MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రతీదీ మారిపోతుంది!-Every Thing Is Changing



ప్రతీదీ మారిపోతుంది!
అది ఓ ఆశ్రమం.
గురువుగారు ఉపన్యాస రూపంలో పాఠం చెప్పడం పూర్తయింది. ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది.
గురువును చూసి, ఒక శిష్యుడు ఇలా అడిగాడు... నేను చాలా ఏళ్ళుగా మీ ఉపన్యాసాలు వింటున్నాను. కానీ, వాటి సారం ఏమిటో నాకు అంతు చిక్కడం లేదు. ఒక్క ముక్కలో వాటన్నిటి సారం ఏమిటో చెప్పగలరా? బౌద్ధం సారాంశాన్ని ఒక మాటలో చెప్పగలరా?
సదరు శిష్యుడి మాట వినగానే అందరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.
గురువుగారు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. కాసేపటికి నోరు విప్పి, ఒకే ఒక్క మాట అన్నారు.... ప్రతి ఒక్కటీ మారిపోతుంది అని.
అలా జవాబిచ్చిన వెంటనే మరో ప్రశ్న వైపు కదలిపోయారు.
ఈ కథలో, ఆ చిన్న మాటలో బోలెడంత అర్థం ఉంది. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ అశాశ్వతమే అని బౌద్ధం చెబుతుంటుంది. ఈ అశాశ్వతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, గురువుగారు ప్రతి ఒక్కటీ మారిపోతుంది అని అన్నారు. ఇది చాలా లోతైన బోధన. మనం కానీ, మనం ప్రేమించేవారు కానీ, మనల్ని ప్రేమించేవారు కానీ, మన ఇల్లు, కుటుంబం అన్నీ అశాశ్వతమే. చివరకు మనం ఉన్న ఈ గ్రహం కూడా.
ఈ బోధన ఎందుకు చాలా ముఖ్యమైనదంటే... సర్వసాధారణంగా మనం ఏదో ఒక విషయాన్ని అంటిపెట్టుకొని ఉంటుం టాం. మన కష్టాలకూ, బాధలకూ, దుఃఖానికీ అదే కారణం. జీవితంలో ప్రతి ఒక్కటీ మారిపోతుంటుందనీ, అదే అసలైన వాస్తవమనీ గుర్తించాలి. అది గుర్తించి, వర్తమాన క్షణాలను ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలా జీవించడం నేర్చుకుంటే, జీవితంలో ప్రతి క్షణమూ ప్రశాంతంగా ఉంటుంది.


నేను అనేది ఏమిటి?
తమిళనాడులో మీనాక్షి దేవి వెలసిన మదురై నగరానికి దగ్గరలో తిరుచ్చుళి అనే గ్రామం ఉంది. అక్కడ సుందరమయ్యర్‌- అళగమ్మ దంపతులకు 1879 డిసెంబరు 29వ తేదీ అర్ధరాత్రి రెండో కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ నేల మీద పడుతున్నప్పుడు పురిటిగది అంతా వెలుగుతో నిండిపోయిందట. ఆ పిల్లవాడికి వేంకటేశ్వరన్‌ అని పేరు పెట్టారు తల్లితండ్రులు. అదే క్రమంగా వెంకటరామన్‌గా, రమణగా పరివర్తనం చెందింది.
రమణ పన్నెండేళ్ల వయసులో ఉండగా అతని తండ్రి గతించారు. ఇంట్లో అందరూ దుఃఖిస్తున్నారు. కానీ, ఆ పిల్లవాడొక చింతనలో పడ్డాడు. ‘‘నా శరీరం నడుస్తోంది, పరిగెత్తుతోంది, మాట్లాడుతోంది- నాన్న ఇవేవీ చేయలేకపోతున్నాడు ఎందువల్ల? దీనివెనుక ఉన్నదేమిటి? నేను చేసే పనులన్నిటి వెనుకా... ‘నేను’ అనేది ఏదో ఉంది. కానీ నాన్నకు ఆ ‘నేను’ అనేది లేదు’’ ఇలా ఆలోచించాడు. పన్నెండేళ్ల వయస్కునిలో ఇటువంటి చింతన కలగడం అరుదైన విషయమే! భావికాలంలో శ్రీరమణ మహర్షిగా ప్రసిద్ధులైన మహనీయుని ‘మృత్యువు’ ఒక వీడని సమస్య అయింది. దానికి సమాధానాన్ని అనుభవ పూర్వకంగా గ్రహించి, తాను మృత్యుభీతి నుంచి విముక్తులయ్యారు.అసంఖ్యాకులకు మార్గదర్శకులైన మహర్షి జీవితంలోని మరిన్ని అంశాలు వచ్చే వారం...
-పింగళి సూర్యసుందరం

పాక శునకం

శునకాలు ఇంట్లో ముద్దుగా తిరుగుతున్నా.. వంటింట్లోకి వస్తే మాత్రం ‘కటె.. కటె..’ అని కసురుకుంటాం. ఆదివారం పూట ఏ మటనో.. చికనో వండుకుంటుంటే.. కుక్క బుద్ధి పోనిచ్చుకోదని.. గుమ్మం బయటే కట్టేస్తాం. కానీ, పదిహేనో శతాబ్దంలో మాత్రం మాంసహారం వండటంలో శునక సాయం తీసుకునేవారట బ్రిటన్‌ వాసులు. ఇందుకోసం వాళ్ల ఇళ్లల్లో ప్రత్యేకమైన నిర్మాణం కూడా ఉండేది. ప్రత్యేకమైన జాతి కుక్కలు మాత్రమే ఇలా పాకయాగంలో పాలుపంచుకునేవి. ఆ శునక జాతి పేరు టర్న్‌స్పిట్‌ డాగ్‌. పొట్టి కాళ్లు, పొడువైన దేహంతో ఉండేవివి.
వీటిని వంటింట్లో అటక మీద చెక్కతో చేసిన వెడల్పాటి చక్రంలో ఉంచేవారు. ఆ చక్రాన్ని, కింద పొయ్యి దగ్గర అమర్చిన రోస్టింగ్‌ జాక్స్‌ను... ఒక తాడుతో అనుసంధానం చేసేవారు. పైన చక్రంలో శునకం పరిగెత్తే కొద్దీ... కింద రోస్టింగ్‌ జాక్స్‌ 360 డిగ్రీల కోణంలో తిరిగేవి. పొయ్యి నుంచి వచ్చే సెగకు.. జాక్స్‌కు గుచ్చి ఉంచిన మటన్‌, చికెన్‌ పీసులు.. చక్కగా రోస్ట్‌ అయ్యేవి. వంటలో సాయం చేసే టర్న్‌స్పిట్‌ కుక్కలను.. కిచెన్‌ డాగ్‌, వీల్‌ డాగ్‌ అన్న పేర్లతో పిలిచేవారు. సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ల ఇళ్లల్లో ఎక్కువగా ఉండేవి. తర్వాతి కాలంలో పాకశునకాల వాడకం పూర్తిగా కనుమరుగైంది.

చిటికెలో ఉగ్గాని
కావాల్సిన పదార్థాలు
మరమరాలు : అర కిలో, పచ్చిమిర్చి : ఆరు (తరిగి)
జీలకర్ర, ఆవాలు : అరస్పూను
ఉల్లి : కప్పు (తరుగు), కరివేపాకు : ఒక రెమ్మ
నూనె : 4 స్పూన్లు, టొమాటోలు : రెండు (తరిగి)
ఉప్పు, కారం, పసుపు : తగినంత
ఎలా చేయాలి?
కడాయ్‌ స్టవ్‌ మీద పెట్టి.. నూనె వేసి వేడి చెయ్యాలి. అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు.. ఆవాలు, జీలకర్రతో పాటు టొమాటో ముక్కలు వేసి వేగించాలి. చివరగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. మరమరాలను నీటిలో వేసి బాగా తడపాలి. కాసేపయ్యాక గట్టిగా నీటిని పిండేసి.. మరమరాలను సిద్ధం చేసుకున్న మిశ్రమంలోకి వేయాలి. గరిటెతో బాగా కలియబెడితే చాలు. వర్షాకాలంలో సాయంత్రం పూట ఈ ఉగ్గానీలోకి మిరపకాయ వడలు (మిర్చి) నంజుకుని తింటే ‘ఆహా! ఏమి రుచి’ అనక తప్పదు.

వీకెండ్‌లో జంక్‌ఫుడ్‌ తినేస్తోంది!
మా అమ్మాయి ఐటీ ఉద్యోగి. శుక్రవారం వచ్చిందంటే చాలు. రెండు చేతుల నిండా జంతికలు, బొబ్బట్లు, కారప్పూస, మురుకులు, వేయించిన గింజలు.. ఇలాంటివన్నీ పట్టుకొస్తుంది. జంక్‌ఫుడ్‌ వద్దని నేను ఎంత చెప్పినా వినదు. దానికితోడు కూల్‌డ్రింక్స్‌ ఒకటి. శని, ఆదివారాలు వస్తే.. సోఫాలో పడుకుని టీవీ చూస్తూ.. జంక్‌ఫుడ్‌ తింటూ గంటలు గంటలు అలాగే బద్ధకంగా ఉండిపోతుంది. భోజనం కూడా సరిగా చేయదు. ఏం చేయాలి?
- నిరుపమ, హైదరాబాద్‌
ఇది మీ అమ్మాయి ఒక్కరి సమస్య కాదు. నగరాల్లోని ఆధునిక జీవనశైలిని అనుసరిస్తున్న చాలామంది యువత సమస్య. ముఖ్యంగా ఉరుకుల పరుగుల జీవితంలో ఇరుక్కుపోయిన వాళ్లలో మరీ ఎక్కువ. ఐటీ, కార్పొరేట్‌, నైట్‌జాబ్స్‌లలో పనిచేసేవాళ్లు మానసికంగా అలసిపోతారు. ఇంటికి వచ్చాక తక్షణం అందుబాటులో ఉండేవాటిని తింటారు. అంటే అది ఆకలి వల్ల వచ్చింది కాదు. మానసిక ఒత్తిడి వల్ల అని గుర్తించాలి. ఉద్యోగంలో బాగా అలసిపోయినప్పుడు.. ఒక చోట నుండి కదలాలి అనిపించదు. అప్పుడు టీవీ చూస్తూనో, చేతిలోని జంక్‌ఫుడ్‌ తింటూనో.. కూల్‌డ్రింక్స్‌ తాగుతూనో గడిపేస్తారు. అక్కడి నుండి కదలరు. అలాగే కూర్చుండిపోవాలని అనిపిస్తుంది. లేచి ఉషారుగా ఇంట్లో పనులు చేయాలని అనిపించదు. దీనికి తోడు ఇంట్లో రోజూ రోటీన్‌ఫుడ్‌ను ఇష్టపడని వారికీ అలా తినాలనిపిస్తుంది. కాబట్టి ముందు మీ అమ్మాయిని మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడేయండి. యోగా, ధ్యానం, నడక అలవాటు చేసుకోమనండి. క్రమం తప్పని జీవనశైలిని అనుసరించినప్పుడు.. శరీరంతోపాటు మనసులోను మార్పు వస్తుంది. ఏది పడితే అది తినడం వల్ల వచ్చే సమస్యలను వివరించండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మెల్లగా జంక్‌ఫుడ్‌ను మానేయమనండి.
- డాక్టర్‌ రామచంద్రరావు
దోమల బెడద లేకుండా..
వానాకాలం మొదలైంది. తొలకరి జల్లులు కురుస్తున్నాయి. రుతురాగంతో పుడమి పులకరిస్తోంది. అదే సమయంలో ఈగలు, దోమలు, కీటకాలు, రకరకాల పురుగుల మనుషులను పలకరిస్తున్నాయి. దోమల విషయంలో జాగ్రత్తగా లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ టిప్స్‌ ఫాలో అయిపోతే దోమలు, ఇతర పురుగుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.
తులసి: వానాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈగలను పారదోలడానికి తులసిని మించిన మార్గం లేదు. వంటింట్లో, గదుల మూలల్లో తులసి కొమ్మలను ఉంచడం ద్వారా ఈగలను నియంత్రించవచ్చు. తాజా తులసి కొమ్మలు దొరక్కపోతే.. ఎండిపోయిన ఆకులనైనా.. మస్లిన్‌ వస్త్రంలో ఉంచి గదుల్లో ఉంచాలి. తులసితో పాటు లావెండర్‌, పుదీనా, తమలపాకులు కూడా ఈగలను అడ్డుకోగలవు.
వెల్లుల్లి: నాలుగు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి.. గాస్లు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లను వడకట్టి.. స్ర్పే బాటిల్‌లో పోసుకోవాలి. చల్లారాక ఇంటి బయటా, బాల్కనీలో చల్లితే.. దోమల తీవ్రత తగ్గుతుంది.
కర్పూరం: కప్పు వేప నూనెలో.. మెత్తగా పొడిచేసిన కర్పూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్‌లో ఉంచి.. వాడితే... గదిలో దోమలు, ఇతర పురుగులు వెంటనే చనిపోతాయి.
నిమ్మగడ్డి నూనె: ఇది సూపర్‌ మార్కెట్లలో లభ్యమవుతుంది. పన్నెండు చుక్కల నిమ్మగడ్డి నూనెను పావు కప్పు వేడి నీళ్లలో వేయాలి. ఈ నీళ్లను స్ర్పే బాటిల్‌లో తీసుకుని తలుపులూ, కిటికీల మూలల దగ్గర పిచికారీ చేస్తే.. కీటకాలు, పురుగులు ఇంట్లోకి రావు.

ఇష్టంగా చేసేద్దాం.. వ్యాయామం
వ్యాయామం చేయాలంటే జిమ్‌కే వెళ్లాలా? అవసరం లేదంటారు నిపుణులు. చిన్నచిన్న వ్యాయామాల్ని ఇంట్లోనే చేయడం అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యం సొంతమైనట్లేనని చెబుతున్నారు.
* రోజూ ఇరవై నిమిషాల నుంచి అరగంట చొప్పున వారంలో ఐదు రోజులు.. నడవడం అలవాటుగా మార్చుకోండి. అలాగే దగ్గరిదగ్గరి పనులకు స్కూటీనో, ఆటోనో ఎక్కకుండా నడకకే ప్రాధాన్యం ఇచ్చి చూడండి. సన్నబడటమే కాదు.. గుండెకూ మంచిది. 
* కార్డియో వ్యాయామాలు చేయాలంటే జిమ్‌కి వెళ్లాల్సిందే అనుకుంటున్నారా? అవసరం లేదు. వేగంగా నడిచి లోతుగా, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అంతకు మించిన కార్డియో(గుండె) వ్యాయామం మరొకటి లేదు. 
* మెట్లు ఎక్కిదిగడం కూడా మంచి వ్యాయామమే! దీనివల్ల నడుము దిగువ భాగానికి తగిన శ్రమ అందుతుంది. ఇంట్లో కూడా చిన్నచిన్న స్ట్రెచింగ్‌, వ్యాయామాలూ, పుషప్‌లు ప్రయత్నించండి. ఇవి బరువును అదుపులో ఉంచడమే కాదు, కండరాలకూ ఎంతో మేలుచేస్తాయి. 
* వ్యాయామాన్ని పిచ్చిగా ప్రేమించే ఓ అమ్మాయిని స్నేహితురాలిగా చేసుకోండి. ఆమెతో మీ వ్యాయామ విశేషాలు పంచుకుంటుంటే ఉత్సాహం పెరుగుతుంది. మీరు పొరపాట్లు చేసినా సరిదిద్దుతారు. ఇలాంటివాళ్లే మీరు వ్యాయామం మానకుండా చూస్తారు!

ఇరవైల్లోనూ బీపీ పరీక్ష!
నలభైలు దాటాక మాత్రమే బీపీ, కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలనేదీ నిన్నటి మాట. ఈ రోజుల్లో ఇరవైల్లో ఉన్న అమ్మాయిలూ ఈ కింది పరీక్షలు అప్పుడప్పుడూ చేయించుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటో, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలో చూద్దామా.
అధిక రక్తపోటు: పద్దెనిమిదేళ్లు దాటినప్పటినుంచీ ప్రతి రెండేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. అలా చేయించుకున్నప్పుడు అది 120/80 ఉంటే.. అధిక రక్తపోటు సమస్య లేదని అర్థం.
కొలెస్ట్రాల్‌: ఇరవైఏళ్లు వచ్చినప్పటినుంచీ ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్షా తప్పనిసరిగా చేయించుకోవాలి. బరువున్నవారు మాత్రం.. ఈ పరీక్ష విషయంలో వైద్యులు చెప్పినట్లుగా చేయించుకోవాలి. ఇది 200ఎంఎల్‌/డీఎల్‌ ఉండేలా చూసుకోవాలి.
పాప్‌స్మియర్‌: లైంగిక జీవితం మొదలుపెట్టిన తరవాతి ఏడాది నుంచీ ఈ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. దానివల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేయొచ్చు. దీన్ని ప్రతి రెండేళ్లకోసారి చేయించుకోవాలి.
రొమ్ముపరీక్ష: ఇరవైఏళ్లప్పటినుంచీ.. ఏడాదికోసారి స్వీయ రొమ్ము పరీక్ష చేయించుకోవాలి. నలభైఏళ్లు దాటాక మాత్రం మామోగ్రామ్‌ని చేస్తారు.
బీఎంఐ: అధిక బరువున్నవారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. దీని ఫలితాన్ని బట్టి బరువు ఎంతమేరకు తగ్గాలో సూచిస్తారు వైద్యులు. సాధారణంగా ఇది 23 దాటకుండా ఉంటే మంచిది!


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list