జాబాలి తీర్థం
రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు భగవంతుని తత్వ గుణ రహస్యాన్నీ, ప్రభావాన్నీ చక్కగా ఎరిగిన వాడు. విద్యా నిపుణుడై ఇచ్ఛానురూప ధారణ సమర్థుడై శ్రీరామ నామ స్మరణలో లీనమైన రామభక్తుడు. సాక్షాత్తు రుద్రతేజో రూపునిగా జగద్రక్షణకు అవతరించిన కారణ జన్ముడు అంజనీసుతుడు. జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన పరమ పవిత్ర దివ్య క్షేత్రం జాబాలి. ఇది చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది.
తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే దారిలో కొలువై ఉంది ఈ క్షేత్రం. స్కందపురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. పక్షుల కిలకిలరావాలతో ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఈ దివ్య క్షేత్రం అలరారుతోంది.
పురాణగాథ
ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రాశస్త్యంలో ఉంది. ముప్ఫై కోట్ల మంది దేవతల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు శ్రీ రాముని అవతారంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది. అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాల్లో జపం చేస్తూ ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయనారంభిస్తారు. అప్పుడు రుద్రుడు ఆయన తపస్సుకు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమై జాబాలి మహర్షికి తన రాబోవు అవతారాన్ని ముందుగానే చూపిస్తారు. అదే హనుమంతుని అవతారం. దేవతలందరితో కలిసి వానరాగ్రగణ్యుడిగా అవతరిస్తానని వివరిస్తాడు. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరతయి కనుక జాబాలి తీర్థంగా పేరొందింది.
అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.
హనుమంతుడు వానరావతార భక్తాగ్రగణ్యుడు. వానరాలకు చెట్లు చేమలు అంటే ప్రీతి. అటువంటి హనుమంతుడు దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఉన్నాడు. చుట్టూ జలపాతాలతో పవనస్తుడైన ఆంజనేయుడు ఈ సుందర దివ్య ధామంలో కొలువై ఉన్నాడు.
రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ సదా కొలువై ఉంటానని హనుమంతుడు వివరించాడు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా రామ భక్తుడిగా రామదాసునుదాసునిగా ఆంజనేయుడు గర్భాలయంలో తేజరిల్లుతుంటాడు. తోరణ గతుడై సింధూరంతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి వారి శిరస్సు పై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి. అభయం, ఆనందం కలబోసిన స్వరూపం ఆంజనేయుడు. అటువంటి దివ్య మూర్తిత్వంతో ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు.
ఆలయం వెలుపల ఉన్న వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సత్వరం కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. రావి చెట్టు మొదలులో ఉన్న వృక్ష మూల గణపతిని దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటారు భక్తులు. ఎందరో మహాత్ములు,సాధువులు, యోగులు, మునులు సిద్ధిపొందిన పరమ పవిత్ర ప్రదేశం ఇది.
ఇక్కడ ఉన్న తీర్థరాజంలో పంచ మహాపాతకాలు, భూతపిశాచ బాధలు ఉన్నవారు స్నానమాచరిస్తే అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర స్థలంలో సీతాకుండ్, రామకుండ్ తీర్థాలు ఉన్నాయి
స్థలపురాణం
శ్రీ రామచంద్రుడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తూ సీతాసమేతంగా ఇక్కడి తీర్థంలో స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి. రాముడు స్నానమాచరించిన తీర్థాన్ని రామకుండ్‌గా, సీతాదేవి స్నానమాచరించిన తీర్థాన్ని సీతాకుండ్‌గా పేర్కొంటారు. కొండలపై నుంచి వచ్చి ఈ తీర్థాలలో నీరు చేరుతూంటుంది. కాబట్టి ఈ నీటిలో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తుల నమ్మకం. వేణుగోపాల స్వామి వారి ఆలయం, హథీరామ్ బావాజీ సమాధి కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తుంటారు. ఇది తిరుమలకు కొద్ది దూరంలోనే ఉండటంతో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఏడు మంగళవారాల పాటు ఇక్కడి రామకుండ్ తీర్థంలో స్నానమాచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.
ఎలా చేరుకోవాలి
తిరుమల నుంచి ఈ క్షేత్రం ఐదు కిలోమీటర్ల దూరంలో పాపనాశానినికి వెళ్లే దారిలో కొలువై ఉంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565