MohanPublications Print Books Online store clik Here Devullu.com

నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వరుడు_nagulabanda subramanya


నాగలమడక సుబ్రహ్మణ్య దర్శనం 

భవరోగ నివారణం


       తారకాసురుడనే లోక కంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం పార్వతీ పరమేశ్వరుల కుమారుని గా గంగాసుతునిగా, కార్తికేయునిగా, సుబ్రహ్మణు నిగా, షణ్ముఖునిగా ఇలా అనేక నామాలతో అనేక రూపాలతో జన్మించాడు కుమారస్వామి.
తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధి నివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడనే పేర్గాం చాడు.
ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుని సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజిం చి పుట్టలో పాలుపోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఆ కారణంగానే దేశంలో చాలా ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడిని సర్పరూపంగా పుట్టల్లో ఉండే సుబ్రహ్మణ్యునిగాను సర్పప్రతిష్ఠలను నెలకొల్పి మరీ కొలుస్తుంటారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైన క్షేత్రాలు మనదేశంలో అనేకం. వాటిలో ముఖ్యమైన మూడు క్షేత్రాలు కర్నాటక రాష్ట్రంలో ఆది, మధ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి కెక్కాయ. ఈ మూడు క్షేత్రాలలో అంత్య సుబ్రహ్మణ్య దివ్య క్షేత్రం నాగలమడక.
నాగలమడక ఓ చిన్ని గ్రామం. స్వామి వారి లీలా విశేషాలవల్ల ఆ గ్రామ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. నాగల మడకను నాగలమడికె అని కూడా పిలుస్తారు.

ఈ దివ్యాలయానికి సుమారు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రకృతి అందాలతో అలరారుతూ ఈ ఆలయం పురాతన కాలం నాటి రూపు రేఖలతో దర్శనమిస్తుంది. శే్వత వర్ణ శోభితంమైన గోపురం చూపరులను ఆకర్షిస్తుంది.
సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం అన్నం బట్టారు అనే భక్తుడిని అనుగ్రహించి స్వామి ఇక్కడ కొలువు తీరారు. స్వామివారు భూమిలో నాగలితో దున్నగా లభించారు కనుక ఈ క్షేత్రానికి నాగలి మడికె అని పేరొచ్చిందని స్థలపురాణం చెబుతుంది.

గర్భాలయంలో సర్పాకృతిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు రాతి శిలగా కొలువుతీరాడు. గర్భాలయం బయట ఆలయం చుట్టు నాగదేవతల శిలా మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఉత్తర పినాకినీ నదీ తీరంలో నాగలి దున్నుతుండగా లభించిన శిలామూర్తినే స్వామి వారి అభీష్టం మేరకు భక్తుడైన అన్నం భట్టారు ప్రతిష్టించారు.
సర్పరూప సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ శుభాలనివ్వడమే కాక రాహకేతు దోషాలకు కూడా పరిహారం చేస్తుందని అంటారు.

నాగలమడక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారంతోపాటు విశేష పర్వదినాల్లో స్వామి వారికి చేసే విశేషఅర్చనాదులు జరుపుతారు.
ఇదే ప్రాంగణంలో మరో పక్క కల్యాణ మండపం ఉంది. ఇక్కడ స్వామివారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ వల్లీ దేవసేన సహితంగా వున్న ఉత్సవ మూర్తులు దర్శనమిస్తాయి.
ఆలయ ప్రాంగణంలో బయట ఓ విశాలమైన వృక్ష రాజం కింద నాగదేవతల మూర్తులు అనేకం దర్శనమిస్తాయి. కుజదోషం ఉన్నవారు, సంతాన లేమితో బాధపడే వారు ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఇక్కడ ఈ ప్రాంగణంలో నాగదేవతల మూర్తులను సుబ్రహ్మణ్య రూపంగా ప్రతిష్టించి కొలిచే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. అలా చేయడంవల్ల వారి వారి దోషాలన్నీ తీరి శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
నాగలమడక శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రతి ఏటా తుల్లి విస్తరాకుల ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.

నాగలమడక స్వామిని దర్శించుకుని వారి బాధలను స్వామికి నివేదిస్తే చాలు వారి బాధలు మటుమాయం అవుతాయని కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం .
ఓ విశేషమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే మహత్తర సుబ్రహ్మణ్య క్షేత్రం నాగలమడక శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం. ఈ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.
- చివుకుల రామమోహన్




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list