MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఏరువాక పున్నమి _eruvaka punnami


                      ఏరువాక పున్నమి 
వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చేసుకునే పండుగ- ఏరువాక పున్నమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు సకుటుంబంగా జరుపుకొనే ఈ ఉత్సవాన్ని ‘కృషి పూర్ణిమ’ లేదా ‘హల పూర్ణిమ’ అని వ్యవహరిస్తారు. రైతులు పంటపొలాల్లో, వ్యవసాయ పరికరాల్లో, పశుసంపదలో దైవత్వాన్ని చూసుకొని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కిదున్నడం ప్రారంభించే రోజు అని అర్థాలున్నాయి.
సువృష్టి ప్రసాదించే ఇంద్రుణ్ని అందరూ ఆరాధిస్తారు. పొలం దున్నడానికి ఉత్తమమైనదిగా ‘జ్యేష్ఠ’ను భావిస్తారు. చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉన్నదే జ్యేష్ఠ పూర్ణిమ. ఆయన సకల ఓషధులకు అధిపతి. అవి పుష్కలంగా ఉంటే, వ్యవసాయం విశేషమైన ఫలసాయం అందజేస్తుంది. అందువల్ల అన్నదాతలు క్షేత్రపాలుణ్ని స్తుతిస్తూ మంత్రపఠనం చేసేవారని రుగ్వేదం చెబుతుంది.
ఉత్తర భారతదేశంలో పున్నమి శుభ సందర్భంగా ‘ఉద్వృషభ యజ్ఞం’ పేరిట ఎడ్లను పూజిస్తారు. ఇది జైమిని ‘న్యాయమాల’లో వివరంగా ఉంది. ‘సీత’ అంటే నాగటిచాలు. సీతాయజ్ఞాన్ని ఇదే పండుగనాడు నిర్వహించేవారని ‘విష్ణుపురాణం’ వర్ణిస్తుంది. బౌద్ధ జాతక కథల్లోని పర్వదినమూ ఏరువాక వంటిదే! శుద్ధోదన మహారాజు వర్షరుతువు రాగానే కపిలవస్తు నగరంలోని కర్షకులకు బంగరు నాగళ్లు బహూకరించేవాడని ‘లలిత విస్తరం’ గ్రంథం వివరిస్తోంది. హాలుడి ‘గాథా సప్తశతి’లోనూ ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది.
ఏరు అంటే, ఎడ్లను కట్టి దున్నేందుకు సిద్ధంచేసిన నాగలి. ఏరువాక అంటే, దున్నే ఆరంభ దశ అని నిఘంటువులు చెబుతాయి. అధర్వణ వేదకాలంలో రైతులు దీన్ని ‘అనడుత్సవం’ అని పిలిచేవారు. హలకర్మ పేరుతో నాగలి పూజ చేసేవారు. మేదినీ ఉత్సవం పేరిట భూమిపూజ, వృషభ సౌభాగ్యం అంటూ పశువుల పూజ ఆచరించేవారు. ‘బృహత్సంహిత’లో, పరాశర విరచితమైన ‘కృషి పరాశరం’ గ్రంథంలోనూ ఈ ఉత్సవాల ప్రస్తావనలున్నాయి. దీన్ని కర్ణాటకలో ‘కారిణి పబ్బం’ పేరుతో నిర్వర్తిస్తారు.
పున్నమి పర్వదినాన ‘పద్మపురాణం’ గ్రంథాన్ని దానం చేయడం అశ్వమేధ యాగ ఫలితంతో సమానమని పెద్దలు చెబుతారు. ఇదే రోజున కృష్ణాజినం సైతం దానం చేస్తారు. ఏరువాక పున్నమినాడు మహిళలు భర్త క్షేమం కోసం ‘వటసావిత్రి’ వ్రతం చేస్తారు. వ్యవసాయ పరికరాలతో పాటు పశువుల్ని పూలు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. టెంకాయలు, పండ్లు, పొంగలి నివేదన చేస్తారు. ఎడ్ల బండ్లను, ఎడ్లను కట్టిన నాగళ్లను మంగళవాద్యాలతో వూరేగిస్తారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, కోలాటాలతో సంబరాలు చేసుకుంటారు. ద్వారాలకు గోగునారతో చేసిన తోరణాల్ని కడతారు. వాటిని చర్నాకోలతో కొట్టి, దొరికిన పీచు తీసుకెళ్లి భద్రపరచుకుంటారు.
గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని పరిరక్షించడంలో అన్నదాతల పాత్ర ఎనలేనిది. మెతుకు పెట్టి బతుకునిచ్చే రైతుల ఉత్సవమిది. సమాజమంతటికీ ఇది ఉత్సవమే! రైతు క్షేమమే దేశానికి క్షేమం. రైతు సౌఖ్యమే దేశానికీ సౌఖ్యం. కృషీవలుర పారమార్థిక చింత ప్రశంసనీయమైనది. నేలలో విత్తి, నింగి వైపు చూసే రైతు- కంట తడిపెట్టే దశ ఎన్నడూ రాకూడదు. భారతీయ సంస్కృతికి, జాతి జీవన విధానానికి పట్టుకొమ్మలే ‘ఏరువాక’ వంటి పల్లె వేడుకలు. ఇవి నవనవోన్మేష చైతన్యానికి, జాతి మనుగడకు అన్నివిధాలా దోహదపడతాయి. కర్షకుడి కళ్లలో ఆనందదీపాల్ని వెలిగిస్తాయి!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ఏరువాక పూర్ణిమ

భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ'. దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లున్నాయి. 'ఏరు' అంటే నాగలి అని, 'ఏరువాక' అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠపూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే- నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠపూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు (మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠపూర్ణిమనాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.

వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు, కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని (కొన్ని ప్రాంతాల్లో పులగం) వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూన్చి, పశువులను, బళ్లను మేళతాళాలతో వూరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం (ఎరువుగా మారిన పశువుల పేడ) పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.

ఉత్తర భారతదేశంలో దీన్ని 'ఉద్‌వృషభయజ్ఞం' అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 


రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ 'అనడుత్సవం' అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ (నాగలిపూజ), మేదినీ ఉత్సవం (భూమి పూజ), వృషభ సౌభాగ్యం (పశువుల పూజ) మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ 'కృషిపూర్ణిమ' ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన 'బృహత్సంహిత'లోను, పరాశరుడు రాసిన 'కృషిపరాశరం'లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో 'కారణిపబ్బం' అని పిలుస్తారీ ఉత్సవాన్ని.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list