నైవేద్యం ఎందుకు?
పండుగ రోజుల్లోనో, పూజలు చేసేటప్పుడో భగవంతునికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. నైవేద్యం సమయంలో చదవాల్సిన మంత్రాలు, సాగించాల్సిన విధి తెలిసినా తెలియకున్నా... ఒక అరటిఆకులో ఆ రోజు వండిన పదార్థాలన్నింటినీ ఉంచుతారు. వాటిని భగవంతుని చూపించిన తర్వాతే ఇంట్లోనివారు భోజనానికి ఉపక్రమిస్తారు. ఇంతకీ ఈ నైవేద్యం సమర్పించడం వెనుక ఉద్దేశం ఏమైఉంటుంది?
- ఆహారం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం లోలోపల బుసలు కొడుతూ ఉంటుంది. కానీ భగవంతునికి దాన్ని అర్పించడం వల్ల... అహంకారపు దశని దాటి, అది భగవంతుని అనుగ్రహమే అన్న వినమ్రత ఏర్పడుతుంది.
- నైవేద్యం కోసం వండే ఆహారాన్ని రుచి చూడకూడదు అంటారు. అంటే వంటిని కేవలం రుచి కోసం కాకుండా, ఓ పవిత్ర యజ్ఞంగా భావించమన్న సూచన కనిపిస్తుంది. ఇలా రూపొందించిన ఆహారాన్ని సాత్వికత చేకూరుతుంది. ఆ ఆహారం తిన్నవారిలోనూ పవిత్ర భావనలు చోటు చేసుకుంటాయి.
- ఆహారం రూపొందడానికి రైతులు అవసరం, ప్రకృతి అనుగ్రహం అవసరం. ఇటు రైతులూ, ఇటు ప్రకృతి దయ తలిస్తేనే నాలుగు మెతుకులు మన చెంతకు చేరతాయి. నైవేద్యం ఆ ఆహారపు పవిత్రతను మరోమారు మనకు గుర్తుచేస్తుంది.
- మనకు లభించిన ఆహారాన్ని సాటిజీవులతో పంచుకోవాలనీ, ఇంటికి వచ్చిన అతిథల ఆకలి తీర్చాలనీ... నైవేద్యం మనకి సూచిస్తుంది.
- ద్రవ్యశుద్ధి అని ఒక మాట అంటుంటాము. అంటే మనం సంపాదించిన ప్రతి రూపాయీ నీతిగా ఉండాలని అర్థం. భగవంతునికి నైవేద్యాన్ని అర్పించే సమయంలో మనలోని ద్రవ్య శుద్ధి ఎలా ఉందో గుర్తుకురాక మానదు. సంపాదన కోసం తెలియక చేసిన తప్పులని క్షమించమనీ, తెలిసి చేసిన తప్పులను మరోసారి చేయననీ... ఆ భగవంతుని వేడుకునేందుకు ఇదో విలువైన అవకాశం.
- ఆహారాన్ని ఆ భగవంతునికి సమర్పించడంతో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న సత్యం గుర్తుకురాకమానదు. అలా భగవంతునికి నివేదించిన ఆహారాన్ని వృధా చేయకూడదన్న విచక్షణా కలగక మానదు.
- కొంతమంది తిండి ముందు కూర్చుని ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఆకలి తీర్చడమే ఆహారానికి ఉండే పరమార్థం అన్న విషయం మర్చిపోయి జిహ్వచాపల్యానికే ప్రాధాన్యతని ఇస్తారు. ఈ తరహా ధోరణ తప్పు అనీ, ఆహారం పరమ పవిత్రమనీ పెద్దలకి తెలుసు. అందుకనే నైవేద్యానికి వంకలు పెట్టకూడదంటారు.
- మన జీవితంలో కంటి ముందు ఉండే అగ్నిగుండం మన జీర్ణకోశమే! ఆ అగ్నిని శాంతింపచేసే ద్రవ్యం ఆహారమే. అందుకే మన ఒంట్లోని అగ్నిని జఠరాగ్ని అన్నారు పెద్దలు. యజ్ఞగుండంలో ఎలాగైతే నానాచెత్తా వేయమో, మంటకు తగినంత అగ్నిని వేస్తూ దానిని పవిత్రంగా చూసుకుంటామో... మన జఠరాగ్నిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. మనం అందులో వేసే ఆహారాన్ని బట్టే మన మనసూ, శరీరమూ ఆరోగ్యంగా ఉంటాయి. ఆ క్రతువుకి నివేదన మరింత పవిత్రతను తీసుకువస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565