MohanPublications Print Books Online store clik Here Devullu.com

మదుపు చేస్తే.. నష్టం వస్తోందా?-Madhupucheste nastam vastundha


మదుపు చేస్తే.. నష్టం వస్తోందా? 
స్టాక్‌ మార్కెట్‌ వృద్ధి పథంలో సాగుతోంది. సూచీలు జీవిత కాల గరిష్ఠాన్ని చేరుతున్నాయి. అయినా, చాలామంది షేర్లలో, మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు సిద్ధపడట్లేదు. కారణం.. మార్కెట్లో పెట్టుబడులు పెడితే నష్టం వస్తుందనే అపోహతోనే. కానీ, వాస్తవం వేరు. కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా.. ఎలాంటి సందర్భంలోనైనా మంచి లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంది.. మరి అవేమిటో చూద్దామా.

‘నేను మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాను.. నష్టం వచ్చింది. అందుకే, నేను నా డబ్బును సురక్షిత పథకాల్లో మాత్రమే జమ చేస్తాను’.. మార్కెట్‌లో మదుపు చేసి.. నష్టాలు చవిచూసిన వారు సాధారణంగా అనే మాటే ఇది. సాధారణంగా ఎక్కడైనా నష్టం వాటిల్లితే.. ఇక దాని వైపు కన్నెత్తి చూడకపోవడం మనలో చాలామందికి అలవాటే. పెట్టుబడుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తింపచేస్తారు. కానీ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని, ‘నాకెందుకు నష్టం వచ్చింది’ అనే సమీక్ష మాత్రం చేసుకోరు. 
మనం పొరపాటు చేశామా? పథకాల ఎంపిక సరిగా ఉందా? మోసపూరిత పథకాలను ఎంచుకున్నామా?లాంటివి గుర్తించాలి. (చాలామంది మదుపరులు ఒకే విధమైన పొరపాటును చేస్తుంటారన్న విషయాన్ని మనం గమనించాలి) 
ఈక్విటీ మార్కెట్లు లేదా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే నష్టం వస్తుందని భావిస్తే.. మరి ఎందుకు కొన్ని కోట్ల మంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు.. సంపద సృష్టించాలంటే దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో మదుపు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు విశ్వసిస్తున్నారు? 
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చాలా సందర్భాల్లో మదుపరులు చేసే కొన్ని పొరపాట్లే.. వారి నష్టాలకు కారణం అవుతాయి. కానీ, మార్కెట్‌ కారణం కానేకాదు. 
ఎంత కాలం మదుపు చేయాలి? 
ఒక పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు దాన్ని ఎంత కాలం కొనసాగించాలనే విషయాన్నీ ముందే గుర్తించాలి. ఇలా కాల వ్యవధిని నిర్ణయించుకోలేకపోతే మన తప్పులు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. 1) స్వల్పకాలంలోనే రెట్టింపు లాభాలు ఆర్జించాలని అనుకుంటాం. 2) అనుకూలంగా లేని పథకాల్లో పెట్టుబడి పెట్టడం.. ఉదాహరణకు ఏడాది కాలం పెట్టుబడి కోసం ఈక్విటీలను ఎంచుకోవడం అన్నమాట. 3) ప్రతికూల సమయంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం. అంటే, మనం మదుపు చేయగానే మార్కెట్‌ పడిపోతే.. ఆందోళనతో పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
అందుకే, సాధించాల్సిన లక్ష్యం, దానికి ఉన్న వ్యవధి ఈ రెండింటినీ గుర్తించి మదుపు చేస్తే.. సరైన పథకాన్ని ఎంచుకొని, అందులో మదుపు చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. రాబడిని కూడా అంచనా వేసుకోవచ్చు. అందుకే, పెట్టుబడులకు ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడే అది మీకు మదుపు చేయాలనే కోరికను కలిగిస్తుంది. 
ఒకవేళ మీరు మదుపు విషయంలో ఎలాంటి లక్ష్యం పెట్టుకోలేదని అనుకుందాం. మరి అప్పుడు పెట్టుబడులకోసం కనీస వ్యవధిని నిర్ణయించుకోవాలి. ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత ఫండ్లలో కనీసం 5ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి. ఇన్‌కంఫండ్లలో మదుపు చేసినప్పుడు కనీసం 3ఏళ్లపాటు వేచి చూడాలి. పెట్టుబడులు, పథకాల ఎంపికకు సంబంధించి కనీస సూత్రాలివి. పెట్టుబడికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పాటించకుండా.. పథకాలను నిదించడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. 
రాబడులపై సరైన అంచనా 
‘నా మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులపై కేవలం 15శాతం మాత్రమే రాబడి వచ్చింది. నేను 25% వరకూ ఆశించాను. ఇక నేను మదుపు చేయాలనే ఆలోచన విరమించుకుంటున్నాను’ పెట్టుబడులను ఆపేసేందుకు కొంతమంది చెప్పే సాధారణ కారణమిదే. పారదర్శకత ఏ మాత్రం లేని, మోసపూరిత పథకాలు తాత్కాలికంగా ఇలాంటి రాబడులను అందించవచ్చు. కానీ, ఇవి ఎంతో నష్టభయంతో కూడుకున్నవని మర్చిపోకూడదు. మీరు సురక్షిత పథకాల్లో వచ్చే రాబడులతో సంతోషంగా ఉన్నప్పుడు.. ఈక్విటీలు ఇచ్చిన రాబడితో ఎందుకు సంతోషపడరు? 
ఎందుకంటే.. ఈక్విటీల్లో రాబడికి ఎలాంటి హామీ ఉండదు. కానీ, ఇందులో మీరు భరించే నష్టభయానికి పరిహారంగా ఇతర ఏ పెట్టుబడులతో పోల్చినా మంచి రాబడినే ఇస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి ఎంత రాబడిని అందిస్తుందన్నదే ప్రామాణికం కావాలి కానీ.. ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు సొంతంగా నిర్ణయించుకున్న రాబడి శాతాలను చూసుకోకూడదు. 
వీటన్నింటినీ పరిశీలించుకుంటూ.. మంచి రాబడుల కోసం ప్రయత్నిస్తూ.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించుకొని, క్రమశిక్షణతో మదుపు చేస్తే.. మార్కెట్‌ మీరు ­హించిన దానికన్నా సానుకూల ఫలితాలను అందిస్తుంది. పెట్టుబడి పథకాల పనితీరును తెలుసుకోకుండా మదుపు చేసినప్పుడే నష్టం మూటగట్టుకునే అవకాశం ఉందని గుర్తించాలి.
- విద్యా బాల, హెడ్‌, మ్యూచువల్‌ ఫండ్‌ రీసెర్చ్‌, 
FundsIndia.com
పెట్టుబడా.. వ్యాపారమా? 
చాలామంది మదుపరులు తాము దీర్ఘకాలం కోసం మదుపు చేస్తున్నాం అనుకుంటారు. కానీ, మదుపు చేస్తున్న ఫండ్‌/షేరు వేగంగా వృద్ధి చెందాలని కోరుకుంటారు. ఒకవేళ అనుకున్న ఫలితాలను అందించలేకపోతే వెంటనే దాన్నుంచి బయటకు వస్తుంటారు. కొంతమంది నేరుగా షేర్లలో మదుపు చేస్తుంటారు. వెంటనే తక్కువ ‘ఎన్‌ఏవీ’ ఉందన్న ఉద్దేశంతో మ్యూచువల్‌ ఫండ్ల వైపు దృష్టి పెడతారు. ఫండ్లలో 52వారాల కనిష్ఠ, గరిష్ఠ ఎన్‌ఏవీలు ఎంతున్నాయన్నది చూస్తుంటారు. 
మార్కెట్‌ వృద్ధి చెందుతున్నా.. కాస్త దిద్దుబాటులో ఉన్నా.. క్రమానుగత పెట్టుబడులను (సిప్‌) కొనసాగించాలి. కానీ, కొందరు మార్కెట్‌ కొంత వృద్ధి చెందగానే.. తమ ‘సిప్‌’లను ఆపేస్తుంటారు. ఎన్‌ఏవీ పెరుగుతున్నప్పుడు దాన్ని సగటు చేయడం సాధ్యం కాదని భావిస్తుంటారు. 
ఇవన్నీ సరైన పెట్టుబడి పద్ధతులు కావు. వీటివల్ల మీ డబ్బూ వృద్ధి చెందదు. దీనివల్ల మీ సంపద పెరగడానికి ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మీ పోర్ట్‌ఫోలియోకు నష్టం కూడా వాటిల్లవచ్చు. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మదుపు చేసేప్పుడు అవి ‘ట్రేడింగ్‌’ కోసం ఉద్దేశించినవి కావని గుర్తించాలి. 
పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలంటే.. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు.. ఫండ్‌/షేరు పూర్తిగా మీరు అనుకుంటున్న దానికి భిన్నంగా పనిచేస్తూ.. నష్టాలు వస్తున్నప్పుడు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకునే విషయాన్ని పరిశీలించాలి. 
* ఏదో ఒకటి రెండు కారణాలతో సిప్‌ ఆపేయడం కూడా మంచిది కాదు. మార్కెట్‌ 2%, 3% పెరిగినంత మాత్రాన మీ పెట్టుబడుల సగటుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉండాలి.



కనీస నిల్వ.. లెక్క ఇలా!
బ్యాంకు పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఉంచడం తప్పనిసరి. లేకుంటే రుసుముల భారం తప్పదు.. పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు నిర్వహించినా కొంత రుసుము భరించాల్సిందే.. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయాలతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలయ్యింది. మరి, ఈ పెరిగిన సేవా రుసుములు భారం కాకుండా ఏమైనా మార్గాలున్నాయా? తెలుసుకుందాం!
బ్యాంకు పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకుంటే అపరాధ రుసుము విధించే విధానం ఎప్పటి నుంచో ఉంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాలో కనీస నిల్వ అవసరం లేకుండా కొన్నేళ్లపాటు వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం దీన్ని తీసేశాయి. 
అసలు కనీస సగటు నిల్వ అంటే ఏమిటో చూద్దాం! 
కొన్ని బ్యాంకులు, నెలవారీ సగటు నిల్వను, మరికొన్ని త్రైమాసిక సగటు నిల్వలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నెలవారీ కనీస సగటు నిల్వను పరిగణనలోనికి తీసుకుంటుండగా.. ఆంధ్రాబ్యాంకు మూడు నెలల సగటు నిల్వను లెక్కిస్తోంది. 
ఇక్కడ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)ను ఉదాహరణగా తీసుకుందాం! హైదరాబాద్‌, ముంబాయి తదితర మహా నగరాల్లోని ఎస్‌బీఐలో పొదుపు ఖాతా ఉన్నవారు తమ ఖాతాల్లో నెలవారీ కనీస సగటు నిల్వ రూ.5వేలు ఉంచాలి. అంటే, ఖాతాలో రోజుకు రూ.5,000 చొప్పున నెల మొత్తం ఉండాలి. బ్యాంకులలో ఈ నిల్వను రోజులలో లెక్కిస్తారు. నెలలో 30 రోజుల్లో రోజుకు రూ.5వేలు అంటే ఒక రోజులో రూ.1,50,000 ఉంచినా సరిపోతుంది. (నెలలో 31 రోజులు ఉంటే రూ.1,55,000). ఖాతాలో మూడు రోజుల పాటు రూ.50,000 నిల్వ ఉన్నా అపరాధ రుసుము పడదు. జీతం తీసుకునే వారు ఒక్క రోజులో మొత్తం ఖర్చు చేయరు. ఉదాహరణకు ఒకటో తారీఖున రూ.50,000 జీతం పొదుపు ఖాతాలో జమ అయ్యిందనుకుందాం. ఉద్యోగి ఇంటి అద్దె, తదితర ఖర్చుల కోసం రూ.30,000 ఒకటో తారీఖునే తీసుకున్నా మిగిలిన రూ.20వేలను 8 రోజుల పాటు సేవింగ్‌ ఖాతాలో ఉంచితే నెలవారీ కనీస సగటు నిల్వ రూ.1,60,000 (8×20,000) ఉంచినట్లే. కాబట్టి, బ్యాంకు రూ.100 అపరాధ రుసుము విధించదు. ఖాతాలో ఉండాల్సిన నెలవారీ సగటు నిల్వలో లోటు సగం కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము రూ.50 విధిస్తారు. 
* గ్రామాల్లో పొదుపు ఖాతా ఉన్న వారు నెలవారీ సగటు నిల్వ రూ.1,000 ఉంచినా చాలు. చాలా బ్యాంకుల్లో ఇదే విధానం అమల్లో ఉంది. అంటే, ఒక్క రోజు రూ.30,000 (నెలలో 31 రోజులు ఉంటే రూ.31,000), లేదా రెండు రోజులపాటు రూ.15,000, నాలుగు రోజులపాటు రూ.8,000, ఎనిమిది రోజులపాటు రూ.4,000 ఉన్నా చాలు. 
* ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులూ కార్పొరేట్‌ శాలరీ అకౌంట్లను అందిస్తున్నాయి. ఈ తరహా ఖాతాల్లో ఎలాంటి సగటు నిల్వ అవసరం లేదు. 
* పలు ప్రైవేటు బ్యాంకులు కనీస నిల్వ నిబంధన పాటించని ఖాతాదారులకు రూ.100 నుంచి రూ.600 వరకూ రుసుములు విధిస్తున్నాయి. మీ బ్యాంకును సంప్రదించి, ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. 
* ఒక ­రి నుంచి మరో ­రికి మారారనుకోండి. అప్పుడు పాత ఖాతాను నిర్వహించకుండా ఉండే సందర్భాల్లో దాన్ని రద్దు చేసుకోవడమే మంచిది. లేకుంటే అనవసరంగా అపరాధ రుసుముల భారం భరించాల్సి ఉంటుంది. 
ఏటీఎంలు వాడినా.. 
* ఏటీఎం లావాదేవీల విషయంలోనూ బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. కాబట్టి, ఉద్యోగులు తన జీతం రాగానే తన పొదుపు ఖాతా నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని తన జీవిత భాగస్వామి, పిల్లల పేరుతో ఉన్న ఖాతాలోకి మళ్లించాలి. దీనికోసం ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఖాతాలైతే నామమాత్రపు రుసుములు ఉంటాయి. అదే బ్యాంకు ఖాతాకు ఎలాంటి రుసుములు ఉండవు. దీనివల్ల ఏటీఎం లావాదేవీలను గరిష్ఠంగా ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. ఎస్‌బీఐలో నెలవారీ సగటు నిల్వ రూ.25వేల కంటే ఎక్కువ ఉన్న వారికి అపరిమిత లావాదేవీలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇలాంటి అవకాశం మీ బ్యాంకు కల్పిస్తోందా?ఒకసారి మీ బ్యాంకు శాఖను సంప్రదించి తెలుసుకోండి. 
* ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటిలో కనీస నిల్వ, అపరాధ రుసుము, ఏటీఎం నిర్వహణ ఖర్చులు లాంటి రుసుములు ఏవీ లేకుండా కూడా ప్రాథమిక పొదుపు ఖాతా (బేసిక్‌ సేవింగ్‌ బ్యాంకు డిపాజిట్‌) ఖాతాను తెరవచ్చు. అయితే, ఇందులో నెలకు 4 లావాదేవీల కంటే ఎక్కువ అనుమతించరు. ఇంటి పెద్ద పేరుతో మామూలు సేవింగ్‌ ఖాతా నిర్వహించుకుంటూ.. చదువుకునే పిల్లలు, ఇంటికి పరిమితమయ్యే వారి పేరుతో ఈ బేసిక్‌ సేవింగ్‌ బ్యాంకు డిపాజిట్‌ ఖాతా తెరిస్తే రుసుముల భయం ఉండదు. 
* ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు వంటి వ్యక్తిగత నిర్ధారణ కార్డులు లేనివారు బ్యాంకులలో తెరచిన స్మాల్‌ అకౌంట్‌లో కూడా నెలవారీ కనీస నిల్వ నిబంధనలు వర్తించవు. కానీ, ఈ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో జమలను ఒక లక్ష కంటే ఎక్కువ అనుమతించరు. ఖాతాలో నగదు ఉపసంహరణ పరిమితి నెలకు రూ.10వేలు. ఖాతాలో ఎప్పుడైనా రూ.50వేల కంటే ఎక్కువ జమలు అనుమతించరు. ఏ బ్యాంకులోనైనా ఈ స్మాల్‌ అకౌంట్‌ను తెరవచ్చు. ఒక ఏడాది వరకూ ఈ ఖాతా నిర్వహించుకోవచ్చు. అల్పాదాయ వర్గాల వారికోసం ఉద్దేశించిన ఖాతాలివి. 
* ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో సేవింగ్‌ ఖాతాలో కనీస నిల్వ నిబంధన లేదు. కానీ, ఖాతాలో రూ.1,00,000 కంటే ఎక్కువ నిల్వ అనుమతించరు. 5.5% వడ్డీ లభించే పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు సేవింగ్‌ ఖాతాదారులు పోస్టల్‌ ఏటీఎంలో అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు. కానీ, ఒక్కో నగదు ఉపసంహరణలో రూ.10వేలకు మించి తీసుకోవడం కుదరదు. రోజువారీ గరిష్ఠ నగదు ఉపసంహరణ రూ.25,000. పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు శాఖలో ఉచిత లావాదేవీల పరిమితి నెలకు నాలుగు.
- వంగా రాజేంద్ర ప్రసాద్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list