MohanPublications Print Books Online store clik Here Devullu.com

వీరభద్రుడు రాయచోటి_Virabhadrudu Rayachoti


ఈ వీరభద్రుడు శాంతాకారుడు!
వీరభద్రుడనగానే దక్షయజ్ఞంలో బీభత్సం సృష్టించి దక్షుడిని సంహరించి శివుడ్ని శాంతపరచిన వాడిగా, ఉగ్రరూపుడిగానే మనకు తెలుసు. కానీ, ఓ చోట శాంత స్వరూపుడిగా భక్తజన పాలకుడిగా కొలువయ్యాడు వీరన్న. ఎందరో రాజులు తమ వీరఖడ్గాలను సమర్పించిన ఈయన్ను రాచరాయుడనీ పిలుస్తారు.
కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞాన్ని తలపెట్టి, కావాలనే శివుడ్ని పిలవలేదు. అయినా పుట్టింటి మీద మమకారం వీడలేక సతీదేవి ఆ యజ్ఞానికి హాజరయింది. పిలవకుండా వచ్చిన కూతుర్ని అవమానించేలా మాట్లాడతాడు దక్షుడు. తీవ్రమనోవేదనతో యజ్ఞ గుండంలో దూకి సతీదేవి ఆహుతి అవడం తెలిసిన విషయమే. అప్పుడు శివుడి జట నుంచి పుట్టిన వీరభద్రుడు మనకు భీకరాకారుడిగానే తెలుసు. కానీ ఆయన తన అవతార సమాప్తి కాలంలో మీసాలూ కోరలూ లేకుండా శాంతాకారుడిగా కడపజిల్లా రాయచోటిలో మాండవ్యనదీ తీరాన శ్రీ వీరభద్రస్వామిగా వెలిశాడు.
అవతార సమాప్తి
సతీదేవి విషయం తెలుసుకుని మహోగ్రుడైన రుద్రుడు తన జటను పీకి నేలకు విసిరితే అందులో నుంచి ప్రళయ భీకరాకార వీరభద్రుడు ఉద్భవించి నిరీశ్వర యాగానికి హాజరైన దేవతలను శిక్షించి, దక్షుడిని పట్టుకొని తన ఖడ్గంతో శిరస్సును ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు. వీరభద్రుడు సృష్టించిన బీభత్సానికి శివుడు సంతోషించాడు. ఆయన వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడవై వర్ధిల్లుదువుగాక అని దీవించాడు. అప్పటి నుంచి వీరభద్రుడికి వీరేశ్వరుడనే పేరొచ్చింది. తన కర్తవ్యం ముగియగానే భూలోకంలో పరమేశ్వరుడి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ చిట్టచివరకు మాండవ్య మహాముని తపోబలంతో పునీతమైన మాండవ్యనదీ తీరాన భద్రకాళీ సమేతుడై అర్చా విగ్రహమూర్తిగా అవతార సమాప్తి పొందాడు. అందుకే వీరభద్రస్వామి ఆలయాలన్నింటిలో ఈ దివ్యక్షేత్రం మూల స్థానమై ప్రసిద్ధి చెందింది. రాజాధి రాజులెందరో విడిది చేసి తమ వీరఖడ్గాలను అర్పించి, నిత్యం రాజోపచారాలను చేసిన ఈ వీరభద్రస్వామి రాచరాయుడిగా పేరు పొందాడు. ఈ కారణంగానే, రాచరాయుడి నివాసమైన ఈప్రాంతం ‘రాచవీడు’గా పేరు పొంది కాలక్రమేణా ‘రాయచోటి’గా మారింది. కన్నడ భక్తులు ఈ ప్రాంతాన్ని ‘రాచోటి’అని కూడా పిలుస్తుంటారు.
ఆలయంలోకి కిరణాలు...
రాచవీటి వీరభద్రస్వామి ఆలయం, 8వ శతాబ్దపు రాజరాజ రాజచోళ, 11వ శతాబ్దపు కాకతీయ గణపతి దేవుడు, శ్రీ కృష్ణదేవరాయలు వంటి రాజుల కాలాల్లో నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు చేపట్టడం ద్వారా నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరభద్ర స్వామి విశేషించి వీరశైవులకు ఇలవేలుపుగా వెలిశాడు. ఈ దివ్యక్షేత్రం వీరశైవ పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం తర్వాతి స్థానంలో ఉందని చెబుతారు. ఇక్కడ మార్చి 27 నుంచి ఐదురోజులపాటు, ఆపైన సెప్టెంబరు 14 నుంచి ఐదురోజులపాటు ఉదయం ఆరు గంటల సమయం నుంచి అరగంటపాటు సూర్యకిరణాలు నేరుగా స్వామి పాదాలమీద పడతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. దక్షిణామూర్తి అంశయిన ఈ స్వామిని పూజించుకునేందుకు దేవతలు ఇలా సూర్య కిరణాల ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారనేది ఓ ఐతిహ్యం.
మొదటి ప్రసాదం...
దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రసిద్ధ ఆలయాన్ని దోచుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు వడియరాజులు అడ్డుకున్నట్లు చెబుతారు. అందుకే నేటికీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి బంగారంతో చేసిన మూడో నేత్రాన్ని అలంకరిస్తారు. అప్పుడు స్వామికి నైవేద్యంగా పెట్టేందుకు అన్నం, గారెలూ, బూరెలూ పెద్ద రాశిగా పోస్తారు. డప్పు వాయిద్యాలతో వచ్చే వడియరాజులు ముందుగా ఆ ప్రసాదాన్ని కొంత తీసుకుని మరో ద్వారం గుండా వెళ్లిపోతారు. తర్వాతే మిగతా భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ తంతు తిలకించడానికి లక్షల్లో జనం హాజరవుతారు. ఆలయంలో స్వామి మూల విరాట్టుకు మీసాలూ, కోరలూ ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహానికి అలంకారంగా మాత్రమే వెండి మీసాన్ని పెడతారు. గర్భగుడిలో స్వామితో పాటు వీరేశుడనే పేరుతో శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. ముఖ మండపం లోపల రెండు నందులు ఉంటాయి. పెద్దనందిని ‘శివనంది’ అనీ, చిన్నదాన్ని ‘వీరనంది’ అనీ పిలుస్తారు. ఈ క్షేత్రంలో వీరేశ్వరుడికి పూర్వమే గ్రామ దేవతగా వెలసిన మాండవీ మాత (ఎల్లమ్మ)కు ప్రథమ పూజ తరువాత వీరేశలింగ పూజ, అనంతరం వీరభద్రుడి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఆలయంలో ద్వారపాలకులైన నందికేశ్వర, మహాకాళేశ్వరులతో పాటు సూర్యభగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు, కాలభైరవులు కొలువయ్యారు. ఏటా మాఘ బహుళ దశమి లేదా ఏకాదశి నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామిని తెలుగురాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులూ పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. కడప ప్రాంతంలో దేశ్‌ముఖ్‌ తెగకు చెందిన ముస్లింలూ స్వామిని సేవిస్తారు. ఇక్కడి భద్రకాళీ అమ్మవారిని విశేష మహిమాన్వితురాలిగా చెబుతారు ఉపాసకులు.
కడప జిల్లా నుంచి 53కిలోమీటర్ల దూరంలో రాయచోటిలో ఈ ఆలయం ఉంది. కర్ణాటక నుంచి రైలు మార్గాన కడపకు చేరి అక్కడ నుంచి బస్సు ద్వారా ఆలయానికి వెళ్లొచ్చు.
- వై.పెద్దరెడ్డెయ్య, న్యూస్‌టుడే, రాయచోటి




























No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list