ఆపిల్... కొత్త రుచులు
వహ్వా... ఆపిల్! ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్‌లు వాడేవాళ్లు రోజులో ఒక్కసారైనా ఈ మాట అనకుండా ఉండరు. కారణం దాని వైవిధ్యమైన ఫీచర్లు, సరికొత్త లుక్. అందుకు తగ్గట్టే ఆపిల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలతో అలరిస్తూ ఉంటుంది. ఏటా కొత్త ప్రోడక్ట్‌లు, అప్‌డేటడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేస్తుంది. వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఏటా తన ఉత్పత్తుల గురించి వివరిస్తుంటుంది. అలా ఈ ఏడాది ఆపిల్ కొత్త ఫ్లేవర్లు లాంచ్ చేసింది. అంటే సరికొత్త పరికరాలు, సౌకర్యాలన్నమాట. ఆ రుచుల్ని మనమూ ఆస్వాదిద్దామా!
ఐ ఓఎస్
ఆపిల్ మొబైల్ వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలు అందించడానికి ఐ ఓఎస్ 11 సిద్ధమైంది.
* ఐఫోన్లలోని మెసేజ్‌లను ఐ క్లౌడ్‌తో సింక్ చేస్తున్నారు. దీని వల్ల మొబైల్‌లోని మెసేజ్‌లను ట్యాబ్, మ్యాక్‌ల్లోనూ చూసు కోవచ్చు. మెసేజ్ ఆప్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యమూ ఉంది.
* ఆపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరికి ట్రాన్స్‌లేటర్‌ను జోడించారు. ఇంగ్లిష్‌లో మీరు చెప్పిన మాటల్ని చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిస్ భాషల్లోకి సిరి అనువాదం చేసి చూపిస్తుంది.
* ఆన్‌లైన్, దుకాణాల్లో కొనుగోళ్లకు అందుబాటులో ఉన్న ఆపిల్ పే ఆప్షన్ ఇకపై పర్సన్ టు పర్సన్ పేమెంట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఆపిల్ పే, మెసేజ్ ఆప్‌ను కలిపి ఈ సౌకర్యం అందిస్తున్నారు.స్నేహితులకు మెసేజ్ చేసినట్లే డబ్బులు పంపించుకోవచ్చు. మీరు పంపిన డబ్బులు ఆపిల్ పే క్యాష్‌లోకి వెళ్తాయి. ఇది పేటీఎం తరహాలో మొబైల్ వ్యాలెట్‌లా పని చేస్తుంది.
* కొత్త ఓఎస్‌లోని బ్రౌజర్‌లో ఏదైనా విషయం గురించి సెర్చ్ చేసి తర్వాత ఆపిల్ న్యూస్ ఆప్‌లోకి వెళ్లారనుకోండి. అందులో కనిపించే వార్తలన్నీ మీరు అంతకుముందు బ్రౌజర్‌లో చూసిన అంశానికి సంబంధించినవే ఉంటాయి.
* ఆపిల్ ఫొటోస్ ఆప్‌లో మెమొరీస్ ఆప్షన్ వచ్చి చేరింది. ఇది ఫేస్ బుక్‌లో ‘ఆన్ దిస్ డే’ ఫీచర్‌లా ఉంటుంది. ఆపిల్ మొబైళ్ల ప్రత్యేకత అయిన లైవ్ ఫొటోలను ఎడిట్ చేసుకునే సౌకర్యం కొత్త ఓఎస్‌లో కల్పించారు.
* కొత్త ఓఎస్‌లో కెమెరా హై ఎఫిషియన్సీ వీడియో కోడింగ్ (హెచ్‌ఈవీసీ)తో పని చేస్తుంది. వీడియో సైజును రెండింతలు తగ్గేలా కంప్రెస్ చేయడం దీని ప్రత్యేకత. ఫొటోల పరిమాణం తగ్గించడానికి హై ఎఫిసియన్సీ ఇమేజ్ ఫార్మేట్‌ను తీసుకొచ్చారు.
* ఆపిల్ మ్యాప్స్‌తో ఇకపై షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్టులో ఫ్లోర్ల వివరాలూ పొందొచ్చు. ఏ ఫ్లోర్‌లో ఏముంది, దానికి ఎటువైపు నుంచి వెళ్లాలనే విషయాలు కనిపిస్తాయి.
* మీరు డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ కాల్స్, మెసేజ్‌ల వల్ల ఇబ్బంది కలగకుండా ‘డునాట్ డిస్ట్రబ్ ఇన్ డ్రైవింగ్’ ఆప్షన్‌ను ప్రవేశపెడు తున్నారు. మీ మొబైల్‌లో ఈ ఆప్షన్ ఆన్ చేసినప్పుడు... మీకు కాల్ చేసే వ్యక్తికి మీరు డ్రైవింగ్‌లో ఉన్నారనే మెసేజ్ వెళ్తుంది.
* ఆపిల్ మ్యూజిక్ ద్వారా మీరు పాటలు వినడమే కాదు... ఆప్‌లోని ఫ్రెండ్ ట్యాబ్‌లోకి వెళ్తే మీ స్నేహితులు ఏ పాటలు వింటున్నారనేది కనిపిస్తుంది.
అంకెల్లో...
86 శాతం
ఐఓఎస్ 10ను వినియోగిస్తున్న ఆపిల్ యూజర్లు
37.5 కోట్లు
వాయిస్ అసిస్టెంట్ సిరి మంత్లీ యాక్టివ్ యూజర్లు
18,000 కోట్లు
ఇప్పటివరకు ఆప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ అయిన ఆప్‌లు
50 కోట్లు
ఒక వారంలో ఆప్ స్టోర్ సందర్శకులు
లక్ష కోట్లు
ఆపిల్ ఉత్పత్తులతో ఏడాదికి క్లిక్ అవుతున్నఫొటోలు
మ్యాక్ ఓఎస్
గతేడాది లాంచ్ చేసిన మ్యాక్ ఓఎస్ సియేరా ఆపిల్ పే, అన్‌లాక్ విత్ వాచ్ లాంటి ఆప్షన్లతో ఆకట్టుకుంది. దానికి మరిన్ని ఆప్షన్లు జోడించి ఈ ఏడాది మ్యాక్‌ఓఎస్ హైసియేరాను ప్రకటించారు.
* బ్రౌజర్‌లోని వీడియో యాడ్‌లు ఆటోమేటిక్‌గా ప్లే అవ్వకుండా హై సియేరాలో వీడియోల ఆటో ప్లే ఆప్షన్‌ను తొలగించారు.
* ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన వస్తువుకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయా? ఇక ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొత్త మ్యాక్ ఓఎస్‌లోని సఫారీ బ్రౌజర్‌లో ఇంటెలిజెంట్ ట్రాకింగ్ ప్రివెన్షన్ ఆప్షన్‌ను జోడించారు. మీరు ఏం సెర్చ్ చేస్తున్నారనే విషయం యాడ్ ట్రాకర్లకు తెలియకుండా బ్రౌజర్ రక్షణ కల్పిస్తుంది.
* ఫొటోల ఎడిటింగ్ కోసం ఇకపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు అవసరం లేదు. ఆపిల్ ఫొటో ఆప్‌లోనే బేసిక్ ఫొటో ఎడిటింగ్ టూల్స్ అందించారు.
* కొత్తగా వచ్చే ఐమ్యాక్‌ల్లో ఏడో తరం ఇంటెల్ కోర్ ప్రోసెసర్ ఉంటుంది. 21.5 అంగుళాల మ్యాక్‌లో 32 జీబీ ర్యామ్, 27 అంగుళాల మ్యాక్‌లో 64 జీబీ ర్యామ్ ఉంటాయి. అంతర్గత మెమొరీ 2 టీబీ ఉంటుంది. అలాగే మ్యాక్‌బుక్‌ల్లోనూ ఏడో తరం ఇంటెల్‌కోర్ ప్రాసెసర్‌లను తీసుకొచ్చారు.
వాచ్ ఓఎస్
వాచ్ ఓఎస్‌లో కొత్త ఆప్షన్లు చేర్చి నాలుగో తరం వాచ్ ఓఎస్‌ను ప్రకటించారు. మూడో తరం వాచ్ ఓఎస్ ఉండే ఆపిల్ వాచీల్లో స్క్రీన్ మీద రకరకాల నోటిఫికేషన్లు కనిపిస్తూ గజిబిజిగా ఉండేది. సిరి ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా కొత్త ఓఎస్‌లో స్క్రీన్‌పై నోటిఫికేషన్లు కనిపించే విధానంలో మార్పులు తీసుకొచ్చారు. మీరున్న ప్రాంతం, అప్పటి సమయాన్ని బట్టి నోటిఫికేషన్లు కనిపించేలా సిరి చూసుకుంటుంది. ఒకప్పుడు యాక్టివిటీ ఆప్‌లో గత వారం రోజుల ఫిట్‌నెస్ యాక్టివిటీస్ మాత్రమే కనిపించేవి. కొత్త ఓఎస్‌లో నెల రోజుల్లో చేసిన వర్కవుట్ల డేటాను క్రోడీకరించి అందిస్తున్నారు.
టీవీ ఓఎస్
ఆపిల్‌టీవీ, ఐఫోన్, ఐప్యాడ్‌ల్లో టీవీ చూడటానికి వీలుగా ఆపిల్ ఇటీవల టీవీ ఆప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రపంచ ప్రఖ్యాత ఛానళ్లను ఐఫోన్, ఐప్యాడ్‌ల్లో చూసుకోవచ్చు. ఈ ఛానళ్ల జాబితాలో ఇప్పుడు అమెజాన్ వచ్చి చేరింది. ఇకపై అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఆపిల్‌లోనూ ఆస్వాదించొచ్చు.
ఐమ్యాక్ ప్రో
ఇన్నాళ్లూ సిల్వర్ రంగులో ధగధగ మెరిసిపోయిన ఐమ్యాక్ ఇప్పుడు బూడిద రంగులోకి మారి ‘ఐ మ్యాక్ ప్రో’గా అవతరించింది. 8 కోర్, 10 కోర్, 18 కోర్ జియాన్ ప్రోసెసర్‌లతో మూడు వెర్షన్లు రూపొందించారు. రేడియాన్ వెగా గ్రాఫిక్స్‌తో పని చేస్తుంది. 18 కోర్ ప్రోసెసర్ ఉన్న ఐమ్యాక్ ప్రో స్పెసిఫికేషన్లు చూస్తే... 128 జీబీ ఈసీసీ మెమొరీ, 4 టీబీ ఎస్‌ఎస్‌డీ, నాలుగు థండర్‌బోల్ట్ 3 పోర్టులుంటాయి. అలాగే 27 అంగుళాల తెర, రెటీనా 5కె డిస్‌ప్లే, 32 జీబీ, 8 కోర్ ప్రోసెసర్, 1 టీబీ హార్డ్ డిస్క్ ఉండే బేసిక్ వెర్షన్ ధర 4999 డాలర్లు. అమెరికాలో డిసెంబరు నుంచి అమ్మకాలు మొదలవుతాయి.
హోమ్ పాడ్
సంగీత ప్రియుల కోసం ఆపిల్ స్మార్ట్ స్పీకర్లను తీసుకొచ్చింది. ‘హోమ్ పాడ్’గా పిలిచే ఈ స్పీకర్లు తెలివైనవి, వైవిధ్య మైనవి. సాధారణ బ్లూటూత్ స్పీకర్‌లా ఉండే వీటితో చేతులు అవసరం లేకుండా చాలా పనులు చేసుకోవచ్చు. అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ తరహాలో ఇది పని చేస్తుంది. ఏడు అంగుళాల ఎత్తు ఉండే ఈ స్పీకర్ ఆపిల్ ఏ8 చిప్‌తో పని చేస్తుంది. దీని దిగువ భాగంలో ఆరు ట్వీటర్లు, పై భాగంలో ఒక వూఫర్ ఉంటాయి. ఈ స్పీకర్ తన చుట్టూ ఎంత స్పేస్ ఉందో అంచనా వేసుకొని సౌండ్ ఎంత ఉండాలో నిర్ణయించుకుంటుంది. మీ మాటలు విని దానికి తగ్గట్టు కావల్సిన పాటలు ప్లే చేస్తుంది. మొబైల్‌లో హోమ్ ఆప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర 349 డాలర్లు. డిసెంబరులో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో తొలుత అందుబాటులోకి వస్తుంది.
ఐప్యాడ్ ప్రో
కొత్త ఆప్షన్లతో ఆపిల్ ఐప్యాడ్ కూడా సిద్ధమైంది. ‘ఐప్యాడ్ ప్రో’గా త్వరలో మీ ముందుకు రాబోతుంది. 13 అంగుళాలు, 10.5 అంగుళాల తాకే తెరతో రెండు వెర్షన్లు రూపొందాయి. ఐప్యాడ్ కోసం ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది.
* మల్టీ టాస్కింగ్ కోసం ‘పుల్ అవుట్ ఆప్’ ఆప్షన్‌ను పొందుపరిచారు. ఒక ఆప్ వాడుతున్నపుడు డాక్‌లో ఉన్న మరో ఆప్‌ను డ్రాగ్ చేసి స్క్రీన్ పైన వేస్తే, ఆ స్క్రీన్ రెండు భాగాలుగా విడిపోయి, రెండు ఆప్‌లను ఒకేసారి వాడుకోవచ్చు.
* కొత్త ఓఎస్‌లో ఫొటోలు, టెక్ట్స్‌లను కాపీ, పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డ్రాగ్ ఆండ్ డ్రాప్ ఆప్షన్‌తో ఒక చోట ఉన్న ఫొటోను మరో చోట పెట్టుకోవచ్చు.
* స్క్రీన్ షాట్లు, డాక్యుమెంట్ల మీద మార్కింగ్ చేసుకోవడానికి ఐప్యాడ్‌లో మార్కప్ ఆప్‌ను అందించారు.
* ఇప్పటివరకు టైప్ చేసిన డాక్యుమెంట్లలోనే లెటర్ సెర్చ్ చేసే ఆప్షన్ ఉండేది. కొత్త ఓఎస్‌లో చేత్తో రాసిన డాక్యుమెంట్లలోనూ లెటర్ సెర్చ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565