దాంపత్యం సజావుగా సాగాలంటే!?
ఆదర్శ దాంపత్యసౌధాన్ని నిర్మించేందుకు చాలా ముడిసరకులు కావాలి. అందులో ప్రేమ అనేది మొట్టమొదటిది, తిరుగులేనిది. ఇది లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. అలాగే ఒకరంటే ఒకరికి భక్తితో కూడిన ప్రేమ అత్యవసరం. అది దేవునిపట్ల భార్యాభర్తలకు ఉండే భక్తిభావం లాంటిదే. దంపతుల జీవితంలోని ప్రతి అంశంలోను భక్తి శ్రద్ధాసక్తులు ఉట్టిపడుతూ, బలంగా పెనవేసుకుపోవాలి. విజయవంతమైన వివాహం చాలా ధనాత్మక అంశాలను ఇముడ్చుకుని వుంటుంది. ఇరు దేహాలు, మనసుల మధ్య కలయిక ఆషామాషీగా జరిగే తంతు కానేకాదు. అది నిరంతరాయంగా తమ వైవాహికబంధాన్ని పోషిస్తూ, మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అనుకూల పరిస్థితులను కల్పించాలి.
ఇక దాంపత్యంలో ఒకరిపై ఒకరికి విశ్వాసం, నమ్మకం మెండుగా ఉండాలి. ఇది ఒక్క రోజులో సిద్ధించేది కాదు. దీనికోసం భార్యాభర్తలిరువురూ సంవత్సరాల తరబడి కృషి చేయాలి. అయితే ఒకసారి విశ్వాసం బలపడ్డాక, అది ఎలాంటి తుపానులనైనా తట్టుకోగలదు. వైవాహిక బంధాన్ని ఎలాంటి సంక్షోభంలోంచైనా బయటపడవేసేందుకు నమ్మకమే గట్టి పునాది. కచ్చితమైన ప్రవర్తన ద్వారా నమ్మకం ఏర్పడతుందనేది పాక్షిక సత్యమే. నిజానికి దీనికి కచ్చితంగా ఉండటం కంటే మించిందేదో కావాలి. అదేమంటే దంపతులు పరస్పరం బాధ్యతగా మెలగడం. తమ భాగస్వామి అన్నిట్లోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోవడంకంటే ఎవరికివారు తమ తప్పులను ఒప్పుకోవాలని, వాటికి బాధ్యత వహించాలనే ఎక్కువమంది దంపతులు ఆశిస్తారు. కాబట్టి విశ్వాసమంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. దీన్ని సాధించామనేదానికి గీటురాయి ఏమిటంటే తన వైఖరి, ప్రవర్తన ద్వారా తనమీద ఆధారపడవచ్చనే నమ్మిక భాగస్వామిలో నెలకొనాలి. ఉన్నతమైన ప్రవర్తన లేకుంటే భాగస్వాముల్లో అడుగడుక్కూ సందేహం తొంగి చూస్తుంది. తమ వివాహబంధానికి భాగస్వామి నిజంగానే నిబద్ధతతో ఉన్నారా లేదా అనే చింత మెదడును తొలుస్తుంది. కనుక ఆదర్శకుటుంబ సౌధాన్ని దంపతులిరువురూ కలసికట్టుగా నిర్మించుకోవాలి. ఇది కేవలం ఒకరి వ్యక్తిగత సౌఖ్యం కోసమే కాదు, అది తన చుట్టూ వెలుగును ప్రసాదించేదిగా ఉండాలి. ఓ పెళ్లికో హనీమూన్‌కో ఎంత డబ్బు ఖర్చుచేశాం లేదా ఇంట్లో ఎంత ఖరీదైన ఫర్నీచర్‌ను పెట్టుకున్నామనే విషయాలు దాంపత్యజీవితానికి ప్రామాణికాలు కావు. నీతి, నైతిక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన, సంతోషంతో అలరారే కుటుంబాన్ని నిర్మించాలనే ఉదాత్తమైన ఆశయమే వివాహానికి ప్రాతిపదికగా ఉండాలి.
మరో ముఖ్యమైన అంశం ఏమంటే కుటుంబంలో శాంతిని నెలకొల్పడం. కీచులాటలు, గొడవలు, మనస్పర్ధలు మనశ్శాంతిని హరించేస్తాయి. దంపతులు తమ బంధంలో తలెత్తే ఎలాంటి సమస్యలనైనా నిభాయించేలా ఉండాలి. ఎడమొహం పెడమొహంలా కాకుండా నిరంతరం తమ మనసులోని బాధలను, ఆలోచనల్ని పంచుకుంటూ, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళుతుండాలి. వాదులాటల్లో పట్టువిడుపులు తెలిసుండాలి. పరిస్థితులు సజావుగా లేనప్పుడు అనవసర భేషజాలకు పోకుండా పరస్పరం సహకరించుకునేలా వుండాలి. వారిరువురూ ఒకే ఆత్మకు చెరిసగమనే విషయం ఎరిగివుండాలి. అర్ధనారీశ్వర తత్వమంటే ఇదే.
దాంపత్యంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇంద్రజాలంలాంటిదేమీ ఉండదు. కుటుంబమనే రథానికి తామిద్దరూ జోడు గుర్రాలనీ, దాంపత్యబంధాన్ని కాపాడుకోవడం, పెళ్లి పవిత్రతను నిలబెట్టడం ఇరువురి భుజస్కంధాలపై ఉంటుందనీ దంపతులు అర్థం చేసుకుని మెలగాలి. ఒంటి చేత్తో చప్పట్లు ఎలా కొట్టలేమో అలాగే దాంపత్యబంధాన్ని ఉన్నతంగా నిర్మించుకోవడమనేది కేవలం ఒకరితోనే కాదు.
నిజమైన ప్రేమ ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందేకానీ మరుగున పరచదు. ముందుగా తన బాగోగులకే ప్రాధాన్యమివ్వాలనే నైజం మనిషిలో ఉన్నప్పటికీ, ఒకరంటే ఒకరికి గల ప్రేమాభిమానాలు, గౌరవం వల్ల భాగస్వామి అవసరాలు, కోరికలపట్ల నిస్వార్థంగా స్పందిస్తారు.
దాంపత్యజీవితం నల్లేరుమీద నడకలా సాగిపోవాలంటే ప్రణాళికాబద్ధంగా ఎంతో కృషి చేయాలనే విషయాన్ని ఎవరూ విస్మరించరాదు.
- కె. రఘు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565