MohanPublications Print Books Online store clik Here Devullu.com

దుష్టచింతనతో చేటు_Dusta chintanato chetu


దుష్టచింతనతో చేటు

           మనసు ప్రశాంతంగా వున్నప్పుడే ఏ పని మొదలెట్టినా శుభంగా ముగుస్తుంది. మంచి ఫలితాలనిస్తుంది. అందుకే వివాహం వంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు ముందుగా వినాయకుడిని పూజించి పనులు ప్రారంభిస్తారు. ఆయన బుద్ధికి అధిపతి. అంతేకాదు. సిద్ధికి కూడా! బుద్ధితో సరైన మార్గంలో నడిస్తే కార్యం సిద్ధిస్తుందని అర్ధం.
మనసు ప్రశాంతంగా వుండాలంటే ముందుగా మనసులోకి అసూయని రానివ్వకూడదు. అది మనసులో ప్రవేశించిందంటే దానికి కారకులైన వారి చర్యలనే గమనిస్తూ వుంటుంది. అక్కడితో ఆగదు. వారి మంచి గుణాల్లో కూడా చెడు వెతకడానికే ప్రయత్నిస్తుంది. అకారణంగా ఆగ్రహం తెచ్చుకుంటుంది. వారి సుఖాలనీ, సంతోషాలని చెడగొట్టాలని చూస్తుంది. వారిపై లేనిపోని వ్యాఖ్యానాలు చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. ఇంకా వారు సుఖంగా వున్నారంటే ఎలాగైనా వారి సంతోషం చెడగొట్టే ప్రయత్నాలు మొదలెడుతుంది.
ఇందుకు ముఖ్య ఉదాహరణ దుర్యోధనుడు, అతడి సహవాసులు శకుని, కర్ణ, దుశ్శాసనులు.
చిన్నప్పటినించీ పాండవులపై అతడికి అసూయే! వారి ఔన్నత్యాన్ని సహించలేక (ముఖ్యంగా భీముడి బలాన్ని) భీముడికి విషం పెట్టి చంపాలని చూశాడు. నిద్రిస్తుండగా రాయికట్టి నదిలో పడేయించాడు. చివరికి ఆప్యాయతని కనబరుస్తూ లక్క ఇంట పాండవులని కుంతితో సహా నివసింపజేసి దానికి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో నిప్పంటింపజేశారు.
ఇలా ఎన్ని చేసినా వారు బతికి బట్టకట్టి తిరిగి ద్రుపదరాజు కొలువులో అర్జనుడు మత్య్చయంత్రాన్ని కొట్టడం పాండవులు ద్రౌపదిని పెండ్లియాడారని తెలిసి సహించలేకపోయారు. పెద్దలంతా కలిసి నిర్ణయించి వారిని రావించి వారికి అర్ధరాజ్యమిస్తున్నట్లుగా ప్రకటించి ఇంద్రప్రస్థానికి ధర్మరాజుని రాజుగా చేసి సత్కరించడం సహించలేక పోతున్నారు దుష్టచతుష్టయంలో ముఖ్యంగా దుర్యోధనుడు.
ధర్మరాజు తమ్ముల సహాయంతో దిగ్విజయాలు సాధించి మయసభను నిర్మించి, రాజసూయ యాగంచేసి సకల దేశ రాజన్యులనీ రావించి ఘనంగా సత్కరించడం, ఆ రాజులు తెచ్చిన ఘనమైన కానుకలను స్వీకరింపజేయడడానికి తనని నియమించడం జరగడంతో ఆ వైభోగాన్ని చూసి సహించలేకపోయాడు దుర్యోధనుడు.
అందుకుతోడు ఇతడు మయసభని సందర్శిస్తుండగా నీరులేని చోట వున్నట్లు, ఉన్నచోట లేనట్లు వుండడాన్ని తెలుసుకోలేక దుర్యోధనుడు కాలుజారి పడడాన్ని మేడపైనించీ చూసిన ద్రౌపది నవ్విందని అది అవమానంగా భావించి ప్రాయోపవేశం చేస్తానన్న సుయోధనుణ్ణి ఓదార్చి శకుని మాయాజూదం ఏర్పాటు చేశాడు.
అందులో సర్వమూ ఓడిన పాండవులని అవమానించడమేకాక ద్రౌపది వస్త్రాలని అపహరించి వివస్తన్రి చేయబోగా ఆమె ప్రార్థన ఆలించి కృష్ణుడు రక్షించాడు.
తిరిగి మరోసారి జూదమాడి పనె్నండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసంగా పందెం పెట్టి, అజ్ఞాతవాసంలో బైటపడితే తిరిగి పనె్నండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కొనసాగించాలంటూ నియమం పెట్టారు, వారి మాయాజూదంలో తిరిగి పాండవులు ఓడిపోయి అరణ్యవాసం చేయడానికి వెళ్తే వారితో కూడా వెళ్ళిన బ్రాహ్మణులకి, ప్రజలకీ ధర్మరాజు సూర్యోపాసనతో అక్షయపాత్రను సంపాదించి అందరికీ ఏ లోటూ లేకుండా భోజనాలు పెడుతున్నారని, అడవులలో వున్నా ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలుసుకున్న దుర్యోధనుడు సహించలేకపోయాడు.
ఒకనాడు తనని దండించి బుద్ధిచెప్పడానికి వచ్చిన దుర్వాసుణ్ణి సేవలతో, పొగడ్తలతో మెప్పించి అడవులలో వున్న పాండవుల మీదకి ఉసికొలిపాడు. కృష్ణుని ప్రభావంతో వారు రక్షింపబడ్డారు.
తిరిగి అడవులతో వున్న పాండవులు తమ ఐశ్వర్యాన్ని చూసి బాధపడాలని వారి సమీపంలో గుడారాలు నిర్మించుకుని ఆటపాటలతో అష్వైశ్వర్యాలు అనుభవిస్తూ మెలగసాగారు.
అప్పుడు గంధర్వరాజుతో దుర్యోధనుడికి యుద్ధం జరిగింది. ఓడిపోయిన దుర్యోధనుణ్ణి రథానికి కట్టి తీసుకుపోతుంటే ధర్మరాజు భీమార్జునులను పంపి అతడిని విడిపించాడు. అపకారికి కూడా ఉపకారంచేసే గుణం అతడిది. ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు.’ మనమెందుకు వెళ్ళి విడిపించడం? అన్న భీముడి మాటలకి.
‘మనలోమనం ఎన్నైనా అనుకోవచ్చు. కానీ, ఇతరులు మన వారిపైకి వచ్చినప్పుడు మనం ఐదుగురం కాదు, నూట ఐదుగురం’ అన్నాడా శాంతమూర్తి.
పాండవులని అవమానించబోయిన దుర్యోధనుడు తానే అవమానించబడ్డాడు. వారు విడిపిస్తేనే తన బతుకు బైటపడింది. వారి చేతలు తనకే సిగ్గుచేటయ్యాయి.
అజ్ఞాతవాసం పాండవులు విరాట రాజు కొలువులో చేస్తున్నారని తెలిసి దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం జరిపి వారి చేతుల్లో ఓడిపోయి వచ్చారు కౌరవులు.
ఇలా చిన్ననాట నుండి కడవరకూ పాండవులపై అసూయా ద్వేషాలతోనే గడిచింది రారాజుగా పేరొందిన దుర్యోధనుడి జీవితం. మనసుకి ఏనాడూ ప్రశాంతత లేదు. వారు అడవుల్లోవుంటే కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారని బాధే ఇతడికి. అందుకే పాండవులు ఐదూళ్ళిచ్చినా చాలని యుద్ధం వద్దని శ్రీకృష్ణుడితో రాయబారం పంపినా అతడు సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని నిష్కర్షగా చెప్పాడు. అతడిలో పాండవులపై అసూయ అంత ద్వేషాన్ని పెంచింది. అదే అతడి సర్వనాశనానికి దారితీసింది.
- ఆర్.ఎస్. హైమావతి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list