MohanPublications Print Books Online store clik Here Devullu.com

జొన్నవిత్తుల_Jonnavithula ramalingeswara rao

పేరడీ పాటల పెద్దన్న

జొన్నవిత్తుల


           చినుకుచినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో అంటూ వానపాటలు రాసిన అదే కలంతో అందరి బంధువయా భద్రాచల రామయ్యా అంటూ భక్తిరసాన్నీ కురిపిస్తాడు. మరోవైపు నేనుసైతం నల్లరంగును తెల్లజుట్టుకు రాసి దువ్వాను అంటూ శ్రీశ్రీ గీతానికి పేరడీలు కడతాడు. అంతేకాదు తెలంగాణకే సొంతమైన బతుకమ్మ, సింగరేణిలపై శతకాలనూ రాయగలడు. సరిగమపదని అనే సప్తస్వరాలను తీసుకొని దానితో పాట రాసిన తొలి తెలుగుకవి ఆయన. సినిమా పాటలు, కవితలు, శతకాలు, పద్యాలు, అవధానం, పేరడీ గీతాలతో పాటల పూదోటలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు జొన్నవిత్తుల.

సినిమా పాటలకంటే పేరడీగీతాల రచయితగా జొన్నవిత్తుల అందరికీ చిరపరిచితుడు. అచ్చతెలుగు పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో పాటలు రాయడంలో జొన్నవిత్తులది అందె వేసిన చేయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం సభ్యుడిగా తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవ చేశారాయన. మధ్యలో ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆయన విజయవాడ దగ్గరి కృష్ణలంకలో జూలై 7, 1959న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, సుబ్బారావు. చిన్నతనం నుంచే సంస్కృత భాషపై ఉన్న మమకారంతో భాషా ప్రవీణ, ఏం.ఏ తెలుగు చదివారు. భాషపై పట్టుండడంతో పద్యాలు, పాటలు, కవితలు రాసేవాడు. స్నేహితుడు ఇచ్చిన సలహాతో సినిమా రంగంలో కాలుమోపానంటాడాయన.
తెలుగు సినిమా పరిశ్రమ జొన్నవిత్తులగా పిలుచుకునే ఆయన పూర్తిపేరు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. 1987లో వచ్చిన రౌడీపోలీస్ చిత్రం కోసం ఆయన తొలిపాట రాశారు. ఇది వరమా? శాపమా? ఇది నీకు న్యాయమా? అని సాగే ఆ పాట ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత భారతంలో అర్జునుడు చిత్రం కోసం అన్ని పాటలూ రాసే అవకాశం రావడంతో ఆయన దశ తిరిగింది.

అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం
ఆవేశం కోల్పోయిన మీకోసం

గర్జించే అర్జున శంఖారావం అంటూ సాగే పాట ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆవేదన, ఆవేశం నిండిన పదాలతో ప్రాసలో రాసిన పాట ఆ చిత్ర విజయంలో కీలకంగా మారింది.
సప్తస్వరాలను పాటగా మలిచిన తొలి కవిగా జొన్నవిత్తులకు పేరుంది. సప్తస్వరాలు కేవలం అక్షరాలు మాత్రమే కావని స్వరాలకు అర్థాలు కూడా ఉంటాయని నిరూపించారాయన. స్వరాలను అర్థవంతంగా కూర్చి ఆయన రాసిన పాట స్వరకల్పన(1989) చిత్రం కోసం రాశారు.

సరిగమపదనిని నీ దానినీ
సరిగా సాగనీ నీ దారినీ
సరిగమపదనిని నీ దానినీ
దాగని నిగనిగ ధగధగమని
దా మరి మానిని సరిదారిని

సరిగమపదని.. అనే సప్తస్వరాలైన ఈ ఏడు అక్షరాలను రాగం తప్పకుండా పదాలు తయారుచేయడం అంత సులువైన విషయం కాదు. కానీ జొన్నవిత్తుల ఆ స్వరాలనే పదాలుగా మార్చి ఎంతో అద్భుతంగా రాసిన ఈ పాట సినీ సంగీత సాహిత్యంలో సరికొత్త ప్రయోగం.
మాయలోడు చిత్రం కోసం జొన్నవిత్తుల రాసిన వానపాట నాటికీ నేటికి ఎవర్‌గ్రీన్ గీతమే.

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్లు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

దీన్ని మొదట మాయలోడు సినిమా కోసం బాబుమోహన్ సౌందర్యలపై చిత్రీకరించగా ఆ తరువాత వచ్చిన శుభలగ్నం సినిమాలోనూ ఇదే పాటను ఆలీ సౌందర్యలపై చిత్రీకరించడం విశేషం.
ష్ గప్ చుప్ చిత్రం కోసం జొన్నవిత్తుల రాసిన తిట్లదండకం కూడా సినిమాల్లో కొత్త ప్రయోగమే.

ఓరేయ్ త్రాపి, మహాపాపి, కురూపి, నిన్ను చూడంగనే వచ్చు హై లెవెల్ బీపీ
ముండమోపి, జిరాఫీ, నిన్ను తెగ్గోస్తె లోకానికే పిచ్చ హ్యాపి
అంకఛండాలుడా, బంకబధిరాంధుడా, పరమపాపిష్ట, నికృష్ట దుష్టాత్ముడా

నీ నీచ రూపంబు చూడంగ పాపంబు, నీకంఠనాళంబు కక్కోసు గొట్టంబు ఇలా సాగే ఈ పాటలో తెలుగు, సంస్కృత, ఇంగ్లీష్ పదాలు కనిపిస్తాయి.
జొన్నవిత్తులది చాలా నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి సుబ్బారావు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయనకు పౌరాణిక నాటకాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఆయన తాతకి ఆంధ్రగంధర్వ అనే బిరుదుండేది. జొన్నవిత్తులకు ముందు ఆయన తల్లికి ముగ్గురు పిల్లలు పురిట్లోనే చనిపోయారట. అప్పుడు ఆమె రామేశ్వరం వెళ్లి సంతానం కోసం రామలింగేశ్వర స్వామిని ప్రార్థించింది. జొన్నవిత్తుల గర్భంలో ఉండగా తెనాలికి సమీపంలో ఉన్న చిలుమూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో నలభై రోజులపాటు 108 ప్రదక్షిణలు చేసింది. ఆ దేవుడి పేరుమీదుగా కలిగిన సంతానం కాబట్టి ఆయనకు రామలింగేశ్వరావు అని పేరుపెట్టారని జొన్నవిత్తుల ఒక సందర్భంలో చెప్పారు. ఆయన తరువాత మరో నలుగురు సంతానం కలిగారు.
భాషా ప్రవీణ తర్వాత జొన్నవిత్తుల స్వాతి పత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరాడు. పదకొండు నెలలపాటు పనిచేసిన తర్వాత మద్రాస్‌లోని ఏషియన్ లాంగ్వేజీ బుక్ సొసైటీ అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ చేరిన పది నెలలకే ఆ సంస్థ మూతపడింది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో స్నేహితుడి సలహాతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు.

పాటల్లో పలు ప్రయోగాలు చేసిన జొన్నవిత్తుల అదే కలంతో భక్తి పాటలు కూడా రాయడం విశేషం.
2005లో రాజేంద్రప్రసాద్ హీరోగా పెళ్లాం పిచ్చోడు సినిమాకు జొన్నవిత్తుల దర్శకత్వం కూడా వహించాడు. కానీ ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ నంది పురస్కారం మాత్రం వచ్చింది. ఈ చిత్రంలో..

రూపాయివే! విశ్వరూపమ్ము దాల్చినావే!
దాసోహమే, నీకు దేశదేశాలవారే!
లోకాన జీవనాధారమ్ము నీవే!

నమస్తే నమస్తే రూపాయి నోటూ! అంటూ రూపాయి దండకం రాసి తన పేరడీని పండించారు.
2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రంలో అన్ని పాటలూ అయనే రాశారు. ఇప్పటికీ ఆయన అనేక కొత్త చిత్రాలకు పాటలు రాస్తూ తన సత్తా చాటుతున్నారు. పద్యపఠనం, సామాజిక చర్చలు, పాడతా తీయగా వంటి కార్యక్రమాలతో పాటు పండుగల రోజున జరిగే భక్తి కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తరుచుగా టీవీలలో కనపడుతుంటారు. ఇప్పటివరకు 600లకు పైగా పాటలు రాసిన వేద కవిగా గుర్తింపు పొందిన జొన్నవిత్తులకు భార్య శేషుకుమారి, పిల్లలు లక్ష్మీ సువర్ణ, లక్ష్మీ అన్నపూర్ణ, అబ్బాయి మాణిక్యతేజ ఉన్నారు. అమ్మాయిలిద్దరూ ఇంజినీరింగ్ చదవడంతో పాటు వారికి పాటలు పాడడం, నాట్యం చేయడంలోనూ ప్రవేశం ఉంది.


జొన్నవిత్తుల ఇరవై సంవత్సరాల వయసు నుంచే పేరడీలు రాసేవాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం, జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్పవిలాపం లాంటి వాటికి పేరడీలు రాశాడు. మిథునం సినిమాకు ఆయన కాఫీ దండకం కూడా రాశారు. అవినీతి, పార్టీ ఫిరాయింపులు, వాతావరణ కాలుష్యం, ఎన్నికలు, దొంగస్వాములు, మూఢనమ్మకాలు, నదుల కాలుష్యం తదితర అంశాలపై ఆయన పేరడీగీతాలు రాశారు.

మహాప్రస్థానం పేరడీ
నేను సైతం
నల్లరంగును
తెల్ల జుట్టుకు రాసి దువ్వాను
ఇంతచేసీ
ఇంత క్రితమే
తిరుపతయ్యకు
జుట్టు నిచ్చాను.

దేవుళ్లు చిత్రంలో


మహా కనకదుర్గా విజయ కనకదుర్గ పరాశక్తి లలితా శివానంద చరిత
శంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరిబ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తిఅష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి తో పాటు
అందరి బంధువయా భద్రాచల రామయ్య.. ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా పాటలు ఆయన రాసినవే. పేరడీ పాటలు, భక్తి పాటలు ఎంత మధురంగా రాయగలరో జింతాక చితా చితా అంటూ చిలిపిపాటలు కూడా అంతే బాగా రాయగలగడం జొన్నవిత్తుల ప్రత్యేకత.

జొన్నవిత్తుల పది శతకాలు రచించారు. అందులో శ్రీరామలింగేశ్వర శతకం, బతుకమ్మ, తెలుగమ్మ, సింగరేణి, తెలుగు భాష, నైమిష వెంకటేశ, రామబాణం, కూచిపూడి, రామప్ప, ఆంగ్లంలో శ్రీరామలింగేశ్వర శతకం ముఖ్యమైనవి. 20 సంవత్సరాల వయసు తన తల్లి సలహాతో తన పుట్టుకకు కారణమైన శ్రీరామలింగేశ్వరుని మీద పద్యాలు రాయడం ప్రారంభించారు. వీటిలో మంచి పద్యాలను ఏరి శ్రీరామలింగేశ్వర శతకంగా ప్రచురించారు. మృత్యుంజయమంత్రార్థము ప్రత్యక్షము జేయు దోసపాదున పువ్వై సత్యస్వరూపిణివనుచు నిత్యము సేవింతునమ్మ నిను బతుకమ్మా అంటూ తెలంగాణలో ప్రధాన పండుగ అయిన బతుకమ్మ మీదా జొన్నవిత్తుల శతకం రాయడం విశేషం.-మధుకర్ వైద్యుల, 

1 comment:

  1. జొన్నవిత్తుల గారి తెలుగు భాషా శతకం మీ దగ్గర దొరుకుతుందా ? తెలియచెయ్యండి. సత్యనారాయణ, 9246467446

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list