MohanPublications Print Books Online store clik Here Devullu.com

పది నిమిషాల ధ్యానంతో ఏకాగ్రత-10 Minutes Meditation


పది నిమిషాల ధ్యానంతో ఏకాగ్రత
ఏకాగ్రత కుదరడంలేదా.. ఒత్తిడి, ఆలోచనలతో సతమతమవుతున్నారా.. అయితే, ఓ పది నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఈ చికాకులన్నీ ఇట్టే మాయమవుతాయి. ఇది ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడయింది. 82 మంది వలంటీర్లపై పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. పరిశోధనలో భాగంగా వలంటీర్లను రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. ఆపై కంప్యూటర్‌పై ఓ పరీక్ష పెట్టారు. రెండు గ్రూపులకూ ఓ ఆడియో వినిపించారు. అంతకుముందు ఒక గ్రూపు సభ్యులను కాసేపు ధ్యానం చేయాలని చెప్పారు. ఆపై ఈ బృందానికీ ఆడియో వినిపించి.. ఆ తర్వాత రెండు బృందాల వారిని పరీక్షించారు. అయితే, ధ్యానం చేసిన బృంద సభ్యులలో మిగతావారితో పోలిస్తే ఏకాగ్రత పెరిగింది. కాబట్టి రోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి


ఇవి అల్సర్‌ లక్షణాలేనా?

నా వయసు 37. దాదాపు ఏడాదిగా అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వచ్చి కొద్ది సేపట్లో తగ్గిపోతోంది. మలంలో కూడా కొన్నిసార్లు సన్నటి రక్తపు చారలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి వెన్నునొప్పి కూడా వస్తోంది. స్థానిక డాక్టర్‌ను కలిస్తే అల్సర్‌ కావచ్చు అన్నారు. నా మట్టుకు నాకు పొగతాగడం, మధ్యపానం, గుట్కాలు తినడం ఇలాంటి అలవాట్లేమీ లేవు. అయినా నాకు అల్సర్‌ సమస్య వచ్చే అవకాశం ఉందా?
- కె. వేణు, మిర్యాలగూడ.
పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లేమీ లేకపోయినా కేవలం బాక్టీరియా వల్లే అల్సర్‌ రావచ్చు. అల్సర్‌లో కనిపించే ప్రధాన దుష్ప్రభావం రక్తస్రావం. దీనివల్ల మలంలో రక్తపు చారలు కనిపించడమో లేదా మలం నల్లనల్లగా రావడమో జరగవచ్చు. మీరు చె ప్పిన లక్షణాలను బట్టి మీకు అల్సర్‌ ఉన్నట్లు అనిపిస్తోంది. అవసరమైన పరీక్షలు చేయిస్తే గానీ, పూర్తి స్థాయిలో వ్యాధి నిర్ధారణ చేయలేం. అయితే రక్తస్రావం మరీ తీవ్రమై అది ఎక్కువ రోజులు కొనసాగుతున్నప్పుడు ఐరన్‌ లోపంతో రక్తహీనత (ఎనీమియా) ఏర్పడే వీలుంది.
చాలా అరుదుగానే అయినా ఒక్కోసారి అల్సర్‌ జీర్ణాశయం వెనుక భాగం నుంచి చొచ్చుకుని పోయి అక్కడినుంచి క్లోమగ్రంఽధికి కూడా వ్యాపించవచ్చు. ఇలాంటి సమయంలో వెన్నునొప్పి మొదలవుతుంది.
జీర్ణద్రవాలు అల్సర్‌ తాలూకు రంధ్రం నుంచి బయటికి ప్రవహించినా, లేదా రంధ్రం డుయోడినమ్‌ ముందు వైపు గోడకు ఏర్పడినా, లీక్‌ అయిన జీర్ణరసాల మూలంగా, పొత్తి కడుపు లైనింగ్‌ వాచిపోతుంది. దీనివల్ల నొప్పి మొదలవుతుంది. ఇలాంటి స్థితిలో అత్యవసరంగా హాస్పిటల్‌కు చేర్చాల్సి ఉంటుంది.
అల్సర్లు ఎక్కువ రోజుల పాటు తీవ్రంగా వేధించినప్పుడు జీర్ణాశయ డుయోడినమ్‌లో లోతుగా గాట్లు ఏర్పడతాయి. వీటివల్ల జీర్ణాశయం ఉంచి డుయోడినమ్‌లోకి ప్రవేశించే ద్వారం ఇరుకవుతుంది. ఫలితంగా ఆ భాగంలో ఆహారం అడ్డుపడుతుంది. ఆ వెంటనే వాంతులు కావడం మొదలవుతుంది. ఆ తర్వాత శరీరం బరువు చాలా వేగంగా తగ్గిపోతుంది. ఏమైనా, పొత్తి కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చి అది ఎంతకూ తగ్గకపోయినా, ముఖం హఠాత్తుగా నల్లగా, కందిపోయినట్లు అనిపించినా అత్యవసరంగా డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.
- డాక్టర్‌ ఎన్‌. ప్రకాశ్‌ రెడ్డి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌




భలే.. బనానా ఆర్ట్‌!
మదిలోని ఆలోచనల్ని రకరకాల కాన్వాసులపై ఆర్టిస్టులు గీస్తుంటారు. అరటిపండుపై చిత్రించిన ఈ ఆర్ట్‌ ఇపుడు ఇంటర్‌నెట్‌లో హల్చల్‌ చేస్తోంది. డచ ఆర్టిస్ట్‌ స్టీఫెన బ్రస్క్‌కి అరటిపండ్లంటే భలే ఇష్టం. అదే ఇష్టంతోనే బనానా ఆర్ట్‌తో ప్రయోగాలు చేశాడు. ఆర్ట్‌కి కావాల్సిన అరటిపండ్లను ఎంపిక చేసుకున్న తర్వాత స్టీఫెన.. తొక్కే కదా అని తీసి పారేయకుండా ఆ తొక్కలోనే అద్భుతమైన విన్యాసాలు చేస్తాడు. ఇలా అరటిపండుపై తాబేలు, మెక్‌డక్‌, జిరాఫీలతో పాటు ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌పైన ఉండే కింగ్‌ కాంగ్‌, మర్లిన మాన్రో, క్రిష్మస్‌ వేడుకల క్షణాల్ని.. అరటిపండుపై గీసి వారెవ్వా అనిపించుకున్నాడు స్టీఫెన. బనానా ఆర్ట్‌ భలే ఉందని సోషల్‌ వెబ్‌సైట్స్‌లో ఈ ఆర్టి్‌స్టకి అభినందనలు వస్తున్నాయి.


ప్రయాణాల్లో వాంతులా?
బస్సుల్లోగానీ, రైళ్లల్లో గానీ, ప్రయాణిస్తున్న వేళల్లో కొందరికి తలనొప్పి, తలతిరగడం, వికారంతో పాటు విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఈ స్థితికి ఇతర కారణాలు కూడా ఉన్నా, దీర్ఘకాలికమైన మలబద్దకం కూడా ఒక కారణమే. ఇలాంటి వారు ఆహారంలో పండ్లు, పీచుపదార్థాల మోతాదును పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. లేదంటే వారానికి ఒకసారి త్రిఫళా చూర్ణం వేసుకోవడం ద్వారా మలబద్దకం నుంచి వాంతుల సమస్యనుంచి బయటపడవచ్చు. ఇకపోతే గృహ ఔషధంగా.....
ప్రయాణ సమయంలో, యాలకులు, లవంగాలు, జీలకర్ర వీటిల్లో ఏదో ఒకటి నోటిలో వేసుకుని కొంచెం కొంచెంగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి.
ఉసిరి కాయను నోటిలో ఉంచుకుని, కొంచెం కొరికి ఆ రసాన్ని నిదానంగా మింగుతూ ఉండాలి. లేదా కొంచెం చింతపండును చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే ప్రయాణం తాలూకు వికారం, వాంతుల బాధ ఉండదు.
ఒకవేళ ఇవీ పనిచేయకపోతే, ఆయుర్వేద షాపుల్లో దొరికే జంబీరాది పానకం, పైత్యాంతకం లేదా మాతులుంగ రసాయనం వీటిల్లో ఏదో ఒకటి తీసుకుంటే ఈ వికారం, వాంతుల సమస్యలనుంచి దూరంగా ఉండవచ్చు.


జుట్టుకి స్టిక్కర్స్‌ పూచెనే..
ఫ్యాషన్ ప్రపంచంలో చిన్నపాటి సరదా స్టయిల్స్‌ ఒక్కోసారి యమా క్రేజ్‌ను సంపాదిస్తుంది. తాజాగా ‘హెయిర్‌ స్టిక్కర్‌’ ట్రెండ్‌ మస్త్‌ పాపులర్‌ అయ్యింది. న్యూయార్క్‌లోని హెయిర్‌ స్టయిలిస్ట్‌ అలెన థామస్‌ ఉడ్‌ ఈ ట్రెండ్‌ను క్రియేట్‌ చేసింది. తలపై పప్పీల్లాగా జంతువులు, ఫుడ్‌ థీమ్డ్‌ స్టిక్కర్స్‌ను అతికించింది. వీటిని గట్టిగా ప్రెస్‌ చేస్తే సరి అతుక్కుంటాయి. సులువుగా తీయొచ్చు కూడా. ప్లేఫుల్‌ లుక్‌లో ఉండే ఈ ట్రెండ్‌ను అమెరికా, యూకేలోని స్కూల్‌ గాళ్స్‌ ఎక్కువగా ఫాలో అవుతున్నారట. యువత కూడా హెయిర్‌ స్టిక్కర్‌ ట్రెండ్‌కి ఫిదా అయ్యింది. ఈ ఫొటోలను ఇనస్టాగ్రమ్‌లో అప్‌లోడ్‌ చేసి వారు మురిసిపోతున్నారు.

కుబేరుని గర్వభంగం
కుబేరుడు బంగారానికి ఆధిపతి. అతను తన ఐశ్వర్యాన్ని చూసుకుని విర్రవీగేవాడు. ఒకరోజు పరమేశ్వరుని ముందూ తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. కైలాసానికి వెళ్లి ‘స్వామీ! మీరు ఇరువురూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి’ అని కోరాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న శివుడు ఇతనికి గుణపాఠం నేర్పాలని అనుకుని ‘నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను’ అని చెప్పాడు. వెంటనే కుబేరుడు ‘నేను ఏర్పాట్లు చేశాను, మీరు మా ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరించాలి, మీరు రాకపోతే నేను బాధపడతాను’ అని అన్నాడు. అలా అయితే ‘నా కుమారున్ని పంపిస్తానని’ శివుడు అన్నాడు. దానికి కుబేరుడు సరే అన్నాడు. అయితే నీకొక ముఖ్య విషయం చెబుతాను.
వినాయకుడు కొంచెం ఎక్కువగా తింటాడు, ఫరవాలేదుగా అని అడిగాడు. మరేం ఫరవాలేదు స్వామీ. ఎంత తిన్నా నేను పెట్టగలను అని కుబేరుడు జవాబిచ్చాడు. అయితే సరే నా కుమారున్ని తీసుకెళ్లు అని శివుడు వినాయకున్ని పంపిస్తాడు. వినాయకుడు కుబేరుని ఇంట భోజనానికి కూర్చున్నాడు. ఆహారపదార్థాలు రుచిగా ఉండటంతో వినాయకుడు తృప్తిగా తినడం మొదలుపెట్టాడు. వడ్డిస్తూనే ఉన్నారు, వినాయకుడు తింటూనే ఉన్నాడు. ఇంతలో వంటవాడు వచ్చి కుబేరునితో వండిందంతా అయిపోయిందని చెప్పాడు. కుబేరునికి ఏం చేయాలో పాలుపోలేదు. వినాయకున్ని ఎలా శాంతపరచాలో కుబేరునికి తెలియలేదు. ‘‘వినాయకా! వండిందంతా ఆయిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు’ అని అడిగాడు.
‘‘నాకు ఏదో ఒకటి పెట్టు లేదంటే నిన్ను మింగేస్తాను’ అని వినాయకుడు హెచ్చరించాడు. దాంతో కుబేరునికి శివుడు గుర్తొచ్చాడు. ఆయనొక్కడే నన్ను కాపాడగలడు అనుకుని కైలాసానికి పరుగు పెట్టాడు. ‘‘నన్ను క్షమించు స్వామీ! నువ్వొక్కడివే నన్ను కాపాడగలవు’’అని మోకరిల్లి పడి వేడుకున్నాడు. శివుడు అతన్ని క్షమించి ‘నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నా కుమారునికి ప్రేమతో ఈ
మరమరాలు సమర్పించు. నీకు అతని ఆశీర్వాదం లభిస్తుంది’ అని ఇచ్చి పంపించాడు. వెంటనే కుబేరుడు వినాయకుని దగ్గరకు వెళ్లి ‘తండ్రీ నన్ను క్షమించండి. ఈ మరమరాలు తీసుకుని నన్ను ఆశీర్వదించండి’ అని వేడుకున్నాడు. అవి తిన్న వినాయకునికి ఆకలి తీరింది. కుబేరున్ని ఆశీర్వదించాడు.
పళ్లరసాలతో పిల్లల్లో ఊబకాయం
పళ్ల రసాలు ఆరోగ్యకరమనే విషయం తెలిసిందే.. అయితే, చిన్నారులను మాత్రం వీటికి దూరంగా ఉంచడమే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏడాదిలోపు వయసున్న పిల్లలకు పళ్ల రసాలతో ఎటువంటి ప్రయోజనం చేకూరదట. ఈ విషయాన్ని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ తెలిపింది. పైపెచ్చు చిన్నారులు అనారోగ్యకర రీతిలో బరువు పెరిగే ప్రమాదం ఉందట. అయితే పళ్లరసాలకన్నా తాజా పండ్లను తినిపించడం మంచిదని పిల్లల వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడుతున్నారా?

ఓవైపు ఎండలు మండిపోతుంటే బయటికి ఎలా వెళ్లేది? తప్పనిసరై వెళితే సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడాల్సిందే అంటారా..? అయితే, జర జాగ్రత్త.! సన్‌స్ర్కీన్‌ లోషన్లతో మేలు కంటే కీడే ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. ఈ లోషన్ల వల్ల శరీరానికి విటమిన్‌ డి సరిగ్గా అందడం లేదని వెల్లడయింది. శరీర ఆరోగ్యానికి, ఎముకల ఎదుగుదలకు విటమిన్‌ డి చాలా కీలకమనే విషయం తెలిసిందే! అయితే, ఎంతసేపూ ఇంట్లోనో, ఆఫీసుల్లోనో ఏసీ గదుల్లోనో గడుపుతూ చాలామంది ఎండపూట బయటికి వెళ్లడమే లేదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా చర్మానికి సన్‌స్ర్కీన్‌ లోషన్లు పట్టించి కానీ కాలు బయటపెట్టడంలేదు. ఈ లోషన్లు సూర్యరశ్మి ద్వారా చర్మానికి అందే విటమిన్‌ డిని అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా విటమిన్‌ డి లోపం ఏర్పడుతోంది. ఇది కండరాల పటిష్టతను, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరి వ్యాధుల ముప్పు లేకుండా విటమిన్‌ డి లోపాన్ని నివారించేందుకు వారంలో రెండుసార్లు మధ్యాహ్నపు ఎండలో కాసేపు నిలుచోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

బంధాలను కాపాడుకోవాలి!
ఆత్మీయం
కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడు! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! మనిషిని ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెలిగా, తమ్ముడిగా సృష్టించి ఆ బంధాల్లో ఇమిడ్చి పెట్టిన దేవుడు, ఆ బంధాల్లో అతను అనురాగభరితంగా జీవించాలని ఆశించిన దేవుడు అవే బంధాలను ఆధారం చేసుకొని తన ప్రేమను వ్యక్తీకరించడం అసమానం. కాని ఈనాడు వాస్తవానికి ఏం జరుగుతోంది? దురదృష్టవశాత్తూ పెచ్చరిల్లిన వాణిజ్య సంస్థలు, పాశ్చాత్య పోకడలు... కుటుంబ బంధాలను కూడా కలుషితం చేసి కకావికలం చేసి... దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థనే బలహీనపర్చి కూలదోస్తున్నాయి.
దీని నుంచి బయట పడాలి. అంతా కళ్లు తెరవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ బంధాలకు అతీతంగా మనిషి బతకలేడు. ఆప్తుల చావు వల్లో, అప్పులతోనో, సమస్యలతోనో, ఒంటరితనంతోనో అలమటిస్తున్న వారిని బాధపడవద్దని వెన్నుతట్టి ‘నీకు నేనున్నాను, మనందరికీ పైన దేవుడున్నాడు’ అని ఓదార్చడం వారికి ఎంత ఉపశమనాన్నిస్తుందో తెలుసా? ప్రయత్నించి చూడండి.


డ్రై కేర్‌... పొడి చర్మానికి చికిత్స
బ్యూటిప్స్‌

పొడి చర్మానికి రకరకాల ఫేస్‌ప్యాక్‌లు వేయడం కంటే సింపుల్‌గా ఆయిల్‌ థెరపీ ఇస్తే చాలు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కాని ఆలివ్‌ ఆయిల్‌ కాని రాయాలి. ముఖంతోపాటు పాదాలు, అరచేతులు, మోచేతుల వంటి చర్మం పొడిబారి గట్టిపడిన ప్రదేశాల్లో కూడా ఆయిల్‌ రాయాలి. ఆయిల్‌ రాయడానికి ముందు చర్మం మీద దుమ్ము, ధూళి లేకుండా సబ్బుతో కడగాలి.
రోజూ పదినిమిషాల సేపు హాట్‌థెరపీ ఇస్తే చర్మంలోని నూనెగ్రంథులు ఉత్తేజితమై పొడి చర్మానికి స్వాంతన çకలుగుతుంది. హాట్‌ థెరపీ చాలా సింపుల్‌... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఉదయం స్నానం చేయడానికి ముందు ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి చేస్తే చాలు.
ప్యాక్‌ల విషయానికి వస్తే...
ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్‌ కమలారసం, ఒక టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ మీద చర్మం నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపు కూడా వదులుతుంది.
పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే చాలు. ఇది ఇప్పుడు అన్ని సూపర్‌మార్కెట్లలోనూ దొరుకుతోంది.పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు... అనేక రకాల కాంబినేషన్‌లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కాకపోతే చర్మానికి స్వచ్ఛమైన ఆముదం కాని అవొకాడో ఆయిల్‌ కాని రాసి మర్దన చేయాలి.

పేగులు క్లీన్‌ అవుతాయి
గుడ్‌ఫుడ్‌
క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డైటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. అందుకే పేగులకు ఎంతో మేలు. క్యాబేజీని క్రమం తప్పకుండా తినేవారిలో పేగుల్లో అల్సర్, క్యాన్సర్‌లు నివారితమవుతాయి. మరీ ముఖ్యంగా పెద్ద పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.
మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడానికి క్యాబేజీ చాలా నమ్మకమైన ఆహార పదార్థం. క్యాబేజీలో విటమిన్‌ సి, విటమిన్‌ కె, ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్‌ ఏ, థయామిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్‌... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా దీన్ని పేర్కొంటారు.క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్‌ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.ఇది ఇచ్చే శక్తి చాలా తక్కువ. వందగ్రాముల క్యాబేజీ నుంచి కేవలం 15 క్యాలరీల శక్తి మాత్రమే లభ్యమవుతుంది.అందుకే స్థూలకాయులకు, బరువు పెరుగుతున్న వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

వయసు తగ్గించేద్దాం!
కొంతమందికి మోచేయి నుంచీ భుజం వరకూ చేతులు లావుగా ఉంటాయి. పొట్టా వస్తుంది. దాంతో చూడ్డానికి స్థూలకాయుల్లా కనిపిస్తారు. అలాంటి వారికి ఉత్తానాసనం చక్కని పరిష్కారం. దాంతోపాటు ఈ ఆసనాలూ వేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కొవ్వు కరగడమూ సులువవుతుంది.
ఉత్తానాసనం: రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి నిలబడాలి. చేతులతో సీసాని పట్టుకుని వంగి తలని మోకాళ్ల దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రెండు చేతులూ ఆసనాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి ముందుకు వస్తాయి. ఇలా అరనిమిషం ఉన్న తర్వాత మళ్లీ చేయాలి. ఈ ఆసనంతో పొట్టా, చేతుల్లో ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది.
బద్దవీరభద్రాసనం: దీనినే వారియర్‌ పోజ్‌ అని కూడా అంటారు. ముందుగా రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి నిలబడాలి. నెమ్మదిగా కుడికాలుని వెనక్కి స్ట్రెచ్‌ చేసి ఎడమ కాలిని తొంభై డిగ్రీల కోణంలో ఉంచాలి. ముందుకు చూస్తూ నీళ్లసీసాని చేతుల్లోకి తీసుకుని వెనక్కి ఉంచి పట్టుకోవాలి. ఇలా పదిహేను సెకన్లు ఉండాలి. అలానే ఎడమ కాలిని వెనక్కి స్ట్రెచ్‌ చేయాలి. చేతులతో పాటు నడుము కింద భాగం మొత్తానికి సరైన వ్యాయామాన్ని అందిస్తుందీ ఆసనం.
పాయింట్‌ షోల్డర్‌ ఓపెనర్‌: ముందు వెల్లకిలా పడుకుని కుడివైపునకు ఒత్తిగిలాలి. ఎడమకాలుని చిత్రంలో చూపించినట్టుగా ఉంచి కుడికాలుని మాత్రం నిటారుగా స్ట్రెచ్‌ చేయాలి. ఇప్పుడు ఒక సీసాని చేతుల్లోకి తీసుకుని వెనక్కి ఉంచాలి. ఇలా పదిహేను సెకన్లు ఉన్న తర్వాత ఎడమవైపు తిరిగి చేయాలి. ఇలా చేయడం వల్ల చేతుల్లోని కొవ్వు కరగడంతోపాటూ మెడా, వెన్ను పట్టేయడం.. వంటి సమస్యలూ తొలగిపోతాయి.


క్యాల్షియం తగ్గినా.. నొప్పి తప్పదు!
నెలసరి వస్తుందంటే చాలు గుండెల్లో రాయిపడుతుంది కొందరికి. పొత్తి కడుపులో నొప్పి కొందరి సమస్య అయితే మరికొందరిలో తీవ్రమైన నడుము నొప్పి వేధిస్తుంది. కాళ్లూ, చేతులూ లాగడం.. కడుపులో వికారం వంటివీ తప్పవు. ఈ సమస్యనే పీరియడ్‌ క్రాంప్స్‌ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా డెబ్బైశాతం మంది మహిళల్లో ఈ సమస్య ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకలా అంటే.. 
కొందరికి హార్మోన్లలో ఉండే ఇబ్బందుల వల్లా, వివిధ సమస్యల కారణంగా దీర్ఘకాలికంగా మందుల వాడకం వల్లా నెలసరులు రావు. ఇలాంటి వారికి నెలసరి వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఫైబ్రాయిడ్లు ఉన్నా నెలసరుల సమయంలో నొప్పీ, వికారం వంటి సమస్యలూ తప్పవు. 
* కడుపు నొప్పి మాత్రమే కాదు.. ఒక్కోసారి నెలసరి సమయంలో మూత్రానికి వెళ్లాలన్నా కూడా మంట బాధిస్తుంది. దీనికి కారణం అండాశయాలూ, గర్భాశయంలో కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు ఉండటమేనని మరవకూడదు. 
* తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే వారిలో కూడా నెలసరి సమయంలో కడుపులో నొప్పీ, నెలసరులు సరిగా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 
* హైపో థైరాయిడిజమ్‌ అనే సమస్య వల్ల కూడా నెలసరిలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయక శరీరంలో క్యాల్షియం నిల్వలు తగ్గితే కూడా నెలసరుల వేళ నొప్పితో పాటూ ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయని మరవకూడదు.

మనకు ఇప్పుడే పరీక్ష 
తెలుగు రాష్ట్రాల్లో పదీ, ఇంటర్‌, ఎంసెట్‌ నుంచి సీబీఎస్‌ఈ దాకా వరసగా వివిధ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి! పాతతరం కంటే నేటి తల్లులు పిల్లల పరీక్షాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నారు కానీ.. ఫలితాల ఆందోళనని దాచుకోలేకపోతున్నారని చెబుతున్నారు నిపుణులు. తక్కువ మార్కులో, వైఫల్యమో ఎదురైతే నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారంటున్నారు. మీరూ అలా కాకూడదంటే...
ఆ డైలాగులొద్దు : ‘ఛ.. నీ కోసం మేమెంతగా కష్టపడుతున్నాం! నీకు మా ఆవేదన పట్టదా. ఎందుకిలా చేశావ్‌...!’ ఇలా పాతతరం సినిమాల్లోలా సెంటిమెంట్‌ సంభాషణల్లోకి వెళ్లకండి. మీరెప్పుడైతే అలాంటి ప్రశ్నలు వేస్తారో.. మీ చిన్నారులు ఏవేవో కారణాలు వల్లెవేస్తారు. అది అసలు సమస్యని పక్కదారి పట్టిస్తుంది. వాళ్ల లోపమేంటో, ఎక్కడ విఫలమయ్యారో తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతుంది.
మరేం చేయాలి? : మీ నిరాశా నిస్పృహల్ని ఏరకంగానూ వ్యక్తం చేయొద్దు. ‘ఈ మార్కులు నీకు సంతృప్తిగా అనిపిస్తున్నాయా? అయితే ఎందుకు? కాకపోతే కారణాలేమిటో ఆలోచించు’ అని ఆవేశకావేశాలకు లోనుకాకుండా, భయపెట్టకుండా అడగండి. అప్పుడే ‘ఏదో ఒక జవాబు చెప్పి.. ఇప్పటికి తప్పించుకుందాం!’ అనే ధోరణిలో కాకుండా నిజంగా ఆత్మావలోకనం చేసుకుంటారు. లోపాలని నిజాయతీగా పట్టుకోగలుగుతారు.
ఇదే తరుణం : ఈసారి మంచి మార్కుల కోసం ఏమేం చేయాలో మీరు చెప్పకుండా వాళ్లనే ఆలోచించమనండి. వ్యూహాలు సిద్ధం చేయమని చెప్పండి. ఆ ప్రక్రియలో మీరు కేవలం వాళ్లకి సాయపడండి చాలు. ‘నేనే వేస్తా ప్రణాళిక..’ అని మీరు అతి జోక్యం చేసుకుంటే వాళ్లపై మీకు ఏమాత్రం నమ్మకం లేదని అపోహపడతారు. తమపై తాము ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ప్రణాళిక వేసి.. వాటిని చిన్న భాగాలుగా విడగొట్టి.. ఎప్పటికప్పుడు ఆ లక్ష్యాలు చేరిన ప్రతిసారీ నజరానాలివ్వడం మరిచిపోవద్దు!

గోరు గోడు తీరుస్తాయ్‌!
కొందరిలో గోళ్లు పెళుసుబారి విరిగిపోతూ చికాకు పెడతాయి. వీటికి నాణ్యమైన రంగు వాడినా మానిక్యూర్‌ చేయించినా ఫలితం ఉండదు. వాటికి సరైన పోషణ లేకపోవడం ఇందుకు కారణం. ఆ పోషణ అందే మార్గాలివి.. 
* బాదం నూనె నిర్జీవంగా మారిన గోళ్లకు తేమతోపాటూ పోషణా ఇస్తుంది. తరచూ గోళ్లపె బాదం నూనె వేసి నెమ్మదిగా రాస్తూ ఉండటం వల్ల గోళ్లు బలంగా కూడా తయారవుతాయి. మెరుపులీనుతాయి. 
* విటమిన్‌-ఇ నూనె కూడా గోళ్లకు చాలా బలాన్నిస్తుంది. కొంచెం ఇ-విటమిన్‌ ఆయిల్‌ను గోళ్లమీద వేసి నెమ్మదిగా రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యంగా కనిపిస్తాయి. 
* యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌ మూలకాలుంటాయి. ఇవి గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి. యాపిల్‌ సిడార్‌లో ఉండే ఆమ్లగుణం వల్ల ఫంగస్‌ వంటివి దరిచేరవు. 
* గ్రీన్‌ టీ కూడా పెళుసుగా మారిన గోళ్లకు చక్కటి పోషణనిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గోళ్లకు బలాన్నివ్వడమే కాకుండా మంచి మెరుపూ వచ్చేలా చేస్తాయి. ఓ కప్పు చల్లటి గ్రీన్‌ టీలో కాసేపు మీ గోళ్లు ముంచితే.. వాటికున్న మరకలు పోతాయి. 
* అవిసె గింజల్లో మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గోళ్లకు లోపలి నుంచి బలాన్నిస్తాయి.




జీర్ణానికి... జీలకర్ర! 
తాలింపులో ఆవాలతోపాటు జీలకర్ర కూడా వాడతాం కదా.. అసలు దీనివల్ల కలిగే మేలు ఏంటో ఎప్పుడయినా ఆలోచించారా.. లేదంటే మాత్రం ఇది చదవండి. 
* జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు జీలకర్రతో చేసిన టీని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 
* జీలకర్రలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా జరగడానికి అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణసంబంధ వ్యాధులను నయం చేయడానికీ తోడ్పడుతుంది. 
* జీలకర్రలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జలుబూ, దగ్గును నివారిస్తాయి. ఇందులోని ఇతర పోషకాలు రోగనిరోధకశక్తినీ పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తాయి. 
* గర్భిణులు దీన్ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా అరిగి, మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉంటుంది. గర్భిణుల్లో సాధారణంగా కనిపించే వికారాన్నీ జీలకర్ర నివారిస్తుంది. బాలింతలు తీసుకుంటే పాలవృద్ధి బాగుంటుంది.



.సమయాన్ని సాగదీద్దామా! 
ఇది పనిని సాగదీయడం కాదు. ఓ పనిని సాగదీయడమంటే దాన్ని చేయడానికి అవసరానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం. సమయాన్ని సాగదీయడమంటే ఓ పనిని అనుకున్నదానికంటే చాలాముందే ముగించి ‘అరె! ఇంత సమయం మిగిలిపోయిందా!’ అని ఆశ్చర్యానికి లోనుకావడం. మనకు ఎప్పుడో కానీ అలాంటి ఆనందం దక్కదంటారా? నిజమే. కానీ దాన్ని సాధించడానికి కొన్ని మార్గాలున్నాయంటున్నారు నిపుణులు..
ప్రశ్నించుకోండి : మనం ప్రతి పనికీ ‘ఎక్కువ సమయం కావాలి’ అని కోరుకుంటాం కానీ ఉన్నదాన్ని సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో చూడం. అలా కాకుండా ‘నాకున్న సమయాన్ని క్షణం కూడా వృథా కాకుండా ఎలా వినియోగించుకోవాలి?’ అని ప్రశ్నించుకోండి. దానికి సమాధానం వెతకండి. ఇది మీ మనసు అనవసరమైన విషయాల్లోకి పోకుండా ఆపుతుంది. చక్కగా సాధన చేస్తే సమయం గడిచిందే తెలియనంతగా ఓ ధ్యానం లాంటి స్థితినిస్తుంది.
కత్తిరించేయండి : మీకున్న గడువుని మరింతగా కుదించుకోండి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి.. తక్కువ సమయంలో ఆ పని పూర్తి చేయడానికి సృజనాత్మకమైన దారులు వెతకడం మొదలుపెడతాం. రెండు.. ఒకేరకం పనిని ఒకేలా.. ఒకే సమయంలో చేయడం ద్వారా ఏర్పడే స్తబ్దతని పోగొట్టుకుంటాం. మూసతనానికి దూరమై చురుగ్గా మారతాం. కాకపోతే ఈ గడువు కుదింపు మనలో ఆందోళన కలిగించనంతగా ఉండాలంతే!
ప్రణాళికలొద్దు : ప్రణాళిక అన్నీసార్లూ అవసరం లేదు! ఒక్కోసారి పని ప్రారంభించడానికీ, ముగించడానికీ నిర్దిష్ట సమయమంటూ లేకుండా ఆకస్మికంగా చేపడితే సమయాన్ని మనం మించిపోయేలా చేస్తుంది. మామూలు కంటే అతి తక్కువ సమయంలోనే పని పూర్తిచేయొచ్చు.

ముక్కుపై కళ్లద్దాల మచ్చలా?
కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు ముక్కుకి ఇరువైపులా మచ్చలు పడుతుంటాయి. అవి పెద్దవైతే చూడ్డానికి కాస్త ఇబ్బందే. అందుకే వాటిని నివారించేందుకు ఇలా చేసి చూడండి.
కలబంద: రాత్రిపూట కలబంద గుజ్జును ముక్కుకు రాసి మర్దన చేసి పడుకోవాలి. మర్నాడు గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఆ మచ్చలు పోతాయి.
నిమ్మరసం: సహజ బ్లీచింగ్‌ గుణాలు నిమ్మరసంలో అధికం. నాలుగు చెంచాల నిమ్మరసంలో అరచెంచా నీళ్లు కలిపి అందులో దూది ఉండల్ని వేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీశాక ఆ ఉండల్ని ముక్కు మీద మచ్చలున్నచోట, కళ్ల అడుగున రాసుకోవాలి. కాసేపటికి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.
కీరా: ఈ రసాన్ని మచ్చలున్న చోట రాసుకోవాలి. లేదంటే దూదిని ముంచి అక్కడ కాసేపు పెట్టుకున్నా చాలు ఆ ప్రభావం మచ్చల మీద పడి త్వరగా పోతాయి.
టొమాటో: కళ్లద్దాల తాలూకూ మచ్చల్ని పోగొట్టడానికి టొమాటోలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ ముక్కల్ని మెత్తగా చేసి ఆ గుజ్జును మచ్చల మీద పూతలా వేయాలి. తరవాత కడిగేస్తే అవి క్రమంగా పోతాయి. అలానే టొమాటోరసంలో కీరా, బంగాళాదుంప రసాలు కలిపి రాసుకున్నా ఆ మచ్చల్ని పోగొట్టొచ్చు.



వేడిలోనూ వ్యాయామం..
వ్యాయామానికి.. పచ్చదనం ఆవరించిన పార్కులో, చక్కగా సంరక్షిస్తున్న మైదానాలో ఎంత సౌకర్యంగా ఉంటాయో కదా! కాకపోతే, మే నెల దాటినా వేడి సెగలు మానుకోని ఎండ ఈ ఆరుబయట వ్యాయామానికి పెద్ద అవరోధం. దాన్ని అధిగమించి వ్యాయమాలు చేయడం ఎలా? 
నీళ్లు : వ్యాయామం కోసం బయల్దేరడానికి 20 నిమిషాల ముందే ఓ పావు లీటర్‌ నీళ్లు తాగండి. కసరత్తు చేసేటప్పుడు ప్రతి పావుగంటకోసారి వంద మి.లీ. నీళ్లు తీసుకుంటూ ఉండండి. ఈ అలవాటు డీ-హైడ్రేషన్‌ని నిరోధిస్తుంది. అంతేకాదు, వెళ్లడానికి కాస్త ముందు ఐస్‌క్రీమ్‌, చాక్లెట్‌ వంటి శీతల పదార్థాలు తీసుకుంటే వేడిని చక్కగా ఎదుర్కోవచ్చు. 
ఉప్పున్నవి కాస్త : శారీరక శ్రమ చేసేటప్పుడు శరీరంలో చెమటద్వారా నీళ్లేకాదూ.. సోడియం, పొటాషియం కూడా పోతాయి. అందువల్లే నీరసం ఆవహించి, సహనం నశిస్తుంటుంది. అలా జరగకూడదంటే ఉప్పుతో చేసిన వేరుసెనగలూ, దాంతో నానబెట్టిన ఉసిరికాయలు, ఇతర విత్తనాల వంటివి కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. 
దుస్తులు : లేత రంగులున్న దుస్తులూ, వదులుగా ఉన్నవే వాడాలి. వ్యాయామాలకంటూ ప్రత్యేకంగా వాడే బ్రా, లోదుస్తులు వాడటం మరీ మంచిది. చెమట ఎక్కువపట్టే సున్నితమైన ప్రదేశాల్లో ముందుగానే టాల్కం పౌడర్‌ రాస్తే ఇబ్బంది ఉండదు. ఉదయమైనా సాయంత్రమైనా ముఖానికి అత్యధిక ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ రాయడం మరవకండి. 
మెల్లగానే : ఆరుబయట వ్యాయామాలన్నాక.. చాలా మెల్లగానే మొదలుపెట్టాలి. ముందే కష్టతరమైన వ్యాయామాలైతే శరీరం వేడికి సర్దుకోలేదు. కాబట్టి, ముందు మెల్లగా నడక, పరుగులాంటివాటితోనే వ్యాయామం ప్రారంభించండి.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list