ఆనందాల హరివిల్లు
ఆనందంగా జీవించడమే ప్రతి ఒక్కరి ఆశయం. ఆ సంతోషం ఓ వెల్లువలా ఉబికినప్పుడు, మనిషి నవనాడులూ ఉత్తేజితమవుతాయి. హృదయ స్పందన ఆహ్లాదకర స్థాయిలో కొనసాగుతుంది. శరీర ఆరోగ్యానికి దోహదం చేసే రసాయనాలు విడుదలవుతాయి. మనసు పరవశమైన స్థితిలో- అతడు ధనికుడై దానగుణం కలిగినవాడైతే, చేతికి ఎముక లేకుండా అడిగినవారికి అడిగినంత దానం చేస్తాడు. కర్ణుడు వంటి దానశీలురు అదే ఉదాత్త లక్షణం కలిగి ఉన్న కారణంగా, స్థితిగతులకు అతీతంగా దానం చేసి ఖ్యాతి పొందారు. లోకంలో ఆనందం అనేది దొరకని వస్తువని అంటారు. అది నిజమేనా?
మానవుడు ఆనంద ప్రియుడైనా, అందుకోసం అడ్డదారులు వెతుక్కొంటే అతడికి కలిగేది దుఃఖమే! మంచి ప్రవర్తన, దైవ కార్యాచరణ వల్ల కలిగే ఆనందానుభూతులు వేరు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆయన ముద్దుబిడ్డ అయిన మనిషికి, ఆ ఆనందాన్ని అనుబంధంగా పొందే అర్హత ఉంది. అడిగినవారికి అడిగినంత ఆనందాన్ని వితరణ చేయగల సర్వ సమర్థుడు, సకల సద్గుణ సంపన్నుడు- భగవంతుడు. ఆ ఆనంద సంపద పొందే అర్హతను మనిషే సంపాదించుకోవాలి.
శ్రీరామచంద్రుడిలో పదహారు దైవీ లక్షణాలు ఉండేవి. వీరత్వం, ధర్మపాలన, కృతజ్ఞత కనబరచే గుణం, సత్యబద్ధత, దృఢ వ్రతం- వాటిలో కొన్ని. ఆయనలో సర్వ భూతదయ, అపార విద్య, అసాధారణ సామర్థ్యం, ప్రియ దర్శనం, మృదు భాషణం వెల్లివిరిసేవి. అనంత పరాక్రమం, క్రోధాన్ని జయించే తత్వం, అసూయ లేని గుణం, కోపించినప్పుడు దేవతలు సైతం భీతిల్లేంత ధీరత్వం శ్రీరాముడి లక్షణాలు. అమేయ ప్రజ్ఞ, తొలి పలకరింపు, నిరాడంబరత వంటి గుణాల నిధి ఆయన. వీటిలో కొన్నింటినైనా మనిషి సంతరించుకొంటే, ఆనందం అతడి వెన్నంటి ఉన్నట్లే!
కొందరికి ఐశ్వర్యం ఉండవచ్చు. అరిషడ్వర్గాల బారిన పడితే, ఆనందం వారికి దొరకని వస్తువు అవుతుంది. లోపలి శత్రువుల్ని నియంత్రించినా లేక వాటికి దాసోహమైనా- అది మనసే! అందుకే దాని కార్యశీలత పట్ల మనిషి జాగరూకత వహించాలంటారు పెద్దలు. ఇతరత్రా ఎన్ని గుణాలు కలిగి ఉన్నా- కామానికి వశమైనప్పుడు రావణుడికి పట్టిన దుర్గతి లోకంలో ఎవరికైనా తప్పదు. లోభంతో దుర్యోధనుడు నశించాడు. దుర్మార్గుల్ని ఆశ్రయించి కర్ణుడు పతనమయ్యాడు. కామక్రోధాది శత్రు వర్గంలోని ఏ భావానికి వశుడైనా, మనిషికి మనశ్శాంతి దుర్లభమే! అతడి మనసు నిర్మలమైతేనే ప్రశాంతి, ప్రగతి సమకూరతాయి.
అనుభవాలు పొందడంలో తరతమ భేదాలు ఉండవు. దత్తాత్రేయ ప్రభువు తాను 24 ఉపాధుల్ని గురువులుగా స్వీకరించానని చెబుతుండేవారు. పంచ భూతాలతో పాటు చీమ, చేప, తేనెటీగ, సాలెపురుగు వంటి అల్పప్రాణులూ ఆ గురు సమూహంలో ఉండటం విశేషం! మనిషి అలా సామాన్య జీవనం గడపడంలో ఎంతో ఆనందం, మాధుర్యం ఉంటాయన్నదే దత్తాత్రేయ బోధ.
విలువైనది ఏదీ అంత సులభంగా లభించదు. సులభంగా లభించినంత మాత్రాన, దానికి విలువ లేదనడం సరికాదు. ఆనందం కొందరికి సులభంగా లభించవచ్చు. మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. ఆనంద ప్రాప్తిలో మనసు పాత్ర గొప్పది. ధ్యానాచరణలో ఓ పద్ధతి ఉంది. దాని ప్రకారం- మనసుకు పగ్గం వేసి, కళ్లెం బిగించి నిలువరించే పని ఉండదు. ఏ పనీ చేయక, ఏమీ ఆలోచించక సుఖాసనంలో కూర్చుంటే చాలు. మనసు అదే సర్దుకుంటుంది. కొంతసేపటికి నిశ్చలమవుతుంది. ధ్యానం కుదురుకుంటుంది. సజావుగా సాగుతుంది. ఆనందం సైతం అంత సులువుగా పొందగలిగిందే అంటారు అనుభవజ్ఞులు!
ధర్మయుతంగా అందినదాన్ని మనసారా ఆస్వాదిం చడమే సాధకుడికి ఉండాల్సిన ఉత్తమ తత్వం. దాని వల్ల ఆనందం అతడితో చెలిమి చేస్తుంది. గొప్ప కలలు కని వాటిని సాధించాలంటారు పెద్దలు. ఆ సాధనలో ఎదురయ్యే అపజయాల్ని ఖాతరు చేయని స్వభావం మనిషికి ఉంటే, ఆనంద జీవనం లభిస్తుంది! - గోపాలుని రఘుపతిరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565