిన్నేపుడూ రక్షించదు.”
ధర్మాన్ని నమ్మాలి – ధర్మాన్ని ఆచరించాలి.
ధర్మాన్ని ఆశ్రయించాలి – ధర్మమార్గాననే నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి. శ్రీరాముడు ప్రభుధర్మం కోసమే సీతా పరిత్యాగం చేయవలసి వచ్చింది. ధర్మ మార్గాన నడవటం వల్లనే యుధిష్ఠిరుని ధర్మరాజు అని పిలుస్తున్నాం.
“యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా!
అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్||”
– అని చెప్పాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్ముడు. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే కృష్ణుడు పాండవపక్షాన నిలిచి వారికి సహకరించాడు. అధర్మంతోనే త్రొక్కివేశాడు.
అధర్మపరులను అధర్మంతో ఎదుర్కొనవచ్చు. తప్పుగాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. ఋతుధర్మంవల్లనే వర్షాలు వస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగ ధర్మంవల్లనే మళ్ళీ జన్మిస్తున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’
_నాగవరపు రవీంద్ర


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list