MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాలేయానికి బిఘాతం!-Symptoms of Liver


కాలేయానికి బిఘాతం!
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయాల్లో కాలేయం ప్రధానమైంది. ఇది అలుపెరగకుండా ఒక కర్మాగారం మాదిరిగా పనిచేస్తూ.. శరీర వ్యవస్థలన్నీ సజావుగా సాగేలా చేస్తుంది. ఒకింత మొండిదైనా కాలేయానికి వైరస్‌లు, జబ్బుల ముప్పూ ఎక్కువే. ముఖ్యంగా హెపటైటిస్‌ వైరస్‌లు ఏమాత్రం అవకాశం దొరికినా దాడి చేసేస్తుంటాయి. రకరకాల ఇన్‌ఫెక్షన్లను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ చాపకింద నీరులా పాకుతూ.. దీర్ఘకాలం పట్టి పీడిస్తుంది. కాలేయం గట్టిపడటం, కాలేయ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. కాబట్టి హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు దీని తీరుతెన్నులను గమనిస్తూ.. జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో చిక్కేంటంటే.. హెపటైటిస్‌ బి అందరిలోనూ దీర్ఘకాలిక సమస్యగా పరిణమించకపోవచ్చు. దీర్ఘకాలికంగా మారినా అందరికీ చికిత్స అవసరం ఉండకపోవచ్చు. చికిత్స అవసరమైనా ఒకొకరికి ఒకోరకం మందులు ఇవ్వాల్సి రావొచ్చు. పైగా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి కూడా. ఇవన్నీ హెపటైటిస్‌ బాధితులకు ఒకపట్టాన అర్థం కావు. ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలి? ఏయే మందులు వేసుకోవాలి? అనే వాటిపై బోలెడు సందేహాలు తలెత్తుతుంటాయి. అందుకే వీటన్నింటిపై సమగ్ర వివరాలను అందిస్తోంది ఈవారం సుఖీభవ.కాలేయం మహా కష్టజీవి! మన శరీర వాహనానికి కాలేయమే ఇంజిన్‌!! ఇది విటమిన్లు, గ్లూకోజు, ఐరన్‌ వంటి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు శక్తిని అందజేస్తూ.. శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా, సాఫీగా సాగిపోయేలా చూస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి, పోషకాలు ఒంటపట్టటానికి తోడ్పడే పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తుంటుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే పదార్థాలనూ ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే కాలేయం దెబ్బతింటే వ్యవస్థలన్నీ కుప్పకూలతాయి. మొరాయించిన వాహనంలా శరీరం కుదేలవుతుంది. అందుకే కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ను ఆదిలోనే.. అక్యూట్‌ దశలోనే నిలువరించటం అత్యంతావశ్యకం. లేకపోతే ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి.. కాలేయం గట్టిపడటం (సిరోసిస్‌), కాలేయ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తోంది. ఇందుకు కొందరిలో చాలా ఏళ్లు పడితే.. ఇంకొందరిలో ఐదేళ్ల లోపే ఇలాంటి సమస్యలు ఆరంభం కావొచ్చు. మనదేశంలో సుమారు 3% మంది హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది తెచ్చిపెట్టే కాలేయం గట్టిపడటం (సిరోసిస్‌), కాలేయ క్యాన్సర్ల మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు కూడా. మనదేశంలో కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తున్న కారణాల్లో అతి ముఖ్యమైంది హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షనే కావటం గమనార్హం. అందువల్ల దీన్ని సకాలంలో సరైన చికిత్స తీసుకోవటం మంచిది. ఇప్పుడు దీనికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటితో హెపటైటిస్‌ బి దీర్ఘకాలిక సమస్యగా మారకుండా, తీవ్ర సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు. అయితే ఈ వైరస్‌ అందరిలో ఒకేలా ఉండదు. అందువల్ల హెపటైటిస్‌ బి విషయంలో ఎవరికి, ఎప్పుడు చికిత్స అవసరం? ఎలాంటి మందులు ఇవ్వాలి? అనేవి చాలా కీలకం. హెపటైటిస్‌ బాధితులకు ఇలాంటి వాటి విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి కూడా. ఇన్‌ఫెక్షన్‌ ఎంత కాలం నుంచి ఉంది? వైరస్‌ నిద్రాణంగా ఉందా? చురుకుగా ఉందా? వైరస్‌ సంఖ్య ఎంత ఉంది? కాలేయం ఏమైనా దెబ్బతిందా? అనేవన్నీ చికిత్సలో ప్రధాన భూమిక పోషిస్తాయి. 
అవసరమయ్యే పరీక్షలు 
హెపటైటిస్‌ బి పాజిటివ్‌గా గలవారు డాక్టర్‌ను సంప్రదించి క్రమం తప్పకుండా కనీసం ప్రతి ఏడాదికి ఒకసారి తగు పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం. అయితే అన్ని పరీక్షలూ అందరిలో అవసరం ఉండకపోవచ్చు. 
* కాలేయ సామర్థ్య పరీక్షలు: 
ఎస్‌జీపీటీ, బిలిరుబిన్‌: కాలేయం దెబ్బతింటే 
* అల్బుమిన్‌, ప్రోత్రాంబిన్‌ టైమ్‌: కాలేయం పని తీరు దెబ్బతింటే. 
Anti HBc Igm: ఇది పాజిటివ్‌గా ఉంటే వైరస్‌ ఆర్నెల్లలోపు నుంచే ఉందని అర్థం. 
* HBe Ag: వైరస్‌ చురుకుదనాన్ని, కాలేయాన్ని దెబ్బతీసే అవకాశాన్ని తెలుసుకోవటానికి. 
* HBV DNA (క్వాంటిటేటివ్‌): వైరస్‌ సంఖ్యను (లోడు) తెలుసుకోవటానికి. వైరస్‌ స్థాయిని బట్టి చికిత్సను నిర్ధరించటానికి. 
* ఆల్ఫా ఫీటో ప్రోటీన్‌ (AFP): కాలేయ క్యాన్సర్‌ను నిర్ధరించటానికి. 
* అల్ట్రాసౌండ్‌ స్కాన్‌: కాలేయం గట్టిపడటం, కాలేయ క్యాన్సర్‌ను నిర్ధరించటానికి. 
* ఫైబ్రో స్కాన్‌: కాలేయం గట్టిపడి తాళ్లుగా పేనుకుపోవటాన్ని (ఫ్రైబ్రోసిస్‌) నిర్ధరించటానికి. 
* సీటీ స్కాన్‌: క్యాన్సర్‌ నిర్ధరణకు, క్యాన్సర్‌ దశ నిర్ధరణకు. 
టీకా ఎవరికి? 
హెచ్‌బీఎస్‌ ఏజీ పాజిటివ్‌గా ఉన్నవారి కుటుంబ సభ్యులు, భాగస్వాములు, వైద్య సిబ్బంది, శిశువులు, విద్యార్థులు, ఇంజెక్షన్‌ ద్వారా మాదక ద్రవ్యాల తీసుకునేవారు, మాదక ద్రవ్యాల అలవాటు గలవారి భాగస్వాములు, కాలేయజబ్బు గలవారు, దీర్ఘకాల కిడ్నీ జబ్బు బాధితులు, తరచుగా రక్త మార్పిడి అవసరమైనవారు, ఎక్కువమందితో శృంగారంలో పాల్గొనేవారు, ఖైదీలు.. వీరందరూ హెపటైటిస్‌ బి టీకా తీసుకోవటం తప్పనిసరి 
తొలిదశలో ఏం చేయాలి? 
హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ చాలావేగంగా కాలేయానికి చిక్కులు తెచ్చిపెట్టే సమస్యే కావొచ్చు. కానీ అక్యూట్‌ దశలో.. అంటే కొత్తగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిలో చాలామందిలో పెద్దగా ఎలాంటి లక్షణాలూ కనబడవు. కొద్దిమందిలో కళ్లు-ఒళ్లు పచ్చపడటం వంటి కామెర్ల లక్షణాలు, ఫ్లూజ్వరం లాంటి లక్షణాలు, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్లనొప్పుల వంటివి ఉండొచ్చు. అక్యూట్‌ దశలో ఇన్‌ఫెక్షన్‌ నిర్ధరణ కోసం HBs Ag(హెపటైటిస్‌ బి సర్ఫేస్‌ యాంటిజెన్‌) పరీక్ష.. అలాగే కాలేయ ఇన్‌ఫెక్షన్‌ పరీక్షలు (బిలిరుబిన్‌, ఏఎల్‌టీ, ఆల్కలైన్‌ ఫాస్ఫేటేస్‌/ప్రోత్రాంబిన్‌టైమ్‌), అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. అవసరమైతే ఇన్‌ఫెక్షన్‌ ఏ దశలో ఉందో తెలుసుకోవటానికి Anti HBc Igm పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. అక్యూట్‌ దశలో చాలావరకూ మందుల అవసరమేమీ ఉండదు. ఇతరత్రా సమస్యేలేవీ లేకపోతే మంచి పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. పసరు మందులు తాగటం, ఒంటిపై వాతలు పెట్టించుకోవటం వంటివి చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు చిన్నగానే కనిపించొచ్చు.. కానీ పెద్ద ప్రభావమే చూపుతాయి. పసరు మందులు తీసుకున్నవారిలో కిడ్నీ వైఫల్యంతో ఆసుపత్రులకు వచ్చేవారూ కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. అక్యూట్‌ దశలో.. వాంతులు, తీవ్రమైన బలహీనత, ఆకలి లేకపోవటం వంటివి కనబడితే రక్తనాళం ద్వారా ద్రవాలు (ఐవీ ఫ్లూయిడ్స్‌) ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా లక్షణాలు తగ్గటానికీ కూడా చికిత్స చేయాలి. ఇలాంటి ఉపశమన చికిత్సతో 99.5 శాతం మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కామెర్లు తగ్గిపోతాయి. 90% మందిలో వైరస్‌ కూడా దానంతటదే తొలగిపోతుంది. అతి తక్కువ మందిలో మెదడు వాపు, కాలేయం వైఫల్యం వంటి సమస్యలు తలెత్తొచ్చు. వీరిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. అరుదుగా కొందరిలో కాలేయం విఫలమైతే మార్పిడి చేయాల్సిన అవసరం రావొచ్చు.
దీర్ఘకాలిక దశలో ఏం చేయాలి?
హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక దశగా (క్రానిక్‌ హెపటైటిస్‌ బి) పరిగణిస్తారు. నిజానికిది చాలామందిలో యాదృచ్ఛికంగానే బయటపడుతుంటుంది. ఇతరత్రా సమస్యల కోసం చేసే పరీక్షలు, హెల్త్‌ చెకప్‌, గర్భధారణ సమయంలో, రక్తదానం చేయటం వంటి సందర్భాల్లో అనుకోకుండా HBs Ag పాజిటివ్‌గా కనబడుతుంటుంది. సమస్య దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ.. వీరిలో అందరికీ చికిత్స అవసరం ఉండకపోవచ్చు. వైరస్‌ నిద్రాణంగా ఉందా? చురుకుగా ఉందా? ఇతరత్రా లక్షణాలను బట్టి చికిత్సను నిర్ణయిస్తారు.
వైరస్‌ నిద్రాణంగా ఉన్నప్పుడు (ఇన్‌యాక్టివ్‌ క్యారియర్‌ స్టేట్‌): హెపటైటిస్‌ బి వైరస్‌ ఒంట్లో చేరినా కూడా కొద్దిమందిలో ఇది నిద్రాణంగానే ఉండిపోవచ్చు. పైకి ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాలేయ పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ఫలితాలు అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. HBe Ag నెగెటివ్‌గా ఉంటుంది. HBV DNA సైతం నామమాత్రంగానే కనబడుతుంది. అయితే వీరిలో వైరస్‌ ఎప్పుడైనా తిరిగి ఉద్ధృతం కావొచ్చు. కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీళ్లు అందరిలా మామూలుగానే జీవితం గడపొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... వీరి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమించే అవకాశముండటం వల్ల భాగస్వాములు, కుటుంబ సభ్యులు హెపటైటిస్‌ బి టీకాలు పూర్తిగా తీసుకోవాలి. 
వైరస్‌ చురుకుగా ఉన్నప్పుడు (ఇమ్యూన్‌ యాక్టివ్‌ క్రానిక్‌ హెపటైటిస్‌): కాలేయం గట్టిపడే సూచనలేవీ లేకపోతే- వైరస్‌ నిద్రాణంగా ఉన్నవారిలో, చురుకుగా ఉన్నవారిలో పెద్ద తేడాలేవీ ఉండవు. కొందరిలో HBe Ag పాజిటివ్‌గా ఉంటుంది. ఎస్‌జీపీటీ పెరుగుతుంది. HBe Ag స్థితిని బట్టి.. HBV DNA పరీక్ష ద్వారా వైరస్‌ సంఖ్య (లోడ్‌) ఎలా ఉందో చూస్తారు. వీరిలో వైరల్‌ లోడ్‌ 20వేల ఐయూ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇలా వైరస్‌ చురుకుగా ఉన్నవాళ్లు యాంటీవైరల్‌ చికిత్స తీసుకోవాలి. దీంతో వైరస్‌ నియంత్రణలో ఉంటుంది. కాలేయం గట్టిపడటం, కాలేయ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు. 
కాలేయం దెబ్బతింటే (లివర్‌ సిరోసిస్‌): దీర్ఘకాలిక హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌లో పెద్ద సమస్య కాలేయం గట్టిపడటం (సిరోసిస్‌). ఇందులోనూ సమస్య తీవ్రతను బట్టి ‘చైల్డ్స్‌ ఎ, బి, సి’ అని మళ్లీ మూడు దశలున్నాయి. కాలేయ సామర్థ్య పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ (ప్లీహం పెద్దగా ఉండటం, పొట్టలో నీరుచేరటం తెలుస్తుంది), గ్యాస్ట్రోస్కోపీ (అన్నవాహిక గోడల్లో రక్తనాళాలు ఉబ్బటం తెలుస్తుంది), వంటి పరీక్షలతో కాలేయం గట్టిపడటాన్ని, తీవ్రతను నిర్ధరిస్తారు. వీరికి యాంటీవైరల్‌ మందులతో పాటు పొట్టలో నీరు చేరటం, రక్తపు వాంతులు, మెదడు వాపు వంటి ఇతరత్రా సమస్యలను తగ్గించటానికీ తగు చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. వీరిని వీలైనంతవరకు హాయిగా జీవించేలా చూడటానికే ప్రాధాన్యం ఇస్తారు.
గర్భిణుల్లో మరింత జాగ్రత్తగా..
గర్భిణుల్లో హెపటైటిస్‌ బి వైరస్‌ పాజిటివ్‌గా కనబడితే వారి నుంచి పిల్లలకు వైరస్‌ సంక్రమించకుండా చూసుకోవటం చాలా అవసరం. అందువల్ల వీరిలో HBV DNA, HBe Ag పరీక్షలతో వైరస్‌ ఎంత తీవ్రంగా ఉందో గుర్తిస్తారు. మిగతావన్నీ ఎలా ఉన్నా.. వైరస్‌ సంఖ్య ఎక్కువగా ఉంటే యాంటీవైరల్‌ మందులైన టెనోఫోవిర్‌ లేదా ల్యామువుడిన్‌ ఇస్తారు. ముఖ్యంగా టెనోఫోవిర్‌ బాగా ఉపయోగపడుతుంది. దీంతో కాన్పు సమయానికి వైరస్‌ ఉద్ధృతి బాగా తగ్గుతుంది. ఇక కాన్పు తర్వాత వెంటనే శిశువుకు హెపటైటిస్‌ ఇమ్యునోగ్లోబులిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం హెపటైటిస్‌ బి టీకాలు పూర్తిగా ఇవ్వాలి. దీంతో 95% మంది పిల్లలను హెపటైటిస్‌ బి బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఈ పద్ధతిని సరిగా పాటిస్తే తల్లి నుంచి పిల్లలకు హెపటైటిస్‌ బిని సంక్రమించకుండా దాదాపు పూర్తిగా నివారించుకోవచ్చు. ఒకవేళ తల్లి నుంచి పిల్లలకు వైరస్‌ సంక్రమించి, దీర్ఘకాలిక సమస్యగా మారితే పెద్దల్లో మాదిరిగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని మందులను పిల్లలకు ఇవ్వకూడదు. మందుల మోతాదులూ మారతాయి.
మందులు.. ఆరు రకాలు 
దీర్ఘకాల హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌కు పెద్దవారికి ఆరు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. పెగ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఇంజెక్షన్లు మన వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవటానికి తోడ్పడతాయి. ఇక యాంటీవైరల్‌ మందులైన ఎంటెకావిర్‌, టెనోఫోవిర్‌, ల్యామువుడిన్‌, టెల్బువిడిన్‌, అడెఫోవిర్‌ మందులు వైరస్‌ సంఖ్య తగ్గటానికి దోహదం చేస్తాయి. ఇంటర్‌ఫెరాన్‌ ఇంజెక్షన్లతో పోలిస్తే యాంటీవైరల్‌ మందులతో దుష్ప్రభావాలు తక్కువ. ఇవి చాలావరకు సురక్షితం. వీటితో జబ్బుతో మంచాన పడటం, మరణం ముప్పు తగ్గుతుంది. ప్రస్తుతం పెగ్‌ ఇంటర్‌ఫెరాన్‌, ఎంటెకావిర్‌, టెనోఫోవిర్‌ మందులు ఎక్కువగా వాడుతున్నారు. అయితే దీర్ఘకాల హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయం కావటం అసాధ్యం. ఈ వైరస్‌ డీఎన్‌ఏ కాలేయ కణాల్లో నిద్రాణంగా ఉండిపోవచ్చు. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగైనా కూడా ఎప్పుడో అప్పుడు సమస్య తిరగబెట్టే అవకాశముందని గుర్తించటం అవసరం. 
వ్యక్తులను బట్టి చికిత్స 
యాంటీవైరల్‌ మందుల అవసరం ఒకరిలో ఒకోలా ఉంటుంది. దీన్ని వయసు, లింగ బేధం, ఏఎల్‌టీ స్థాయులు, హెచ్‌బీఇ ఏజీ స్థితి, హెచ్‌బీవీ డీఎన్‌ఏ స్థాయులు, వైరస్‌ రకం, కాలేయం వాపు తీరుతెన్నులు, కాలేయం గట్టిపడటం వంటి వాటిని బట్టి నిర్ధరిస్తారు. తీవ్రమైన గుండెజబ్బు, మధుమేహం, హెచ్‌ఐవీ వంటి ఇతరత్రా సమస్యలను.. ఆడవారిలోనైతే గర్భధారణనూ పరిగణనలోకి తీసుకుంటారు. యాంటీవైరల్‌ మందుల ఖరీదు ఎక్కువ కాబట్టి రోగి ఆర్థిక స్థితి కూడా కీలకమే. వీటన్నింటి ఆధారంగా చికిత్సను ఆరంభిస్తారు.
పెళ్లికి ఇబ్బందేమీ లేదు
హెచ్‌బీఎస్‌ ఏజీ పాజిటివ్‌గా ఉన్నా నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే భాగస్వామి హెపటైటిస్‌ బి టీకాలను పూర్తిగా తీసుకోవాలి. చివరి టీకా తీసుకున్న 2 నెలల తర్వాత శృంగారంలో పాల్గొనొచ్చు. దీంతో భాగస్వాములకు వైరస్‌ సంక్రమించకుండా చూసుకోవచ్చు. అందరిలా దాంపత్య జీవితాన్ని గడపొచ్చు.
నివారణే అత్యుత్తమం
హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ వచ్చాక బాధపడటం కన్నా అసలు దీని బారినపడకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇప్పటికే శరీరంలో హెపటైటిస్‌ బి వైరస్‌ ఉన్న వ్యక్తుల రక్తం, శారీరక స్రావాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. అసురక్షిత శృంగారం, ఇతరులు వాడిన ఇంజెక్షన్‌ సూదులను వాడటం ద్వారా.. ఇతరుల రేజర్లు, టూత్‌ బ్రష్షులు, నెయిల్‌ క్లిప్పర్ల వంటివి ఉపయోగించటం ద్వారా రావొచ్చు. అందువల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. డెంటిస్టుల వద్దకు, ఆక్యుపంక్చర్‌ చికిత్సకు వెళ్లినపుడు ఇతరులకు వాడిన పరికరాలు, సూదులు మళ్లీ వాడకుండా చూసుకోవాలి. చెవులు కుట్టేందుకు, బోడీ పియర్సింగ్‌కు, పచ్చబొట్టు వేయటానికి వాడే పరికరాలు, సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరికి వాడటం తగదు. రక్తం ఎక్కించే సమయంలోనూ సంపూర్ణ జాగ్రత్తలు తీసుకోవాలి. హెపటైటిస్‌ బి సంక్రమించకుండా టీకా కూడా అందుబాటులో ఉంది. అవసరమైనవారిలో హెపటైటిస్‌ బి నివారణకు ఇది అత్యుత్తమమైన పద్ధతి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list