MohanPublications Print Books Online store clik Here Devullu.com

మంధరపుట్టింటి దాసీ ధర్మం_mandhara



మంధరపుట్టింటి
దాసీ ధర్మం

చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే, వారిపైకి కనిపించే స్వభావస్వరూపాల ఆంతరంగిక ఆలోచనలోనితత్తం విభిన్నమై అర్థంకాని వృత్యాసంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మంచీ చెడుల సందిగ్థావస్థను మనకొదిలేసి, తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి, లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది మంధర. 
మంధర ఎవరో, ఎక్కడ పుట్టిందో ఎవ్వరికీ తెలియదు. కైకేయి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న దాసి మంధర. కైకేయికి గూనిదైనా మంధరంటే మహా ఇష్టం. అయోధ్య రాజ్యంలో దాసీ అయినా కైకేయి వల్ల ఓ వెలుగు వెలుగుతూ ఉండేది మంధర. కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. కైకేయి కూడా సలహాలూ, సంప్రదింపులూ మంధరతోనే చేసేది. కైకేయి మీద ఈగ వాలినా సహించేది కాదు మంధర. పుట్టింటి నుంచి తనతో రావటం వల్ల కైకకూ మంధరంటే వల్లమాలిన అభిమానం. అందుకేనేమో రామకథలో ఓ ప్రధాన ఘట్టానికి నాంది పలికింది మంధర.రామాయణంలో కైకేయి జీవితాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేస్తున్నట్లు కనిపించే మంధర గర్వంతో విర్రవీగుతూ అతి సామాన్యమైన పాత్రలా మిగిలిపోయింది. కానీ అసలు రామకథను మలుపు తిప్పడంలో ప్రధానపాత్ర తనదే.
తెల్లవారితే రామాభిషేకం అనగా మంధర ఒక కిటికీలోంచి అయోధ్యపుర ప్రజల హడావుడి చూసింది. కౌసల్యాదేవి ఆనందంతో ప్రజలందరికీ దానధర్మాలు చేయడం చూసి జీర్ణించుకోలేకపోయింది. మరో దాసిని పిలిచి ఏమిటీ హడావుడని అడుగుతుంది మంధర. ఆమె పట్టలేని సంబరంతో శ్రీరామ పట్టాభిషేకమని చెబుతుంది. అంతే, మంధర మొహం వివర్ణమైంది. పళ్ళు పటపటా కొరుకుతూ కైకేయి మందిరం వైపు కదిలింది. నిద్రకు ఉపక్రమిస్తున్న కైకేయి ప్రశాంతతను భంగం చేస్తూ.. కైకాదేవీ! నీ వైభవాన్ని చూసి విర్రవీగేదాన్ని. నీ పుట్టింటి దాసిగా నీ భోగాన్ని తలుచుకుంటూ నీతో వచ్చినందుకు నా జీవితానికి లోటు లేదని భావించిన నాకు ఇది జరగాల్సిందే. ఎండాకాలంలో ఏరు ఎండిపోయినట్టు అడుగంటి పోతుంది నీ అదృష్టం అంటూ భోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ మొసలి కన్నీళ్ళ వెనుక అగాథమైన తుఫాను దాగుంది.
కైకేయి ఏమీ పాలుపోక మంధరా జరిగిందేమిటో చెప్పమని సూటిగా అడిగింది. దశరథుడు మంచివాడు కాదు. నీపై ప్రేమ నటిస్తూనే నిన్ను మోసం చేస్తున్నాడు. భరతున్ని కావాలనే మేనమామ ఇంటికి పంపి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవూ, నేనూ అందరూ రాజమాత కౌసల్యకు సేవకులమే అన్న మంధర మాటల్లో కైకేయికి రామపట్టాభిషేకం మాత్రమే వినపడింది. ఆనందంతో పొంగిపోయింది. శుభవార్త చెప్పావంటూ మంధరకు ముత్యాలహారం బహుకరించింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ ముత్యాలదండను విసిరిగొట్టి మహా సముద్రంలో నిన్ను నీవుగా ముంచేసుకుంటావనీ, నేను చెప్పేవరకూ రామపట్టాభిషేకం విషయం తెలియదంటే నీ విలువేంటో తెలుసుకోమనీ రెచ్చగొడుతుంది.
మంధర మాటల ప్రభావం కైకేయిని ఆలోచనల్లో పడేసింది. కైకేయిలో కోపం కట్టలు తెంచుకుంది. మంధర మాత్రం మనసులో నిప్పురాజేశాను. మహా అగ్ని ఆవరించడమే ఆలస్యమని సంతోషించింది. చివరికి కైకేయి ఈ విషయ పరిస్థితిని దాటే ఉపాయం చెప్పమని మంధరను ప్రాధేయపడే స్థాయికి కైకేయిని తీసుకొచ్చింది మంధర. దేవాసుర యుద్ధాన్ని గుర్తుచేసి, దశరథుడు కైకేయికిచ్చిన రెండు వరాలు ఇంకా తీరనే లేదనీ, వాటిని తీర్చుకునే సమయం వచ్చిందనీ ఆ రెండు వరాల్లో ఒకటి భరతునికి పట్టాభిషేకం, రెండవది రాముడి వనవాసంగా కోరుకొమ్మంటుంది. రాముని వనవాసం అతి ముఖ్యమని పదేపదే చెప్పి కైకేయితో అనుకున్నదంతా చేయించిన ఘటకురాలు మంధర.
పుట్టింటి దాసీ ధర్మాన్ని పాటించిందని కైకేయి మంధరను మెచ్చుకుంటుంది. గూనివారికి తెలివితేటలు ఎక్కువని పొగుడుతుంది. కానీ మంధర చేసిన రాద్ధాంతం కుటుంబాన్ని విడగొట్టి, అయోధ్యను కకలావికలం చేయడం కోసం కాదు. రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరగాలనే. శబరయోగిని మంధర శరీరంలో ప్రవేశించి కైక చేత వరాలు అడిగేలా ప్రణాళిక ఏర్పడిందనీ మరొక కథనం. మంధర ఆలోచనా దృక్పథాన్ని ఆవిష్కరించినప్పటికీ, మంధర జీవితం పాపాల పుట్టగా, వర్ణించినప్పటికీ ఆమె జన్మ లోకరక్షణే ధ్యేయంగా చెప్పాలి.
సంకుచితమైన చిన్న వలయమే ఈ ప్రపంచం. మనలో చాలామంది కొన్ని అడుగుల ఆవల చూడలేకపోవడం వల్ల, మనం దుష్టులం, అవినీతి పరులం అవుతున్నాం. ఇదే మన అశక్తత. ప్రతి దుర్భావం ద్వేషపూరిత ఆలోచన అతి రహస్యంగా ఏ గుహలోనో దాగి తలంచినా ఎప్పుడో ఒకప్పుడు అప్రతిహత శక్తితో బయటపడక తప్పదు. మంధర విషయంలో జరిగిందదే. కాని మంధర దుర్భావం వెనుక అసామాన్యమైన లోక సుభిక్షాకార్యం దాగుంది. దానిని జరిగేలా చూసేందుకు చరిత్ర పుటల్లో చీకటి కోణాన్ని పులుముకొని తన గాథకు నల్లరంగును పూసుకొని మంధర మానవత్వాన్ని పరిమళింపజేసేందుకు తానూ ఓ పుప్పొడి రేణువయ్యింది


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list