MohanPublications Print Books Online store clik Here Devullu.com

నిర్జల ఏకాదశి_Nirjala ekadasi



అన్ని ఏకాదశులకూ సాటి
ఈ నిర్జల ఏకాదశి
మనిషి భోజన ప్రియుడు. ఆకలి వేసినా వేయకపోయినా ఆహారాన్ని సేవించే జీవి ఒక్క మనిషి మాత్రమే! ఆహారాన్ని దేహాన్ని పోషించేదిగా కాకుండా, నాలుకకు రుచిని ఇచ్చేదిగా భావించేదీ మనిషి ఒక్కడే. ఆహారంతో మనిషికి ఉండే ఈ సంబంధం అతనికి అనారోగ్యాన్ని ఎలాగూ కలిగిస్తుంది... ఇంద్రియ సుఖాల పట్ల అతనికి ఉన్న మోహానికి ఉదాహరణగా నిలుస్తుంది. అలా నిరంతరం ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయే మనిషిని కాస్త ఆధ్మాత్మిక దిశకు మళ్లించేందుకు పెద్దలు సూచించిన ఉపాయమే ఏకదశి ఉపవాసాలు!
నిర్జల ఏకాదశి!
ఒకో మాసానికి రెండు చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఏర్పడతాయి. ఈ 24 ఏకాదశులూ ఉపవాసం చేయదగ్గవే. పైగా ప్రతి ఏకాదశికీ ఒకో విశిష్టతను కల్పించారు. భీష్మ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదైకాదశి... ఇలా ప్రతి ఏకాదశికీ ఓ పేరు ఉంది. అలాగే జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు వచ్చే రోజుని ‘నిర్జల ఏకాదశి’ అన్నారు. నిర్జల అన్న పేరులోనే జలం సైతం తీసుకోకుండా సాగించే ఏకాదశి అని స్ఫురిస్తుంది. దీనినే భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా అంటారు.
ఇలా భీమునితో ఈ ఏకాదశి ముడిపడటం వెనుక ఒక పురాణ గాధ లేకపోలేదు. భీముడు భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే! అలాంటి భీమునికి, తన చుట్టు పక్కల వారంతా ఏడాది పొడవునా ఏకాదశీ వ్రతాలను ఆచరించి పుణ్యాన్ని పొందడం కనిపించింది. వారితో పాటుగా తాను కూడా 24 ఏకాదశుల నాడు ఉపవాసం చేయాలని ఉన్నా, ఆకలికి ఆగలేని శరీర తత్వం అతనిది. దీనికి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పమంటూ, భీముడు వేదవ్యాసులవారిని వేడుకున్నాడట. దానికి వ్యాసుల వారు అందించిన సూచనే ‘నిర్జల ఏకాదశి’. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినాడు నిరాహారంగానే కాకుండా నిర్జలంగా సైతం నువ్వు ఉపవాసం ఉండగలిగితే... ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం చేసినంత ఫలితం వస్తుందని సూచించారు. ఆనాటి నుంచి ఈ ఏకాదశి భీమ/ పాండవ ఏకాదశిగా పేరు పొందింది.
నిర్జలంగానే ఎందుకు!
మనిషి ఆకలికైనా కొన్నాళ్లు తట్టుకోగలడు కానీ దాహానికి మాత్రం తట్టుకోలేడు. సమయానికి తగినంత నీరు లభించకపోతే, అతనిలోని అణువణువూ ఆర్చుకుపోతుంది. కానీ ఎప్పుడన్నా ఓసారి నిర్జలంగా ఉపవాసం ఉండటం కూడా మంచిదే! ఎందుకంటే ఘనాహారం తీసుకోకుండా కేవలం నీటి మీదే ఆధారపడి చేసే ఉపవాసాలు చాలా సులువు. పైగా అలాంటి సమయాలలో నీటిని తీసుకుంటూ ఉండటం వల్ల శరీర ధర్మం ఎంతో కొంత సాగుతూ ఉంటుంది. తాగిన నీటిని జీర్ణం చేసుకునేందుకు మన జీర్ణ వ్యవస్థ, కిడ్నీలు, పాంక్రియాస్‌ పనిచేస్తూనే ఉంటాయి. కానీ నిర్జలంగా ఉన్న రోజున ఆయా శరీరభాగాలన్నీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్యూట్ పాంక్రియాటిస్‌ వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, రోగిని కనీసం నీటిని కూడా అందించరు వైద్యలు. దాంతో సదరు అవయం తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకునేందుకు తగిన విశ్రాంతిని కల్పిస్తారు.
అలాగని ఇలా తరచూ నిర్జల ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు, శారీరిక శ్రమ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు... ఒంటికి తగినంత నీరు అందకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఒంటికి తగినంత నీరు లభిస్తూ ఉండకపోతే కిడ్నీలు దెబ్బతినిపోతాయి. అందుకనే ఏడాదికి ఒక్కమారే ఇలా నిర్జలంగా ఉపవాసం ఉండమని సూచించి ఉంటారు పెద్దలు. మరో పక్క ఇలా నీరు సైతం తీసుకోకుండే సాగించే ఉపవాసంతో దైవం పట్ల మనిషికి ఉన్నా ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించినట్లు అవుతుంది. అందుకనే రంజాన్‌ నాడు చేసే ఉపవాసాలు కూడా నిర్జలంగా సాగడం గమనార్హం.
విధానం
అన్ని ఏకాదశి ఉపవాసాలకు అటూఇటూగానే ఈ నిర్జల ఏకాదశి కూడా సాగుతుంది. దశమి నాడు ఒంటిపూట భోజనం; దశమినాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆచరించడం; నిర్జల ఏకాదశినాడు ఆచమనానికి తప్ప చుక్క నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగించడం; ఏకాదశినాడు విష్ణుమూర్తిని దర్శించి, సేవించి, పూజించుకోవడం; ఏకాదశి రాత్రివేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయడం; ద్వాదశి నాడు ఒక అతిథిని భోక్తగా పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం.... ఇలా సాగుతుంది ఈ నిర్జల ఏకాదశి.
పచ్చి మంచినీరు సైతం ముట్టకుండా సాగుతుంది కాబట్టే... మిగతా ఏకాదశులు అన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది!

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list