కనువిందు చేసే కోవళమ్
వీకెండ్‌లో చుట్టి రావడానికి కేరళలోని ‘కోవళమ్’ బెస్ట్ ఆప్షన్. రెండు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటే మీకు కావాల్సినంత ఆహ్లాదం, ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది. ఆధ్యాత్మిక అనుభవం సొంతమవుతుంది. ఆ విశేషాలు ఇవి...
పద్మనాభస్వామి ఆలయం
వీకెండ్ టూర్‌లో దైవదర్శనం కూడా ఉండాలంటే పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించాలి. శ్రీమహావిష్ణువు పద్మనాభస్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వస్త్రధారణ నిబంధనలు అమల్లో ఉంటాయి. కాబట్టి దర్శనానికి వెళ్లే వారు తప్పనసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలి.
నేపియర్ ఆర్ట్ మ్యూజియం అండ్ గ్యాలరీ
కోవళమ్ వెళ్లిన వారు చూడాల్సిన మరో ప్రదేశం ఇది. కోవళమ్ సిటీకి పురాతన చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలుసుకోవాలంటే నేపియర్ ఆర్ట్ మ్యూజియంను సందర్శించాలి. ఇందులో ఏనుగు దంతాలతో మలిచిన చిత్రాలు, సంప్రదాయ ఆభరణాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మద్రాసు గవర్నర్ లార్డ్ నేపియర్ పక్కాగా డాక్యుమెంటేషన్ చేయించడంతో అవి ఈ తరానికి ఎన్నో విశేషాలను అందిస్తున్నాయి. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు.
లైట్‌హౌజ్ బీచ్
ఇండియాలో ఉన్న ప్రముఖ బీచ్‌ల్లో ఇదొకటి. బీచ్ సమీపంలో కురుంకల్ హిల్స్‌పై లైట్‌హౌజ్ ఉంటుంది. ఈ బీచ్ అందాలు పర్యాటకుల మదిని దోచేస్తుంటాయి. కోవళమ్ వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. సాయంత్రం వేళ పర్యాటకులతో బీచ్ సందడిగా ఉంటుంది. సూర్యాస్తమయ అందాలు కట్టిపడేస్తాయి.
కరామన నది
అరేబియా సముద్రంలో కలిసే ఈ నది ఒక చోట ఇరుకైన ప్రదేశం గుండా సాగిపోతుంటుంది. ఆ ప్రాంతానికే కరామన అని పేరు. ఈ నది అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. నది చెంతనే తిరువళ్లమ్ బోట్ క్లబ్ ఉంటుంది. నదిలో ప్రయాణించడానికి ఇక్కడ టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. నదిలో ప్రయాణం మధురానుభూతిని అందిస్తుంది.
వెల్లయాని లేక్
కోవళమ్‌కు ఏడు కి.మీ దూరంలో ఉంటుంది. ఓనం పండుగ సమయంలో ఇక్కడ బోట్ రేసింగ్ నిర్వహిస్తుంటారు. పర్యాటకులు ఇక్కడ బోట్ రైడింగ్‌ను ఇష్టపడుతుంటారు. లేక్ అందాలు ఎంత సేపు చూసినా తనివి తీరదు.
నెయ్యార్ డ్యాం
తిరువనంతపురం నుంచి 32 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని అందిస్తుంది. ఇక్కడ ఉన్న ధన్వంతరి ఆశ్రమాన్ని తప్పక సందర్శించాల్సిందే. శివానంద ఆశ్రమంలో యోగా నేర్చుకోవచ్చు. హఠయోగా నేర్పిస్తారు. ఇక్కడ ఔషధ మూలికలు ప్రత్యేకం. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం రెట్టింపు ఉత్సాహాన్ని అందిస్తాయి.
రాక్ కట్ కేవ్ టెంపుల్
8వ శతాబ్దానికి చెందిన ఆలయం ఇది. వింజం రాక్ కట్ కేవ్ టెంపుల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. తిరువనంతపురం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పురాతన ఆలయం నిర్మించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎలా చేరుకోవాలి?
విమానంలో : కోవళమ్‌కు 15 కి.మీ దూరంలో త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల నుంచి ఇక్కడకు విమాన సర్వీసులు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి కోవళమ్ వెళ్లడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
రైలులో : కోవళమ్‌కు 15 కి.మీ దూరంలో త్రివేండ్రం సెంట్రల్ రైల్వేస్టేషన్ ఉంది. ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలులో ఇక్కడికి చేరుకుంటే ట్యాకీలో కోవళమ్ చేరుకోవచ్చు.
రోడ్డు మార్గంలో : మధురై నుంచి 303 కి.మీ దూరంలో కోవళమ్ ఉంటుంది. చెన్నై 728 కి.మీ, బెంగళూరు 724కి.మీ దూరం ఉంటుంది. బస్సులు ప్రధాన నగరాల నుంచి అందుబాటులో ఉన్నాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565