MohanPublications Print Books Online store clik Here Devullu.com

వివాహ సంప్రదాయములు_VIVAHA SAMPRADAYALU




వివాహ సంప్రదాయములు......

సుముహూర్తం (జీలకర్ర, బెల్లం) : పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ క్రింది మంత్రము చదువుతారు.
“ “అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే!ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!! “ ”
కన్యాదానం : దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.
“ “కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!! “ ”
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా" భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది."వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.
దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుతుంది.
మంగళసూత్రధారణ : వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“ “మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!! “ ”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.
తలంబ్రాలు : మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.
“ ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!! ”

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list