మానవ ఔన్నత్యం
సర్వమానవ సౌభ్రాత్రం, సుహృద్భావనల్ని పెంపొందించడమే పండుగల అంతరార్థం. అందరిలోనూ సోదరభావం కలిగించడంతో పాటు పరస్పర అవగాహన, త్యాగనిరతిని వికసింపజేయడమే పర్వదినాల అసలు ఉద్దేశాలు. ఆ మహోన్నత లక్ష్యాలకు అనుగుణంగా మానవాళి వ్యవహరిస్తే- శాంతి కృశించదు. ధర్మం దిగులు చెందదు.
లోకహితం కోరి, దైవానుగ్రహం ఆశించి, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షతో పాటు దాతృత్వ గుణం కనబరచాలని ఇస్లామ్ స్పష్టం చేస్తోంది. ఆత్మనిగ్రహం, ఆత్మశుద్ధి, త్యాగం వంటి మానవీయ విలువలు అలవరచుకోవడానికి దోహదపడే పద్ధతుల్లో మొదటిది ఉపవాసం. దీనివల్ల మానవ శరీరం విషతుల్యాల నుంచి విముక్తమవుతుంది. మనసులో నీచ ప్రవృత్తి ఉంటే తొలగిపోతుంది. కామ క్రోధాదులు దరిచేరవు. సమాజం శుభప్రదంగా విలసిల్లుతుంది. వీటన్నింటినీ సాధించేందుకు అనువుగా రంజాన్ మాసం అత్యుత్తమ శిక్షణ అందజేస్తుంది. అందులో ప్రధాన భాగమే- ఉపవాసం.
సంయమనం కలిగించే ఉపవాసం పంచేంద్రియాలకూ వర్తిస్తుంది. దీంతో ఆధ్యాత్మిక శక్తి వృద్ధి చెందుతుంది. ఉపవాసం పాటిస్తున్నామంటూనే ఆ నియమాల్ని ఉల్లంఘించడం- అల్లాహ్ దృష్టిలో క్షమించరాని నేరం. రంజాన్ మాసంలోని ఉపవాస వ్రతదీక్షలో ఒకరికొకరు సహాయకులవుతారు. ముస్లిమ్ సమాజం సమస్తం ఈ మాసంలో ఒకే విధంగా ఒకే ఆరాధనలో ఉంటుంది. స్థిర సంకల్పంతో ప్రార్థనల్లో లీనమవుతుంది. ఈ ఉపవాసాన్ని అరబ్బీ భాషలో ‘సౌమ్’ అంటారు. అంటే, కొన్నింటికి దూరంగా ఉండటం. ముస్లిములు ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహార పానీయాలకు, మనోవాంఛలకు, దురూహలకు దూరంగా ఉంటారు కాబట్టి, ‘సౌమ్’ అనేది సార్థకమైంది.
‘ఫిత్రా’ పేరిట నిర్ణీత దాన కార్యక్రమాల్ని ఆచరిస్తారు. రంజాన్ మాసంలో ముస్లిములు అందరూ ఉదారంగా దానాలు అందజేస్తారు. ఉపవాసం పాటించే సమయంలో ఏదైనా దోషం సంభవించి ఉంటే, ఆ లోపాన్ని ఈ దానం పూరిస్తుంది. ‘ఫిత్రా’ను పండుగకు వారం రోజుల ముందే ఆచరిస్తారు. ఆ పైకంతోనే పేదలు నూతన వస్త్రాలు, పండుగ సామగ్రి ఇళ్లకు తెచ్చుకుంటారు. ఫిత్రా దానం నిర్వర్తించనంతవరకు, రంజాన్ ఉపవాసాలు ఫలప్రదం కావు. ఆర్తులకు దానం చేయడం ద్వారా వారి ఆశలకు ప్రాణం పోయడమన్నది దాతల మదిలో సుప్రభాతం వంటిది. ఆత్మీయులతో పాటు అనాథలనూ ఆదరించగల శక్తి ఒక రూపు ధరించాలన్నదే‘ఫిత్రా’ ఆంతర్యం.
‘ఫిత్ర్’ అంటే ఉపవాసాలు విరమించడం లేదా పరిసమాప్తి చేయడం. ఈద్-ఉల్-ఫితర్ అంటే, రంజాన్ ఉపవాసాలు ముగించి ఆనందించే రోజు. ఇదే ఇస్లామ్ ధర్మానికి ప్రాణప్రదమైన రంజాన్ పర్వదినం! మరో దానం ‘జకాత్’. అంటే, పరిశుద్ధపరచడం లేదా అభివృద్ధి చేయడం. ఒక వ్యక్తి సంవత్సర కాలంలో తన అవసరానికి మించి ఉన్న ధనంలో రెండున్నర శాతం మొత్తాన్ని విశ్వవిభుడి పేరిట పేదలకు అందజేయాలి. అలా ఆ సొమ్మును సత్కార్యాలకు వినియోగించాలి. అప్పుడు ఆ వ్యక్తి ధనం దోషపూరితం కాదు. విషతుల్యమూ కాదు. జకాత్ చెల్లింపులకు శుభప్రదమైన రంజాన్ మాసాన్నే అందరూ ఎంచుకొంటారు. ఈ జకాత్ సంపన్నులకే నిర్దేశితమైంది. ఉపవాసం శారీరకపరమైన ఆరాధన. జకాత్ ఆర్థిక సంబంధమైనది. హృదయంలోని కాఠిన్యాన్ని, లోభత్వాన్ని జకాత్ నివారిస్తుంది. సంకుచిత ధోరణిని తొలగిస్తుంది. శుభాల పంట పండిస్తుంది. సమసమాజం వైపు పయనింపజేస్తుంది.
ఫిత్రా, జకాత్ దానాలు పేదలకు ఉపయోగపడకుంటే- వాటిలోని ఔన్నత్య భావన వ్యర్థమైనట్లే! బాధాతప్తులైన ముస్లిములు, ఇతరులు అందరూ ఈ దానాలు పొందడానికి అర్హులు. రంజాన్ మాసంలో విశ్వరక్షకుడు తమ ప్రవర్తనల్ని నిత్యం గమనిస్తాడన్న విశ్వాసం- ప్రతి ఒక్కరినీ లోపరహితంగా మారుస్తుంది.
మానవులంతా సమానమన్న భావన అంతటా వెల్లివిరియాలి. ఎవరి లోపాల్ని వారు గ్రహించి, వాటి నుంచి బయటపడాలి. అప్పుడే విశ్వశాంతి ఔన్నత్యానికి స్వాగతం పలికినట్లవుతుంది!
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565