శివ పారమ్యం
ఈ ప్రపంచమంతా పరమ శివమయమే తప్ప మరొకటి కాదనడమే ‘శివ పారమ్యం’. పారమ్యం అంటే ‘ఉత్కృష్టం’ అని అర్థం. ఇదే విషయాన్ని శివమహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు అనే గంధర్వుడు వర్ణిస్తాడు. ‘ఓ శివా! నీవు సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, జలం, ఆకాశం, భూమి అని; క్షేత్రజ్ఞుడివి అని పండితులెందరో చెబుతున్నారు. కాని, నీవు తప్ప నాకు మరేమీ కనిపించడం లేదు’ అని అతడు స్తుతిస్తాడు.
పుష్పదంతుడి మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. మనిషికి పొద్దున నిద్రలేవగానే కనిపించేది సూర్యుడు. రాత్రివేళ కనిపించేవాడు చంద్రుడు. మనిషి శరీరంలో, వెలుపలా ఉండేవి పంచభూతాలు. అతడిలో ఉండే ఆత్మ- క్షేత్రజ్ఞుడు. ఇలా ఎనిమిది రూపాల్లోనూ కనిపించేది శివుడే అని ఆ గంధర్వుడి మాటల ఆంతర్యం!
ఈ ఎనిమిది రూపాలూ శివుడిలోనివేనా లేక ఆయన కంటే భిన్నమైనవా అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. శివుడు వేరు, ఎనిమిది రూపాలూ వేరు అనుకుంటే- ఆయన నిత్యుడు, సత్య స్వరూపుడు, అద్వితీయుడు కాదా? ఆ ఎనిమిది రూపాలూ నిత్యాలు, సత్యాలు, అద్వితీయాలవుతాయా అని పలు సందేహాలు కలుగుతాయి.
సూర్యుడు పగటిపూట కనిపిస్తాడు కాని, రాత్రివేళ కనిపించడు. చంద్రుడు రాత్రివేళ కనిపిస్తాడే తప్ప, పగటిపూట కాదు. అంటే, ఆ ఇద్దరూ శాశ్వతులు కారు. పంచభూతాల్లోనూ ఒక దానిలో మరొకటి కనిపించదు. అంటే- భూమిలో, జలంలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలోనూ మిగిలిన నాలుగు ఉండవు. క్షేత్రజ్ఞుడిగా భావించే ఆత్మ సైతం పరమాత్మ అయిన శివుడిలోనే లీనమవుతుంది కాబట్టి, ఇదీ శాశ్వతమైనది కాదు. ఇలా అన్నీ అశాశ్వతాలే కావడంతో, చివరికి మిగిలేది శివుడొక్కడే! ఇదే శివ పారమ్యం.
సూర్యుడు వంటి అష్టమూర్తులు శివుడు అనే ఉనికిలోనే ఉంటాయి. ఏ పదార్థమైనా, ఉనికి లేకుండా ఉండలేదు. ఉనికి శాశ్వతమే కాని, పదార్థం శాశ్వతం కాదు. అంటే- ఉనికి అనేది శివస్వరూపం. ఆ శివుడే లేకుంటే ఈ ఎనిమిది రూపాలూ ఉండవు. శివుడిలోనే ఇవన్నీ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అంతేకాని, శివుడి కంటే వేరుగా ఇవి లేవు. మట్టి అనే పదార్థం నుంచి కుండ, పాత్ర, కలశం వంటివి తయారవుతున్నాయి. అవన్నీ పగిలిపోయినప్పుడు ఆయా రూపాలు నశిస్తాయి. చివరికి మట్టి ఒక్కటే మిగులుతుంది. అలాగే శివుడిలోని అంశలు- సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, క్షేత్రజ్ఞుడు అనేవి చివరికి ఆయనలో లీనమయ్యేవే. వీటికి ప్రత్యేకమైన ఉనికి లేనే లేదు. యుగాంతాలు లేదా కల్పాంతాల్లో ఇవన్నీ శివుడిలోనే లీనమవుతాయి. ఆయన గురించి ‘నీవు తప్ప మరొకటి లేనే లేదు’ అని పుష్పదంతుడు అనడంలో అంతరార్థం అదే!
పంచభూతాలు మానవ శరీరంలో, లోకంలో ఉన్నాయి. మనిషి మరణించినప్పుడు అవి బ్రహ్మాండంలోని పంచభూతాల్లో లీనమవుతున్నాయి. మనిషి చర్మం, ఎముకలు భూమిలో కలిసిపోతాయి. శరీరంలోని నీరు ఆవిరైపోతుంది. పంచప్రాణాల్లో జ్వలించే అగ్ని చల్లారిపోతుంది. ప్రాణవాయువు గాలిలో కలుస్తుంది. మానవ శరీరంలోని శూన్యం ఆకాశంలో లీనమవుతుంది. ఇలా పిండాండం (మానవ శరీరం) రూపంలో గల పంచభూతాలు బ్రహ్మాండం (విశాల విశ్వం)లో కలుస్తాయి. బ్రహ్మాండం అంతా చివరికి శివుడిలో లీనమవుతుంది. శివుడు తన ఇచ్ఛ(కోరిక) శక్తితో తలచుకొన్నప్పుడు, మళ్లీ ఇవన్నీ పుడతాయి. కొంతకాలం నిలుస్తాయి. చివరికి మళ్లీ శివుడిలోనే లీనమైపోతాయి. ఇలా ఇవన్నీ పుడుతూ, నశిస్తూ ఉన్నా- ఏ పుట్టుకా ఏ వినాశమూ లేకుండా నిలిచి ఉంటాడు శివుడు.
శివుడొక్కడే శాశ్వతుడు. ఆయనే నిత్యం, సత్యం. ఆయనే అనంతుడు. తానొక్కడే తప్ప మరేదీ లేనివాడు కాబట్టి, శివుడు అద్వితీయుడంటాయి పురాణ గ్రంథాలు. ఇది తెలుసుకోవడమే శివ పారమ్యం - డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565