MohanPublications Print Books Online store clik Here Devullu.com

కష్టసుఖాలు కుంతీదేవి _Kasta sukalu Kunti




కష్టసుఖాలు
జీవితంలో కష్టసుఖాలు కావడి కుండల వంటివి- అని కవి భావన. కష్టాలనైనా సుఖాలనైనా మనిషి సమానంగా అనుభవించక తప్పదన్నదే దీని అంతరార్థం. రెండు సుఖాల మధ్య విరామమే కష్టమని వేదాంతులు చెబుతారు. కష్టసుఖాల్ని కదిలే మేఘాలతో పోల్చడమూ పరిపాటి.
జీవితంలో ఏదీ శాశ్వతంగా ఉండదు. మార్పు అనేది జీవన స్రవంతి. కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి. ఒడుదొడుకులు, సంతోష విచారాలు వస్తూపోతూ ఉంటాయి. ప్రకృతి ఒక్కోసారి నల్లటి మేఘాలతో, భీకరమైన గర్జనలతో, కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుంభవృష్టి కురిపిస్తుంది. భయానక దృశ్యంగా అది మనిషికి కనిపిస్తుంది. ఒక్కోసారి అదే ప్రకృతి స్థిమితపడి సూర్యకిరణాల వెలుగుతో హృదయానందకరంగా మారుతుంది. ప్రవహించడం నీటికి సహజం. గడిచిపోవడం కాలానికి సహజం. జనన మరణాలు రెండూ ప్రాణికి అనివార్యాలే! ప్రకృతి తత్వాలు మార్పుల్ని సూచిస్తుంటాయి.
కష్టాలు చుట్టుముట్టాయని మనిషి ముడుచుకు కూర్చుంటే- నిస్సహాయుడిగా మారతాడు. చీకట్లో చిరుదివ్వెను వెలిగిస్తే, అది పరిసరాల్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే అతడు బాధల నుంచి బయటపడే పరిష్కార మార్గాల్ని అన్వేషించాలి. ప్రతిదానికీ తరుణోపాయం ఉంటుంది. కమ్ముకున్న కష్టాలకు నివారణోపాయాలు ఎప్పుడూ ఉంటాయి.
పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొన్న తరవాత కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించారు. పట్టాభిషిక్తులైన అనంతరం వారు శ్రీకృష్ణ దర్శనానికి వెళ్లారు. వారిని తల్లి కుంతీదేవి అనుసరించింది. శ్రీకృష్ణుడు అందర్నీ ఆప్యాయంగా పలకరించాడు. ద్రౌపదిని సముదాయించాడు. పాండవుల విన్నపాలు వింటూనే, కుంతీదేవిని సమీపించి ‘అత్తా! నీ కోరికేమిటి’ అని ప్రశ్నించాడు. 
శ్రీకృష్ణుణ్ని కుంతి ఆత్మీయంగా అక్కున చేర్చుకొంది. ‘అందరికీ వరాలిచ్చే దేవుడివి. నాకూ ఓ వరం ఇవ్వరాదా’ అని అడిగింది. అడగమన్నాడు కృష్ణుడు. ‘కృష్ణా! ఇంతకాలం ఎన్నో కష్టాలు అనుభవించాం. దీర్ఘకాలం నా తనయులకు దూరంగా గడిపాను. ఇప్పుడు ధర్మరాజు పట్టాభిషేకం తరవాత, ఆనందాతిశయంలో మునిగి తేలతానే మోనని భయంగా ఉంది. అందువల్ల నాకు ఎప్పుడూ కష్టాలనే ప్రసాదించు’ అని కుంతి వేడుకుంది.
‘జీవితమంతా కష్టాల్లోనే గడిపావు. ఇక ముందు సుఖాలతో గడపక, నీకు ఇదేమి కోరిక’ అని నవ్వుతూ ప్రశ్నించాడు కృష్ణుడు. ‘కష్టా ల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ నీ నామస్మరణే చేసేవాళ్లం. మాకు నీ దర్శనభాగ్యం ఎప్పుడు కోరినా లభించేది. ముందుముందు సుఖాల్లోనే మునిగి- నీ నామస్మరణ, నీ దర్శన భాగ్యం కోల్పోతానేమో అని నా భయం’ అంది కుంతి.
సుఖాల్లో ఉన్నప్పుడు మనిషికి కాలం తెలియదు. రోజులు, నెలలు, సంవత్సరాలు అలవోకగా గడిచిపోతాయి. ‘కాలం ఎంత త్వరగా పూర్తయిందో’ అని అతడు ఆశ్చర్యపడతాడు. కష్టంలో ఉన్నప్పుడు, ఒక రోజు ఒక యుగంలా గడుస్తుంది. రాత్రి సమయంలో ఏదైనా బాధ కలిగితే నిద్ర రాదు. నొప్పితో గిలగిలలాడుతున్నపుడు, ఆ రాత్రి గడవడం మనిషికి ఎంతో దీర్ఘంగా అనిపిస్తుంది. నిమిషాలు లెక్కిస్తుంటాడు.
సీతాదేవి వనవాస సమయంలో పలు సంవత్సరాలపాటు భర్త శ్రీరాముడితో ఆనందంగా గడిపింది. రావణాసురుడి చెరలో గడిపిన పదకొండు నెలలు ఆమెను అత్యంత బాధకు, వేదనకు గురిచేశాయి.
జీవితంలో అన్ని కష్టాలూ ఒక్కసారే చుట్టుముట్టినట్లు మనిషి కొన్నిసార్లు భావిస్తుం టాడు. దెబ్బ తగిలిన కాలుకే తిరిగి తగిలినంతగా తల్లడిల్లుతాడు. కష్టాల పరంపర అతణ్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. సంతోషం సగం బలం అంటారు పెద్దలు. ఆనందాన్ని విడవక, కష్టాలకు వెరవక మనిషి జీవిత యాత్ర సాగించాలి. ఎన్నడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. కష్టాలను అధిగమించడానికి తగిన పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తూ ప్రయాణించాలి. పాములు, నిచ్చెనలతో కూడిన వైకుంఠపాళి- మానవ జీవితం. ఆత్మవిశ్వాసమే ఆ ఆటలో అతణ్ని గెలిపించగల ఏకైక సూత్రం!
- రావులపాటి వెంకట రామారావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list