MohanPublications Print Books Online store clik Here Devullu.com

అయినవిల్లి గణపయ్య_Ayenavilli Ganapayya

అయినవిల్లి గణపయ్య అండాదండా..!
తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్‌... అంటూ బొజ్జ గణపయ్యకు మొక్కుతాం. తలపెట్టిన కార్యాల్లో మనకు కొండంత అండగా ఉండమని ఆయన్ను కోరుకుంటాం. చాటంత చెవుల దేవుడు మన మాటల్ని పెడచెవినేం పెట్టడు. సిద్ధిబుద్ధులతోనూ కలిసి మన అభీష్టాలను సిద్ధింపజేస్తాడు. అలాంటి సర్వశుభప్రదుడైన వినాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి గ్రామంలో సిద్ధివినాయకుడిగా కొలువుదీరాడు. వృద్ధగోదావరీ తీరాన కొలువైన ఈయన గురించి చెప్పాలంటే అది కృతయుగం నాటి మాట అనాలి మరి!
యుగాలనాడు... 
కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడట. నిజానికి ఈయనను స్వయంభూగా చెబుతారు. 14వ శతాబ్దంలో శంకరభట్టు సంస్కృతంలో రాసిన ‘శ్రీపాద శ్రీవల్లభచరిత్ర’లోని అయిదో అధ్యాయంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ.1320లో జన్మించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులు మల్లాది బాపన్నావధానులు అయినవిల్లిలో స్వర్ణగణపతి మహాయజ్ఞం జరిపారు. శాస్త్ర ప్రకారం చివరి రోజు హోమంలో వేసే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని అక్కడి పండితులు చర్చించారట. వినాయకుడు వారి కోరికను మన్నిస్తూ యజ్ఞాంతంలో అదేవిధంగా దర్శనమిచ్చి, కొద్ది కాలంలోనే భాద్రపద శుద్ధ చవితి నాడు దత్తావతారుడైన శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరిస్తానని వరమిచ్చాడట. అదే అధ్యాయంలో ముగ్గురు నాస్తికులు గణపతిని అవహేళన చేసినట్లూ పర్యవసానంగా తర్వాతి జన్మలో వాళ్లు గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుట్టినట్లూ చెప్పారు. ఈ ముగ్గురూ కాణిస్థలాన్ని సేద్యం చేస్తున్నప్పుడు బావిలో గణపతి దొరికాడట. ఆయనే కాణిపాక వినాయకుడిగా ప్రసిద్ధిచెందినట్లు రాసిఉంది. దీన్నిబట్టి కాణిపాక వినాయకుడి కంటే అయినవిల్లి సిద్ధివినాయకుడు ప్రాచీనుడని తెలుస్తోంది.
కొబ్బరి కాయల దేవుడు... 
గణేశుడు గరిక ప్రియుడు గనుక ఇక్కడి స్వామినీ గరికతో విశేషంగా పూజిస్తారు. భక్తులు తమ సంకల్పాన్ని స్వామికి చెప్పుకుని వెళ్లి, అది తీరగానే మళ్లీ గణపతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అప్పుడే ఒక కొబ్బరికాయను గణపతికి సమర్పిస్తారు. ఏటా ఇలా మొక్కుల రూపంలో అందే కొబ్బరి కాయల సంఖ్యే 30 లక్షలు ఉంటుందంటే స్వామి మహత్యం అర్థం చేసుకోవచ్చు. ప్రాంగణంలో నిత్యం లక్ష్మీగణపతి హోమం నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా 300 రూపాయలు చెల్లించి ఈ హోమం చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ హోమానికి కొన్ని వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఆలయంలో నిత్యం ఏకాదశరుద్రాభిషేకం, మహన్యాసాభిషేకాలతో పాటు పుస్తకపూజ, అక్షరాభ్యాసన తదితరాలను నిర్వహిస్తుంటారు. ప్రతి నెలా ఉభయ చవితి తిథులూ దశమి, ఏకాదశుల్లో విశేషార్చనలు చేస్తారు. సంకటహర చతుర్థినాడు ప్రత్యేకంగా గరికపూజ నిర్వహిస్తారు. విద్యార్థుల కోసం ఏటా వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి మాసం 3,4 వారాల్లో లక్షపెన్నులతో స్వామివారికి అభిషేకం చేసి వాటిని విద్యార్థులకు అందిస్తారు.
కోనసీమ ముఖ్యకేంద్రమైన అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరాలంటే రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం-కొత్తపేట మీదుగా 54 కిలోమీటర్లు ప్రయాణించాలి.
- ఎం.సుబ్రమణ్యజగన్మోహన్‌రావు న్యూస్‌టుడే, అయినవిల్లి

+++++++++++++++++++++++++++++
అడిగిన వరాలనిచ్చే 
అయినవిల్లి విఘ్నేశ్వరుడు
ఎప్పటినుంచో తీరని కోరికలు ఉన్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరడం లేదా? ఏ పని తలపెట్టినా ముందుకు సాగడం లేదా? అయితే అయినవిల్లిలోని సిద్ధివినాయకుడి గుడికి వెళ్లి, ఒక టెంకాయను సమర్పించి అక్కడ కొలువుదీరిన వినాయకుడి ముందు కోరికను నివేదించుకుంటే సరి! చూడటానికి ఇదేదో వ్యాపార ప్రకటనలా ఉన్నా, తీరని కోరికలను అయినవిల్లి వినాయకుడికి విన్నవించుకుంటే ఆ కోరికను నెరవేర్చే పని భక్తవత్సలుడైన ఆ స్వామివారే స్వయంగా చూసుకుంటారని విశ్వాసం.
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలో కొలువైన విఘ్నేశ్వరుడు కోరిన వెంటనే వరాల నొసగే స్వామిగా ప్రసిద్ధి కెక్కాడు. స్వయంభువుగా వెలిసిన ఈ స్వామి నారికేళ ప్రియుడు. నిత్యం ప్రభాత వేళ మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉదయం ఐదుగంటలకు స్వామివారి మేల్కొలుపుతో ఆలయ పూజలు ఆరంభమవుతాయి. ఈ స్వామి దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమిస్తారు. ఈ స్వామిని కొలిచి దక్షయజ్ఞం విఘ్నాలు లేకుండా పూర్తి చేసినట్లు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి. నిత్యం వేలాదిగా భక్తులు స్వామిని సేవించుకుంటారు. ఆలయంలో వేకువజామున స్వామికి పంచామృత అభిషేకం, నిత్యగణపతిహోమం వంటి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామివారు; శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామివారు, క్షేత్రపాలకుని కాలభైరవస్వామివారు కొలువై ఉన్నారు. బదిలీపై జిల్లాకు వచ్చిన ఉన్నతోద్యోగులు స్వామిని దర్శిస్తే గానీ తమ పనులు ప్రారంభించరు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పరీక్షల సమయంలో విద్యార్థులు విజయాన్ని కోరుతూ స్వామికి మొక్కులు మొక్కుకోవడం పరిపాటి.
స్థలపురాణం: అయినవిల్లి వినాయకుడి ఆలయం కృతయుగం నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. కాణిపాకం వినాయకుని కన్నా అయినవిల్లి గణపతి ఆలయం ప్రాచీనమైనదిగా చెబుతారు. అంతేకాదు, అయినవిల్లి వినాయకుడిని స్వయంగా వేదవ్యాసుల వారు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్లు స్థలపురాణం చెబుతోంది.
ఇందుకు సంబంధించిన ఒక కథ ఇలా ఉంది... మహాభారత యుద్ధం ముగిసిన అనంతరం వేదవ్యాసమహర్షి తన శిష్యులను, మునులను వెంటబెట్టుకుని దక్షిణదేశ యాత్రకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపాడట. ఈ సందర్భంగా గతంలో అష్టాదశ పురాణాలు, మహాభారతం వంటివాటిని తాను చెబుతూ ఉండగా వినాయకుడు లేఖకుడిగా ఉండి వాటిని రాసిన విషయాలను నెమరువేసుకున్నాడట. ఆ సమయంలో వినాయకుడు పదే పదే తన మదిలోకి వస్తుండటంతో వేదవ్యాసుడు స్వయంగా వినాయకుడిని ప్రతిష్ఠించగా దేవతలు స్వయంగా ఆలయాన్ని నిర్మించి పూజలు చేసినట్లు పురాణ కథనం. తనను పూజించిన వారి అభీష్టాలను సిద్ధింపజేయడం వల్ల ఈ స్వామికి సిద్ధివినాయకుడు అనే పేరు వచ్చిందని ప్రతీతి.
రవ్వలడ్డు, పులిహోర ప్రసాదాలు ఇక్కడి ప్రత్యేకత. నిత్యం వేలాదిమందికి ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. పరీక్షల సమయంలో లక్షకలాలను స్వామివారి సన్నిధిలో ఉంచి వాటిని విద్యార్థులకు కానుకగా ఇచ్చి, వారిలో స్వామివారి అనుగ్రహమనే మనోబలాన్ని నింపడం మరో ప్రత్యేకత.
ఇతర ప్రదేశాలు: ఇక్కడికి సమీపంలో ముక్తేశ్వరంలో ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వరస్వామివారు కొలువై ఉన్నారు. బ్రహ్మహత్య పాప నివారణ కోసం ఈ స్వామిని శ్రీరాముడు పూజించినట్లు, శ్రమణి అనే రుషి భార్యకు శాపం విమోచనం కల్గించినట్లు చెబుతారు. ఈ ఆలయానికి ఆనుకుని ముక్తిగుండం అనే తీర్థం కనబడుతుంది. అంతేకాదు, అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయం, ఇంకా సమీపంలోని ఇతర ఆలయాలను సందర్శించవచ్చు.
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు
∙జిల్లా కేంద్రమైన కాకినాడ మీదుగా బస్సులో అమలాపురం చేరుకుని అక్కడి నుంచి అయినవిల్లి చేరుకోవచ్చు. రాజమండ్రిలో దిగి బస్సులో రావులపాలెం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు.
– రాము భావిశెట్టి సాక్షి, అయినవిల్లి




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list